ప్రధాన మంత్రి కార్యాలయం
భూటాన్‌లోని థింఫులో చాంగ్లిమెథాంగ్ సెలబ్రేషన్ గ్రౌండ్‌లో జరిగిన సభనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
శతాబ్దాలుగా భారత్, భూటాన్లది అత్యంత బలమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధం
ఈ ముఖ్యమైన సందర్భంలో పాల్గొనటం భారత్ ప్రాధాన్యత మాత్రమే కాదు.. నాది కూడా... కానీ ఈ రోజు చాలా బాధతో ఇక్కడికి వచ్చాను: పీఎం
నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన భయంకరమైన ఘటనతో అందరిలోనూ కలవరం
ఈ కుట్ర ఛేదించనున్న మన ఏజెన్సీలు నేరస్థులను క్షమించేది లేదు... నేరగాళ్లకు శిక్ష తప్పదు: పీఎం
వసుధైక కుటుంబం... భారత్ ప్రాచీన సైద్ధాంతిక నమ్మకం ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం... అందరి ఆనందాన్నీ మేం కోరుకుంటాం: పీఎం
భూటాన్ రాజు ప్రతిపాదించిన ‘‘స్థూల జాతీయ ఆనందం’’ప్రపంచ అభివృద్ధిని లెక్కించేందుకు ఓ ముఖ్యమైన కొలమానం: పీఎం
ప్రపంచంలోని మొదటి కర్బన రహిత దేశంగా భూటాన్ మారటం అసాధారణ విజయం: పీఎం
తలసరి పునరుత్పాదక శక్తి ఉత్పత్తిలో ప్రపంచంలోని అగ్ర దేశాల్లో భూటాన్ ఒకటి.
విద్యుత్తును 100% పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేస్తోంది... ఈ సామర్థ్యాన్ని పెంచుతూ ఇవాళ మరో కీలకమైన అడుగు వేయనున్న భూటాన్: పీఎం
అనుసంధానంతో అవకాశాలు, అవకాశాలతో అభివృద్ధి శాంతి, సుసంపన్నత, ఉమ్మడి అభివృద్ధి మార్గంలో భారత్, భూటాన్: పీఎం
Posted On:
11 NOV 2025 1:13PM by PIB Hyderabad
భూటాన్‌లోని థింపూలో చాంగ్లిమెథాంగ్ సెలబ్రేషన్ గ్రౌండ్‌లో జరిగిన సభనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భూటాన్ రాజు గౌరవ జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్ వాంగ్‌చుక్, నాలుగో రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌కు ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రాజకుటుంబ సభ్యులకు, భూటాన్ ప్రధానమంత్రి శ్రీ షెరింగ్ తోబ్గేకి, ఇతర ప్రముఖులకు గౌరవపురస్సరంగా నమస్కరించారు.
భూటాన్ కు, భూటాన్ రాజ కుటుంబానికి, ప్రపంచశాంతిని కోరే ప్రతి ఒక్కరికీ ఇవాళ ముఖ్యమైన రోజని ప్రధానమంత్రి అన్నారు. భారత్, భూటాన్ మధ్య శతాబ్దాలుగా ఉన్న బలమైన భావోద్వేగ, సాంస్కృతిక సంబంధాలను ఆయన వివరించారు. ఇలాంటి కీలక సందర్భంలో తాను ఇక్కడికి రావడం భారతదేశపు ప్రాధాన్యత మాత్రమే కాదు..అది తనది కూడానని స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన భయంకరమైన ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసిందని, ఈ క్రమంలో తాను బరువెక్కిన హృదయంతో భూటాన్ కు వచ్చినట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. బాధిత కుటుంబాల దుఃఖాన్ని తాను అర్థం చేసుకోగలనని, దేశం మొత్తం వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీలతో రాత్రంతా సంప్రదింపులు జరిపినట్లు ప్రధానమంత్రి తెలిపారు. భారత ఏజెన్సీలు ఈ కుట్రను బయటపెడతాయని, దాడికి కారణమైన వారిని విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. కుట్రదారులను న్యాయస్థానం ఎదుట నిలబెడతామని తెలిపారు.
గురు పద్మసంభవ ఆశీస్సులతో, భూటాన్‌లో గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్‌లో, భారత్ నుంచి తీసుకెళ్లిన బుద్ధ భగవానుడి పవిత్ర పిప్రహ్వా అవశేషాల దర్శనం లభిస్తోందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సందర్భం గౌరవ నాలుగో రాజు 70వ జన్మదిన వేడుకలను కూడా సూచిస్తుందని, అధిక సంఖ్యలో ప్రముఖులు హాజరుకావడం భారత్-భూటాన్ మధ్య బలమైన బంధాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.
వసుధైక కుటుంబం... ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్న ప్రాచీన సిద్ధాంతాన్ని భారత్ నమ్ముతుందని చెబుతూ.. "సర్వే భవంతు సుఖినః" అనే మంత్రం ద్వారా సార్వత్రిక ఆనందం కోసం భారత్ ప్రార్థిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వేద మంత్రాలను ఉదహరిస్తూ.. ఆకాశం, అంతరిక్షం, భూమి, నీరు, మూలికలు, వృక్షజాలం, సమస్త జీవుల్లో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ భావనలతో గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ సందర్భంగా భూటాన్‌తో భారత్ జతకడుతుందని, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సాధువులు ఏకమై ప్రపంచ శాంతి కోసం ప్రార్థిస్తున్నారని, ఈ సమష్టి స్ఫూర్తిలో 140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలు భాగమని ఆయన తెలిపారు. గుజరాత్‌లోని తన జన్మస్థలమైన వద్ నగర్ బౌద్ధ సంప్రదాయానికి సంబంధించిన పవిత్ర స్థలమని కొందరికి తెలిసుండొచ్చన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని తన కార్యస్థలమైన వారణాసి బౌద్ధ ఆరాధనకు అత్యున్నత శిఖరమని శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ వేడుకకు హాజరు కావడం వ్యక్తిగతంగా ఎంతో గౌరవప్రదమైనదన్నారు. శాంతి దీపం భూటాన్‌లోని ప్రతి ఇంటిలోనూ, ప్రపంచం నలుమూలలా వెలుగునివ్వాలని ఆయన ఆకాంక్షించారు.
భూటాన్ నాలుగో రాజు జీవితాన్ని జ్ఞానం, సరళత, ధైర్యం, దేశానికి నిస్వార్థ సేవల సమ్మేళనంగా అభివర్ణించారు. కేవలం 16 ఏళ్ల వయసులోనే గొప్ప బాధ్యతను స్వీకరించి, తండ్రి మాదిరిగా వాత్సల్యంతో, దార్శనిక నాయకత్వంతో దేశాభివృద్ధికి కృషి చేశారని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. 34 ఏళ్ల పాలనలో ఆయన భూటాన్ వారసత్వాన్ని పరిరక్షిస్తూనే అభివృద్ధిని సాధించారని ప్రధానమంత్రి వెల్లడించారు. ప్రజాస్వామ్య సంస్థలను స్థాపించడం నుంచి సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని పెంపొందించటం వరకు, భూటాన్ రాజు ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించారన్నారు. భూటాన్ రాజు ప్రవేశపెట్టిన "స్థూల జాతీయ ఆనందం" అన్న భావన, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిని నిర్వచించటానికి ముఖ్యమైన కొలమానంగా మారిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దేశాభివృద్ధి అంటే కేవలం జీడీపీ మాత్రమే కాదనీ, మానవాళి సంక్షేమం కూడానని నిరూపించారని వ్యాఖ్యానించారు.
భూటాన్ నాలుగో రాజు.. భారత్, భూటాన్ మధ్య స్నేహాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన వేసిన పునాది వల్లే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పెంపొందుతున్నాయన్నారు. సమస్త భారతీయుల తరపున, రాజు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
"భారత్, భూటాన్ దేశాలు కేవలం సరిహద్దుల ద్వారా మాత్రమే కాక, సంస్కృతుల ద్వారా అనుసంధానమైనవని.. విలువలు, భావోద్వేగాలు, శాంతి, పురోగతితో కూడుకున్న సంబంధం" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2014లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి విదేశీ పర్యటనలో భాగంగా తన భూటాన్ పర్యటనను గుర్తుచేసుకుంటూ, ఆనాటి జ్ఞాపకాలు ఇప్పటికీ భావోద్వేగానికి గురిచేస్తున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. భారత్-భూటాన్ సంబంధాల బలం, గొప్పదనాన్ని వివరించారు. రెండు దేశాలూ కష్టకాలంలో కలిసి నిలబడ్డాయని, సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కొన్నాయని.. ఇప్పుడు అభివృద్ధి మార్గంలో కలిసి ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. రాజుగారు... భూటాన్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నారని.. భారత్-భూటాన్ మధ్య నమ్మకం, అభివృద్ధి భాగస్వామ్యం ఈ ప్రాంతానికి ఆదర్శంగా నిలుస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
భారత్, భూటాన్ వేగంగా వృద్ధి చెందుతున్న తరుణంలో, ఇంధన భాగస్వామ్యం ఈ అభివృద్ధిని మరింత ముందుకు నడిపిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. నాలుగో రాజు నాయకత్వంలో భారత్-భూటాన్ జలవిద్యుత్ సహకారానికి పునాది వేశారన్నారు. నాలుగో రాజు, ఐదో రాజు ఇద్దరూ కూడా భూటాన్‌లో స్థిరమైన అభివృద్ధి, పర్యావరణానికి తొలి ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. దీనివల్లే భూటాన్ ప్రపంచంలోనే మొదటి కర్బన రహిత దేశంగా మారగలిగిందని, ఇది అసాధారణమైన విజయమని తెలిపారు. తలసరి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని సాధించిన ప్రపంచ దేశాల్లో ఒకటిగా భూటాన్ ఉందని, ప్రస్తుతం పునరుత్పాదక వనరుల నుంచి 100 శాతం విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోందన్నారు. ఈ సామర్థ్యాన్ని మరింతగా విస్తరిస్తూ, 1,000 మెగావాట్లకు పైగా ఉన్న కొత్త జలవిద్యుత్ ప్రాజెక్టును ఈ రోజు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇది భూటాన్ జలవిద్యుత్ సామర్థ్యాన్ని 40 శాతం పెంచుతుందన్నారు. దీనికి అదనంగా, పెండింగ్‌లో ఉన్న మరొక జలవిద్యుత్ ప్రాజెక్టు పనులు కూడా తిరిగి ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. ఈ భాగస్వామ్యం కేవలం జల విద్యుత్‌కు మాత్రమే పరిమితం కాదని.. ఇవాళ కుదుర్చుకున్న ముఖ్యమైన ఒప్పందాల ద్వారా భారత్, భూటాన్ సౌరశక్తి రంగంలోనూ కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ఇంధన సహకారంతో పాటు అనుసంధానతను పెంపొందించడంపై భారత్, భూటాన్ దృష్టి సారిస్తున్నాయని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. "అనుసంధానత అవకాశాన్ని సృష్టిస్తుంది.. అవకాశం అభివృద్ధికి సహకరిస్తుంది" అనే దార్శనికతతో గెలెఫు, సమ్త్సే నగరాలను భారత రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించడానికి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, భూటాన్ పరిశ్రమలకు, రైతులకూ భారత్ లోని విస్తృతమైన మార్కెట్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. రైలు, రహదారుల అనుసంధానంతో పాటు సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను ఇరుదేశాలు వేగంగా అభివృద్ధి చేస్తున్నాయని తెలిపారు. రాజుగారు ప్రారంభించిన దార్శనికమైన గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీ ప్రాజెక్టును ప్రస్తావిస్తూ, దాని అభివృద్ధికి భారత్ పూర్తి మద్దతునిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సందర్శకులకు, పెట్టుబడిదారులకు మరింత సౌలభ్యంగా ఉండేందుకు త్వరలో గెలెఫు సమీపంలో ఒక ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌ను భారత్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
"భారత్, భూటాన్.. పురోగతి, శ్రేయస్సు ద్వారా బలంగా అనుసంధానమై ఉన్నాయి" అని ప్రధానమంత్రి అన్నారు. ఈ స్ఫూర్తితోనే గతేడాది భూటాన్ పంచవర్ష ప్రణాళిక కోసం భారత ప్రభుత్వం ₹10,000 కోట్ల మద్దతు ప్యాకేజీని ప్రకటించిందని తెలిపారు. రోడ్ల నుంచి వ్యవసాయం వరకు, ఆర్థిక సహాయం నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు అనేక రంగాల్లో ఈ నిధులను వినియోగిస్తున్నారని, తద్వారా భూటాన్ పౌరుల జీవన సౌలభ్యం మెరుగుపడుతుందన్నారు. భూటాన్ ప్రజలకు నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా భారత్ చర్యలు తీసుకుందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూటాన్‌లో యూపీఐ చెల్లింపుల పరిధి విస్తరిస్తోందని, అక్కడి పౌరులు భారతదేశాన్ని సందర్శించినప్పుడు యూపీఐ సేవలను ఉపయోగించుకునేందుకు వీలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
భారత్-భూటాన్ మధ్య పటిష్టమైన భాగస్వామ్యం ద్వారా ఇరుదేశాల యువత అధిక ప్రయోజనం పొందుతున్నారని.. జాతీయ సేవ, స్వచ్ఛంద సేవ, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో గౌరవ రాజు చేస్తున్న ఆదర్శప్రాయమైన కృషిని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. సాంకేతికత ద్వారా యువతను శక్తిమంతం చేయటానికి రాజుగారు చేస్తున్న ప్రయత్నాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ దార్శనికతతో భూటాన్ యువత ఎంతో ప్రేరణ పొందుతోందని.. విద్య, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, అంతరిక్షం, సంస్కృతి వంటి అనేక రంగాల్లో భారత్, భూటాన్ యువత మధ్య సహకారం పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల యువత కలిసి ఒక ఉపగ్రహాన్ని తయారుచేస్తున్నారని.. ఇది భారత్, భూటాన్ దేశాలకు కీలకమైన విజయమని తెలిపారు.
ఇరుదేశాల మధ్య ఉన్న దృఢమైన భావోద్వేగ బంధమే భారత్-భూటాన్ దేశాల ప్రధాన బలమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారతదేశంలోని రాజ్‌గిర్‌లో ఇటీవల రాయల్ భూటానీస్ ఆలయాన్ని ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ప్రయత్నం దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నట్లు తెలిపారు. భూటాన్ ప్రజల ఆకాంక్షలకు స్పందిస్తూ, వారణాసిలో భూటాన్ ఆలయం, అతిథి గృహ నిర్మాణానికి అవసరమైన భూమిని భారత ప్రభుత్వం అందిస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ ఆలయాలు భారత్, భూటాన్ మధ్య అమూల్యమైన, చారిత్రక సాంస్కృతిక బంధాల్ని మరింత బలోపేతం చేస్తాయని స్పష్టం చేశారు. ప్రసంగాన్ని ముగిస్తూ.. ఇరుదేశాలు శాంతి, సమృద్ధి, ఉమ్మడి పురోగతి కోసం పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాలపై గౌతమ బుద్ధుడు, గురు రిన్‌పోచె ఆశీస్సులు నిరంతరం ఉండాలని ప్రార్థించారు.
***
(Release ID: 2188977)
Visitor Counter : 11
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Nepali
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam