ప్రధాన మంత్రి కార్యాలయం
బీహార్ రాష్ట్రానికి చెందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఈ నెల ప్రారంభంలో జీవికా నిధి క్రెడిట్ కోపరేటివ్ సొసైటీని ప్రారంభించే అవకాశం నాకు లభించింది..
ఈ బలం తోడుగా ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ మరింత విజయవంతమవుతుంది
ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనతో
మరింత బలోపేతం కానున్న కేంద్ర ప్రభుత్వ లఖ్‌పతి దీదీ ప్రచారం
సమాజంలోని ఇతర వర్గాలకూ మహిళా పథకాల ప్రయోజనాలు
ఉజ్వల యోజన పరివర్తన ప్రభావాన్ని ప్రపంచం గుర్తించిందన్న ప్రధాని
స్వస్త్ నారీ.. సశక్త్ పరివార్ ప్రచారం కింద గ్రామాలు,
పట్టణాల్లో 4.25 లక్షలకు పైగా ఆరోగ్య శిబిరాల ఏర్పాటు
రక్తహీనత, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి
తీవ్రమైన ఆరోగ్య సమస్యల కోసం ఉచితంగా రోగనిర్ధారణ
మహిళల పురోగతితోనే సామాజిక పురోగతి సాధ్యం: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
26 SEP 2025 1:00PM by PIB Hyderabad
బీహార్ రాష్ట్రానికి చెందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో అనుసంధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. నవరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ మహిళలతో కలిసి వారి వేడుకల్లో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను ఈ రోజు ప్రారంభించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇప్పటికే 75 లక్షల మంది మహిళలు ఈ కార్యక్రమంలో చేరారని శ్రీ మోదీ తెలిపారు. ఈ 75 లక్షల మంది మహిళల్లో ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలకు ఒకేసారిగా రూ. 10,000 బదిలీ చేసినట్లు ఆయన ప్రకటించారు.
ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో తనకు రెండు ఆలోచనలు వచ్చాయని శ్రీ మోదీ తెలిపారు. వాటిలో మొదటిది.. బీహార్ మహిళలు, కుమార్తెలకు ఈ రోజు చాలా విశిష్టమైనదని వ్యాఖ్యానించారు. ఉద్యోగంలో లేదా స్వయంఉపాధిలో ఒక మహిళ నిమగ్నమైనప్పుడు, ఆమె కలలకు కొత్త రెక్కలు వస్తాయనీ, సమాజంలో ఆమె గౌరవం పెరుగుతుందన్నారు. రెండోది.. పదకొండు సంవత్సరాల కిందట ప్రభుత్వం జన్ ధన్ యోజనను ప్రారంభించాలని నిర్ణయం తీసుకోకపోతే.. 30 కోట్లకు పైగా మహిళలు ఈ పథకం ద్వారా బ్యాంకు ఖాతాలు తెరవకపోతే.. ఈ ఖాతాలను మొబైల్ ఫోన్లు, ఆధార్‌తో అనుసంధానించకపోతే.. ఈ రోజు ఈ నిధులను వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయడం సాధ్యమయ్యేది కాదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మౌలిక సదుపాయాలు లేకుంటే డబ్బు అందేలోగానే వారు దానిని నష్టపోయేవారనీ.. ఫలితంగా లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరిగేదన్నారు.
తన సోదరి ఆరోగ్యంగా, సుసంపన్నంగా ఉండి, ఆమె కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు ఒక సోదరుడు నిజమైన ఆనందాన్ని పొందుతాడని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ శ్రేయస్సు వారికి లభించేందుకు ఒక సోదరుడు తాను చేయగలిగినదంతా చేస్తాడన్నారు. ఈ రోజు ఇద్దరు సోదరులు.. అంటే ప్రధానమంత్రిగా తానూ, ముఖ్యమంత్రిగా శ్రీ నితీశ్ కుమార్... బీహార్ మహిళల సేవ, శ్రేయస్సు, గౌరవం కోసం కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. నేటి కార్యక్రమం ఈ నిబద్ధతకు నిదర్శనమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన గురించి మొదటిసారిగా తనకు వివరించినప్పుడు దాని దార్శనికత తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబంలో కనీసం ఒక మహిళా లబ్ధిదారు ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా అందించే రూ. 10,000 ప్రారంభ ఆర్థిక సహాయంతో చేపట్టే వ్యాపారం విజయవంతం అయిన తర్వాత, మహిళలు అదనంగా రూ. 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంతమందికి లబ్ది చేకూరుతున్న విషయాన్ని గమనించాలని శ్రీ మోదీ ప్రతి ఒక్కరినీ కోరారు. బీహార్‌లోని మహిళలు ఇప్పుడు కిరాణా సామాగ్రి, పాత్రలు, సౌందర్య సాధనాలు, బొమ్మలు, స్టేషనరీలను విక్రయించే దుకాణాలను ప్రారంభించవచ్చని చెప్పారు. వారు పశువుల పెంపకం, కోళ్ల పెంపకం వంటి పశువుల సంబంధిత వ్యాపారాలనూ కొనసాగించవచ్చన్నారు. ఈ వ్యాపారాల నిర్వహణ కోసం అవసరమైన శిక్షణను అందిస్తారని ప్రధానమంత్రి తెలిపారు. బీహార్‌లో ఇప్పటికే స్వయం సహాయక బృందాల నెట్‌వర్క్ బలంగా ఉందనీ, దాదాపు 11 లక్షల గ్రూపులు క్రియాశీలంగా పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. బాగా స్థిరపడిన వ్యవస్థ ఇప్పటికే ఉందని అర్థం చేసుకోవచ్చన్నారు. "ఈ నెల ప్రారంభంలో జీవికా నిధి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనతో ఈ వ్యవస్థ బలం తోడై.. ఈ పథకం ప్రారంభం నుంచే బీహార్ అంతటా తన ప్రభావాన్ని చూపుతుంది" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వ లఖ్‌పతి దీదీ ప్రచారాన్ని ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన మరింత బలోపేతం చేసిందని శ్రీ మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది లఖ్‌పతి దీదీలను తయారుచేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనీ, 2 కోట్లకు పైగా మహిళలు ఇప్పటికే ఈ ఘనతను సాధించారని వివరించారు. వారి కృషి గ్రామాలను మార్చివేసిందనీ, సమాజాన్ని పునర్నిర్మించిందనీ అన్నారు. బీహార్‌లోనూ లక్షలాది మంది మహిళలు లఖ్‌పతి దీదీలుగా మారిన సంగతిని ప్రధానమంత్రి గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరును బట్టి చూస్తే.. దేశంలోనే అత్యధిక సంఖ్యలో లఖ్‌పతి దీదీలు.. బీహార్‌లో ఉండే రోజు ఎంతో దూరంలో లేదని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ముద్రా యోజన, డ్రోన్ దీదీ ప్రచారం, బీమా సఖి ప్రచారం, బ్యాంక్ దీదీ ప్రచారం వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ మహిళలకు ఉపాధినీ, స్వయంఉపాధి అవకాశాలనూ విస్తరింపజేస్తున్నాయని శ్రీ మోదీ తెలిపారు. ఈ ప్రయత్నాల వెనుక ఉన్న ఏకైక లక్ష్యం మహిళలకు అత్యధిక అవకాశాలను కల్పించడం ద్వారా వారి కలల సాకారంలో వారికి సహాయపడటమేనని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలతో దేశవ్యాప్తంగా మహిళలు, కుమార్తెలకు కొత్త రంగాలు అందుబాటులోకి వచ్చాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. పెద్ద సంఖ్యలో యువతులు నేడు సాయుధ దళాలు, పోలీసు వ్యవస్థలో చేరుతున్నారనీ, యుద్ధ విమానాలను కూడా నడుపుతున్నారని తెలిపారు. బీహార్ ప్రతిపక్ష పాలనలో ఉన్న రోజులను లాంతర్ పాలన యుగంగా అభివర్ణించిన శ్రీ నరేంద్ర మోదీ, వారి మోసాలను మర్చిపోవద్దని ప్రతి ఒక్కరినీ కోరారు. ఆ సమయంలో బీహార్‌లోని మహిళలు చట్టవిరుద్ధ కార్యకలాపాలను, అవినీతి భారాన్నీ భరించారని వ్యాఖ్యానించారు. బీహార్‌లో లాంతరు పాలన సమయంలో ప్రధాన రహదారులు పూర్తిగా పాడయ్యాయనీ, వంతెనలు లేవనీ, మౌలిక సదుపాయాలు సరిగా లేక మహిళలు ఎక్కువగా నష్టపోయారనీ ఆయన గుర్తు చేశారు. ‘‘వరదల సమయంలో ఈ కష్టాలు మరింత తీవ్రమయ్యేవి.. గర్భిణీలు సకాలంలో ఆసుపత్రులకు చేరుకోలేకపోయారు. క్లిష్ట పరిస్థితుల్లో సరైన చికిత్స అందుబాటులో లేక నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి మహిళలు బయటపడటానికి తమ ప్రభుత్వమే సహాయం చేసింది’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్‌లో రహదారుల నిర్మాణం ఊపందుకుందని తెలిపారు. బీహార్‌లో కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయనీ, ఈ పరిణామాలు రాష్ట్రంలోని మహిళల జీవితాలను గణనీయంగా సులభతరం చేశాయని ఆయన అన్నారు.
బీహార్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఒక ప్రదర్శన గురించి తనకు సమాచారం అందిందని చెబుతూ, పాత వార్తాపత్రికల నుంచి తీసిన వార్తల్ని చూపిస్తున్నారని, ఇవి బీహార్‌లో ప్రతిపక్ష పాలనలోని భయానక వాతావరణాన్ని స్పష్టంగా గుర్తు చేస్తాయన్నారు. ఆ సమయంలో ఏ కుటుంబం సురక్షితంగా లేదని, నక్సలైట్ హింసాకాండ ఎప్పుడూ కొనసాగేదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆయా సంవత్సరాల్లో మహిళలు ఎక్కువగా కష్టాల్ని భరించారని ఆయన పేర్కొన్నారు. పేదల నుంచి వైద్యులు, ఐఏఎస్ అధికారుల కుటుంబాల వరకు అందరూ ప్రతిపక్ష నాయకులు చేసిన దురాగతాల నుంచి తప్పించుకోలేకపోయారని శ్రీ మోదీ విమర్శించారు.
శ్రీ నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్‌లో చట్టబద్ధమైన పాలన వచ్చిందనీ.. ఈ మార్పులో మహిళలు ప్రాథమిక లబ్ధిదారులయ్యారని తెలిపారు. బీహార్ కుమార్తెలు ఇప్పుడు భయం లేకుండా తమ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారనీ, అర్థరాత్రి కూడా పని చేసే స్వేచ్ఛను పొందుతున్నారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. తన బీహార్ పర్యటనల సందర్భంగా మహిళా పోలీసు సిబ్బందిని పెద్ద సంఖ్యలో చూడటం సంతోషాన్ని కలిగిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. బీహార్ ఇక ఎన్నటికీ గత కాలపు చీకటిలోకి తిరిగి వెళ్లకూడదని అందరూ సమష్టిగా ప్రతిజ్ఞ చేయాలని ఆయన కోరారు.
మహిళలు కేంద్రంగా విధానాలను రూపొందించినప్పుడు.. వాటి ప్రయోజనాలు సమాజంలోని ఇతర వర్గాలకు కూడా వర్తిస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఉజ్వల యోజనను అటువంటి పరివర్తనాత్మక మార్పునకు శక్తిమంతమైన ఉదాహరణగా శ్రీ మోదీ ఉటంకించారు. ఇప్పుడు దీనిని ప్రపంచమంతా గుర్తించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్... కలగానే ఎన్నో ఏళ్లు ఉండేదని ఆయన గుర్తు చేశారు. పేద తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు పొగతో నిండిన వంటశాలల్లో దగ్గుతూ తమ జీవితాలను గడిపేవారన్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు సర్వసాధారణమై.. కంటి చూపు కూడా కోల్పోయేవారని శ్రీ మోదీ గుర్తు చేశారు. బీహార్‌లో వంట కోసం కట్టెలు సేకరించే భారం మహిళల జీవితాలను అనేక ఇబ్బందులకు గురిచేసేదన్నారు. ‘‘వర్షాకాలం కట్టెలు సరిగా కాలవు.. వరదల సమయంలో కట్టెలు కొట్టుకుపోతాయి.. దీంతో చాలాసార్లు ఇంట్లోని పిల్లలు ఆకలితో నిద్రపోవలసి వచ్చేది.. కొన్నిసార్లు కేవలం కొన్ని మరమరాలు తిని జీవించాల్సి వచ్చేది’’ అని శ్రీ మోదీ తెలిపారు.
ఈ బాధల గురించి ఏ పుస్తకంలోనూ రాయలేదనీ, బీహార్ మహిళలు ఇలాంటి ఎన్నో బాధల్ని అనుభవించారనీ ప్రధానమంత్రి అన్నారు. తమ ప్రభుత్వం మహిళా కేంద్రంగా విధానాలను రూపొందించడంతో పరిస్థితిలో మార్పు రావడం ప్రారంభమైందని తెలిపారు. ఒకేసారిగా కోట్లాది ఇళ్లకు గ్యాస్ కనెక్షన్లు అందించడంతో కోట్లాది మంది మహిళలు పొగ నుంచి, శ్వాసకోశ, కంటి వ్యాధుల నుంచి విముక్తి పొంది గ్యాస్ పొయ్యిలపై ప్రశాంతంగా వంట చేస్తున్నారన్నారు. ఇంట్లో పిల్లలు ఇప్పుడు ప్రతిరోజూ వేడిగా భోజనం తింటున్నారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు బీహార్‌లోని వంటశాలలను ప్రకాశవంతం చేయడమే కాకుండా మహిళల జీవితాలనూ మార్చాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
పౌరులు ఎదుర్కొంటున్న ప్రతి కష్టాన్ని పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్న శ్రీ మోదీ.. కోవిడ్-19 వంటి సమయంలోనూ ప్రభుత్వం రేషన్ ద్వారా ఆహార ధాన్యాలను ఉచితంగా అందించే పథకాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. ఆ పథకం కలిగించిన అపారమైన ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకునే దానిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా బీహార్‌లో 8.5 కోట్లకు పైగా పేదలు ఉచిత రేషన్ పొందుతున్నారనీ.. ఈ పథకం ప్రజల సమస్యలను ఎంతగానో తగ్గించిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. బీహార్‌లోని ప్రధాన భాగం ఉస్నా బియ్యాన్ని ఇష్టపడుతుందని పేర్కొంటూ మరొక ఉదాహరణను ఉటంకించారు. గతంలో తల్లులు, ఆడపడుచులు ప్రభుత్వ రేషన్ ద్వారా అందించిన అర్వా బియ్యాన్ని మార్కెట్లో ఇచ్చి ఉస్నా బియ్యాన్ని తెచ్చుకునేవారని గుర్తుచేశారు. 20 కిలోల అర్వా బియ్యానికి బదులుగా 10 కిలోల ఉస్నా బియ్యం మాత్రమే వారికి లభించేవని తెలిపారు. ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి.. రేషన్ ద్వారా నేరుగా ఉస్నా బియ్యాన్ని అందించడం ప్రారంభించిందని ప్రధానమంత్రి వివరించారు.
భారతదేశంలో ఇల్లు, దుకాణం, భూమి ఏదయినా సంప్రదాయపరంగా పురుషుల పేరు మీద రిజిస్టర్ చేయడం పరిపాటిగా ఉందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రారంభంతో తల్లులు, ఆడపడుచులు ఇల్లు యజమానులుగా ఉండేలా ఒక కొత్త నిబంధన అమలులోకి వచ్చిందని స్పష్టం చేశారు. బీహార్‌లో 50 లక్షలకు పైగా ప్రధానమంత్రి ఆవాస్ గృహాలు నిర్మించామని, వాటిలో చాలా వరకు మహిళలు సహ యజమానులుగా ఉన్నారని ప్రధానమంత్రి తెలిపారు. ఇప్పుడు మహిళలు తమ ఇళ్లకు నిజమైన యజమానులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఒక మహిళ ఆరోగ్యం క్షీణించినప్పుడు దాని ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. మహిళలు నిశ్శబ్దంగా అనారోగ్యాలను భరిస్తూ ఇంటి డబ్బును వారి చికిత్స కోసం ఖర్చు చేయడానికి ఇష్టపడని కాలాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ యోజన ఈ సమస్యను పరిష్కరించిందనీ, బీహార్‌లోని లక్షలాది మంది మహిళలకు రూ 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సను అందించిందని ప్రధానమంత్రి వివరించారు. ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద గర్భిణీల బ్యాంకు ఖాతాలకు ఆర్థిక సహాయం నేరుగా బదిలీ చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
పౌరుల ఆరోగ్యం, ముఖ్యంగా మహిళల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యంగా ఉందని ప్రధానమంత్రి ధ్రువీకరించారు. ఈ నెల 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రారంభించిన స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ఉటంకించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో 4.25 లక్షలకు పైగా ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరాల ద్వారా రక్తహీనత, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు ఉచితంగా రోగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు శ్రీ మోదీ వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే కోటి మందికి పైగా మహిళలు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారనీ.. బీహార్‌లోని అందరు మహిళలు ఈ శిబిరాల్లో పాల్గొని పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.
పండగ సీజన్ ప్రారంభమైందనీ.. నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయని.. దీపావళి సమీపిస్తోందని.. ఛఠ్ పూజ కూడా ఎంతో దూరం లేదని గుర్తు చేస్తూ.. ఈ సమయంలో మహిళలు ఇంటి ఖర్చులను ఎలా నిర్వహించాలో, డబ్బును ఎలా ఆదా చేయాలో నిరంతరం ఆలోచిస్తుంటారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఆందోళనను తగ్గించడానికి తమ ప్రభుత్వం ఈనెల 22 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లను తగ్గించడం ద్వారా కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఫలితంగా టూత్‌పేస్ట్, సబ్బు, షాంపూ, నెయ్యి, ఇతర ఆహార పదార్థాల వంటి నిత్యావసర వస్తువులు ఇప్పుడు తక్కువ ధరలకే లభిస్తాయని తెలిపారు. పిల్లల విద్య కోసం స్టేషనరీ ఖర్చు, అలాగే పండగ సందర్భాల్లో దుస్తులు, పాదరక్షలకయ్యే ఖర్చులు కూడా తగ్గాయన్నారు. ఈ నిర్ణయం ఇంటి, వంటగది బడ్జెట్‌లను నిర్వహించే మహిళలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పండగల సమయంలో మహిళలపై భారాన్ని తగ్గించడం, వారి ముఖాల్లో ఆనందం చూడడం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన బాధ్యతగా శ్రీ మోదీ పేర్కొన్నారు.
బీహార్‌లో మహిళలకు అవకాశాలు ఇచ్చినప్పుడల్లా వారు తమ ధైర్యం, దృఢ సంకల్పం ద్వారా పరివర్తనాత్మక మార్పును సాధించారని ప్రధానమంత్రి కొనియాడారు. మహిళల పురోగతి.. మొత్తం సమాజ పురోగతికి దారితీస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన ప్రారంభం సందర్భంగా బీహార్ ప్రజలకు మరోసారి తన అభినందనలు తెలియజేస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
బీహార్ రాష్ట్రానికి చెందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో అనుసంధానం ద్వారా ప్రారంభించారు. బీహార్ వ్యాప్తంగా 75 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 7,500 కోట్లను ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి చేతుల మీదుగా నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు.
మహిళలు స్వయం-సమృద్ధి సాధించడం.. వారికి స్వయం ఉపాధి, జీవనోపాధి అవకాశాలను కల్పించడం ద్వారా మహిళా సాధికారతను ప్రోత్సహించడం లక్ష్యంగా బీహార్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇది రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకు ఆర్థిక సహాయం అందిస్తుంది. వారు తమకు నచ్చిన ఉపాధి లేదా జీవనోపాధి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా మహిళల ఆర్థిక స్వేచ్ఛను, సామాజిక సాధికారతను పెంపొందిస్తుంది.
ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారునికి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ప్రారంభ గ్రాంట్ రూ. 10,000 అందిస్తారు. తదుపరి దశల్లో రూ. 2 లక్షల వరకు అదనపు ఆర్థిక సహాయం పొందే అవకాశమూ ఉంటుంది. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న వ్యవసాయం, పశుపోషణ, చేతివృత్తులు, దర్జీ, నేత, ఇతర చిన్న తరహా సంస్థల వంటి రంగాల్లో ఈ సహాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఈ పథకం సమాజ భాగస్వామ్యం గలది. దీనిలో భాగంగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు స్వయం సహాయక బృందాలతో అనుసంధానమై ఉండే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు మహిళలకు తగిన శిక్షణను అందిస్తారు. వారి ఉత్పత్తుల అమ్మకాలకు మద్దతు ఇవ్వడానికి రాష్ట్రంలో గ్రామీణ హాత్-బజార్లను మరింత అభివృద్ధి చేస్తారు.
(रिलीज़ आईडी: 2171962)
आगंतुक पटल : 31
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam