ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవ రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ కొత్త భవనం ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 01 NOV 2025 3:22PM by PIB Hyderabad

ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శ్రీ రమణ్‌ డేకా, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, రాష్ట్ర శాసనసభ స్పీకర్- నా మిత్రుడు శ్రీ రమణ్ సింగ్‌, ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి, కేంద్ర మంత్రిమండ‌లిలో నా సహ‌చ‌రుడు శ్రీ తోఖన్ సాహు, ఉప ముఖ్యమంత్రులు- శ్రీ విజయ్ శర్మ, శ్రీ అరుణ్ సావు, శాస‌న‌స‌భ‌లో ప్రతిపక్ష నేత శ్రీ చరణ్ దాస్ మహంత్‌, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కార్య‌క్ర‌మానికి హాజరైన సోద‌రీసోదరులారా!

ఛత్తీస్‌గఢ్ ప్ర‌గ‌తి ప‌య‌నంలో ఇది స్వ‌ర్ణ‌శ‌కం ఆరంభ‌మైన రోజు. వ్యక్తిగతంగా ఇది నాకు ఎన‌లేని ఆనందం క‌లిగించిన ప్ర‌త్యేక‌ సంద‌ర్భం. ఈ నేల‌తో దశాబ్దాలుగా నాకు లోతైన భావోద్వేగ బంధముంది. ఓ కార్మికుడిగా ఛత్తీస్‌గఢ్‌లో చాలా సమయం గడిపాను. ఆ స‌మ‌యంలో ఈ గ‌డ్డ‌మీద ఎంతో జీవితానుభ‌వం గ‌డించాను. ఈ రాష్ట్ర ప్ర‌జ‌లు, నేల న‌న్ను అమితంగా ఆద‌రించి, ఆశీర్వ‌దించాయి. ఛత్తీస్‌గఢ్ ఆలోచన, భావన నుంచి దాని ఏర్పాటుకు దారితీసిన సంకల్పం దాకా మాత్ర‌మేగాక‌, ఆ కల సాకారమ‌య్యే వరకూ రాష్ట్ర పరిణామంలోని ప్ర‌తి ద‌శ‌కూ నేను సాక్షిగా నిలిచాను. ఈ నేప‌థ్యంలో ఛత్తీస్‌గఢ్ నేడు తన 25 ఏళ్ల ప‌య‌నంలో ఓ కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ  చారిత్రక సంద‌ర్భంలోనూ నేనొక భాగం కావడం నాకు మరోసారి ద‌క్కిన గౌరవం. ఈ రజతోత్సవ స‌మ‌యాన రాష్ట్ర ప్రజల కోసం కొత్త శాసనసభ భవనాన్ని ప్రారంభించడం నా అదృష్టం. ఈ శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి నా హృదయపూర్వక అభినందనలు... శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

మిత్రులారా!

ఇది (2025) భారత గణతంత్ర అమృత సంవత్సరం కాగా, 75 ఏళ్ల కిందట దేశం తన రాజ్యాంగాన్ని పౌరులకు అంకితం చేసింది. ఈ చారిత్రక సందర్భంలో ఈ ప్రాంతం నుంచి రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించిన పండిట్ శ్రీ రవిశంకర్ శుక్లా, బారిస్టర్ శ్రీ ఠాకూర్ చెడిలాల్, శ్రీ ఘనశ్యామ్ సింగ్ గుప్తా, శ్రీ కిషోరి మోహన్ త్రిపాఠీ, శ్రీ రాంప్రసాద్ పోతాయ్, శ్రీ రఘురాజ్ సింగ్‌ తదితరులకు నివాళి అర్పిస్తున్నాను. అంతగా అభివృద్ధి చెందని ఈ ప్రాంతం నుంచి దార్శనికులైన ఈ పెద్దలు ఢిల్లీ స్థాయిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ నాయకత్వాన రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

మిత్రులారా!

