ప్రధాన మంత్రి కార్యాలయం
హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
प्रविष्टि तिथि:
06 DEC 2025 8:14PM by PIB Hyderabad
అందరికీ నమస్కారం.
హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో భారత్‌కు, విదేశాలకు చెందిన విశిష్ట అతిథులు చాలా మంది ఉన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులను, ఇక్కడ తమ అభిప్రాయాలను పంచుకున్న సహచరులను అభినందిస్తున్నాను. శోభన గారు చెప్పిన వాటిలో నేను రెండు విషయాలను గమనించాను. మొదటిది, గతంలో మోదీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇది సూచించారు అని చెప్పారు. మీడియాకు పని చేయమని చెప్పే సాహసం ఈ దేశంలో ఎవరూ చేయరు. కానీ నేను చెప్పాను. శోభన గారు, ఆమె బృందం అత్యంత ఉత్సాహంగా దానిని పూర్తి చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. నేను ఇప్పుడే ఎగ్జిబిషన్ సందర్శించాను. మీ అందరూ కూడా తప్పనిసరిగా దానిని సందర్శించమని కోరుతున్నాను. ఫొటోగ్రాఫర్ మిత్రులు క్షణాలను చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఫొటోల్లో బంధించారు. ఇక రెండో విషయానికి వస్తే... నేను ఇంకా ఆమె చెప్పిన మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ‘‘మీరు దేశానికి సేవలందించడం కొనసాగించాలి’’ అని చెప్పి ఉండొచ్చు. దానికి బదులుగా ‘‘మీరు దేశానికి సేవలందించడం కొనసాగించాలి’’ అని హిందుస్థాన్ టైమ్స్ చెబుతోందన్నారు. ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
స్నేహితులారా,
ఈ ఏడాది ఈ సదస్సు ఇతివృత్తం - ‘ట్రాన్స్‌ఫార్మింగ్ టుమారో’. 101 ఏళ్ల చరిత్ర, మహాత్మాగాంధీ, మదన్ మోహన్ మాలవీయ, ఘన శ్యామ్ దాస్ బిర్లా, ఇతర గొప్ప వ్యక్తుల ఆశీస్సులు హిందుస్థాన్ టైమ్స్‌కు ఉన్నాయి. ఇలాంటి సంస్థ భవిష్యత్తు మార్పుల గురించి మాట్లాడినప్పుడు, భారత్‌లో ప్రస్తుతం వస్తున్న మార్పు.. అవకాశాలకు సంబంధించినది మాత్రమే కాదని, ఇది జీవితాలను, ఆలోచనను, దిశను మార్చే నిజమైన కథ అనే నమ్మకం దేశానికి కలుగుతుంది.
స్నేహితులారా,
ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహా పరినిర్వాణ దినం. భారతీయలందరి తరఫున ఆయనకు నివాళి అర్పిస్తున్నాను.
స్నేహితులారా,
21 వ శతాబ్దం ఆరంభమై పావు వంతు గడిచిపోయిన స్థితిలో మనం ఉన్నాం. ఈ పాతికేళ్లలో, ఈ ప్రపంచం అనేక ఎత్తుపల్లాలను చూసింది. ఆర్థిక సంక్షోభాలను, ప్రపంచ మహమ్మారులను, సాంకేతిక అవాంతరాలను, విచ్ఛిన్నమవుతున్న ప్రపంచాన్ని మనం చూశాం. యుద్ధాలను చూస్తున్నాం. ప్రస్తుతం ప్రపంచమంతా అనిశ్చితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల మధ్య భారత్ విభిన్న మార్గంలో ప్రయాణిస్తోంది. భారత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రపంచం మందగమనంలో ఉన్నప్పుడు, భారత్ అభివృద్ధి గాథను లిఖిస్తోంది. ప్రపంచంలో నమ్మకం క్షీణిస్తున్న సమయంలో.. విశ్వాసానికి బలమైన పునాదిగా భారత్ నిలబడింది. విచ్ఛిన్నం దిశగా ప్రపంచం వెళుతోంటే.. వారధిని నిర్మించే శక్తిగా భారత్ ఎదుగుతోంది.
స్నేహితులారా,
కొన్ని రోజుల క్రితమే రెండో త్రైమాసికానికి సంబంధించిన దేశ జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి. 8 శాతం కంటే ఎక్కువ ఉన్న వృద్ధి రేటు.. మన పురోగతి వేగాన్ని ప్రతిబింబిస్తోంది.
స్నేహితులారా,
ఇది కేవలం ఓ సంఖ్య కాదు. ఇది బలమైన స్థూల ఆర్థిక వ్యవస్థకు సూచిక. ఇది ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా భారత్ మారుతోందనే సందేశాన్నిస్తోంది. అంతర్జాతీయంగా వృద్ధి రేటు సుమారు 3 శాతంగా ఉన్న సమయంలో మన గణాంకాలు ఈ స్థాయిలో ఉన్నాయి. జీ-7 దేశాల ఆర్థిక వ్యవస్థలు సగటున 1.5 శాతం మేర వృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అధిక వృద్ధి రేటు, తక్కువ ద్రవ్యోల్బణంతో భారత్ ఆదర్శంగా నిలుస్తోంది. ఒకప్పుడు అధిక ద్రవ్యోల్బణం గురించి, ముఖ్యంగా మన దేశంలో పరిస్థితి గురించి ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేసేవారు. ఇప్పుడు వారే తగ్గిన ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నారు.
స్నేహితులారా,
భారత్ సాధించిన విజయాలు సాధారణమైనవి కాదు. ఇది గణాంకాలకు సంబంధించిన విషయం కాదు. ఇది గడచిన దశాబ్దంలో భారత్ తీసుకువచ్చిన ప్రాథమిక మార్పు. ఇది స్థిరత్వాన్ని సాధించడంలో వచ్చిన ప్రాథమిక మార్పు. సమస్యలను పరిష్కరించే ధోరణిలో వచ్చిన మార్పు. కమ్ముకున్న భయాలను తొలగించి ఆకాంక్షలను విస్తరించిన మార్పు. దీనివల్లే.. దేశం తనను తాను మార్చుకోవడంతో పాటు భవిష్యత్తును సైతం మారుస్తోంది.
స్నేహితులారా,
రేపటి మార్పుల గురించి ఈరోజు చర్చిస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుతం కొనసాగుతున్న పని అనే బలమైన పునాది ఆధారంగా మన విశ్వాసం పెరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు అమలు చేస్తున్న సంస్కరణలు, పనులు రేపటి మార్పులకు అవసరమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. మేము ఎలాంటి ఆలోచనా దృక్పథంతో పని చేస్తున్నామో మీకో ఉదాహరణ ఇస్తున్నాను.
స్నేహితులారా,
సుదీర్ఘ కాలంగా భారత్ సామర్థ్యంలో ఎక్కువ భాగం నిరుపయోగంగానే ఉందని మీకు తెలుసు. ఉపయోగించని ఈ సామర్థ్యానికి మంచి అవకాశాలను ఇచ్చినప్పుడు.. ఎలాంటి సంకోచం లేకుండా, పూర్తి శక్తితో అభివృద్ధిలో పాలు పంచుకున్నప్పుడు ఈ దేశం కచ్చితంగా మారుతుంది. తూర్పు భారతం, ఈశాన్య భారతం, మన గ్రామాలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, మన మహిళా శక్తి, ఆవిష్కరణాత్మకమైన భారతీయ యువత, దేశ సముద్ర వాణిజ్యం, సముద్ర ఆర్థిక వ్యవస్థ, దేశ అంతరిక్ష రంగం గురించి ఆలోచించండి. గతంలో ఎన్నడూ ఉపయోగించని అపారమైన శక్తి మన దేశంలో ఉంది. ఇప్పుడు ఈ శక్తిని ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో భారత్ ముందుకు వెళుతోంది. తూర్పు భారత్‌లో ఆధునిక మౌలిక వసతులు, రవాణా, పరిశ్రమల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులు పెడుతున్నాం. ఆధునిక వసతులతో మన గ్రామాలు, పట్టణాలు అలరారుతున్నాయి. అంకుర సంస్థలకు, ఎంఎస్ఎంఈలకు నూతన కేంద్రాలుగా చిన్న పట్టణాలు మారుతున్నాయి. గ్రామాల్లోని రైతులు ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేసుకొని.. నేరుగా మార్కెట్లతో అనుసంధానమవుతున్నారు. కొన్ని ఎఫ్‌పీవోలైతే అంతర్జాతీయ మార్కెట్లను సైతం చేరుకుంటున్నాయి.
స్నేహితులారా,
భారత్‌లోని మహిళా శక్తి ఇప్పుడు అద్భుతాలు చేస్తోంది. ప్రతి రంగంలోనూ మన అమ్మాయిలు ఆధిపత్యం కనబరుస్తున్నారు. ఈ మార్పు మహిళా సాధికారతకు మాత్రమే పరిమితం కాలేదు. సమాజానికి ఉన్న ఆలోచనలను, సామర్థ్యాన్ని కూడా మారుస్తోంది.
స్నేహితులారా.
కొత్త అవకాశాలు లభిస్తున్నప్పుడు, అవరోధాలు తొలగిపోతున్నప్పుడు.. ఆకాశంలో విహరించేందుకు కొత్త రెక్కలు పుట్టుకొస్తాయి. భారత అంతరిక్ష రంగం దీనికి ఉదాహరణ. గతంలో ఈ అంతరిక్ష రంగం ప్రభుత్వం ఆధీనంలో మాత్రమే ఉండేది. ఇప్పుడు దీనిని సంస్కరించి, ప్రైవేటు సంస్థలకు కూడా అవకాశం కల్పించాం. ఆ ఫలితాలను ఇప్పుడు మన దేశం చూస్తోంది. హైదరాబాద్‌లో 10, 11 రోజుల క్రితమే స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రారంభించాను. ఈ స్కైరూట్ ప్రైవేటు అంతరిక్ష సంస్థ. నెలకో రాకెట్ తయారు చేయగల సామర్థ్యాన్ని సాధించేలా ఈ సంస్థ పనిచేస్తోంది. ఇది ప్రయోగించడానికి సిద్ధంగా ఉండేలా విక్రమ్ - వన్‌ను తయారు చేస్తోంది. అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తే.. వాటిని అందిపుచ్చుకున్న భారత యువత భవిష్యత్తును నిర్మిస్తోంది. మార్పు అంటే ఇదే.
స్నేహితులారా,
భారత్‌లో చోటు చేసుకున్న మరో ముఖ్యమైన మార్పు గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఒకానొక సమయంలో ప్రతిస్పందన ఆధారంగా మన దేశంలో సంస్కరణలను చేపట్టేవారు. పెద్ద నిర్ణయాలను తీసుకొనేటప్పుడు, దాని వెనుక రాజకీయ ఆసక్తులు లేదా అసమ్మతిని సంతృప్తిపరచడమనే కారణం ఉండేది. కానీ ఇప్పుడు దేశ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని సంస్కరణలు అమలవుతున్నాయి. దేశంలో ప్రతి రంగం మెరుగ్గా మారడాన్ని మీరు చూస్తున్నారు. మన వేగం, లక్ష్యం స్థిరంగా ఉన్నాయి. దేశమే ప్రధానం.. ఇదే మా విధానం. 2025 సంవత్సరమంతా.. సంస్కరణల ఏడాదిగా నిలిచింది. వాటిలో అతి పెద్ద సంస్కరణ.. భవిష్యత్తు తరం జీఎస్టీ. ఈ సంస్కరణల ఫలితాన్ని దేశం మొత్తం చూసింది. ప్రత్యక్ష పన్ను విధానంలో సైతం ప్రధాన సంస్కరణలు అమలు చేశాం. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తీసుకున్న నిర్ణయం.. దశాబ్దం క్రితం ఊహకు కూడా అందని అంశంగా ఉండేది.
స్నేహితులారా,
ఈ సంస్కరణలను ప్రక్రియను కొనసాగిస్తూ.. చిన్న సంస్థ నిర్వచనాన్ని మూడు, నాలుగు రోజుల క్రితమే సవరించారు. దీంతో.. సులభతరమైన నియమాలు, వేగవంతమైన ప్రక్రియలు, మెరుగైన వసతుల పరిధిలోకి వేలాది సంస్థలు వచ్చాయి. తప్పనిసరి నాణ్యతా నియంత్రణ ఉత్తర్వుల పరిధి నుంచి సుమారు 200 వరకు ఉత్పత్తులను మేం తొలగించాం.
స్నేహితులారా,
ఇప్పుడు భారత్ సాగిస్తున్న ప్రయాణం అభివృద్ధికి సంబంధించినది మాత్రమే కాదు. ఇది ఆలోచనా దృక్పథంలో వచ్చిన పరివర్తనకు సంబంధించిన ప్రయాణం. ఇది మానసిక పునరుజ్జీవానికి సంబంధించిన ప్రయాణం. ఆత్మవిశ్వాసం లేకుండా ఏ దేశమూ ప్రగతి సాధించలేదనే విషయం మీ అందరికీ తెలుసు. దురదృష్టవశాత్తూ.. సుదీర్ఘ కాలం దేశం అనుభవించిన బానిసత్వం.. ఆ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేసింది. దీనికి కారణం బానిస మనస్తత్వం. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనలో ఈ బానిస ధోరణి ప్రధాన అడ్డంకిగా మారింది. అందుకే.. ఈ బానిస మనస్తత్వ ధోరణి నుంచి బయటపడేందుకు భారత్ కృషి చేస్తోంది.
స్నేహితులారా,
భారత్‌ను సుదీర్ఘ కాలం పాటు పాలించాలంటే.. భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని తొలగించి, వారిలో న్యూనతా భావాన్ని నింపాలని బ్రిటిషర్లు గుర్తించారు. ఆ సమయంలో వారు అదే పని చేశారు. భారతీయ కుటుంబ వ్యవస్థను పాత విధానమని ముద్ర వేశారు. భారతీయ వస్త్రధారణను అనాగరికమైనవిగా ప్రకటించారు. భారతీయ పండగలను అసంబద్ధమైనవన్నారు. యోగా, ఆయుర్వేదాన్ని అశాస్త్రీయమైనవని పిలిచారు. భారతీయ ఆవిష్కరణలను హేళన చేశారు. ఇదే ధోరణి కొన్ని దశాబ్దాల పాటు, తరాల పాటు కొనసాగింది. అదే చదివారు. అదే నేర్పించారు. అలా.. మన భారతీయుల ఆత్మవిశ్వాసం సడలింది.
స్నేహితులారా,
ఈ బానిస మనస్తత్వం ప్రభావం ఎంతగా విస్తరించిందో మీకు కొన్ని ఉదాహరణల ద్వారా వివరించాలనుకుంటున్నాను. ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ మారింది. కొంతమంది భారత్‌ను వృద్ధిని నడిపించే శక్తిగా, ఇంకొందరు అంతర్జాతీయ శక్తి కేంద్రంగా వర్ణిస్తున్నారు. అనేక అద్భుతమైన విషయాలు కూడా జరుగుతున్నాయి.
అయినప్పటికీ స్నేహితులారా,
ప్రస్తుతం భారత్ సాధిస్తున్న వేగవంతమైన వృద్ధి గురించి మీరు ఎప్పుడైనా చదివారా? దాని గురించి మీరు ఎక్కడైనా విన్నారా? ఎవరైనా దానిని హిందూ వృద్ధి రేటు అని పిలుస్తున్నారా? ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, వృద్ధి వేగం గురించి చెబుతున్నారా? దీనిని హిందూ వృద్ధి రేటు అని ఎప్పుడు పిలిచారు? రెండు, మూడు శాతం వృద్ధి సాధించాలనే తపనతో భారత్ ఉన్నప్పుడు, ఇక్కడ నివసిస్తున్న ప్రజల విశ్వాసాలతో, వారి గుర్తింపుతో దానిని ముడి వేయడం యాదృచ్ఛికంగా జరిగిందని మీరు భావిస్తున్నారా? లేదు.. ఇది బానిసత్వ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అనుత్పాదకతకు, పేదరికానికి మొత్తం సమాజాన్ని, మొత్తం సంప్రదాయాన్ని పర్యాయపదాలుగా మార్చేశారు. అంటే భారత్ నెమ్మదిగా వృద్ధి చెందడానికి ప్రధాన కారణం హిందూ నాగరికతే, హిందూ సంస్కృతే అని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థం. ప్రతి అంశంలోనూ మతపరమైన అంశాలను వెతికే మేధావులు.. హిందూ అభివృద్ధి రేటు అని చెప్పినప్పుడు దానిలో ఉన్న మతతత్వం వారికి కనిపించలేదు. వారి పాలనా సమయంలో పుస్తకాలు, పరిశోధనా పత్రాల్లో ఈ పదాన్ని ఉపయోగించారు.
స్నేహితులారా,
భారత్‌లో తయారీ వ్యవస్థను నాశనం చేసిన బానిస ఆలోచనా ధోరణి గురించి కూడా మీకు కొన్ని ఉదాహరణలు ఇవ్వాలని భావిస్తున్నాను. అలాగే దానిని ఎలా పునరుద్ధరిస్తున్నామో కూడా మీకు చెప్పదలుచుకున్నాను. వలస పాలనా సమయంలో భారత్ తయారీ కేంద్రంగా ఉండేది. ఆయుధాల కర్మాగారాలకు సంబంధించిన బలమైన వ్యవస్థ మనకు ఉండేది. భారత్ నుంచి ఆయుధాలు ఎగుమతి అయ్యేవి. ప్రపంచ యుద్ధాల సమయంలో సైతం భారత్‌లో తయారైన ఆయుధాలకు ప్రాధాన్యం ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత మన రక్షణ రంగ తయారీ వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. ఈ బానిస మనస్తత్వ ప్రభావం ఎంత బలంగా ఉండేదంటే.. ప్రభుత్వంలో ఉన్నవారు సైతం భారత్‌లో తయారైన ఆయుధాలను తక్కువ చేసి చూడటం ప్రారంభించారు. ఈ ధోరణే.. ప్రపంచంలో అతిపెద్ద రక్షణ దిగుమతిదారుగా భారత్‌ను మార్చేసింది.
స్నేహితులారా,
నౌకా నిర్మాణ పరిశ్రమ విషయంలో సైతం బానిస మనస్తత్వం ఇదే చేసింది. శతాబ్దాల పాటు నౌకా నిర్మాణానికి ప్రధాన కేంద్రంగా భారత్ ఉండేది. అయిదారు దశాబ్దాల క్రితం, అంటే 50-60 ఏళ్ల క్రితం కూడా భారత వాణిజ్యంలో నలభై శాతం ఓడల ద్వారానే జరిగేది. కానీ బానిస మనస్తత్వం ఉన్నవారు విదేశీ నౌకలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. దాని పర్యవసానం ఏమిటో మీ ముందే ఉంది. ఒకప్పుడు సముద్ర వాణిజ్యంలో ప్రధాన శక్తిగా ఉన్న మన దేశం ఇప్పుడు 95 శాతం వాణిజ్యానికి విదేశీ నౌకలపై ఆధారపడాల్సి వస్తోంది. దీనివల్ల ప్రతి ఏడాది దాదాపు 75 బిలియన్ డాలర్లు అంటే.. సుమారు 6 లక్షల కోట్ల రూపాయలను విదేశీ షిప్పింగ్ కంపెనీలకు చెల్లించాల్సి వస్తోంది.
స్నేహితులారా,
అది నౌకా నిర్మాణమైనా, రక్షణ ఉత్పత్తుల తయారీ అయినా.. ప్రతి రంగంలోనూ.. బానిస మనస్తత్వాన్ని వదలిపెట్టి, కొత్త విజయాన్ని సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
స్నేహితులారా,
పరిపాలనలో భారత్ అనుసరించే విధానంపై కూడా ఈ బానిస ఆలోచనా ధోరణి తీవ్ర ప్రభావం చూపింది. చాలాకాలం పాటు ప్రజల పట్ల అపనమ్మకంతో ప్రభుత్వం ఉండేది. గతంలో పౌరులు తమకు సంబంధించిన పత్రాలను ప్రభుత్వ అధికారితో ధ్రువీకరించుకోవాల్సి వచ్చేదని మీకు గుర్తుండే ఉంటుంది. వారు ఆమోద ముద్ర వేయకపోతే.. వాటిని నకిలీవిగా పరిగణించేవారు. ఇది మీరు పడిన కష్టానికి ఇచ్చే ధ్రువీకరణ. ఈ అపనమ్మకాన్ని మేం బద్దలుకొట్టాం. స్వీయ ధ్రువీకరణ సరిపోతుందని మేం భావించాం. నేను అతన్ని నమ్ముతున్నాను అని నా దేశ ప్రజలు చెబుతారు. నేను చెబుతున్నదీ ఇదే.
స్నేహితులారా,
చిన్న పొరపాటును కూడా పెద్ద నేరంగా పరిగణించే చట్టాలు మన దేశంలో ఉండేవి. మేం జన విశ్వాస్ చట్టాన్ని తీసుకొచ్చి.. ఇలాంటి వేలాది నిబంధనలను నేరరహితం చేశాం.
