ప్రధాన మంత్రి కార్యాలయం
దండక్రమ పారాయణాన్ని పూర్తి చేసిన వేదమూర్తి దేవవ్రత్ మహేశ్ రేఖేను అభినందించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
02 DEC 2025 1:03PM by PIB Hyderabad
శుక్ల యజుర్వేదంలోని మాధ్యందిని శాఖకు చెందిన 2,000 మంత్రాల దండక్రమ పారాయణాన్ని అంతరాయం లేకుండా 50 రోజుల్లో పూర్తి చేసిన వేదమూర్తి దేవవ్రత్ మహేశ్ రేఖేను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. 19 ఏళ్ల వేదమూర్తి దేవవ్రత్ మహేశ్ రేఖే సాధించిన ఈ ఘనత భవిష్యత్ తరాలకు గుర్తుండిపోతుందన్నారు. పవిత్ర కాశీలో ఈ అసాధారణ కార్యక్రమం జరగటం, కాశీ ఎంపీగా తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు. దేవవ్రత్ కుటుంబ సభ్యులకు, ఆయనకు మద్దతుగా నిలిచేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చిన సాధువులు, యోగులు, పండితులు, సంస్థలకు వందనాలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“19 ఏళ్ల యువకుడు వేదమూర్తి దేవవ్రత్ మహేశ్ రేఖే చేసిన ఈ పని రాబోయే తరాలకు గుర్తుండిపోతుంది!
శుక్ల యజుర్వేదంలోని మాధ్యందిని శాఖకు చెందిన 2,000 మంత్రాల దండక్రమ పారాయణాన్ని అంతరాయం లేకుండా 50 రోజుల్లో పూర్తి చేసినందుకు భారతీయ సంస్కృతిపై మక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారు. ఇందులో ఎన్నో శ్లోకాలు, పవిత్ర పదాలను దోషాలు లేకుండా పఠిస్తారు. మన గురు పరంపర శ్రేష్టతను ఆయన మూర్తీభవింపజేశారు.
ఈ మహత్తర కార్యానికి వేదికైన పవిత్ర నగరం కాశీకి ఎంపీగా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దేవవ్రత్ కుటుంబ సభ్యులకు, ఆయనకు మద్దతుగా నిలిచేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చిన సాధువులు, యోగులు, పండితులు, సంస్థలకు నా ప్రణామాలు"
***
(रिलीज़ आईडी: 2197558)
आगंतुक पटल : 2