ఛత్తీస్‌గఢ్ చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. ఇంతటి అద్భుత, ఆధునిక అసెంబ్లీ భవన ప్రారంభోత్సవం కేవలం ఒక నిర్మాణానికి పరిమితం కాదు... ఇది పాతికేళ్ల ప్రజాకాంక్షలు, పోరాటాలు, ప్రతిష్ఠకు ఒక ప్రతీక. ఛత్తీస్‌గఢ్ ఇవాళ తన కలల కొత్త శిఖరాన్ని అధిరోహించింది. ఈ గర్వకారణ సందర్భంలో దూరదృష్టి, సహానుభూతితో ఈ రాష్ట్ర ఏర్పాటుకు బాటవేసిన దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు, భారతరత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయికి శిరసాభివందనం చేస్తున్నాను.

మిత్రులారా!

అటల్‌ జీ 2000 సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి రూపమిస్తూ తీసుకున్న నిర్ణయం కేవలం పరిపాలన పరమైనది కాదు. అది ఈ ప్రాంత ఆత్మకు గుర్తింపు ఇవ్వడంతోపాటు అభివృద్ధికి కొత్త దారులు వేసిన దార్శనిక ముందడుగు. అందుకే ఇవాళ అటల్ జీ విగ్రహావిష్కరణతో పాటు ఈ కొత్త శాసనసభ సౌధం ప్రారంభోత్సవ సమయాన నా హృదయం భావోద్వేగంతో ఉప్పొంగింది. అంతేకాదు... “అటల్ జీ, మీరు ఏ లోకం ఉన్నా మీ కలలు సాకారం అవుతుండటాన్ని చూస్తూనే ఉంటారు. నాడు మీరు రూపుదిద్దిన ఛత్తీస్‌గఢ్ నేడు పెల్లుబికే ఆత్మవిశ్వాసంతో సరికొత్త ప్రగతి శిఖరాలను అధిరోహిస్తోంది” అని ఎలుగెత్తి చాటాలని ప్రగాఢంగా కోరుకుంటున్నాను.

మిత్రులారా!

ఛత్తీస్‌గఢ్ శాసనసభ చరిత్ర ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ అందమైన రాష్ట్రం 2000 సంవత్సరంలో ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాన్ని రాయ్‌పూర్‌లోని రాజ్‌కుమార్ కళాశాలలోగల జష్‌పూర్ హాల్‌లో నిర్వహించారు. జరిగింది. ఆ రోజుల్లో రాష్ట్ర వనరులు పరిమితం... కానీ, కలలు అపరిమితం. కాబట్టి, మన భవిష్యత్తును మనమే రూపొందించుకుందాం... దాన్ని వేగంగా ఉజ్వలం చేసుకుందాం అన్నదే ప్రజానీకం మదిలో ఆనాటి ఏకైక భావన. ఆ తర్వాత ఏర్పాటైన అసెంబ్లీ భవనం కూడా తొలినాళ్లలో మరొక శాఖ ప్రాంగణంలో భాగంగా ఉండేది. అక్కడి నుంచి నవశక్తితో ఛత్తీస్‌గఢ్ ప్రజాస్వామ్య పయనం మొదలై, 25 ఏళ్ల తర్వాత నేడు అదే ప్రజాస్వామ్యంలో, అదే వ్యక్తులు ఆధునిక, డిజిటల్, స్వయంసమృద్ధ శాసనసభ సముదాయాన్ని ప్రారంభించుకున్నారు.

మిత్రులారా!

ఈ భవనం ప్రజాస్వామ్యానికి పవిత్ర ప్రదేశం... ఇక్కడ ప్రతి స్తంభం పారదర్శకతకు చిహ్నం... ప్రతి కారిడార్ మనకు జవాబుదారీతనాన్ని గుర్తు చేస్తుంది. అదేవిధంగా ఈ సౌధంలోని ప్రతి గది ప్రజా గళాన్ని ప్రతిధ్వనింపజేస్తుంది. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు రాబోయే దశాబ్దాల్లో ఛత్తీస్‌గఢ్ భవితను నిర్దేశిస్తాయి. ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ఛత్తీస్‌గఢ్ భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల్లో కీలక భాగం కాగలదు. ఈ భవనం అనేక తరాలపాటు రాష్ట్ర విధివిధానాలు, విధాన నిర్ణేతలకు కూడలిగా పనిచేస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా!

యావద్దేశం ఇవాళ వారసత్వం, వికాసం రెండింటినీ ఆమోదిస్తూ ముందడుగు వేస్తోంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో, ప్రతి విధానంలో ఈ స్ఫూర్తి ప్రతిబింబిస్తుంది. పవిత్ర సెంగోల్ మన కొత్త పార్లమెంటుకు స్ఫూర్తినిచ్చింది.. పార్లమెంటులోని కొత్త గ్యాలరీలు యావత్‌ ప్రపంచాన్ని భారత ప్రజాస్వామ్య ప్రాచీన మూలాలతో జోడిస్తాయి. పార్లమెంటు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విగ్రహాలు దేశంలో ప్రజాస్వామ్య మూలాల లోతును ప్రపంచానికి గుర్తుచేస్తాయి.

మిత్రులారా!

భారత దార్శనికత, స్ఫూర్తిని విస్తరింపజేయడంలో పార్లమెంటు కొత్త భవనం పాత్ర గురించి నేనిప్పుడు చెప్పిన ప్రతి మాట పొల్లుపోకుండా ఛత్తీస్‌గఢ్‌ కొత్త శాసనసభకూ వర్తిస్తుంది. ఈ అసెంబ్లీ సముదాయం రాష్ట్ర సుసంపన్న సంస్కృతికి నిజమైన ప్రతిబింబం. ఈ భవనంలోని ప్రతి మూలలోనూ ఛత్తీస్‌గఢ్ పవిత్ర భూమిపై జన్మించిన మహనీయుల స్ఫూర్తి నిండి ఉంది. అణగారిన వర్గాలకు ప్రాధాన్యం, ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్’ (సమష్టి భాగస్వామ్యంతో సమ్మిళిత వృద్ధి) దృక్కోణం, బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో సుపరిపాలన తదితరాలు దేశ రాజ్యాంగ స్ఫూర్తిని కూడా సూచిస్తాయి. ఈ శాశ్వత విలువలన్నీ మన రుషులు, మహనీయులు, మహా నాయకులు ప్రబోధించినవే.

మిత్రులారా!

ఈ అద్భుత భవనాన్ని చూస్తుంటే- బస్తర్ కళావైభవ సౌందర్య నా కళ్లకు కడుతోంది. కొన్ని నెలల కిందట నేను థాయ్‌లాండ్ ప్రధానమంత్రికి బస్తర్ కళారూపాన్ని బహూకరించినట్లు గుర్తు. ఈ కళారూపం భారతీయ సృజనాత్మకత, సాంస్కృతిక సామర్థ్యానికి సంకేతం.

మిత్రులారా!

ఈ భవనం గోడలు బాబా గురు ఘాసిదాస్ “మాణిఖే-మాణిఖే ఏక్ సమాన్” (ప్రతి మానవుడూ సమానమే) అనే సందేశాన్ని వినిపిస్తుంటాయి. ఇది “సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా సమ్మాన్‌” (సమష్టి భాగస్వామ్యంతో సమ్మిళిత వృద్ధి... అందరి పట్ల గౌరవం) సారాంశాన్ని బోధిస్తుంది. ఈ భవనంలోని ప్రతి ద్వారం ‘మాతా శబరి’ ప్రబోధిత ప్రేమ, ఆదరాలను ప్రబోధిస్తుంది. ప్రతి అతిథిని, ప్రతి పౌరుడినీ ఆప్యాయతతో స్వాగతించాలని మనకు గుర్తుచేస్తుంది. ఈ సభలోని ప్రతి ఆసనం సాధువు కబీర్ బోధించిన సత్యం, నిర్భయత స్ఫూర్తిని చాటుతుంది. ఈ భవనం పునాదిలో  మహాప్రభు శ్రీ వల్లభాచార్య సంకల్పం ఉంది.. ‘నర సేవే నారాయణ సేవ’ (మానవసేవే మాధవ సేవ) అని అది బోధిస్తుంది.

మిత్రులారా!

భారతదేశం ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు కాగా, మన గిరిజన సమాజం తరతరాలుగా ఈ సంప్రదాయాలను ఆచరిస్తూ సజీవంగా ఉంచింది. బస్తర్ ‘ఆదిమ్ సంసద్’ (ప్రాచీన చట్టసభ)గా వ్యవహరించే ‘మురియా దర్బార్’ ఈ వారసత్వానికి సజీవ ఉదాహరణ. ఈ ఆదిమ సంసద్‌ ద్వారా పరిష్కారాల అన్వేషణ దిశగా శతాబ్దాల నుంచీ మన సమాజం, పాలన సమష్టిగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మురియా దర్బార్ సంప్రదాయానికి ఈ అసెంబ్లీ భవనం సముచిత స్థానంతోపాటు గౌరవం కల్పించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది.

మిత్రులారా!

ఈ అసెంబ్లీలోని ప్రతి మూల ఒకవైపు మన మహనీయుల ఆదర్శాలను ప్రతిబింబిస్తే, మరోవైపు స్పీకర్ ఆసనం శ్రీ రమణ్ సింగ్ వంటి అనుభవజ్ఞుల నాయకత్వానికి అలంకారమైంది. అంకితభావంతో పనిచేసే పార్టీ కార్యకర్తలందరూ కృషి, అంకితభావం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను దాని వాస్తవిక స్ఫూర్తితో ఎలా బలోపేతం చేయగలరో చెప్పడానికి శ్రీ రమణ్‌ ఒక ఉజ్వల ఉదాహరణగా నిలుస్తారు.

మిత్రులారా!

క్రికెట్‌ ఆటలో జట్టుకు నాయకత్వం వహించిన వ్యక్తి అదే జట్టులో సాధారణ సభ్యుడుగా కొనసాగడం మనం సాధారణంగా చూస్తుంటాం. రాజకీయాల్లో అలాంటి ఉదాహరణలు చాలా అరుదు... కానీ, శ్రీ రమణ్ సింగ్ అందుకు విరుద్ధం. ఒకనాడు కెప్టెన్‌ (ముఖ్యమంత్రి)గా ఉన్న ఆయన, ఇవాళ ఛత్తీస్‌గఢ్ పురోగతిపై నిరంతర నిబద్ధతగల నేతగా వాస్తవిక స్ఫూర్తితో ఏ స్థానంలో ఉన్నాననే అంశంతో నిమిత్తం లేకుండా తన వంతు సేవ చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర సేవకు అంకితమైన ప్రతి శ్రామికుడికీ ఆయనే ఆదర్శం అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు!

మిత్రులారా!

రాష్ట్ర కవి శ్రీ నిరాలా ఓ సందర్భంలో సరస్వతీ దేవిని తన పద్యంలో- “ప్రియ స్వతంత్ర రవ్‌ అమృత్‌ మంత్ర్‌ భారత్‌ మే భర్‌ దే" (ప్రియమైన స్వేచ్ఛా మంత్రామృతాన్ని నవ భారత్‌ నిండి నింపవమ్మా) అని ప్రార్థించారు. ఇది కేవలం కవితా పంక్తులకు పరిమితం కాదు... నవ్య, స్వాతంత్ర్య భారత్‌ రూపకల్పనకు తారకమంత్రం. అదే సందర్భంలో ఆయన సరికొత్త లయ, వేగం, గళం గురించి కూడా చెప్పారు. అది లోతుగా పాదుకున్న సంప్రదాయాలతో భవిష్యత్తు వైపు పూర్తి విశ్వాసంతో ముందడుగు వేసే భారత్ దార్శనికతను వివరిస్తుంది. మనం ఇవాళ ఛత్తీస్‌గఢ్ కొత్త అసెంబ్లీ భవనంలో నిలుచున్న నేపథ్యంలో ఆ స్ఫూర్తి ఇక్కడ సజీవమై నిలిచింది. ఈ భవనం కూడా ఆ ‘నవ స్వరం’ సంకేతమే. ఇక్కడ పాత అనుభవాల ప్రతిధ్వని కొత్త కలల శక్తితో మమేకం అవుతుంది. ఈ శక్తితో  మనం ఒక భారత దేశానికి... వారసత్వం, ప్రగతి సమ్మిళిత ఛత్తీస్‌గఢ్‌కు పునాది వేసి, అత్యంత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.

మిత్రులారా!

‘పౌర దేవో భవ’ (పౌరుడే దైవం) అనేది మన సుపరిపాలనకు మార్గదర్శక మంత్రం. అందుకే, ఈ అసెంబ్లీలో తీసుకునే ప్రతి నిర్ణయానికీ ప్రజల సంక్షేమమే ప్రాతిపదిక కావాలి. సంస్కరణలను వేగిర పరుస్తూ జనజీవనాన్ని సరళం చేసే, అనవసర ప్రభుత్వ జోక్యం తగ్గించే చట్టాలు ఇక్కడ రూపొందాలి. అసలు ప్రభుత్వం లేకపోవడం లేదా అతిగా వ్యవహరించడం అన్నది తగదు... అంటే-  శరవేగంతో పురోగమనానికి నిజమైన మంత్రం ఇదే!

మిత్రులారా!

మన ఛత్తీస్‌గఢ్ శ్రీరాముని మాతృభూమి... అంటే- రాముడు ఈ నేలకు ప్రియమైన మేనల్లుడు. ఈ కొత్త అసెంబ్లీ సముదాయంలో రాముని ఆదర్శాలను గుర్తుచేసుకోవడానికి ఇవాళ్టికన్నా శుభప్రదమైన సందర్భం మరేముంటుంది! రాముని ఆదర్శాలే మన సుపరిపాలన సూత్రాలు.

మిత్రులారా!

అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠాపన సందర్భంగా ‘దేశం కోసం దేవుడు - దేశం కోసం రాముడు’ అని మనమంతా ప్రతిజ్ఞ చేశాం. “దేశం కోసం రాముడు” అంటే- ‘త్రిలోకాలలో రామరాజ్యం’ అని మనం గుర్తుంచుకోవాలి. అలాగే “హర్షిత్‌ భయ్‌ గయే సబ్‌ శోకాః”- సుపరిపాలన, ప్రజా సంక్షేమ పాలన అని అర్థం. అంటే- ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్..’ ద్వారా మార్గనిర్దేశం. “రామ్ టు రాష్ట్ర” అంటే- దారిద్ర్య రహితం, పేదలు లేని, కష్టాలు ఎరుగని ప్రజలున్న దేశం... పేదరికం లేని సంపన్న భారతదేశం. అలాగే అకాల మరణం లేని, వ్యాధి బాధలు తాకని, ఆరోగ్యకర-సంతోషకర నవ భారత్ సృష్టి. అదేవిధంగా వివక్ష లేని, అందరికీ సామాజిక న్యాయం, సమానత్వం లభించే పునాదిపై నిర్మితమైన సమాజం అన్న మాట!

మిత్రులారా!

అంతేకాదు... మానవాళి వ్యతిరేక శక్తుల నిర్మూలన, ఉగ్రవాద అంతంపై ప్రతిజ్ఞ. ఆపరేషన్ సిందూర్‌లో మనం చూసింది ఇదే... ఉగ్రవాద నిర్మూలనకు ప్రతినబూనుతూ, ఉగ్రవాద నెట్‌వర్క్‌ వెన్నెముకను విరవడమే ఇప్పుడు భారత్‌ కర్తవ్యం. నక్సలిజం, మావోయిస్టు హింస అంతం దిశగా భారత్ నేడు నిర్ణయాత్మకంగా ముందడుగు వేస్తోంది. ఈ మేరకు అపూర్వ విజయాలతో సగర్వంగా సాగుతోంది. ఈ కొత్త ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ సముదాయం అంతటా అదే సగర్వ స్ఫూర్తి ప్రసరిస్తూంటుంది.

మిత్రులారా!

గడచిన 25 ఏళ్లలో ఛత్తీస్‌గఢ్ ఒక అద్భుత, స్ఫూర్తిదాయక రూపాంతరీకరణను చూసింది. ఒకనాడు నక్సలిజానికి, వెనుకబాటుతనానికి పేరుపడిన ఈ రాష్ట్రం ఇవాళ శ్రేయస్సు, భద్రత, స్థిరత్వానికి ప్రతీకగా మారింది. ‘బస్తర్ ఒలింపిక్స్’పై ఇప్పుడు దేశమంతటా చర్చ సాగుతోంది. ఒకప్పుడు నక్సలిజం ప్రభావిత ప్రాంతాలు ఇవాళ అభివృద్ధికి, శాంతికి, చిరునవ్వులకు నెలవుగా మారాయి. ఈ మార్పులో ఛత్తీస్‌గఢ్ ప్రజల కృషి, బీజేపీ ప్రభుత్వాల దార్శనిక నాయకత్వం ప్రధాన పాత్ర పోషించాయి.

మిత్రులారా!

ఛత్తీస్‌గఢ్ రజతోత్సవం ఒక కీలక ఘట్టానికి మాత్రమేగాక ఓ గొప్ప భవిష్యత్‌ పయనానికి నాంది. మన దేశం 2047లో స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు చేసుకునే నాటికి ‘వికసిత భారత్’ స్వప్న సాకారంలో ఛత్తీస్‌గఢ్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ మేరకు ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ, ప్రతి ప్రజా ప్రతినిధులందూ దేశంలోని ప్రతి రాష్ట్రం కొత్త శిఖరాలను అధిరోహించేలా ప్రేరణనిచ్చే వ్యవస్థను, అసెంబ్లీని నిర్మించాలని పిలుపునిస్తున్నాను. ఈ సభలో సాగే ప్రతి చర్చలో, లేవనెత్తే ప్రతి ప్రశ్నలో, ప్రతి అంశంపై చర్చలో శ్రేష్ఠత ఉండాలి. మనం ఏమి చేసినా, ఏ రూపంలో చేసినా, మన అంతిమ లక్ష్యం “వికసిత ఛత్తీస్‌గఢ్ – వికసిత భారత్” అయి ఉండాలి.

మిత్రులారా!

ఈ కొత్త అసెంబ్లీ భవనం వాస్తవిక గొప్పదనమేమిటో దాని నిర్మాణ వైభవం కాకుండా సంక్షేమం ప్రాతిపదికన ఇక్కడ తీసుకునే నిర్ణయాలే నిర్వచిస్తాయి. ఈ సభ ప్రజల కలలు, ఆకాంక్షలను ఎంత లోతుగా అర్థం చేసుకుంటుందో, వాటి సాకారానికి ఎంత దృఢంగా పనిచేస్తుందో దాని ద్వారా కొలుస్తారు. ఇక్కడ ప్రతి నిర్ణయం రైతుల శ్రమను గౌరవించాలి, యువత ఆకాంక్షలకు మార్గనిర్దేశం చేయాలి, ‘నారి శక్తి’ (మహిళా సాధికారత)కి కొత్త ఆశల రెక్కలు మొలవాలి. సమాజంలోని పేదలను సముద్ధరణకు కృషి చేయాలి. ఈ అసెంబ్లీ చట్టాల రూపకల్పనకు మాత్రమేగాక ఛత్తీస్‌గఢ్ భవిష్యత్తును రూపొందించే నిత్యచైతన్య కేంద్రమని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ జన్మించే ప్రతి ఆలోచనలో ప్రజా సేవ స్ఫూర్తి, అభివృద్ధి సంకల్పం, భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనే విశ్వాసం మెండుగా ఉండాలి. ఇది మన సమష్టి సంకల్పం.

మిత్రులారా!

ప్రజాస్వామ్యంలో కర్తవ్యానికి సదా ప్రాధాన్యమివ్వాలి. కొత్త అసెంబ్లీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజా ప్రతినిధులుగా మన జీవితాన్ని సమగ్రత, నిబద్ధతతో కర్తవ్య నిర్వహణకు అంకితం చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. ఈ పవిత్ర సముదాయం నుంచి ఈ గణతంత్ర అమృత సంవత్సరంలో ప్రజలకు సేవ చేయడాన్ని మన జీవన ధ్యేయంగా మార్చుకోవాలని ప్రతినబూనుదాం. ఈ అందమైన, కొత్త ప్రజాస్వామ్య ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఈ దార్శనికతను వాస్తవంగా మార్చినందుకు నా మిత్రుడైన  ముఖ్యమంత్రికి ప్రత్యేక అభినందనలు.

 

జై భారత్! జై ఛత్తీస్‌గఢ్!

అనేకానేక ధన్యవాదాలు.

 

***


(Release ID: 2185647) Visitor Counter : 5