ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
17 SEP 2025 4:18PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై!
నర్మదా మైయా కీ జై! నర్మదా మైయా కీ జై! నర్మదా మైయా కీ జై!
మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారు, కేంద్ర మంత్రివర్గ సహచరులు సోదరి సావిత్రి ఠాకూర్ గారు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, దేశంలోని ప్రతి మూల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేదికపై ఉన్న ఇతర ప్రముఖులు, నా ప్రియమైన సోదరీ సోదరులారా!
జ్ఞానానికి అధిదేవత, ధార్ భోజ్‌శాలలో పూజలందుకొనే తల్లి వాగ్దేవి పాదాలకు నేను నమస్కరిస్తున్నాను. ఈ రోజు నైపుణ్యాలు, సృజనాత్మకతల దైవం విశ్వకర్మ జన్మదిన సందర్భంలో ఆయనకూ నేను నమస్కరిస్తున్నాను. నైపుణ్యాలతో దేశ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న కోట్లాది మంది సోదరీ సోదరులకు విశ్వకర్మ జయంతి సందర్భంగా నేను గౌరవపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ఈ ధార్ భూమి ఎల్లప్పుడూ శౌర్య భూమి.. స్ఫూర్తినిచ్చే భూమి. మహారాజా భోజుడి శౌర్యం... బహుశా అక్కడ మీకు వినిపించకపోవచ్చు.. కనిపించకపోవచ్చు. మీరు ఎంత దూరంలో ఉన్నప్పటికీ మీ హృదయంలో ఏముందో నాకు అర్థమవుతుంది. ఇక్కడి సాంకేతిక నిపుణులు వారికి ఏ విధంగానైనా సహాయం చేయగలిగితే.. వెంటనే సహాయం చేయండి. లేకపోయినా వారు మధ్యప్రదేశ్‌కు చెందినవారు.. చాలా క్రమశిక్షణతో ఉంటారు. అసౌకర్యం ఉన్నప్పటికీ.. మధ్యప్రదేశ్ ఎల్లప్పుడూ సహన స్వభావాన్నే కలిగి ఉంది. ఇప్పుడు నేను ఆ సహనాన్ని ఇక్కడ కూడా చూస్తున్నాను.
మిత్రులారా,
జాతి గౌరవాన్ని కాపాడుకోవడం కోసం దృఢంగా నిలబడాలని భోజ మహారాజు చూపిన తెగువ మనకు తెలియజేస్తుంది. మానవాళికి సేవ చేయాలనే సందేశాన్ని మహర్షి దధీచి త్యాగం మనకు బోధిస్తుంది. వారి వారసత్వం స్ఫూర్తిగా.. నేడు మన దేశం భరతమాత భద్రతకే అత్యంత ప్రాధాన్యమిస్తోంది. మన అక్కాచెల్లెళ్లు, తల్లుల సిందూరాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదులు తుడిచేస్తే.. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల స్థావరాలను మనం నాశనం చేశాం. మన సైనికులు రెప్పపాటు సమయంలోనే పాకిస్థాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టారు. నిన్న ఓ పాకిస్థాన్ ఉగ్రవాది ఏడుస్తూ తన బాధను వెళ్లగక్కడం మన దేశంతో పాటు ప్రపంచమంతా చూసింది.
మిత్రులారా,
ఇది నవ భారతం, ఎవరి అణ్వాయుధ బెదిరింపులకు భయపడదు… నేరుగా వారుండే చోటుకే వెళ్లి దాడి చేసి తగిన సమాధానం ఇవ్వగలదు.
మిత్రులారా,
ఈ రోజు.. సెప్టెంబర్ 17వ తేదీ మరో చరిత్రాత్మక సందర్భాన్ని సూచిస్తుంది. ఈ రోజున, సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పానికి ఒక ఉదాహరణను దేశం చూసింది. భారత సైన్యం హైదరాబాద్‌ను అనేక దురాగతాల నుంచి విముక్తి చేసి, దాని హక్కులను కాపాడటం ద్వారా భారతదేశపు గర్వాన్ని పునరుద్ధరించింది. దేశం ఈ గొప్ప విజయం సాధించి చాలా దశాబ్దాలు గడిచాయి. ఆ విజయాన్ని, సైన్యం ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలను ఎవరూ గుర్తుంచుకోలేదు. కానీ మీరు నాకు అవకాశం ఇచ్చారు. మన ప్రభుత్వం సెప్టెంబర్ 17ను.. సర్దార్ పటేల్ గారిని.. హైదరాబాద్ సంఘటనను చిరస్మరణీయం చేసింది. భారత ఐక్యతకు చిహ్నంగా ఉన్న ఈ రోజును మనం హైదరాబాద్ విమోచన దినోత్సవంగా పాటిస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్‌లో విమోచన దినోత్సవాన్ని గొప్పగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ విముక్తి దినోత్సవం మనకు స్ఫూర్తినిస్తుంది. భరతమాత గౌరవం, కీర్తిని మించినది ఏదీ లేదు. మనం జీవిస్తే అది దేశం కోసం అయి ఉండాలి.. మన జీవితంలోని ప్రతి క్షణం దేశానికి అంకితం చేయాలి.
మిత్రులారా,
జాతి కోసం సర్వస్వం త్యాగం చేస్తామని మన స్వాతంత్య్ర సమర యోధులు ప్రతిజ్ఞ చేసి.. తమ జీవితాలను దేశానికే అంకితం చేశారు. వలస పాలన నుంచి విముక్తి పొంది, వేగంగా పురోగమిస్తూ భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడమే వారి కల. వారిని స్ఫూర్తిగా తీసుకొన్న 140 కోట్ల మంది భారతీయులు అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణం కోసం సంకల్పించారు. ఈ ప్రయాణంలో భారతీయ మహిళా శక్తి, యువశక్తి, పేదలు, రైతులు నాలుగు మూలస్తంభాలు. అభివృద్ధి చెందిన భారత్ కోసం ఈ నాలుగు మూలస్తంభాలను ఈనాటి కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుంది. పెద్ద ఎత్తున మహిళలు, అక్కాచెల్లెళ్లు ఈ కార్యక్రమం కోసం ఇక్కడకు వచ్చారు. నేటి కార్యక్రమంలో మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యమిచ్చాం. ఈ కార్యక్రమం ఇక్కడ ధార్‌లో జరుగుతున్నప్పటికీ ఇది యావత్ దేశం కోసం.. యావత్ జాతి కోసం..భారతీయ మహిళలు..ఆడబిడ్డల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం. ఆరోగ్యవంతమైన మహిళ – సాధికారత గల కుటుంబం అనే గొప్ప ప్రచారాన్ని ఇక్కడ మనం ప్రారంభించుకున్నాం. వాగ్దేవి ఆశీస్సులతో ఇది ప్రారంభమైంది.. ఇంతకంటే గొప్ప పని ఏముంటుంది?
మిత్రులారా,
దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ‘‘ఆది సేవా పర్వ’’ వివిధ దశల్లో తనదైన ప్రభావం చూపిస్తోంది. మధ్యప్రదేశ్‌లోనూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నాం. ధార్ సహా మధ్యప్రదేశ్‌లోని మన గిరిజన తెగలకు నేరుగా వివిధ ప్రభుత్వ పథకాలను అందించే వారధిగా ఈ కార్యక్రమం పనిచేస్తుంది.
మిత్రులారా,
విశ్వకర్మ జయంతి సందర్భంగా ఇక్కడ ప్రధాన పారిశ్రామిక కార్యక్రమానికి బీజం పడింది. దేశంలోనే అతి పెద్ద సమీకృత టెక్స్‌టైల్ పార్కుకు ధార్‌లో భూమిపూజ జరిగింది. ఈ పార్కు దేశ జౌళి పరిశ్రమకు కొత్త శక్తినిస్తుంది. పండించిన పంటలకు సరైన ధర లభిస్తుంది. ఇక్కడ ధార్‌లోనే కాకుండా, దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రస్తుతం ఈ కార్యక్రమంతో అనుసంధానం కావడం నాకు సంతోషాన్నిస్తోంది.
మిత్రులారా,
ఈ పీఎమ్ మిత్ర పార్క్, ఈ టెక్స్‌టైల్ పార్క్ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. మన యువతకు, మహిళలకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు అందబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టులు, ప్రచారాల కోసం నా దేశ ప్రజలందరికీ నేను అభినందనలు తెలుపుతున్నాను. మధ్యప్రదేశ్‌కు ప్రత్యేక అభినందనలు.
మిత్రులారా,
మన మాతృమూర్తులు, అక్కాచెల్లెళ్లు, మన నారీ శక్తి దేశ ప్రగతికి పునాది. మనమంతా చూస్తూనే ఉంటాం.. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే, కుటుంబమంతా బాగుంటుంది.
మిత్రులారా,
ఆ తల్లి అనారోగ్యానికి గురైతే కుటుంబం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. ‘ఆరోగ్యవంతమైన మహిళ-సాధికారత గల కుటుంబం’ పేరిట చేస్తున్న ప్రచార కార్యక్రమం.. మాతృమూర్తులు, ఆడబిడ్డల ఉజ్వల భవిత కోసం అంకితమైనది. అవగాహనా లోపం, వనరుల లేమి కారణంగా ఏ మహిళా ఇబ్బంది పడకూడదనేదే మా లక్ష్యం. చాలా రోగాలు శరీరంలోకి నిశ్శబ్దంగా చేరతాయి.. వాటిని ఆలస్యంగా గుర్తించడం వల్ల మహిళలకు తీవ్ర సమస్యలు ఎదురవుతాయి.. క్రమంగా అవి ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. మహిళల ప్రాణాలకు ముప్పును కలిగించే ఇలాంటి వ్యాధులను తొలి దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా రక్తపోటు, మధుమేహం, రక్తహీనత, క్షయ, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను గుర్తించే పరీక్షలు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న నా తల్లులు, ఆడబిడ్డలు ఎల్లప్పుడూ నాకు చాలా ఇచ్చారు. మీ ఆశీర్వాదాలే నాకు గొప్ప రక్షణ కవచం. దేశంలోని కోట్లాది మంది తల్లులు, ఆడబిడ్డలు... లెక్కకు మిక్కిలిగా నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఈ రోజు సెప్టెంబర్ 17న.. విశ్వకర్మ జయంతి రోజున.. నేను నా తల్లులను, ఆడబిడ్డలను ఒక విషయం అడగడానికి వచ్చాను. నా తల్లులు, ఆడబిడ్డలూ.. దయచేసి నాకు చెప్పండి? మీరు నేను అడిగింది చేస్తారా లేదా? దయచేసి మీ చేతులు పైకెత్తి నాకు చెప్పండి. బాగుంది, అందరూ చేతులు పైకెత్తారు. ఎటువంటి సంకోచం లేకుండా ఈ శిబిరాలకు వెళ్లి మీరు పరీక్షలు చేయించుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఒక కొడుకుగా, సోదరునిగా నేను ఇదైతే అడగగలను కదా? నేను మీకు చెప్పాల్సిందల్లా.. ఈ ఆరోగ్య శిబిరాల్లో పరీక్షలు ఎంత ఖరీదైనవైనా మీరు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఫీజు ఉండదు. పరీక్షలు ఉచితం, అంతే కాదు ఇక్కడ మందులు కూడా ఉచితం. ప్రభుత్వ ఖజానా మీ మంచి ఆరోగ్యం కంటే విలువైనది కాదు. ఈ ఖజానా మీ కోసం.. మీలాంటి తల్లులు, ఆడబిడ్డల కోసం. ఆయుష్మాన్ కార్డు తదుపరి చికిత్సలో మీకు రక్షణ కవచంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రచారం విజయదశమి, అక్టోబర్ 2 వరకు అంటే రెండు వారాల పాటు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, కుమార్తెలకు నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎప్పుడూ మీ కుటుంబం గురించే ఆందోళనపడుతూ ఉంటారు. కానీ, మీ ఆరోగ్యం కోసం కూడా కొంత సమయం కేటాయించండి. మీరు వీలైనంత ఎక్కువ సంఖ్యలో ఈ శిబిరాలను సందర్శించాలి. లక్షలాది శిబిరాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే ప్రజలు కొన్ని శిబిరాలలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సమాచారాన్ని మీ ప్రాంతంలోని ఇతర మహిళలకు కూడా చేరవేయండి. మా మోదీజీ ధార్ కు వచ్చారని, మా కొడుకు ధార్ కు వచ్చాడని, మా సోదరుడు ధార్ కు వచ్చాడని, ఆయన వచ్చి మమ్మల్ని పరీక్ష చేయించుకోమని చెప్పారని ప్రతి తల్లికి, సోదరికీ చెప్పండి. దయచేసి ప్రతి ఒక్కరికీ చెప్పండి. ఏ తల్లి గానీ, ఏ కుమార్తె గానీ ఆరోగ్య సేవలు అందుకోవడంలో వెనుకబడకూడదని మనం ప్రతిజ్ఞ చేయాలి.
మిత్రులారా,
తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, కుమార్తెల ఆరోగ్యమే మా ప్రాధాన్యం. గర్భిణీ స్త్రీలు, కుమార్తెలకు సరైన పోషకాహారం అందించే లక్ష్యంతో మా ప్రభుత్వం పని చేస్తోంది. ఈ రోజు, మనం ఎనిమిదో జాతీయ పోషకాహార మాసోత్సవాన్ని ప్రారంభిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ప్రసూతి మరణాలను, శిశు మరణాల రేటును వీలైనంత తగ్గించాలి. కేవలం ఇందుకోసమే 2017లో ప్రధానమంత్రి మాతృ వందన యోజనను ప్రారంభించాం. ఈ పథకం కింద మొదటి బిడ్డ పుట్టినప్పుడు అయిదు వేల రూపాయలు, రెండోసారి ఆడపిల్ల పుట్టినప్పుడు ఆరు వేల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మాతృ వందన యోజన ద్వారా ఇప్పటి వరకు నాలుగున్నర కోట్ల మంది గర్భిణీ తల్లులు ప్రయోజనం పొందారు. ఇప్పటి వరకు 19 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. కొంతమందికి ఈ సంఖ్య ఏమిటో కూడా అర్థం కాకపోవచ్చు. నా తల్లులు, అక్కలు, చెల్లెళ్ళ బ్యాంకు ఖాతాల్లో రూ.19 వేల కోట్లకు పైగా చేరింది. ఈ రోజు కూడా నేను ఒక్క క్లిక్ తో 15 లక్షలమంది పైగా గర్భిణీ తల్లులకు నగదును బదిలీ చేశాను. ధార్ భూమి నుంచి ఈ రోజు వారి ఖాతాల్లో 450 కోట్ల రూపాయలకు పైగా జమ అయ్యాయి.
మిత్రులారా,
ఈ రోజు, నేను మధ్యప్రదేశ్ నుంచి మరొక కార్యక్రమం గురించి చర్చించాలనుకుంటున్నాను. మీకు తెలుసు. మన గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ రక్తహీనత పెద్ద సంక్షోభం. ఈ వ్యాధి నుంచి మన గిరిజన సోదరీసోదరులను రక్షించడానికి మా ప్రభుత్వం జాతీయ మిషన్ ను నిర్వహిస్తోంది. 2023లో మధ్యప్రదేశ్ లోని షాడోల్ నుంచి మేం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. షాడోల్ లోనే మొదటి సికిల్ సెల్ స్క్రీనింగ్ కార్డును పంపిణీ చేశాం. మళ్లీ నేడు, మధ్యప్రదేశ్ లో 10 మిలియన్ (కోటి) సికిల్ సెల్ స్క్రీనింగ్ కార్డుల పంపిణీ జరిగింది. ఇప్పుడే వేదికపైకి వచ్చిన కుమార్తెకు ఇచ్చిన కార్డు 10 మిలియనో కార్డు. నేను మధ్యప్రదేశ్ గురించి మాట్లాడుతున్నా. ఈ ప్రచారం కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5 కోట్ల మందికి పైగా పరీక్షలు నిర్వహించారు. సికిల్ సెల్ స్క్రీనింగ్ మన గిరిజన సమూహాల్లోని లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.
మిత్రులారా,
మేం చేస్తున్న పని రాబోయే తరాలకు గొప్ప వరం కాబోతోంది. ఈ రోజు మేం ఇంకా పుట్టని వారి కోసం పని చేస్తున్నాం. నేటి తరం ఆరోగ్యంగా ఉంటే, అది భవిష్యత్తులో వారి పిల్లల ఆరోగ్యానికి హామీ ఇస్తుంది. మన గిరిజన తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు సికిల్ సెల్ అనీమియా పరీక్షలు చేయించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నా.
మిత్రులారా,
తల్లులు, అక్కలు, చెల్లెళ్ళ జీవితాలను సులభతరం చేయడానికి, వారి కష్టాలను తగ్గించడానికీ నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద నిర్మించిన లక్షలాది మరుగుదొడ్లు, ఉజ్వల యోజన ద్వారా అందించిన లక్షలాది ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ప్రతి ఇంటికి నీరు అందించడానికి చేపట్టిన జల్ జీవన్ మిషన్, రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించే ఆయుష్మాన్ యోజన, ఇవన్నీ తల్లులు, అక్కలు, చెల్లెళ్ళ జీవితాల్లో ఇబ్బందులను తగ్గించాయి. వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచాయి. ఇక్కడ చాలా మంది సోదరులు ఉన్నారు. మీ కుటుంబాలలో కూడా తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, కుమార్తెలు ఉన్నారు. మీరంతా నా మాట విని మీ తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, కుమార్తెలు ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా చూడాలని నేను కోరుతున్నా.
మిత్రులారా,
గరీబ్ కళ్యాణ్ అన్న యోజన- ఈ పథకం గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా వినిపించినప్పుడు, వారి కళ్లలో ఆశ్చర్యం కనిపిస్తుంది. ఇది అంత పెద్ద సంఖ్య. స్నేహితులారా, కరోనా వంటి కష్టకాలంలో, ఈ ఉచిత రేషన్ పథకం పేద తల్లి ఇంట్లోని పొయ్యి ఆరిపోకుండా చేసింది. ఈ పథకం కింద నేటికీ ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతోంది. పీఎం ఆవాస్ యోజన కింద ఇచ్చిన కోట్లాది ఇళ్లలో కూడా ఎక్కువ భాగం మహిళల పేరిటే ఉన్నాయి.
మిత్రులారా,
అక్కలు, చెల్లెళ్ళు, కుమార్తెలకు ఆర్థికంగా సాధికారత కల్పించడంపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కోట్లాది మంది మన అక్కలు, చెల్లెళ్ళు ముద్రా యోజన ద్వారా రుణాలు తీసుకుని వ్యాపారాలు, పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు.
మిత్రులారా,
గ్రామాల్లో నివసిస్తున్న మూడు కోట్లమంది తల్లులు, అక్కలు, చెల్లెళ్ళను లక్షాధికారి దీదీలుగా మార్చే ప్రచారంలో మా ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఈ ప్రచారంలో సాధించిన విజయం కారణంగా, తక్కువ సమయంలోనే దాదాపు రెండు కోట్ల మంది అక్కలు, చెల్లెళ్లు లక్షాధికారి దీదీలుగా మారారని నేను చాలా గర్వంగా చెప్పగలను. మహిళలను బ్యాంక్ సఖీలు, డ్రోన్ దీదీలుగా చేయడం ద్వారా వారిని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా మారుస్తున్నాం. స్వయం సహాయ సంఘాల ద్వారా మహిళలు కొత్త విప్లవాన్ని తీసుకువస్తున్నారు.
సోదరీసోదరులారా,
గత 11 సంవత్సరాలుగా, పేదల సంక్షేమం, పేదల సేవ, వారి జీవితాలను మెరుగుపరచడం మా ప్రభుత్వ ముఖ్య ప్రాధాన్యతలుగా ఉన్నాయి. దేశంలోని పేదలు పేదరికం నుంచి బయటపడి వేగంగా ముందుకు సాగినప్పుడే దేశం పురోగమిస్తుందని మేం నమ్ముతున్నాం. పేదలకు సేవ చేయడం ఎప్పటికీ నష్టం కాదు. ఒక పేదవాడికి కొద్దిపాటి మద్దతు, కొద్దిపాటి సహాయం లభిస్తే, అతను తన కృషితో సముద్రాన్ని దాటే ధైర్యాన్ని కలిగి ఉంటాడు. పేదల భావోద్వేగాలూ, భావాలూ నాకు వ్యక్తిగతంగా తెలుసును. పేదల బాధ నా సొంత బాధ. పేదలకు సేవ చేయడమే నా జీవిత అతిపెద్ద లక్ష్యం. మా ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకొని నిరంతరం ప్రణాళికలను రూపొందిస్తోంది, అమలు కూడా చేస్తోంది.
మిత్రులారా,
ఈ పనిని స్థిరంగా, అంకితభావంతో, స్వచ్ఛమైన హృదయంతో చేయడం వల్ల ఈ రోజు మా విధానాల ఫలితాలు ప్రపంచానికి కనిపిస్తున్నాయి. గత 11 సంవత్సరాల నిరంతర శ్రమ, కృషి వల్ల నేడు దేశంలోని 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడడం ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తికి గర్వం కలిగిస్తుంది. మన మొత్తం సమాజంలో కూడా కొత్త విశ్వాసం నెలకొంది.
మిత్రులారా,
మా ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ కేవలం పథకాలు మాత్రమే కాదు... పేద తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, కుమార్తెల జీవితాలను మార్చడానికి మోదీ ఇచ్చిన హామీ. పేదల ముఖాల్లో చిరునవ్వు తేవడానికి, వారి గౌరవాన్ని కాపాడటానికి ఇది నా ఆరాధన. ఇది నా ప్రతిజ్ఞ.
మిత్రులారా,
మహేశ్వరి వస్త్రాలకు సంబంధించిన సుదీర్ఘ సంప్రదాయం మధ్యప్రదేశ్‌లో ఉంది. దేవి అహల్యాబాయి హోల్కర్ మహేశ్వరి చీరకు కొత్త కోణాన్ని ఇచ్చారు. ఇటీవల మనం అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతిని నిర్వహించుకున్నాం. ఇప్పుడు ధార్‌లోని పీఎం మిత్రా పార్క్ ద్వారా ఒక విధంగా మనం దేవి అహల్యాబాయి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. పత్తి, పట్టు వంటి ముడి పదార్థాల అందుబాటును పీఎం మిత్రా పార్క్ భారీగా మెరుగుపరుస్తుంది. ఇది నాణ్యతకు సంబంధించిన తనిఖీలను సులభతరం చేస్తుంది. మార్కెట్లను కూడా మరింత అందుబాటులో తీసుకురానుంది. స్పిన్నింగ్‌తో పాటు డిజైనింగ్, ప్రాసెసింగ్‌లు ఇక్కడ జరగనున్నాయి. ఈ పార్క్ నుంచి వస్త్రాలు ఎగుమతి అవుతాయి. ఇక్కడి నుంచి వచ్చే వస్త్ర ఉత్పత్తులు పోటీ ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. వస్త్ర పరిశ్రమలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఒకే దగ్గర జరుగుతాయి. వస్త్ర పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న 5ఎఫ్ విధానంలో మొదటిది వ్యవసాయం, రెండోది ఫైబర్, మూడోది ఫ్యాక్టరీ, నాలుగోది ఫ్యాషన్. వ్యవసాయం నుంచి ఫైబర్‌కు, ఫైబర్ నుంచి ఫ్యాక్టరీకి, ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్‌కు, ఫ్యాషన్ నుంచి విదేశాలకు జరిగే ప్రయాణం త్వరితగతిన, సులభంగా పూర్తవుతుంది.
మిత్రులారా,
ధార్‌లో ఉన్న ఈ పీఎం మిత్రా పార్క్‌లో 80కి పైగా యూనిట్లకు సుమారు 1,300 ఎకరాల భూమిని కేటాయించినట్లు నాకు చెప్పారు. అంటే అవసరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు, కర్మాగారాల నిర్మాణం రెండూ ఏకకాలంలో జరగనున్నాయి. ఈ పార్క్‌లో కొత్తగా 3 లక్షల మంది ఉపాధి పొందనున్నారు. ఇది రవాణా ఖర్చులపై ఎక్కువ సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వస్తు రవాణా ఖర్చుతో పాటు తయారీ ఖర్చులను ఈ పార్కు తగ్గిస్తుంది. మన ఉత్పత్తుల ధరను మరింత తగ్గించటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వాటి పోటీతత్వం మెరుగుపడుతుంది. కాబట్టి పీఎం మిత్రా పార్క్ విషయంలో మధ్యప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా నా రైతు సోదరీసోదరులకు, నా యువతీయువకులను నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మా ప్రభుత్వం దేశంలో ఇలాంటి మరో 6 పీఎం మిత్రా పార్క్‌లను నిర్మించనుంది.
మిత్రులారా,
ఈ రోజు దేశవ్యాప్తంగా విశ్వకర్మ పూజ చేసుకుంటున్నాం. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన విజయాన్ని జరుపుకోవాల్సిన సమయం కూడా ఇది. వడ్రంగులు, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, వడ్రంగి, తాపీ పనివారు, రాగి పనివారు, కంచు కళాకారులు, చేతులతో అద్భుతాలు చేసే అనేక మందితో సహా దేశవ్యాప్తంగా ఉన్న నా విశ్వకర్మ సోదరీసోదరులను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. భారత్‌తో తయారీ కార్యక్రమానికి గొప్ప బలం మీరే. అది ఒక గ్రామం లేదా నగరం అయినా మీ కళ, మీరు తయారు చేసే ఉత్పత్తుల వలన రోజువారీ అవసరాలు తీరుతున్నాయి. ఇంత తక్కువ సమయంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన 30 లక్షలకు పైగా చేతివృత్తుల, హస్తకళల వారికి సహాయం చేసిందని తెలిసి నేను సంతోషంగా ఉన్నాను. ఈ పథకం ద్వారా వారు నైపుణ్య శిక్షణ పొందటంతో పాటు డిజిటల్ మార్కెటింగ్, ఆధునిక సాధనాలతో అనుసంధానమయ్యారు. 6 లక్షలకు పైగా విశ్వకర్మ మిత్రులు కొత్త పరికరాలు అందుకున్నారు. రూ. 4 వేల కోట్లకు పైగా విలువైన రుణాలు ఇప్పటి వరకు విశ్వకర్మ సోదరీసోదరులు పొందారు.
మిత్రులారా,
దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన సమాజంలోని ఒక వర్గానికి ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన ప్రయోజనం చేకూర్చింది. మన పేద విశ్వకర్మ సోదరీసోదరులకు నైపుణ్యాలు ఉన్నాయి. కాని క్రితం ప్రభుత్వాలు వారి నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు, వారి జీవితాలను మెరుగుపరచడానికి ఎటువంటి ప్రణాళికను చేపట్టలేదు. తమ ప్రతిభను సొంత పురోగతి కోసం ఉపయోగించుకునే మార్గాలను వారికి మేం చూపించాం. అందుకే నేను ‘వెనుకబడిన వారికే మా ప్రాధాన్యత’ అని అంటున్నాను.
మిత్రులారా,
మన ధార్ పూజ్యనీయులైన కుశభావు ఠాక్రే జన్మస్థలం కూడా. ఆయన దేశమే ప్రథమం అనే భావనతో జీవితమంతా సమాజ సేవ కోసం అంకితం చేశారు. నేను ఇవాళ ఆయనకు నా వినయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. దేశమే ప్రథమం అనే ఈ స్ఫూర్తి దేశాన్ని కొత్త శిఖరాలు అధిరోహించేలా చేసేందుకు తగిన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
మిత్రులారా,
ఇది పండుగ సమయం. ఇప్పుడు మీరు నిరంతరం స్వదేశీ మంత్రాన్ని జపించాలి. స్వదేశీని జీవితంలో భాగంగా చేసుకోవాలి. మీ అందరికీ, నా 140 కోట్ల మంది దేశ ప్రజలకు నా అభ్యర్థన.. మీరు ఏది కొన్నా అది దేశంలోనే తయారైనదై ఉండాలి. మీరు ఏది కొనుగోలు చేసినా.. అది కొంతమంది భారతీయుల చెమటతో ముడిపడినదై ఉండాలి. మీరు ఏది కొన్నా దానిలో మట్టి వాసన ఉండాలి… మన భారతదేశ మట్టి పరిమళం రావాలి. ఈ రోజు నేను వ్యాపారంలో ఉన్న సోదరీసోదరులను అభ్యర్థిస్తున్నాను.. మీరు కూడా దేశం కోసం నాకు సహాయం చేయండి. దేశం కోసం నాకు మద్దతునివ్వండి. నేను దేశం కోసం మీ సహాయం కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి. దానికి మార్గం స్వావలంబన భారతదేశమే. కాబట్టి విక్రయించేదంతా మన దేశంలోనే తయారు చేసినదై ఉండాలని నా చిన్న, మధ్య తరహా వ్యాపార సోదరులందరిని కోరుతున్నాను. మహాత్మా గాంధీ స్వదేశీని స్వాతంత్ర్యోద్యమ మాధ్యమంగా మలిచారు. ఇప్పుడు మనం స్వదేశీని అభివృద్ధి చెందిన భారతదేశ పునాదిగా మార్చాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది?.. మన దేశంలో తయారైన ప్రతిదాని పట్ల మనం గర్వంగా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. మనం కొనే పిల్లల బొమ్మలు, దీపావళి విగ్రహాలు, ఇంటిని అలంకరించే వస్తువులు వంటి చిన్న వస్తువుల నుంచి మొబైల్ ఫోన్, టీవీ, రిఫ్రిజిరేటర్ వంటి ఏదైనా పెద్ద వస్తువు వరకు అది మన దేశంలో తయారైనదో లేదో చూసుకోవాలి. నా దేశ ప్రజల చెమట పరిమళం వస్తోందా అన్నది గమనించాలి. ఎందుకంటే మనం స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసినప్పుడు మన డబ్బు దేశంలోనే ఉంటుంది. మన డబ్బు విదేశాలకు తరలిపోదు. అదే డబ్బును మళ్లీ దేశాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు. ఆ మొత్తంతో రోడ్లు, గ్రామీణ పాఠశాలలు నిర్మాణమవుతాయి. పేద వితంతువు తల్లులకు సహాయం అందుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మాణమవుతాయి. అవే డబ్పులు సంక్షేమ పథకాలకు ద్వారా మీకు అందుతాయి. నా మధ్యతరగతి సోదరీసోదరుల, నా మధ్యతరగతి యువత తమ కలలను నెరవేర్చుకోవడానికి ఆ డబ్బులు అవసరం. దీనిని ఈ చిన్న చిన్న మంచి పనులు చేయడం ద్వారా సాధించవచ్చు. మనకు అవసరమైన వస్తువులు దేశంలోనే తయారైనప్పుడు.. వాటి ద్వారా లభించే ఉపాధి కూడా మనకే వెళ్తుంది.
నవరాత్రి మొదటి రోజు అయిన సెప్టెంబర్ 22 నుంచి తగ్గించిన జీఎస్టీ రేట్లు అమలులోకి రాబోతున్నాయి. మనం స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయడం ద్వారా ఈ ప్రయోజనాన్ని పొందాలి. మనం ఒక మంత్రాన్ని గుర్తుంచుకోవాలి. ఇది ప్రతి దుకాణంపై రాతపూర్వకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని విన్నవిస్తున్నాను. ప్రతి దుకాణంపై ‘ఇది స్వదేశీ’ అనే ఒక బోర్డు ఉండాలి. గర్వంగా చెప్పండి - ఇది స్వదేశీ! మీరందరూ నాతో కలిసి అంటారా! మీరందరూ నాతో కలిసి అంటారా! నేను ‘గర్వంగా చెప్పండి’ అని అంటాను మీరు "ఇది స్వదేశీ" అని అనండి. గర్వంగా చెప్పండి- ‘ఇది స్వదేశీ’..గర్వంగా చెప్పండి- ‘ఇది స్వదేశీ’..గర్వంగా చెప్పండి- ‘ఇది స్వదేశీ’.. గర్వంగా చెప్పండి- ‘ఇది స్వదేశీ’.. గర్వంగా చెప్పండి- "ఇది స్వదేశీ"
మిత్రులారా,
ఈ స్వదేశీ భావనతో నేను మీకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. భారత్ మాతా కీ- జై.. భారత్ మాతా కీ- జై… భారత్ మాతా కీ- జై.. ధన్యవాదాలు.
గమనిక- ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఇది.
***
(Release ID: 2167921)