ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భూటాన్ రాజుతో ప్రధానమంత్రి సమావేశం

Posted On: 11 NOV 2025 6:14PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు థింఫు నగరంలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యాల్‌ వాంగ్‌చుక్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌-భూటాన్‌ ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడంతోపాటు పటిష్ఠం చేయడంపై వారిద్దరూ అభిప్రాయాలను పంచుకున్నారు. రెండు దేశాల ప్రయోజనాలతో ముడిపడిన ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపైనా వారు చర్చించారు. ఢిల్లీ దుర్ఘటనలో ప్రాణనష్టంపై మాననీయ భూటాన్‌ రాజు సంతాపం ప్రకటించారు.

రెండు దేశాల మధ్య మైత్రి, సహకారాల విస్తరణ, సన్నిహిత సంబంధాల పటిష్ఠీకరణలో భూటాన్‌ను పాలించిన రాజుల దార్శనికతను ప్రధానమంత్రి ప్రశంసించారు. భూటాన్ సామాజిక-ఆర్థిక పురోగమనం దిశగా భారత ప్రభుత్వం ఎనలేని చేయూతనిచ్చిందంటూ రాజు కృతజ్ఞతలు తెలిపారు.

భారత్‌ నుంచి భూటాన్‌లోని తాషిచోజాంగ్‌ గ్రాండ్ కుయెన్రే హాల్‌లో ప్రతిష్ఠించిన బుద్ధ భగవానుడి పవిత్ర పిప్రహ్వా అవశేషాల సమక్షంలో నాయకులిద్దరూ ప్రార్థన చేశారు. భూటాన్ నాలుగో రాజు 70వ జయంతి, ప్రపంచ శాంతిసౌఖ్యాల కోరుతూ నిర్వహించే ‘గ్లోబల్ పీస్’ ప్రార్థన ఉత్సవంతోపాటు థింపూలో పవిత్ర పిప్రాహ్వా అవశేషాల ప్రదర్శన నిర్వహిస్తుంటారు.

అనంతరం ప్రధానమంత్రి, రాజు ఇద్దరూ సంయుక్తంగా 1020 మెగావాట్ల పునత్సాంగ్చు-2  జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది భారత్‌-భూటాన్ మధ్యగల శక్తిమంతమైన, ఇనుమడిస్తున్న  పరస్పర ప్రయోజనకర ఇంధన భాగస్వామ్యంలో ఇదొక కీలక ఘట్టం. రెండు దేశాల సాధారణ ప్రజల జీవితాల్లో గణనీయ ప్రయోజనాలకు ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది.

ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా పునరుత్పాదక ఇంధనం, మానసిక ఆరోగ్య సేవలు, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో 3 అవగాహన ఒప్పందాలపై వారి సమక్షంలో సంతకాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భూటాన్ ఇంధన ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే దిశగా రాయితీతో కూడిన రూ.4000 కోట్ల దశలవారీ రుణం (లైన్ ఆఫ్ క్రెడిట్‌) మంజూరు చేస్తున్నట్లు భారత్‌ ప్రకటించింది. ఈ ప్రకటనతోపాటు అవగాహన ఒప్పందాల జాబితాను ఇక్కడ చూడవచ్చు.

 

***


(Release ID: 2188982) Visitor Counter : 9