ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        మణిపూర్‌లోని ఇంఫాల్‌లో 1,200 కోట్లకు పైగా విలువైన  అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
                    
                    
                        
భరతమాత శిరస్సుకు మణిమకుటం మణిపూర్
మణిపూర్‌ను సుస్థిర శాంతి.. అభివృద్ధి మార్గంలో మనం ముందుకు నడిపించాలి
మణిపూర్‌ను భారత స్వాతంత్య్రానికి ప్రవేశ ద్వారంగా పిలిచిన నేతాజీ సుభాష్
ధైర్యసాహసాలు గల చాలామంది అమరవీరులను ఇచ్చిన నేల
మణిపూర్‌లోని ప్రతి మహావీరుని ప్రేరణతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం
మణిపూర్‌లో శాంతి, సుస్థిరతల కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం
నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రిగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన
శ్రీమతి సుశీలా గారికి 140 కోట్ల మంది భారతీయుల తరపున నా హృదయపూర్వక అభినందనలు
ఆమె నేపాల్ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం మార్గం సుగమం చేస్తారని నేను విశ్వసిస్తున్నా
అపారమైన సామర్థ్యం కలిగి ఉన్న రాష్ట్రం మణిపూర్
కొండలు-లోయల మధ్య సామరస్యమనే బలమైన వంతెన నిర్మాణం కోసం
నిరంతర చర్చల ప్రక్రియ బలోపేతం కావాలి: ప్రధానమంత్రి
                    
                
                
                    Posted On:
                13 SEP 2025 5:04PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మణిపూర్‌లోని ఇంఫాల్‌లో రూ.1,200 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మణిపూర్ అభివృద్ధి కోసం వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఈ రోజు ప్రారంభించామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచుతాయనీ, ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. మణిపూర్ యువతకు, రాష్ట్రానికి చెందిన వారికి కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఈరోజు ప్రారంభించిన ప్రాజెక్టుల్లో రూ. 3,600 కోట్లకు పైగా పెట్టుబడితో చేపట్టిన ‘మణిపూర్ అర్బన్ రోడ్స్ ప్రాజెక్ట్’, రూ. 500 కోట్లకు పైగా పెట్టుబడితో చేపట్టిన ‘మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్’ లు అత్యంత ముఖ్యమైనవని తెలిపారు. ఈ ప్రాజెక్టులు ఇంఫాల్‌లో రహదారి మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాయనీ.. మణిపూర్ ఉజ్వల భవిష్యత్తు కోసం కొత్త శక్తినిస్తాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. కొత్తగా ప్రారంభించిన అన్ని ప్రాజెక్టుల కోసం మణిపూర్ ప్రజలకు ఆయన అభినందనలూ.. శుభాకాంక్షలు తెలిపారు.
స్వాతంత్య్రానంతరం దేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లోని ప్రధాన నగరాలు అభివృద్ధిని చూశాయనీ.. ఆకాంక్షల కేంద్రాలుగా అవి మారాయని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆ ప్రాంతాల యువతకు కొత్త అవకాశాలూ లభించాయని వ్యాఖ్యానించారు. “"21వ శతాబ్దం తూర్పు, ఈశాన్య ప్రాంతాలదే" అని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వం మణిపూర్ అభివృద్ధికి నిరంతర ప్రాధాన్యమిస్తోందని, ఫలితంగా మణిపూర్ వృద్ధి రేటు క్రమంగా పెరుగుతోందన్నారు. 2014కి ముందు మణిపూర్ వృద్ధి రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉండగా.. ప్రస్తుతం చాలా రెట్లు వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మణిపూర్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నవశకం ప్రారంభమైందని శ్రీ మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, జాతీయ రహదారి అభివృద్ధి వేగం అనేక రెట్లు పెరగడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి గ్రామానికి రహదారుల అనుసంధానాన్ని విస్తరించే పనులు వేగంగా కొనసాగుతున్నాయని ప్రధానమంమత్రి తెలిపారు.
ఇంఫాల్ నగరాన్ని అవకాశాల నగరంగా శ్రీ మోదీ అభివర్ణించారు. యువత కలలను నెరవేర్చే, దేశ పురోగతిని వేగవంతం చేసే అభివృద్ధి చెందిన నగరాల్లో ఇంఫాల్ ఒకటని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ దార్శనికతకు అనుగుణంగా స్మార్ట్ సిటీ మిషన్ కింద ఇంఫాల్‌లో అనేక ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. వందల కోట్ల విలువైన అనేక ఇతర ప్రాజెక్టుల పనులు కూడా వేగంగా సాగుతున్నాయని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఇంఫాల్ సహా మణిపూర్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ అంకురసంస్థలు, టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఐటీ స్పెషల్ ఎకనమిక్ జోన్ ఈ అవకాశాలను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ఈ జోన్ మొదటి భవనం ఇప్పటికే పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. మణిపూర్‌లో కొత్త సివిల్ సెక్రటేరియట్ భవనం కోసం డిమాండ్ చాలా కాలంగా ఉందని శ్రీ మోదీ తెలిపారు. ఈ భవనం ఇప్పుడు సిద్ధంగా ఉందన్న ప్రధానమంత్రి.. ఈ కొత్త కార్యాలయం పాలనలో 'నాగరిక్ దేవోభవ' స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని ఆయన ఆకాంక్షించారు.
మణిపూర్ నుంచి చాలా మంది తరచుగా కోల్‌కతా, ఢిల్లీకి ప్రయాణిస్తుంటారని గుర్తు చేస్తూ.. ఈ నగరాల్లో సరసమైన వసతి అందుబాటులో ఉంచేందుకు రెండు ప్రదేశాల్లోనూ మణిపూర్ భవనాలను నిర్మించామని శ్రీ మోదీ తెలిపారు. ఈ సౌకర్యాలు మణిపూర్ ఆడబిడ్డలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. పిల్లలు అక్కడ సురక్షితంగా, భద్రంగా ఉండడం.. ఇంట్లో వారి తల్లిదండ్రుల ఆందోళనను తగ్గిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడానికి ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేసిన శ్రీ మోదీ.. మణిపూర్‌లోని అనేక ప్రాంతాలు తీవ్రమైన వరద సంబంధిత సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ సమస్య తీవ్రతను తగ్గించడం కోసం ప్రభుత్వం పలు ప్రాజెక్టులపై చురుగ్గా పనిచేస్తోందని ఆయన తెలిపారు.
మణిపూర్ ఆర్థిక వ్యవస్థలో మహిళలు ముందంజలో ఉన్నారనీ.. ఇమా కీథెల్ సంప్రదాయం ఈ విషయానికి శక్తిమంతమైన నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత అభివృద్ధికి, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు మహిళా సాధికారత మూలస్తంభమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రేరణ మణిపూర్‌లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల కోసం ఇమా మార్కెట్లు అనే ప్రత్యేక హాత్ బజార్లు ప్రారంభించామని శ్రీ మోదీ తెలిపారు. ఈ రోజు నాలుగు కొత్త ఇమా మార్కెట్లు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్న ప్రధానమంత్రి.. ఈ మార్కెట్లు మణిపూర్ మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
ప్రతి పౌరుడి జీవితాన్ని సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. మణిపూర్ ప్రాంతానికి వస్తువుల రవాణా ఒక పెద్ద సవాలుగా ఉండేదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఒకప్పుడు సాధారణ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేవి కావని ఆయన పేర్కొన్నారు. మణిపూర్ నాటి పాత కష్టాలను అధిగమించేందుకు ఇటీవలి సంవత్సరాల్లో తమ ప్రభుత్వం ఎంతగానో సహాయపడిందని శ్రీ మోదీ తెలిపారు. మా ప్రభుత్వం పొదుపును పెంచాలని, ప్రజలకు జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చాలని కోరుకుంటోందని పేర్కొంటూ ఆయన ఒక కొత్త అభివృద్ధిని ప్రకటించారు. తమ ప్రభుత్వం జీఎస్టీని గణనీయంగా తగ్గించిందనీ.. ఇది మణిపూర్ ప్రజలకు రెట్టింపు ప్రయోజనాలను తెస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సబ్బు, షాంపూ, హెయిర్ ఆయిల్, బట్టలు, పాదరక్షలు వంటి అనేక రోజువారీ వినియోగ వస్తువులు ఇప్పుడు మరింత సరసమైనవిగా మారుతాయని ఆయన వివరించారు. సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు కూడా తగ్గుతాయని ఆయన తెలిపారు. హోటళ్ళు, ఆహార సేవలపై కూడా జీఎస్టీని గణనీయంగా తగ్గించామని శ్రీ మోదీ తెలిపారు. ఇది గెస్ట్ హౌస్ యజమానులకు, టాక్సీ ఆపరేటర్లకు, వీధివెంట తినుబండారాలు విక్రయించే వారికి అత్యంత ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని పెంపొందించడానికి కూడా ఇది సహాయపడుతుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
“"మణిపూర్ వేల సంవత్సరాల నాటి గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ ప్రాంత సాంస్కృతిక మూలాలు లోతైనవి.. బలమైనవి. భరతమాత శిరస్సును అలంకరించే మణిమకుటం మణిపూర్" అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. మణిపూర్ అభివృద్ధిని నిరంతరం బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్‌లో ఏ రూపంలోనైనా హింస జరగడం దురదృష్టకరమన్న ఆయన.. అలాంటి హింస మన పూర్వికులకు, భవిష్యత్ తరాలకు చేసే తీవ్ర అన్యాయం అవుతుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. శాంతి, అభివృద్ధిల మార్గంలో మణిపూర్‌ను స్థిరంగా ముందుకు నడిపించాల్సిన ప్రాముఖ్యాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. భారత స్వాతంత్య్ర పోరాటం, దేశ రక్షణకు మణిపూర్ అందించిన స్ఫూర్తిదాయక సహకారాన్ని ప్రధానమంత్రి కొనియాడారు. భారత జాతీయ సైన్యం మొదట భారత సొంత జెండాను ఎగురవేసింది మణిపూర్ గడ్డపైనేనని ఆయన గుర్తు చేసుకున్నారు. మణిపూర్‌ను భారత స్వాతంత్య్రానికి ప్రవేశ ద్వారంగా అభివర్ణించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. ఈ భూమి నుంచి వచ్చిన అనేక మంది ధైర్యవంతులైన అమరవీరులకు ప్రధానమంత్రి నివాళులర్పించారు. మణిపూర్‌లోని ప్రతి మహావీరుని నుంచి తమ ప్రభుత్వం ప్రేరణ పొందుతున్నదని శ్రీ మోదీ పేర్కొన్నారు. అండమాన్-నికోబార్ దీవుల్లోని మౌంట్ హ్యారియెట్ పేరును మౌంట్ మణిపూర్‌గా మార్చుతూ తమ ప్రభుత్వం తీసుకున్న ఒక ప్రధాన నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది మణిపూర్‌కు చెందిన స్వాతంత్య్ర సమరయోధులకు జాతి అందించే నివాళి అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
నేటికీ మణిపూర్‌కు చెందిన అనేకమంది యువతీయువకులు భరతమాత రక్షణ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సాయుధ దళాల బలాన్ని ప్రపంచమంతా చూసిందన్నారు. భారత సైనికుల నిర్ణయాత్మక దాడులతో పాకిస్తాన్ సైన్యం ఉలిక్కిపడిందని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయంలో ధైర్యవంతులైన మణిపూర్ బిడ్డలు కీలక పాత్ర పోషించారని శ్రీ మోదీ కొనియాడారు. పరాక్రమవంతుడైన సైనికుడు షహీద్ దీపక్ చింగ్ఖామ్‌కు నివాళులర్పించి.. అతని ధైర్యానికి ప్రధానమంత్రి సెల్యూట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో దీపక్ చింగ్ఖామ్ చేసిన త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు.
2014లో తాను మణిపూర్ సందర్శించిన సమయంలో చేసిన ఒక ప్రకటనను గుర్తుచేసుకుంటూ.. మణిపురి సంస్కృతి లేకుండా భారతీయ సంస్కృతి అసంపూర్ణమని.. మణిపూర్ క్రీడాకారులు లేకుండా భారతీయ క్రీడలు అసంపూర్ణంగా ఉంటాయని తాను చెప్పినట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు. మణిపూర్ యువత జాతీయ జెండా గౌరవాన్ని నిలబెట్టేందుకు హృదయపూర్వకంగా అంకితమవుతారని ఆయన కొనియాడారు. హింస అనే చీకటి నీడలో ఈ గుర్తింపును మరుగునపడేయవద్దని ఆయన కోరారు.
“"ప్రపంచ క్రీడా శక్తికి కేంద్రంగా భారత్ అవతరిస్తున్న తరుణంలో మణిపూర్ యువత బాధ్యత మరింత పెరిగింది. అందుకే భారత ప్రభుత్వం దేశంలోని మొట్టమొదటి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయానికి మణిపూర్‌ను ఎంచుకుంది" అని ప్రధానమంత్రి తెలిపారు. ఖేలో ఇండియా పథకం, ఒలింపిక్ పోడియం పథకాల కింద మణిపూర్ నుంచి చాలా మంది అథ్లెట్లను ప్రోత్సహిస్తూ.. వారికి అవసరమైన మద్దతునిస్తున్నామని పేర్కొన్నారు. పోలోను ప్రోత్సహించడం కోసం ప్రపంచంలోనే ఎత్తయిన పోలో విగ్రహాన్ని కలిగి ఉన్న మార్జింగ్ పోలో కాంప్లెక్స్ ఏర్పాటు చేసినట్లు శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రాంతం నుంచి వచ్చిన ఒలింపియన్లను గౌరవించేందుకు ఒక ఒలింపియన్ పార్క్ కూడా నిర్మించామన్నారు. ప్రభుత్వం ఇటీవల ఖేలో ఇండియా నీతి పేరుతో జాతీయ క్రీడా విధానాన్ని ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది రాబోయే సంవత్సరాల్లో మణిపూర్ యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
“"మణిపూర్‌లో శాంతి, సుస్థిరతలను నెలకొల్పేందుకు మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది" అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ.. శిబిరాల్లో ఉంటున్న వారిని తిరిగి సాధారణ జీవితానికి వచ్చేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిర్వాసిత కుటుంబాల కోసం 7,000 కొత్త ఇళ్ళు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మణిపూర్ కోసం సుమారు రూ. 3,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని శ్రీ మోదీ గుర్తుచేశారు. నిర్వాసితులకు సహాయం చేయడం కోసం ప్రత్యేకంగా రూ. 500 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. హింసకు గురైన వారు సాధారణ జీవితానికి తిరిగి రావడానికి సహాయం చేయడం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప్రయత్నానికి మద్దతునివ్వడంలో మణిపూర్ పోలీసుల కోసం కొత్తగా నిర్మించిన ప్రధాన కార్యాలయం కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
మణిపూర్ నేల నుంచి నేపాల్‌లోని తన మిత్రులనుద్దేశించి మాట్లాడాలనుకుంటున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. హిమాలయాల ఒడిలో ఉన్న నేపాల్ భారత్‌కు సన్నిహిత మిత్ర దేశంగా, విశ్వసనీయ భాగస్వామిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు ఉమ్మడి చరిత్ర, విశ్వాసం, సమష్టిగా ముందుకు సాగడానికి కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి సుశీలా గారికి 140 కోట్ల మంది భారతీయుల తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నేపాల్ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు ఆమె మార్గం సుగమం చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా శ్రీమతి సుశీలా నియామకం మహిళా సాధికారతకు ఒక అద్భుతమైన ఉదాహరణ అని శ్రీ మోదీ పేర్కొన్నారు. అస్థిర వాతావరణంలోనూ ప్రజాస్వామ్య విలువలను సమర్థించిన నేపాల్‌లోని ప్రతి వ్యక్తినీ ఆయన అభినందించారు.
నేపాల్‌లో ఇటీవల జరిగిన పరిణామాల్లో పెద్దగా దృష్టిని ఆకర్షించని ఒక ముఖ్యమైన అంశాన్ని శ్రీ మోదీ ప్రస్తావిస్తూ.. గత రెండు-మూడు రోజులుగా నేపాల్ యువకులు, మహిళలు అంకితభావంతో స్వచ్ఛందంగా వీధులను శుభ్రం చేయడం, గోడలకు రంగులు వేయడం చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వారి చిత్రాలు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రసారమవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వారి సానుకూల మనస్తత్వం, నిర్మాణాత్మక చర్యలు స్ఫూర్తిదాయకంగా ఉండటమే కాకుండా నేపాల్ పునరుజ్జీవనానికి స్పష్టమైన సూచనగా నిలుస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేపాల్ ఉజ్వలమైన, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
“"21వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన భారత్ సాకారం లక్ష్యంగా భారత్ పురోగమిస్తోంది... ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం మణిపూర్ అభివృద్ధి చాలా అవసరం" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మణిపూర్ అపరిమిత అవకాశాలతో నిండి ఉందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి మార్గంలో దృఢంగా ఉండటం అందరి సమష్టి కర్తవ్యమని ఆయన తెలిపారు. చర్చల మార్గాన్ని నిరంతరం బలోపేతం చేయాల్సిన అనసరముందన్న ప్రధానమంత్రి.. కొండలు-లోయల మధ్య సామరస్యం అనే బలమైన వంతెన నిర్మించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మణిపూర్ సామర్థ్యంలో ఎటువంటి లోపం లేదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత అభివృద్ధికి శక్తిమంతమైన కేంద్రంగా మణిపూర్ మారుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి మరోసారి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మణిపూర్ గవర్నర్ శ్రీ అజయ్ కుమార్ భల్లా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
ఇంఫాల్‌లో రూ.1,200 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. వాటిలో మంత్రిపుఖ్రిలోని సివిల్ సెక్రటేరియట్, ఐటీ సెజ్ భవనం, కొత్త పోలీసు ప్రధాన కార్యాలయం ఉన్నాయి. ఢిల్లీ, కోల్‌కతాలోని మణిపూర్ భవనాలు, 4 జిల్లాల్లో ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ఇమా మార్కెట్లూ ఈ అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగంగా ఉన్నాయి.
 
***
                
                
                
                
                
                (Release ID: 2166440)
                Visitor Counter : 7
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Bengali-TR 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam