హోం మంత్రిత్వ శాఖ
సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీస్, డీఆర్‌జీలతో పాటు కోబ్రా జవాన్లతో కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా భేటీ..
కర్రెగుట్ట కొండ ప్రాంతంలో ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ను విజయవంతంగా పూర్తి చేసిన
ప్రత్యేక పోలీసు దళాలకు సత్కారం
కర్రె గుట్టలు కొండ ప్రాంతంలో చేపట్టిన అతి పెద్ద దాడి... ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్
సాహసంతో విజృంభించిన జవాన్లు… విజయవంతంగా ఆపరేషన్
భద్రతాదళాలను హృదయపూర్వకంగా అభినందించిన శ్రీ అమిత్ షా
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ సందర్భంగా జవాన్లు ప్రదర్శించిన ధైర్య సాహసాలూ, శౌర్యం
నక్సల్ నిరోధక కార్యకలాపాల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం
నక్సలైట్లు లొంగిపోవడం, పట్టుబడటం, లేదా అంతమయ్యే వరకూ తగ్గేది లేదు
నక్సల్ ముక్త భారతమే లక్ష్యం
మండే ఎండలు, ఎత్తయిన ప్రాంతం, మందుపాతరల ప్రమాదం…ఎక్కడా వెనక్కి తగ్గని భద్రతాదళాలు
నక్సలైట్ల బేస్ క్యాంపు ధ్వంసం…. సడలని మనోధైర్యంతో విజయ కేతనం
తిరుగులేని దాడితో కర్రెగుట్టల్లో నక్సలైట్లు నిర్మించిన వస్తుసామాగ్రి, సరఫరా వ్యవస్థ ధ్వంసం
నక్సల్ ఆపరేషన్లలో తీవ్రంగా గాయపడిన జవాన్లకు అండగా నిలిచిన ప్రభుత్వం
వారి జీవితాలు సాఫీగా సాగేందుకు సకల ప్రయత్నాలు
నక్సలైట్లను అంతం చేసే చర్యల ద్వారా… పశుపతినాధ్ నుంచి తిరుపతి వరకూ
6.5 కోట్ల మంది జీవితాల్లో నవోదయం
దేశంలో 2026 మార్చి నెల 31 నాటికి నక్సలిజం ఆనవాళ్లు లేకుండా చేయాలన్నది
మోదీ ప్రభుత్వ దృఢ సంకల్పం: కేంద్ర హోం మంత్రి
Posted On:
03 SEP 2025 10:48AM by PIB Hyderabad
కర్రె గుట్టలు కొండ ప్రాంతంలో ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ను విజయవంతంగా అమలు చేసిన- సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీస్, డీఆర్‌జీలతో పాటు కోబ్రా జవాన్లను కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా న్యూఢిల్లీలో సన్మానించారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయితో పాటు ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ శర్మ కూడా పాల్గొన్నారు.
ఇదివరకు ఎన్నడూ ఎరుగనంతటి అతి పెద్ద నక్సల్ నిరోధక కార్యక్రమం ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ను కర్రె గుట్టలు కొండ ప్రాంతంలో నిర్వహించి, ఈ ఆపరేషనును విజయవంతం చేసినందుకు భద్రతా దళాలను కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అభినందించారు. ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ కాలంలో జవాన్లు కనబరిచిన ధైర్య సాహసాలను, శౌర్యాన్ని నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుందని ఆయన అన్నారు.
నక్సలైట్లు లొంగిపోవడం, పట్టుబడటం లేదా అంతమయ్యే వరకూ మోదీ ప్రభుత్వం విశ్రమించబోదని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మనం భారత్‌ను నక్సలైట్ల ఉనికి లేకుండా తీర్చిదిద్దుదామని ఆయన అన్నారు.
మండే ఎండలు, ఎత్తయిన గుట్టలు, అడుగడుగునా ఐఈడీల అపాయం పొంచి ఉన్నప్పటికీ, భద్రతదళాలు మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శిస్తూ నక్సలైట్ల బేస్ క్యాంపును నాశనం చేయడం ద్వారా ఆపరేషన్‌ను విజయవంతం చేశారనీ, కర్రె గుట్టలు కొండ ప్రాంతంలో నక్సలైట్లు ఏర్పాటు చేసుకొన్న మెటీరియల్ డంపును, సరఫరా వ్యవస్థను సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీస్, డీఆర్‌జీలతో పాటు కోబ్రా జవాన్లు ధ్వంసం చేశారని ఆయన అన్నారు.
దేశంలో అంతగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలకు నక్సలైట్లు ఎంతో నష్టాన్ని తెచ్చారని, పాఠశాలల్నీ, ఆసుపత్రులనూ మూసివేశారని, ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు చేరుకోకుండా చేశారని శ్రీ అమిత్ షా వివరించారు. నక్సల్ నిరోధక కార్యకలాపాలను చేపట్టిన కారణంగా... పశుపతినాథ్ మొదలు తిరుపతి వరకు గల ప్రాంతంలో 6.5 కోట్ల మంది ప్రజల జీవనంలో ఒక వెలుగు చోటుచేసుకొందని వెల్లడించారు. నక్సలైట్ల నిరోధక కార్యకలాపాల్లో తీవ్రంగా గాయపడిన భద్రతాదళాల జీవనం సాఫీగా సాగిపోయేందుకు మోదీ ప్రభుత్వం సాధ్యమైన అన్ని రకాల ప్రయత్నాలను చేస్తోందని శ్రీ షా తెలిపారు. దేశంలో 2026 మార్చి 31 నాటికి నక్సలిజం ఉనికి ఉండని స్థితిని ఆవిష్కరించాలన్నది మోదీ ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోం మంత్రి పునరుద్ఘాటించారు.
***
(Release ID: 2163526)
Visitor Counter : 2
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam