ప్రధాన మంత్రి కార్యాలయం
రేపు గుజరాత్‌లో ప్రధానమంత్రి పర్యటన
'సముద్ర సే సమృద్ధి' కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
భావ్‌నగర్‌లో రూ. 34,200 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి
సముద్ర, ఎల్‌ఎన్‌జి మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, రహదారులు, ఆరోగ్య సంరక్షణ, పట్టణ రవాణా సహా అనేక రంగాలకు ప్రయోజనం చేకూర్చనున్న ప్రాజెక్టులు
లోథాల్‌లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ పురోగతిని సమీక్షించనున్న ప్రధానమంత్రి
నౌకానిర్మాణం, ఓడరేవుల ఆధునీకరణ, గ్రీన్ ఎనర్జీ,
తీరప్రాంత కనెక్టివిటీ ద్వారా సముద్ర ఆధారిత వృద్ధిపై దృష్టి
ఏరియల్ సర్వే ద్వారా ధోలేరాను పరిశీలించనున్న ప్రధానమంత్రి
Posted On:
19 SEP 2025 5:22PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు గుజరాత్‌లో పర్యటిస్తారు. ఉదయం 10:30 గంటలకు భావ్‌నగర్‌లో ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రూ. 34,200 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.
ఆ తరువాత ఏరియల్ సర్వే ద్వారా ధోలేరాను ప్రధానమంత్రి పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఆయన అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం లోథాల్‌లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌ను ప్రధానమంత్రి సందర్శిస్తారు.
సముద్ర రంగానికి ఊతమిచ్చే రూ.7,870 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఇందిరా డాక్‌లో ముంబయి ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌నూ ఆయన ప్రారంభిస్తారు. కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులో కొత్త కంటైనర్ టెర్మినల్, అనుబంధ కేంద్రాలు.. పరదీప్ పోర్టులో కొత్త కంటైనర్ బెర్త్, కార్గో హ్యాండ్లింగ్ కేంద్రాలు, సంబంధిత అభివృద్ధి పనులు.. ట్యూనా టెక్రా మల్టీ-కార్గో టెర్మినల్.. ఎన్నోర్‌లోని కామరాజర్ పోర్టులో అగ్నిమాపక కేంద్రాలు, ఆధునిక రహదారి కనెక్టివిటీ పనులు.. చెన్నై పోర్టులో సీవాల్స్, రివెట్మెంట్లు సహా తీరప్రాంత రక్షణ పనులు.. కార్ నికోబార్ ద్వీపంలో సీవాల్ నిర్మాణం.. కాండ్లాలోని దీన్‌దయాళ్ పోర్టులో బహుళ ప్రయోజన కార్గో బెర్త్, గ్రీన్ బయో-మిథనాల్ ప్లాంట్.. పాట్నా, వారణాసి ఓడల మరమ్మతు కేంద్రాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.
సమగ్ర, సుస్థిర అభివృద్ధి పట్ల తన నిబద్ధతకు అనుగుణంగా.. ప్రధానమంత్రి గుజరాత్‌లోని వివిధ రంగాలకు చెందిన రూ.26,354 కోట్లకు పైగా విలువైన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పలు ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఛరా పోర్టులో హెచ్‌పీఎల్ఎన్‌జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్, గుజరాత్ ఐవోసీల్ రిఫైనరీలో యాక్రిలిక్స్, ఆక్సో ఆల్కహాల్ ప్రాజెక్ట్, 600 మెగావాట్ల గ్రీన్ షూ ఇనిషియేటివ్, రైతుల కోసం పీఎమ్-కుసుమ్ 475 మెగావాట్ల కాంపోనెంట్ సి సోలార్ ఫీడర్, 45 మెగావాట్ల బదేలి సోలార్ పీవీ ప్రాజెక్ట్, ధోర్డో గ్రామ సంపూర్ణ సౌర విద్యుదీకరణ మొదలైన పనులను ఆయన ప్రారంభిస్తారు. భావ్‌నగర్‌లోని సర్ టీ. జనరల్ హాస్పిటల్, జామ్‌నగర్‌లోని గురు గోవింద్ సిన్హ్ ప్రభుత్వ ఆసుపత్రి విస్తరణ పనులు, 70 కిలోమీటర్ల జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరణ పనులు సహా ఎల్ఎన్‌జీ మౌలిక సదుపాయాలు, అదనపు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, తీరప్రాంత రక్షణ పనులు, రహదారులు, ఆరోగ్య సంరక్షణ, పట్టణ రవాణా ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.
సుస్థిర పారిశ్రామికీకరణ, స్మార్ట్ మౌలిక సదుపాయాలు, ప్రపంచ పెట్టుబడులు లక్ష్యంగా నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ పారిశ్రామిక నగరంగా భావించే ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (డీఎస్ఐఆర్)ను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. భారత ప్రాచీన సముద్ర సంప్రదాయాల సంరక్షణ, పర్యాటకం, పరిశోధన, విద్య, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా లోథాల్‌లో దాదాపు రూ.4,500 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్‌హెచ్ఎమ్‌సీ) పురోగతిని ప్రధానమంత్రి సమీక్షిస్తారు.
***
(Release ID: 2168778)