స్నేహితులారా,
గతంలో బ్యాంకు నుంచి వెయ్యి రూపాయల రుణం తీసుకోవాలంటే.. దానికి హామీ అడిగేవారు. ఎందుకంటే అంత అపనమ్మకం ఉండేది. ఈ అపనమ్మకం అనే విష వలయాన్ని ముద్ర యోజనతో మేం తొలగించాం. ఈ పథకం ద్వారా, మన దేశ ప్రజలకు రూ. 37 లక్షల కోట్ల విలువైన హామీ రహిత రుణాలను అందించాం. ఈ కుటుంబాలకు చెందిన యువతకు వ్యాపారవేత్తలుగా మారాలనే ఆత్మవిశ్వాసాన్ని ఈ సొమ్ము ఇచ్చింది. ప్రస్తుతం వీధి వ్యాపారులు, తోపుడు బళ్లపై వ్యాపారం చేేసే వారికి కూడా బ్యాంకులు హామీ లేని రుణాలను అందిస్తున్నాయి.
స్నేహితులారా,
ప్రభుత్వానికి ఏదైనా ఇస్తే.. అది వన్ వే ట్రాఫిక్ లాంటిదనే భావన మన దేశంలో ఉంది. ఒకసారి ఇచ్చింది మళ్లీ తిరిగి రాదని, అది పోయినట్టే అనుకొనేవారు. ఇది అందరికీ అనుభవమే. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య నమ్మకం బలంగా ఉన్నప్పుడు పని ఎలా జరుగుతుంది? రేపు మీరు ఏదైనా మంచి పని చేయాలనుకుంటే.. ఈ రోజే దానికి తగినట్టుగా మీ మనసుని సిద్ధం చేసుకోవాలి. మీ ఆలోచన మంచిదైతే భవిష్యత్తు కూడా గొప్పగా ఉంటుంది. అందుకే మేం మరో కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దాని గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. పత్రికలు, విలేకరులు సైతం దాని గురించి పెద్దగా గమనించలేదు. వారు గమనించారో లేదో నాకు తెలియదు. రేపు అది జరగొచ్చు.
మన దేశంలో రూ. 78 వేల కోట్ల మేర క్లెయిము చేసుకోని ప్రజల ధనం బ్యాంకుల్లో ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవి ఎవరి సొంతమో, ఎవరివో, ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికీ తెలియదు. ఈ సొమ్ము గురించి ఎవరూ అడగడం లేదు. అలాగే.. దాదాపు రూ. 14 వేల కోట్లు బీమా సంస్థల వద్ద ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ సంస్థల వద్ద రూ.3 వేల కోట్లు ఉన్నాయి. 9 వేల కోట్ల రూపాయల డివిడెండ్లు ఉన్నాయి. వీటిని ఎవరూ క్లెయిము చేసుకోకుండా, యజమాని లేకుండా ఉన్నాయి. ఈ ధనమంతా మన దేశంలో పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందినది. అందుకే అసలైన యజమానులు ఈ సొమ్ము గురించి మరచిపోయారు. దేశవ్యాప్తంగా మా ప్రభుత్వం వారి కోసం వెతుకుతోంది. సోదరా. ఈ డబ్బు మీదేనా? మీ తల్లిదండ్రులదా? ఎవరైనా వాటిని దాచి పెట్టారా? అని అడుగుతున్నాం. వాటికి హక్కుదారులైన యజమానులను వెతకడంలో మా ప్రభుత్వం నిమగ్నమై ఉంది. దీని కోసం మేం ప్రత్యేక క్యాంపులను కూడా నిర్వహిస్తున్నాం. సోదరా.. వీరి ఆచూకీ మీకు తెలుసా అని అడుగుతున్నాం. మీ డబ్బు ఎక్కడైనా దాచారా? దాని గురించి మరచిపోయారా? అని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటి వరకు 500 జిల్లాల్లో ఇలాంటి క్యాంపులను నిర్వహించాం. వేల కోట్ల రూపాయలను వాటి అసలైన హక్కుదారులకు అందించాం. ఆ సొమ్ము అక్కడ పడి ఉంది. దాని గురించి అడిగేవారు లేరు. కానీ ఇక్కడ ఉన్నది మోదీ.. ఆయన వెతుకుతున్నారు. మిత్రమా, ఇది మీదేనా? తీసుకోండి అని అంటున్నారు.
స్నేహితులారా,
ఇది ఆస్తులను తిరిగి ఇచ్చే ప్రక్రియ కాదు. ఇది నమ్మకానికి సంబంధించిన అంశం. ఇది నిరంతరం ప్రజల విశ్వాసాన్ని పొందాలనే అంకితభావానికి సంబంధించినది. ప్రజల విశ్వాసమే గొప్ప ఆస్తి. బానిస మనస్తత్వం ఉంటే.. ప్రభుత్వం కూడా మాన్సీ సాహెబీ అయి ఉండేది. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి ఉండేది కాదు.
స్నేహితులారా,
ప్రతి రంగంలోనూ బానిస మనస్తత్వం నుంచి మన దేశం పూర్తిగా బయటపడింది. కొన్ని రోజుల క్రితమే.. ఈ దేశానికి నేను ఓ విజ్ఞప్తి చేశాను. తదుపరి పదేళ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాతో కలసి ఓ పని చేయమని ఈ దేశ ప్రజలను ప్రేమగా అడుగుతున్నాను. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను, నా మాట వినండి. 140 కోట్ల మంది దేశ ప్రజల సహకారం లేనిదే నేను ఈ పని చేయలేను. అందుకే చేతులు జోడించి మిమ్మల్ని పదే పదే అడుగుతున్నాను. వచ్చే పదేళ్ల కోసం నేను ఏం అడుగుతున్నాను? మెకాలే విధానంతో భారత్‌లో మానసిక బానిసత్వానికి బీజాలు పడి 2035 నాటికి 200 ఏళ్లు పూర్తవుతాయి. అంటే దానికి ఇంకా పదేళ్ల సమయం ఉంది. అందుకే ఈ పదేళ్లలో ఈ మానసిక బానిసత్వం నుంచి దేశానికి విముక్తి కల్పించడానికి మనం అందరం కలసి పని చేయాలి.
స్నేహితులారా,
మనం ఒకరు వేసిన మార్గంలో నడిచేవాళ్లం కాదని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. మెరుగైన రేపటి కోసం మన పరిధిని విస్తరించుకోవాలి. భవిష్యత్తులో దేశ అవసరాలను అర్థం చేసుకుంటూ... ప్రస్తుత సమస్యలకు పరిష్కారం వెతకాలి. ఇటీవలి కాలంలో నేను మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్ అభియాన్ గురించి ఎక్కువగా చర్చిస్తుండటాన్ని మీరు గమనించే ఉంటారు. శోభన గారు కూడా తన ప్రసంగంలో దీని గురించి ప్రస్తావించారు. ఇలాంటి కార్యక్రమాలు 4, 5 దశాబ్దాల క్రితం ప్రారంభించి ఉంటే.. భారత్ ముఖచిత్రం ఇప్పుడు మరోలా ఉండేది. కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ఇతర ప్రాధాన్యాలుండేవి. మీకు సెమీకండక్టర్ల కథ గురించి తెలుసు. 50, 60 ఏళ్ల క్రితం, ఐదారు దశాబ్దాల క్రితం భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ ప్లాంటును ప్రారంభించడానికి ఓ సంస్థ ముందుకొచ్చింది. కానీ దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా సెమీకండక్టర్ల రంగంలో భారత్ బాగా వెనకబడిపోయింది.
స్నేహితులారా,
ఇంధన రంగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భారత్ దాదాపు రూ.125 లక్షల కోట్ల విలువైన పెట్రోలు, డీజిల్, గ్యాస్‌ను ఏటా దిగుమతి చేసుకుంటోంది. మన దేశానికి సూర్య భగవానుని ఆశీస్సులు అపారంగా ఉన్నాయి. అయినప్పటికీ 2014 వరకు దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 3 గిగావాట్లుగా మాత్రమే ఉంది. నేను 2014 గురించి మాట్లాడుతున్నాను. మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చే నాటికి 3 గిగావాట్ల సామర్థ్యం ఉంది. గత పదేళ్లలో అది 130 గిగావాట్లకు పెరిగింది. అందులోనూ రూఫ్‌టాప్ సౌర విద్యుత్ నుంచి 22 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. రూఫ్ టాప్ సోలార్ నుంచి 22 గిగావాట్లు ఉత్పత్తి అవుతోంది.
స్నేహితులారా,
ఇంధన భద్రతలో నేరుగా ప్రజలు పాలు పంచుకొనే అవకాశాన్ని పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అందిస్తోంది. నేను కాశీకి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. ప్రధానమంత్రిగా నేను చేయాల్సిన పనులు ఉంటాయి. అలాగే పార్లమెంట్ సభ్యుడిగా నెరవేర్చాల్సిన బాధ్యతలు కూడా ఉంటాయి. కాశీ పార్లమెంట్ సభ్యుడిగా మీకో విషయం చెప్పదలుచుకున్నాను. మీ హిందీ వార్తా పత్రిక చాలా శక్తివంతమైనది. అది కచ్చితంగా ప్రయోజనం కలిగిస్తుంది. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పరిధిలో కాశీలో దాదాపు 26 వేల గృహాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రోజుకి మూడు లక్షల యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఫలితంగా రూ. 5 కోట్ల ప్రజల సొమ్ము ప్రతి నెల ఆదా అవుతోంది. అంటే ఏడాది అరవై కోట్ల రూపాయలు ఆదా అవుతోంది.
స్నేహితులారా,
పెద్ద మొత్తంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవడం వల్ల ఏటా తొంభై వేల మెట్రిక్ టన్నుల మేర కర్బన ఉద్గారాలు తగ్గుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలంటే.. మనం 40 లక్షలకు పైగా మొక్కలను నాటాలి. నేను మరోసారి చెబుతున్నాను. ఈ గణాంకాలన్నీ కాశీ, వారణాసికి చెందినవే. నేను మొత్తం దేశం గురించి చెప్పడం లేదు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన దేశానికి ఎంత పెద్ద ప్రయోజనం అందిస్తుందో మీరు ఊహించుకోవచ్చు. ఇది ఇప్పుడు అమలు చేేస్తున్న విద్యుత్ పథకానికి భవిష్యత్తును మార్చగలిగే శక్తి ఎంత ఉందో తెలియజేస్తుంది.
అలాగే, మిత్రులారా,
మీరు మొబైల్ తయారీకి సంబంధించిన గణాంకాలను కూడా చూసి ఉంటారు. 2014కు ముందు మనం ఉపయోగించే మొబైల్ ఫోన్లలో దాదాపు 75 శాతం దిగుమతుల పైనే ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు దేశంలో మొబైల్ ఫోన్ దిగుమతులు సున్నాకు చేరుకున్నాయి. ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ల ప్రధాన ఎగుమతిదారుగా మారబోతున్నాం. 2014 తర్వాత మేం సంస్కరణ చేపడితే.. దాన్ని దేశం స్వీకరించింది. దాని పరివర్తనా ఫలితాలను ఇప్పుడు ప్రపంచం చూస్తోంది.
స్నేహితులారా,
ఇలాంటి ఎన్నో పథకాలు, విధానాలు, నిర్ణయాలు, ప్రజల ఆకాంక్షలు, పౌర భాగస్వామ్య మిళితమే రేపటి పరివర్తనాత్మక ప్రయాణాన్ని సుసాధ్యం చేస్తుంది. ఇది నిత్యం కొనసాగే ప్రయాణం. ఇది ఒక సదస్సులో చర్చించడానికి మాత్రమే పరిమితమైన అంశం కాదు. ఇది జాతి సంకల్పం. దీన్ని నెరవేర్చుకోవడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. ఈ మార్పులకు సంబంధించిన అత్యున్నత శిఖరాన్ని చేరుకొనే అవకాశాన్ని సమష్టి ప్రయత్నాలు అందిస్తాయి.
స్నేహితులారా,
మీతో గడిపే, మీరు సూచించిన వాటిని నెరవేర్చే అవకాశాన్ని నాకు ఇచ్చిన శోభన గారికి, హిందుస్థాన్ టైమ్స్‌కు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది దేశంలోని ఫొటోగ్రాఫర్లకు కొత్త శక్తిగా మారుతుందని నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలి. ఈ సలహా ఇచ్చినందుకు నేను రాయల్టీ వసూలు చేయను. ఇది స్వేచ్చాయుత వ్యాపారం. ఇది మార్వాడీ కుటుంబం. కాబట్టి అవకాశాన్ని వదిలిపెట్టదు. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.
***
(रिलीज़ आईडी: 2200279)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Bengali-TR
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada