కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దోహాలో జరిగిన రెండో ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సులో డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ప్రసంగం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పేదరిక నిర్మూలన, సామాజిక భద్రత పురోగతిలో భారత్ సాధించిన పరివర్తనాత్మక పురోగతిని ప్రముఖంగా ప్రస్తావించిన కేంద్ర మంత్రి

ప్రణాళికలకు ప్రజలు కేంద్రబిందువుగా ఉన్నప్పుడు... అభివృద్ధి ఉమ్మడి ప్రయత్నంగా మారినప్పుడు... సామాజిక పురోగతి సాధ్యమని వ్యాఖ్య

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' దార్శనికతను పునరుద్ఘాటించిన కేంద్రమంత్రి

భారత ప్రగతి ప్రయాణానికి మార్గదర్శనం చేస్తున్న అంత్యోదయ సూత్రం

భారత అభివృద్ధి పథం దక్షిణ ప్రపంచ దేశాలకు అనుసరణీయ అభివృద్ధి నమూనాను అందిస్తుంది

ఖతార్‌లోని దోహాలో జరిగిన రెండో ప్రపంచ సామాజిక అభివృద్ధి శిఖరాగ్ర సదస్సు ప్లీనరీ సమావేశంలో భారత ప్రతినిధిగా కేంద్ర మంత్రి ప్రసంగం

Posted On: 05 NOV 2025 7:12PM by PIB Hyderabad

గౌరవనీయులు, విశిష్ట ప్రతినిధులు, సహచరులారా,

ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు లభించిన గౌరవం.

30 సంవత్సరాల కిందట కోపెన్‌హాగన్ డిక్లరేషన్ ప్రజలను అభివృద్ధి కేంద్రంగా ఉంచింది... పేదరిక నిర్మూలన, సంపూర్ణ ఉపాధి, మంచి పని వాతావరణం, సామాజిక సమ్మిళితత్వంపై అది దృష్టి సారించింది. ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి పట్ల భారత్ అనుసరిస్తున్న విధానాన్ని ఈ డిక్లరేషన్ ప్రతిధ్వనిస్తుంది.

భారత అభివృద్ధి గాథ ఒక స్థాయిలో పరివర్తనకు దారితీసింది. గత 10 సంవత్సరాల్లో నిరంతర సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాల కలయికతో పాటు డిజిటల్ ఆవిష్కరణల ద్వారా సుమారు 25 కోట్ల మంది భారతీయులు పలు రకాల పేదరికం నుంచి బయటపడ్డారు.

గౌరవనీయులారా,

భారత వృద్ధి ప్రయాణానికి అంత్యోదయ సూత్రం మార్గనిర్దేశం చేసింది... దీని అర్థం వరుసలోని చివరి వ్యక్తికీ సాధికారత కల్పించడం. జీవనచక్ర ఆధారితమైన విధానాల ఫలితమే మా పురోగతి. ఇక్కడ పిల్లలకు ఆరోగ్యకరమైన పునాది లభిస్తుంది... యువతకు విద్య, జీవనోపాధికి మద్దతు లభిస్తుంది... కార్మికులకు మంచి పని వాతావరణం లభిస్తుంది... వృద్ధులకు గౌరవం, ఆదాయ భద్రతకు భరోసా లభిస్తుంది.

ఈ రోజు 11.8 కోట్ల మంది బడి పిల్లలు పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం పొందుతున్నారు... 80 కోట్లకు పైగా పౌరులకు ఆహార భద్రత కల్పించాం... 42.5 కోట్ల మంది భారతీయులకు ఆరోగ్య భద్రత కల్పించాం... అల్పాదాయ వర్గాలకు చెందిన వారికి 3.7 కోట్లకు పైగా ఇళ్ళనూ అందించాం.

2017–18 నుంచి 2023–24 మధ్య కాలంలో మా నిరుద్యోగిత రేటు 6 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గింది... మహిళల ఉపాధి రేటు దాదాపు రెట్టింపయింది. లక్షలాది మంది మహిళలు స్వయం సహాయక బృందాల్లో చేరారు. మహిళల నేతృత్వంలోని స్థానిక సంస్థల బలాన్ని పెంపొందించడంలో రుణ చెల్లింపులు ఎంతగానో తోడ్పడ్డాయి.

భారత సామాజిక భద్రతా కవరేజీ 2015లో 19 శాతంగా ఉండగా... 2025 నాటికి 64.3 శాతానికి పెరిగింది. ఈ విషయంలో మా ప్రయత్నాలను గుర్తించిన అంతర్జాతీయ సామాజిక భద్రతా సంఘం... "సామాజిక భద్రతలో అత్యుత్తమ పనితీరుకు అందించే ఐఎస్ఎస్ఏ పురస్కారం"ను ఈ సంవత్సరం భారత్‌కు ప్రదానం చేసింది.

ఈ కార్యక్రమాలను సజావుగా అమలు చేయడంపై దృష్టి సారించడం మా ప్రయత్నాల్లో ప్రధానమైనది. బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఇంటర్నెట్ యాజమాన్యం, పౌరులకు ప్రత్యేక ఐడీల నెట్‌వర్క్ ద్వారా... ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానాన్ని ఉపయోగించి అందరికీ పథకాల ప్రయోజనాలను సమర్థంగా అందించాం.

గౌరవనీయులారా,

ముఖ్యంగా మహిళల నేతృత్వంలో అభివృద్ధి, సాంప్రదాయ వైద్య వ్యవస్థలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, సహకార సంస్థలను సమ్మిళిత వృద్ధికి చోదక శక్తిగా గుర్తిస్తూ ఈ శిఖరాగ్ర సమావేశంలో మనం ఆమోదిస్తున్న రాజకీయ ప్రకటన ప్రపంచ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉంది.

మా ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధి మార్గాలు... సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వాతావరణ మార్పుల పట్ల మా నిబద్ధతకు అనుగుణంగా ఉన్నాయి17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు గల ఐక్యరాజ్యసమితి ఎజెండా విషయంలోనూ మేం స్థిరంగా ఉన్నాం.

పాకిస్తాన్ అధ్యక్షుడు నిన్న భారత్‌పై చేసిన అర్థంలేని ఆరోపణలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఇది భారత్ గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా సామాజిక అభివృద్ధి పట్ల ప్రపంచం దృష్టిని మరల్చడం కోసం ఒక అంతర్జాతీయ స్థాయి వేదికను దుర్వినియోగం చేయడమే. మేం వాస్తవాలను మీ ముందుంచడం ద్వారా ఈ అపోహలను తొలగించాలనుకుంటున్నాం.

సింధు జలాల ఒప్పందం విషయంలో పాకిస్తాన్ నిరంతర శత్రుత్వం, సరిహద్దు ఉగ్రవాదం ద్వారా ఒప్పంద స్ఫూర్తిని దెబ్బతీసింది. భారత్ చేపట్టిన చట్టబద్ధమైన ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఒప్పంద నియమాలను పదే పదే దుర్వినియోగం చేసింది.

భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ విషయంలోనూ.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించడానికి పాకిస్తాన్‌కు ఎటువంటి హక్కూ లేదు. ప్రత్యేకించి భారత పౌరులపై సరిహద్దు ఉగ్రవాద చర్యలతో దాడులకు పాల్పడే విషయంలోనూ ఇది వర్తిస్తుంది.

అంతర్జాతీయ సమాజం అందించే విరాళాలపై ఆధారపడేందుకు కారణమైన తమ అభివృద్ధికి సంబంధించిన తీవ్రమైన సవాళ్లను పాకిస్తాన్ ఆత్మపరిశీలన చేసుకుని పరిష్కరించుకోవడం మంచిది. ఇకనైనా ఆ దేశం అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేయడం మానుకోవాలి.

గౌరవనీయులారా,

మా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి "సబ్ కా సాథ్, సబ్ కా వికాస్" అంటే... 'మనమంతా ఐక్యంగా ఉందాం, కలిసికట్టుగా అభివృద్ధి సాధించుకుందాం' అనే మంత్రం స్ఫూర్తిగా... పాలసీల రూపకల్పనకు కేంద్రంగా ప్రజలు ఉన్నప్పుడుఆవిష్కరణలు సమ్మిళితత్వాన్ని సాధించినప్పుడుఅభివృద్ధి ఉమ్మడి ప్రయత్నంగా మారినప్పుడు సామాజిక పురోగతి సాధించవచ్చని మేం విశ్వసిస్తున్నాం.

ప్రతి దేశపు విభిన్న పరిస్థితులు, ఆర్థిక అవసరాలు, సామాజిక అవసరాలను ఈ వేదిక గుర్తించడం, ధ్రువీకరించడమూ ముఖ్యమే.

భారత అభివృద్ధి పథం దక్షిణాది దేశాల కోసం ఒక అనుసరణీయ అభివృద్ధి నమూనాను అందిస్తుంది. సామాజిక అభివృద్ధి కోసం భవిష్యత్తు మార్గాన్ని మేం సమష్టిగా రూపొందిస్తున్నందున... భారత్ తన అత్యుత్తమ పద్ధతులను పంచుకోవడానికి, ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికీ సిద్ధంగా ఉంది.

సామాజికంగా సమాన హక్కులు గల, సమ్మిళితమైన ప్రపంచాన్ని సృష్టించడం పట్ల తమ నిబద్ధతను పునరుద్ధరించడం కోసం ప్రపంచ నాయకత్వానికి ఒక వేదికను అందిస్తూ సరైన సమయంలో ఈ సమావేశాన్ని నిర్వహించిన ఐక్యరాజ్యసమితికి, ఖతార్ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు.

 

***


(Release ID: 2186916) Visitor Counter : 2