ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అస్సాంలోని దరంగ్‌లో రూ.6,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


· “ప్రపంచంలో నేడు శరవేగంగా పురోగమిస్తున్న దేశం భారత్‌... దేశంలో అత్యంత వేగంగా ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా అస్సాం”

· “వికసిత భారత్‌ సాకారం వైపు యావద్దేశం ఐక్యంగా ముందడుగు వేస్తోంది.. ముఖ్యంగా మన యువతరానికి ఇదొక స్వప్నం... సంకల్పం కావడం వల్ల ఈ లక్ష్య సాధనలో ఈశాన్య భారతం పాత్ర కీలకం”

· “ప్రస్తుత 21వ శతాబ్దంలో పాతికేళ్లు పూర్తయ్యాయి... ఇక ఈ శతాబ్ద తదుపరి అధ్యాయం తూర్పు-ఈశాన్య భారత్‌ రాష్ట్రాలదే”

· “ఏ ప్రాంతంలోనైనా సత్వర ప్రగతికి పటిష్ట అనుసంధానం అవశ్యం.. ఈ దిశగా ఈశాన్య ప్రాంతానికి మా ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యమిస్తోంది”

· “‘ఎయిమ్స్’, వైద్య కళాశాలల నెట్‌వర్క్‌ దేశం నలుమూలలకూ విస్తరించింది... ముఖ్యంగా అస్సాంలో కేన్సర్‌ పీడితుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు కూడా ఏర్పాటు చేశాం”

· “చొరబాట్లతో సరిహద్దు ప్రాంత జనసంఖ్యను తారుమారు చేసే కుట్ర సాగుతోంది... ఇది జాతీయ భద్రతకు తీవ్ర ముప్పుగనుక త్వరలో దేశవ్యాప్త జనసంఖ్య అధ్యయన కార్యక్రమం ప్రారంభిస్తాం”

Posted On: 14 SEP 2025 1:57PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అస్సాంలోని దరంగ్‌లో దాదాపు రూ.6,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- అస్సాం ప్రగతి పయనంలో నేటి కార్యక్రమం చారిత్రక సందర్భమని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు దరంగ్ ప్రజలతోపాటు రాష్ట్ర పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

ఆపరేషన్ సిందూర్ విజయం నేపథ్యంలో నిన్న తొలిసారి అస్సాం పర్యటనకు వచ్చానని ప్రధానమంత్రి చెప్పారు. కామాఖ్య మాత ఆశీస్సులతోనే ఈ అద్భుత విజయం సాధ్యమైందని వ్యాఖ్యానించారు. ఈ పవిత్ర భూమిపై పాదం మోపగానే తనకెంతో ఆధ్యాత్మిక సంతృప్తి కలిగిందని ఆయన పేర్కొన్నారు. అస్సాంలో జన్మాష్టమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత వ్యూహంలో ‘సుదర్శన చక్ర’ ప్రణాళిక గురించి ఎర్రకోట పైనుంచి తన ప్రసంగంలో ప్రకటించడాన్ని శ్రీ మోదీ గుర్తుచేశారు. అస్సాంలోని మంగళ్‌దోయ్‌ ప్రాంతాన్ని సుసంపన్న సంస్కృతి, చారిత్రక ప్రతిష్ఠ, భవిష్యత్‌ ఆకాంక్షల సంగమ ప్రదేశంగా ఆయన ప్రస్తుతించారు. రాష్ట్ర ప్రతిష్ఠకు ఇదొక విశిష్ట చిహ్నమని పేర్కొన్నారు. శౌర్యపరాక్రమాలకు, స్ఫూర్తికి నెలవైన ఈ ప్రాంతంలోని ప్రజలతో మమేకమై, కొద్దిసేపు ముచ్చటించే అవకాశాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు.

దిగ్గజ స్వరకర్త, భారతరత్న భూపేన్ హజారికా జయంతిని ఇటీవలే నిర్వహించుకున్నామని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆయన గౌరవార్థం నిన్న ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించడం ఎంతో తృప్తినిచ్చిందని శ్రీ మోదీ చెప్పారు. మన పూర్వికులు, అస్సాం గడ్డపై జన్మించిన ఎందరో మహనీయుల స్వప్న సాకారం దిశగా నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి నిబద్ధతతో కృషి చేస్తున్నాయని ఆయన చెప్పారు.

అస్సాం ప్రగతికి ప్రోత్సాహంతోపాటు సాంస్కృతిక వారసత్వ ప్రాచుర్యం, పరిరక్షణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కీలక ప్రాధాన్యాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అటు ప్రభుత్వం, ఇటు అస్సాం ప్రజల సంయుక్త కృషితో రాష్ట్రం నేడు జాతీయంగా, అంతర్జాతీయంగా అద్భుత ప్రభావం చూపుతున్నదని ప్రశంసించారు.

“ప్రపంచంలో నేడు భారత్‌ శరవేగంగా పురోగమిస్తున్న దేశం కాగా... దేశంలో అత్యంత వేగంగా ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాల జాబితాలో అస్సాం కూడా ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఒకనాడు ఈ రాష్ట్రం అభివృద్ధి పరంగా వెనుకబడి, దేశంలోని మిగిలిన ప్రాంతాలతో సమానంగా ముందడుగు వేయలేకపోయిందని గుర్తుచేశారు. ఆ దుస్థితిని అధిగమించి, ఇప్పుడు దాదాపు 13 శాతం వృద్ధితో ఉరకలు వేస్తున్నదని చెప్పారు. ఇదొక ఘన విజయమని, అస్సాం ప్రజల అంకితభావం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషి ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రజలు నిరంతరం బలోపేతం చేస్తూనే ఉన్నారని ఆయన హర్షం ప్రకటించారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఆయన జట్టు ప్రతి ఎన్నికలోనూ విశేష ప్రజాదరణ పొందడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ క్రమంలోనే ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లోనూ చారిత్రక విజయంతో ప్రజలు తమను ఆశీర్వదించారని పేర్కొన్నారు.

అస్సాం రాష్ట్రాన్ని దేశ ప్రగతి సారథిగా తీర్చిదిద్దే దృక్కోణంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ కర్తవ్య నిర్వహణలో నేటి కార్యక్రమం ఒక భాగమని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ మేరకు  “ఈ వేదిక మీదినుంచే సుమారు ₹6,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం” అని వివరించారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అస్సాంను అత్యంత అనుసంధానిత రాష్ట్రాల్లో ఒకటిగా, ప్రసిద్ధ ఆరోగ్య సంరక్షణ కూడలిగా రూపొందిస్తున్నాయని శ్రీ మోదీ చెప్పారు. “ప్రస్తుతం ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ మా సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయి” అని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో దరంగ్ మెడికల్ కళాశాల-ఆస్పత్రి, జాతీయ రహదారి, రింగురోడ్డు తదితరాల ప్రారంభంపై ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

“వికసిత భారత్‌ సాకారం వైపు యావద్దేశం ఐక్యంగా ముందడుగు వేస్తోంది. ముఖ్యంగా మన యువతరానికి ఇదొక స్వప్నం మాత్రమే కాదు... ఓ సంకల్పం కూడా. కాబట్టి, ఈ లక్ష్య సాధనలో ఈశాన్య భారతం పాత్ర కీలకం” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక ప్రధానంగా దేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో పెద్ద నగరాలు, ఆర్థిక వ్యవస్థలు, పారిశ్రామిక కూడళ్లు వృద్ధి చెందాయని చెప్పారు. అయితే, తూర్పు భారతంలోని విస్తృత ప్రాంతం, జనాభా అభివృద్ధి పరంగా వెనుకబడ్డాయని ఆయన వివరించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి తమ కృషి చేస్తోందని శ్రీ మోదీ చెప్పారు. ఈ మేరకు “ప్రస్తుత 21వ శతాబ్దంలో పాతికేళ్లు పూర్తయ్యాయి. ఇక ఈ శతాబ్ద  తదుపరి అధ్యాయం తూర్పు-ఈశాన్య భారత రాష్ట్రాలదే”నని ఆయన ప్రకటించారు, అస్సాంసహా ఈశాన్య భారత ప్రాంతాలు భారత వృద్ధి పయనానికి సారథ్యం వహించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

“ఏ ప్రాంతంలోనైనా సత్వర ప్రగతికి పటిష్ట అనుసంధానం అవశ్యం. ఈ దిశగా ఈశాన్య ప్రాంతానికి మా ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యమిస్తోంది” అని ప్రధానమంత్రి చెప్పారు. రహదారి, రైలు, విమాన మౌలిక సదుపాయాలు సహా 5జి ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ విస్తరణతో భౌతిక-డిజిటల్ అనుసంధానం మెరుగుపడటాన్ని ఆయన ఉదాహరించారు. ప్రజలకు సౌకర్యాలు మరింత చేరువై, జీవన సౌలభ్యంతోపాటు వ్యాపార కార్యకలాపాలు పెరగడంలో ఈ పురోగమనం దోహదం చేసిందన్నారు. అనుసంధానం మెరుగుదలతో ప్రయాణ సౌలభ్యం పెరిగి, పర్యాటక రంగం విస్తరించడంతో ఇక్కడి యువతకు కొత్త ఉద్యోగ, జీవనోపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు.

దేశవ్యాప్త అనుసంధాన కార్యక్రమాల ద్వారా అస్సాం కూడా ఎంతో లబ్ధి పొందిందని ఆయన చెప్పారు. ఇందుకు ఉదాహరణగా॥ కేంద్రంలో 60 సంవత్సరాలు, అస్సాంలో దశాబ్దాల తరబడి కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ 60-65 ఏళ్లలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించింది 3 వంతెనలు మాత్రమేనని ఉటంకించారు. అయితే, తమ హయాంలో కేవలం ఒక దశాబ్దంలోనే 6 ప్రధాన వంతెనలను నిర్మించడం మునుపటి-ప్రస్తుత ప్రభుత్వాల పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ కురువా-నారెంగి వంతెనకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు. ఇది పూర్తయితే గువహటి-దరంగ్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. దీనివల్ల రవాణా సౌలభ్యం పెరిగి, వాహన రద్దీ తగ్గడంతోపాటు సామాన్యులకు సమయం, వ్యయం రెండూ ఆదా అవుతాయని తెలిపారు.

కొత్త రింగురోడ్డుతో ప్రజలకు గణనీయప్రయోజనాలు ఉంటాయని, ముఖ్యంగా అప్పర్ అస్సాం వెళ్లే వాహనాలు ఇకపై నగరంలో ప్రవేశించే అవసరం ఉండదు కాబట్టి, పట్టణ వాహన రద్దీ తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం 5 జాతీయ, 2 రాష్ట్ర రహదారులతోపాటు ఒక విమానాశ్రయం, 3 రైల్వే స్టేషన్లు, ఒక దేశీయ జలమార్గ కూడలిని ఈ రింగురోడ్డు సంధానిస్తుందని ప్రధానమంత్రి వివరించారు. అస్సాంలో తొలి నిరంతర బహుముఖ రవాణా సంధాన నెట్‌వర్క్‌ సృష్టికి ఇదొక చిహ్నంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి ప్రణాళికకు ఇదే నిదర్శనమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

నేటి ప్రయోజనాల కోసం మాత్రమేగాక రాబోయే 25 నుంచి 50 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా దేశాన్ని సిద్ధం చేస్తున్నామని చెబుతూ- ‘జీఎస్‌టీ’లో భావితరం సంస్కరణలపై ఎర్రకోట పైనుంచి తన ప్రసంగంలో ప్రకటించడాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ మేరకు త్వరలో-  అంటే... మరో 9 రోజుల్లో నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యే వేళకు సంస్కరణలు అమలులోకి వస్తాయంటూ శుభవార్తను ప్రకటించారు. దీంతో అనేక వస్తువులపై పన్ను గణనీయంగా తగ్గుతుందని ప్రకటించారు. తద్వారా అస్సాంలోని ప్రతి ఇంటికీ ప్రయోజనం కలుగుతుందని, అనేక నిత్యావసరాలు మరింత సరసమైన ధరకు లభిస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా సిమెంటుపై పన్ను తగ్గడంతో గృహనిర్మాణ వ్యయం తగ్గుతుందన్నారు. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల మందులు చౌకధరకు లభిస్తాయని, జీవిత-ఆరోగ్య బీమా రుసుము కూడా తగ్గుతుందని వివరించారు. కొత్త బైక్‌ లేదా కారు కొనేవారికి పన్ను భారం నుంచి ఊరట లభిస్తుందని, దీనిపై వాహన తయారీ కంపెనీలు ఇప్పటికే ప్రకటనలు గుప్పిస్తున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అమ్మలు.. చెల్లెమ్మలు, యువతరం, రైతులు, దుకాణదారులు సహా సమాజంలోని అన్ని వర్గాలకూ లబ్ధి చేకూరుతుందని ప్రకటించారు. ఈ సంస్కరణలతో ప్రజల్లో పండుగల ఉత్సాహం వెల్లువెత్తగలదని వ్యాఖ్యానించారు.

ఈ పండుగల సమయంలో ప్రజలు ఓ కీలక సందేశాన్ని మననం చేసుకుంటూ, స్వదేశీ ఉత్పత్తులనే కొనాల్సిందిగా ప్రధానమంత్రి సూచించారు. ఆ మేరకు ‘మేడ్ ఇన్ ఇండియా’ వస్తువుల కొనుగోలు-బహూకరణకు ప్రాధాన్యమివ్వాలని, దుకాణదారులు కూడా స్వదేశీ వస్తు కొనుగోళ్లను ప్రోత్సహించాలని కోరారు. స్థానికుల కోసం ప్రతి ఒక్కరూ తమ గళమెత్తాలని పిలుపునిస్తూ, ఈ దిశగా ప్రతి ప్రయత్నం దేశాన్ని బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు.

కొన్నేళ్లుగా ఆరోగ్య సంరక్షణ రంగంలో దేశమంతటా గణనీయ ప్రగతి సాధించామని ప్రధానమంత్రి చెప్పారు. లోగడ ఆస్పత్రులు ప్రధాన నగరాల్లోనే కేంద్రీకృతం కావడంతోపాటు చికిత్స వ్యయం మోయలేని భారంగా ఉండేదని గుర్తుచేశారు. ఈ సమస్యకు పరిష్కారంగా ‘ఎయిమ్స్’, వైద్య కళాశాలలను దేశం నలుమూలలకూ విస్తరించామని తెలిపారు. అస్సాంలో కేన్సర్ పీడితుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ముఖ్యంగా గత 60-65 ఏళ్ల వ్యవధితో పోలిస్తే కేవలం 11 ఏళ్లలోనే వైద్య కళాశాలల సంఖ్య రెట్టింపైందని శ్రీ మోదీ పేర్కొన్నారు. అస్సాంలో 2014కు ముందు 6 వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవని గుర్తుచేశారు. ఇప్పుడు దరంగ్ వైద్య కళాశాల పూర్తయితే మొత్తం 24 కళాశాలలు ఉంటాయని ఆయన వివరించారు. వైద్య కళాశాలల ఏర్పాటు, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల  మెరుగుదలతోపాటు వైద్యవిద్యలో యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు. గతంలో సీట్ల కొరత ఫలితంగా డాక్టర్‌ కావాలన్న తమ కలను చాలా మంది నెరవేర్చుకోలేక పోయారని తెలిపారు. అయితే, 11 ఏళ్లలోనే దేశవ్యాప్తంగా సీట్ల సంఖ్య రెట్టింపు దాటిందని గుర్తుచేశారు. మరో నాలుగైదేళ్లలో లక్ష కొత్త సీట్లను జోడించాలని తమ ప్రభుత్వం లక్ష్యనిర్దేశం చేసుకున్నట్లు వెల్లడించారు.

అస్సాంను దేశభక్తుల పుట్టినిల్లుగా అభివర్ణిస్తూ, విదేశీ ఆక్రమణదారుల నుంచి దేశాన్ని రక్షించడంతోపాటు స్వాతంత్ర్య పోరాటంలో వారు చేసిన త్యాగాలను గుర్తుచేశారు. పత్రూఘాట్ చారిత్రక రైతు సత్యాగ్రహాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. దానితో జనసమూహం సమావేశమైన ఈ వేదిక సామీప్యాన్ని ప్రస్తావిస్తూ- ఆ శాశ్వత వారసత్వానికి ఇది చిహ్నమని పేర్కొన్నారు. అమరవీరుల పవిత్ర భూమి పైనుంచి కాంగ్రెస్‌ కుట్రను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని శ్రీ మోదీ అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం భారత వ్యతిరేక భావజాలంగల వ్యక్తులు, శక్తులతో ఆ పార్టీ జతకట్టిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ- ఆ సమయంలో కూడా ఈ ధోరణి స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా దేశంలో ఉగ్రవాదం యథేచ్ఛగా విస్తరించినా నాటి ప్రభుత్వం మౌనం వీడలేదని చెప్పారు. తద్విరుద్ధంగా నేటి ప్రభుత్వ హయాంలో భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్ వంటి చర్యలు చేపట్టిందని వివరించారు. తద్వారా పాకిస్థాన్‌లో ఉగ్రవాద సూత్రధారులను, శిక్షణ శిబిరాలను ధ్వంసం చేసిందని చెప్పారు. కానీ, శౌర్యపరాక్రమాలు ప్రదర్శించిన మన సైన్యానికి కాకుండా పాకిస్థాన్‌ బలగాలకు ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయని ఆరోపించారు. ఇది ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే వారి కుట్రలను ప్రోత్సహించడమేనని విమర్శించారు. పాకిస్థాన్ వల్లిస్తున్న అబద్ధాలే ప్రతిపక్షాల కథనాలుగా మారుతున్నాయని, ఆ పార్టీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

జాతీయ జాతీయ ప్రయోజనాలకన్నా తమ ఓటు బ్యాంకు ప్రయోజనాలకే ప్రతిపక్షాలు ఎప్పుడూ ప్రాధాన్యమిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు దేశ వ్యతిరేక శక్తులకు, చొరబాటుదారులకు అండగా నిలుస్తున్నదని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉండగా చొరబాటుదారులను ప్రోత్సహించిందని, ఇవాళ వారికి దేశంలో స్థిర నివాసం ఏర్పరచడానికి ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. అస్సాం గుర్తింపును రక్షించే దిశగా చొరబాటుదారుల నిరోధం కోసం మంగళ్‌దోయ్ ఒకప్పుడు ఒక పెద్ద ఉద్యమం నిర్వహించినట్లు శ్రీ మోదీ గుర్తుచేశారు. అయితే, నాటి ప్రతిపక్ష నేతృత్వ ప్రభుత్వం ప్రజలను శిక్షించిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆక్రమణలను అనుమతించడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నదని ఆరోపించారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను, రైతులతోపాటు గిరిజనుల భూములను ఆక్రమించేవారిని అనుమతించిందని చెప్పారు.

తమ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో పూర్వ పరిస్థితులు నెలకొంటున్నాయని, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వాన దరంగ్‌ జిల్లా సహా అస్సాంలో లక్షలాది ఎకరాల భూమిని చొరబాటుదారుల నుంచి విముక్తం చేశామని చెప్పారు. ప్రతిపక్ష పాలనలో ఒకప్పుడు చొరబాటుదారుల ఆధీనంలోగల గోరుఖుతి ప్రాంతాన్ని ఇప్పుడు స్వాధీనం చేసుకున్నామని శ్రీ మోదీ వివరించారు. ఈ భూమి నేడు ‘గోరుఖుతి వ్యవసాయ ప్రాజెక్టు’కు కేంద్రంగా మారిందని చెప్పారు. ఇక్కడ స్థానిక యువత ‘వ్యవసాయ సైన్యం’లా కృషి చేస్తూ ఆవాలు, మొక్కజొన్న, మినుము, నువ్వులు, గుమ్మడి వంటి పంటలను పండిస్తున్నారని తెలిపారు. ఒకనాడు చొరబాటుదారుల ఆక్రమణలోని భూమి ఇవాళ రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి కొత్త కూడలిగా రూపొందిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

దేశ వనరులు, ఆస్తులపై చొరబాటుదారుల నియంత్రణను తమ ప్రభుత్వం అనుమతించబోదని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. దేశంలోని రైతులు, యువత, గిరిజనం హక్కులపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ఇక్కడి తల్లులు, సోదరీమణులపై చొరబాటుదారుల దురాగతాల మీద ఆందోళన వెలిబుచ్చుతూ- ఈ దుశ్చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. చొరబాట్ల ద్వారా సరిహద్దు ప్రాంతాల జనసంఖ్య కూర్పును తారుమారు చేయడానికి కుట్ర కొనసాగుతోందని శ్రీ మోదీ హెచ్చరించారు. ఇది జాతీయ భద్రతకు తీవ్ర ముప్పుగనుక త్వరలో దేశవ్యాప్త జనసంఖ్య అధ్యయన కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రకటించారు. చొరబాటుదారుల నుంచి దేశాన్ని రక్షించేందుకు, ఈ గడ్డపై నుంచి వారిని పూర్తిగా తరిమికొట్టడానికి నిబద్ధతతో ఉన్నామని ప్రకటించారు.

అస్సాం సుసంపన్న వారసత్వ పరిరక్షణ, ప్రగతి వేగం పెంపు సమష్టి బాధ్యతలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇందుకు అన్నివిధాలా సమన్వయంతో కూడిన కృషి అవసరమని చెప్పారు. ఈ మేరకు అస్సాం సహా ఈశాన్య ప్రాంత ప్రగతిని దేశానికి చోదకశక్తిగా రూపుదిద్దే దృక్కోణంతో ముందడుగు వేస్తున్నామని వివరిస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు.

ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

ప్రధానమంత్రి దరంగ్‌లో అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రాజెక్టులలో వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసే “దరంగ్ మెడికల్ కాలేజ్ అండ్‌  హాస్పిటల్’, ‘జీఎన్‌ఎం’ స్కూల్‌, బీఎస్సీ నర్సింగ్ కాలేజ్” తదితరాలున్నాయి. అలాగే పట్టణంలో వాహన రాకపోకలను నియంత్రిస్తూ రద్దీని తగ్గించడంతోపాటు రాజధాని సహా పరిసర ప్రాంతాల అనుసంధానం మెరుగుపరిచే గువహటి రింగ్ రోడ్డు ప్రాజెక్టు కూడా ఒకటిగా ఉంది. మరోవైపు ఈ ప్రాంత సామాజిక-ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా బ్రహ్మపుత్ర నదిపై కురువా-నారెంగి వంతెనను కూడా నిర్మిస్తారు.

 

***


(Release ID: 2166908) Visitor Counter : 2