ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీహార్ రాజ్య జీవికా నిధి రుణ సహకార సంఘాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

సాధికారితను దక్కించుకొన్న మహిళలు... వికసిత్ భారత్‌కు పునాది..

దేశ మహిళలకు సాధికారత కల్పనే మా ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యాన్నిచ్చే అంశం
వారి జీవితాల్లో ఇబ్బందులను తగ్గించే దిశగా ప్రభుత్వం నిరంతరాయంగా కృషి

ఈ పనిని ఇక ముందూ కొనసాగిస్తుంది
తల్లికి హోదా, ఆదరణ, ఆత్మగౌరవం.. ఇవి మా ప్రభుత్వపు అత్యంత ప్రాధాన్యాంశాలు: ప్రధానమంత్రి

Posted On: 02 SEP 2025 2:35PM by PIB Hyderabad

బీహార్ రాజ్య జీవికా నిధి రుణ సహకార సంఘం లిమిటెడ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ఈ మంగళప్రదమైన మంగళవారం రోజు, చాలా ఆశాజనక కార్యక్రమానికి నాందీప్రస్తావన చేసుకుంటున్నామన్నారు. జీవికా నిధి రుణ సహకార సంఘ రూపంలో బీహార్‌లోని తల్లులకు, ఆడపడుచులకు ఒక కొత్త సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం గ్రామాల్లో జీవికతో అనుబంధం కలిగి ఉన్న మహిళలకు మరింత సులభంగా ఆర్థిక సహాయ సహకారాన్ని అందుబాటులోకి తీసుకు వస్తుందని, వారు పనిలోను, వ్యాపారాల్లోను ముందడుగు వేయడానికి ఇది సాయపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. జీవికా నిధి వ్యవస్థ పూర్తి డిజిటల్ మాధ్యమంలో పనిచేస్తుందని, పనిగట్టుకొని కాళ్లరిగేలా తిరిగే అవసరం ఇక ఉండదని, ప్రతి పనినీ ఇప్పుడు చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారానే చక్కబెట్టవచ్చని చెబుతూ ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జీవికా నిధి రుణ సహకార సంఘం ప్రారంభం అయినందుకు బీహార్‌లోని తల్లులకు, ఆడపడుచులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ అసాధారణ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకు వచ్చినందుకు శ్రీ నీతీశ్ కుమార్‌ను, బీహార్ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి అభినందించారు.

 

‘‘సాధికారతను సంపాదించుకొన్న మహిళలే అభివృద్ధి చెందిన భారతదేశానికి పునాది’’ అని శ్రీ మోదీ చెప్పారు. మహిళలకు సాధికారతను కల్పించడానికి, వారు జీవితాల్లో ఎదుర్కొంటున్న ఇక్కట్లను తగ్గించాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. అమ్మలు, అక్కచెల్లెళ్లు, ఆడపిల్లల జీవనాన్ని సరళతరం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేడుతోందనీ, నిత్యం కాలకృత్యాలను బహిరంగ ప్రదేశాల్లో ముగించుకోవాల్సిన దుస్థితి నుంచి మహిళలకు రక్షించడానికి కోట్లాది టాయిలెట్లను నిర్మించినట్లు ఆయన చెప్పారు. పీఎం ఆవాస్ యోజనలో భాగంగా కోట్లాదిగా పక్కా ఇళ్లను నిర్మించారు. ఈ ఇళ్లను మహిళల పేరుపైనే రిజిస్టర్ చేసేటట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఒక ఇంటికి మహిళ... యజమాని అయితే, ఆమె మాటకు విలువ పెరుగుతుందని ఆయన చెప్పారు.

తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అమలుచేస్తున్న ‘హర్ ఘర్ జల్’ కార్యక్రమాన్ని శ్రీ మోదీ ప్రస్తావించారు. తల్లులు, అక్కాచెల్లెళ్లు ఆరోగ్య సంరక్షణ సేవల్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ‘ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు, రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సదుపాయాన్ని అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని నిర్వహిస్తోందని, దీంతో ప్రతి తల్లీ తన పిల్లలకు రోజూ ఏం పెట్టాలన్న విషయంగా బెంగ పడాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి తెలిపారు. మహిళల ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో, లఖ్‌పతి దీదీ, డ్రోన్ దీదీ, బ్యాంక్ సఖి వంటి కార్యక్రమాలను అమల్లోకి తెచ్చామనీ, ఈ కార్యక్రమాలన్నీ దేశవ్యాప్తంగా మహిళలకు సాధికారతను కల్పిస్తున్నాయనీ ఆయన వివరించారు. ఈ పతకాలు తల్లుల, సోదరీమణుల సేవకు అంకితం చేసిన ఒక గొప్ప ప్రచార ఉద్యమంలో భాగమని ఆయన అభివర్ణించారు. రాబోయే కాలంలో, తమ ప్రభుత్వం బీహార్‌లో ఈ ఉద్యమాన్ని మరింత వేగవంతం చేస్తుందని శ్రీ మోదీ హామీ ఇచ్చారు.  

‘‘బీహార్ మాతృత్వ శక్తిని ఆరాధించే నేల. మాతృమూర్తుల గౌరవానికి అత్యున్నత స్థానాన్నిచ్చే నేల’’ అని ప్రధానమంత్రి అన్నారు. బీహార్‌లో గంగా మాత, కోసీ మాత, గండకీ మాత, పున్‌పున్ మాత.. వీరిని అమిత భక్తి శ్రద్ధలతో పూజిస్తారని ఆయన గుర్తు చేశారు. జానకి జీ బీహార్ పుత్రిక. ఈ నేలపై ఉన్న సాంస్కృతిక నేపథ్యంలో పెరిగారు. ఈ నేలలో పుట్టిన సియా దియాను ప్రపంచం నలు మూలలా సీతామాతగా ఆరాధిస్తారని ఆయన గుర్తుచేశారు. ఛఠీ మాతకు ప్రార్థన చేయడాన్ని ఒక వరంగా భావిస్తారని శ్రీ మోదీ చెప్పారు. పవిత్రమైన నవరాత్రి పండుగ ఈ నెలలోనే రాబోతోందని, ఈ పర్వదినాల్లో దుర్గామాత తొమ్మిది అవతారాలనూ దేశమంతా అర్చిస్తారని ప్రధానమంత్రి అన్నారు. బీహార్‌లోను, పూర్వాంచల్ ప్రాంతంలోను సాత్‌బహినీ పూజ ఒక తరం నాటి నుంచి కొనసాగుతున్న సంప్రదాయం.. దీనిలో భాగంగా ఏడుగురు సోదరీమణులను దేవీమాత స్వరూపాలుగా భావించి పూజలు చేస్తారన్నారు. అమ్మ పట్ల ప్రగాఢ నమ్మకం, భక్తి బీహార్‌కు ఒక విశిష్ట గుర్తింపును తీసుకువచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా.. వారు ఎంత ప్రియతములైనా సరే, ఎప్పటికీ తల్లి స్థానాన్ని అందుకోలేరన్న ఒక స్థానిక నానుడిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఉదాహరించారు.

తల్లులకు హోదా, గౌరవం, అభిమానం... వీటికే తన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యాన్ని కట్టబెట్టే అంశమని శ్రీ మోదీ స్పష్టం చేస్తూ, తల్లే మనకు లోకంలోని సారమంతా... ఆమె మన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నారు.. అని అభివర్ణించారు. సుసంపన్న సాంస్క‌ృతిక సంప్రదాయానికి బీహార్ ప్రసిద్ధి అని ఆయన చెబుతూ, ఇటీవల చోటుచేసుకున్న ఒక సంఘటనపై ఆందోళనను వ్యక్తం చేశారు. అలాంటి ఘటన జరుగుతుందని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు. బీహార్‌లో ప్రతిపక్ష కూటమి వేదిక నుంచి తన మాతృమూర్తిని అనకూడని మాటలు అన్నారని ప్రధానమంత్రి తెలిపారు. ఈ అవమానాలు ఒక్క తన తల్లికి లభించిన తిరస్కారం మాత్రమే కాదని, దేశంలో ప్రతి అమ్మ, ప్రతి సోదరి, ప్రతి కుమార్తెకు జరిగిన అవమానమని ఆయన స్పష్టం చేశారు. అటువంటి వ్యాఖ్యలు కనీ వినీ ఎరుగని బీహార్ ప్రజలకు కలిగిన వేదన.. మరీ ముఖ్యంగా తల్లులు పడ్డ బాధ ఇంతా అంతా కాదని శ్రీ మోదీ అన్నారు. తాను తన గుండెలో ఎంతటి విచారాన్ని మోసిందీ, ఆ దుఖ్ఖాన్ని సమాన స్థాయిలో బీహార్ ప్రజానీకం పంచుకున్నదని, ఈ విచారాన్ని ఈ రోజు యావత్తు ప్రజల దృష్టికి తీసుకు వస్తున్నానని ఆయన అన్నారు.      

 

సుమారుగా 55 ఏళ్ల నుంచి తాను ఈ సమాజానికి, దేశానికి సేవలు చేస్తున్నాననీ, ప్రతి రోజూ, ప్రతి క్షణం దేశం కోసమే అంకితమై పని చేస్తున్నానీ ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ ప్రయాణంలో తన తల్లి పోషించిన ప్రధాన పాత్ర గురించి కూడా వివరించారు. భరత మాత సేవ కోసం మాతృమూర్తి కుటుంబ బాధ్యతల నుంచి తనకు విముక్తి కల్పించారని పేర్కొన్నారు. దేశ సేవ కోసం తనను ఆశీర్వదించిన, ఈ ప్రపంచంలో భౌతికంగా లేని తన తల్లిని ప్రతిపక్ష కూటమి కించపరిచేలా మాట్లాడటంపై విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమని, ఆవేదన కలిగించేదని ఆయన అన్నారు.

 

ప్రతి తల్లి తన పిల్లలను అనేక త్యాగాలతో పెంచుతుందని, ఆమెకు తన సంతానం కంటే ఏదీ ఎక్కువ కాదంటూ.. తన చిన్నతనం నుంచి తన తల్లిని ఆ విధంగానే చూశానని పేర్కొన్నారు. కుటుంబాన్ని, సంతానాన్ని పోషించడానికి ఆమె పేదరికాన్ని, కష్టాలను ఓర్చుకున్నారని తెలియజేశారు. తన పిల్లలు ప్రశాంతంగా నిద్రపోయేందుకు వర్షాకాల ప్రారంభానికి ముందే.. ఇంటి పైకప్పు నుంచి వాన నీరు కిందికి రాకుండా ఉండటానికి ఆమె ఎలా పనిచేసేవారో గుర్తు చేసుకున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ఒక్క రోజు విశ్రాంతి తీసుకుంటే.. తన పిల్లలు ఇబ్బంది పడతారనే ఆలోచనతో ఆమె పనికి వెళ్లేవారని వెల్లడించారు. ఆమె తనకోసం ఎప్పుడూ కొత్త చీర కొనుక్కోలేదని, ప్రతి రూపాయిని తన పిల్లలకు దుస్తులు కుట్టించడానికే దాచిపెట్టేవారని చెప్పారు. తన జీవితం మొత్తాన్ని త్యాగం చేయడం ద్వారా నిరుపేద తల్లి.. తన పిల్లలకు విద్య, బలమైన విలువలను అందిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అందుకే తన తల్లి స్థానం దేవతల కంటే ఎక్కువగా భావిస్తానని పేర్కొన్నారు. ఒక శ్లోకంతో బీహార్ సాంస్కృతిక ఆచారాలను వివరిస్తూ.. ప్రతిపక్షం చేసిన వ్యాఖ్యలు తన తల్లి గురించి మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మాతృమూర్తులను అవమానించడమేనని శ్రీ మోదీ అన్నారు.

 

పేదరికంలో ఉన్న తల్లి త్యాగాన్ని, కొడుకు బాధను రాజరిక వంశాల్లో పుట్టిన వారు అర్థం చేసుకోలేరని శ్రీ మోదీ విమర్శించారు. ప్రత్యేక అధికారాలున్నాయని భావించే ఈ వ్యక్తులు ధనవంతులుగా జన్మించారని, బీహార్లోనూ, దేశవ్యాప్తంగా అధికారాన్ని తమ కుటుంబ వారసత్వంగా పరిగణిస్తారని అన్నారు. అధికార పీఠం జన్మ హక్కుగా భావిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ భారతీయులు పేద తల్లి కొడుకును, కష్టపడే వ్యక్తిని ఆశీర్వదించి ప్రధానమంత్రిని చేశారన్నారు. ఈ వాస్తవాన్ని ప్రత్యేక తరగతులకు చెందినవారు జీర్ణించుకోలేరని ఆయన పేర్కొన్నారు. సమాజంలో వెనకబడిన, అత్యంత వెనుకబడిన తరగతులకు చెందినవారు ఎదగడాన్ని ప్రతిపక్షం ఎన్నడూ సహించదని ఆయన అన్నారు. కష్టపడి పనిచేసే వారిని అవమానించే హక్కు తమకు ఉందని ఈ వ్యక్తులు నమ్ముతారని, అందుకే కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీహార్ ఎన్నికల సమయంలోనూ.. తనను అవమానించారని, దుర్భాషలాడారని, సంపన్న వర్గాల మనస్తత్వాన్ని ఈ వ్యక్తులు పదేపదే బహిర్గతం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మనస్తత్వమే దివంగతురాలైన తన తల్లిని కించపరిచేలా ప్రతిపక్షాన్ని మాట్లాడించిందని ప్రధానమంత్రి అన్నారు.

 

తల్లులను, సోదరీమణులను దుర్భాషలాడే ఆలోచన ఉన్నవారు మహిళలను బలహీనులుగా చూస్తారని, వారిని పీడిస్తూ.. అణిచి ఉంచే వస్తువులుగా పరిగణిస్తారని ఆక్షేపించారు. ఇలాంటి మహిళా వ్యతిరేక భావజాలం ఉన్నవారు అధికారంలోకి వస్తే.. స్త్రీలే ఎక్కువ బాధపడతారన్నారు. ఈ వాస్తవాన్ని బీహార్ ప్రజల కంటే ఎక్కువ ఎవరూ అర్థం చేసుకోలేరని పేర్కొన్నారు. బీహార్లో ప్రతిపక్షం అధికారంలో ఉన్న సమయంలో నేరాలు, నేరస్థులపై అదుపు ఉండేది కాదని, హత్య, దోపీడీ, అత్యాచార సంఘటనలు సర్వసాధారణంగా ఉండేవని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. అప్పటి ప్రభుత్వం హంతకులకు, అత్యాచార నిందితులకు భద్రత కల్పించేందని ఆరోపిస్తూ.. ఆ పాలనా భారాన్ని బీహార్ మహిళలే మోశారని అన్నారు. మహిళలు తమ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టేందుకు సురక్షితమైన వాతావరణం ఉండేది కాదని, తమ భర్తలు లేదా కొడుకులు సాయంత్రానికి ఇంటికి సజీవంగా వస్తారో లేదో తెలియక నిరంతరం భయపడుతూ కుటుంబాలు జీవించాయని శ్రీ మోదీ అన్నారు. కుటుంబాలను కోల్పోతామని, చెర నుంచి విముక్తి పొందడానికి డబ్బులు చెల్లించేందుకు నగలు అమ్మాల్సి వస్తుందేమోనని, మాఫియా అపహరిస్తుందని, వైవాహిక జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుందేమోనని మహిళలు భయపడుతూ ఉండేవారని ఆయన వివరించారు. ఆ చీకటి నుంచి విముక్తి పొందేందుకు బీహార్ సుదీర్ఘ పోరాటం చేసిందని ప్రధానమంత్రి అన్నారు. ప్రతిపక్షాలను అధికార పీఠం నుంచి తొలగించడంలో, వారిని పదే పదే ఓడించడంలో బీహార్ మహిళలు కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. అందుకే.. ప్రతిపక్ష పార్టీలు బీహార్లోని మహిళలపై అత్యంత ఆగ్రహంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ పార్టీలు ప్రతీకారేచ్ఛతో ఉంటాయని, శిక్షలు విధించాలని భావిస్తాయనే విషయాన్ని ప్రతి బీహార్ మహిళ అర్థం చేసుకోవాలని కోరారు.

కొన్ని ప్రతిపక్ష పార్టీలు మహిళా పురోగతిని నిరంతంరం వ్యతిరేకిస్తున్నాయని, అందుకే వారు మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని శ్రీ మోదీ విమర్శించారు. పేద కుటుంబానికి చెందిన ఓ మహిళ ఉన్నత స్థానానికి చేరుకుంటే.. వారిలో ఆ నిరుత్సాహం స్పష్టంగా కనిస్తుందని వ్యాఖ్యానించారు. గిరిజన తెగకు చెందిన, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును తరచూ ప్రతిపక్షం అవమానించడాన్ని దీనికి ఉదాహరణగా చూపించారు. మహిళల పట్ల ఈ ద్వేషపూరితమైన, తిరస్కార ధోరణితో కూడిన రాజకీయాలను ఆపేయాలని హితవు పలికారు. మరో 20 రోజుల్లో నవరాత్రి ప్రారంభం అవుతుందని, ఆ తర్వాత 50 రోజుల్లో ఛఠ్ పండగ వస్తుందని.. ఆ సమయంలో ఛఠీ మైయాను పూజిస్తారని పేర్కొన్నారు. బీహార్ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. తన తల్లిని అవమానించేలా మాట్లాడినవారిని తాను క్షమించగలిగినప్పటికీ.. ఈ భారత భూమి మాతృమూర్తుల పట్ల అగౌరవాన్ని ఎన్నడూ సహించదన్నారు. ప్రతిపక్ష పార్టీలు శతబాహిని, ఛఠీ మైయా నుంచి క్షమాపణలు పొందాలని సూచించారు.

 

తల్లులకు జరుగుతున్న అవమానాలకు స్పందించే బాధ్యతను బీహార్, ముఖ్యంగా ఆ రాష్ట్ర పుత్రులు తీసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎక్కడికి వెళ్లినా, ఏ వీధికి, ఏనగరానికి వెళ్లినా.. వారు మాతృమూర్తులకు జరుగుతున్న అవమానాన్ని, వారి గౌరవాన్ని కించపరిచేలా చేస్తున్న దాడులను ఉపేక్షించరనే ప్రజల అభిప్రాయాన్ని కూడా వారు వినాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీల అణిచివేత ధోరణిని, దాడులను సహించబోమని ఆయన చెప్పారు.

 

భారత్‌లోని మహిళలకు సాధికారత కల్పించడానికే తన ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించేందుకు తమ ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోందని, పూర్తి చిత్తశుద్ధితో ఆ పనిని కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. తన ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరుతూ.. ఈ దేశంలోని ప్రతి తల్లికీ వందనమర్పిస్తూ.. ప్రసంగాన్ని ముగించారు.

 

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. గ్రామాల్లో, వీధుల్లో ‘‘హర్ ఘర్ తిరంగా’’ నినాదం ప్రతిధ్వనించిన జాతీయ భావాలను గుర్తు చేసుకుంటూ.. ప్రస్తుత సమయంలో ‘‘హర్ ఘర్ స్వదేశీ, ఘర్ - ఘర్ స్వదేశీ’’ అవసరం అయిందని ప్రధానమంత్రి తెలియజేశారు. మాతృమూర్తులు, సోదరీమణులకు సాధికారత కల్పించడానికి, ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించడానికి ఈ కొత్త మంత్రం అవసరమని వివరించారు. ఈ కార్యక్రమానికి ఆశీస్సులు అందించాలని మహిళలను కోరారు. ఓకల్ ఫర్ లోకల్, మేడిన్ ఇండియా ఉత్పత్తులపై దృష్టి సారిస్తూ.. ‘‘ఈ దుకాణం స్వదేశీ’’ అనే బోర్డును ప్రతి దుకాణదారుడు, వ్యాపారి గర్వంగా ప్రదర్శించాలని కోరారు. స్వావలంబన సాధించే దిశగా భారత్ దృఢంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ.. ప్రసంగం ముగించారు.

 

బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రులు శ్రీ సామ్రాట్ చౌదరి, శ్రీ విజయ్ కుమార్ సిన్హా, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

 

బీహార్ రాజ్య జీవికా నిధి రుణ సహకారీ సంఘ్ లిమిటెడ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరంద్ర మోదీ ప్రారంభించారు. జీవిక సంఘంలో సభ్యులకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు సులభంగా అందించే లక్ష్యంతో జీవికా నిధిని ఏర్పాటు చేశారు. జీవికలోని అన్ని క్లస్టర్ స్థాయి సంస్థలు ఈ సంఘంలో సభ్యులుగా మారతాయి. ఈ సంస్థ నిర్వహణ కోసం బీహార్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూరుస్తుంది.

 

అనేక సంవత్సరాలుగా జీవికా స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు వ్యాపార నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో అనేక చిన్న వ్యాపారాలు, ఉత్పాదక సంస్థలు ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అయింది. అయినప్పటికీ మహిళా వ్యాపారవేత్తలు తరచూ 18 నుంచి 24 శాతం వడ్డీతో రుణాలు అందించే సూక్ష్మ రుణ సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. ఎంఎఫ్ఐలపై ఆధారపడే అవసరాన్ని తగ్గించడానికి, తక్కువ వడ్డీతో పెద్ద మొత్తంలో రుణాలు అందించడానికి జీవికా నిధిని ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేశారు.

 

నిధులను వేగంగా, పారదర్శకంగా జీవికా దీదీల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు ఈ వ్యవస్థ మొత్తం డిజిటల్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి పనిచేస్తుంది. దీనిని మరింత సులభతరం చేయడానికి 12,000 కమ్యూనిటీ కేడర్లకు మినీ కంప్యూటర్లయిన- ట్యాబ్లెట్లను అందించారు.

 

ఈ కార్యక్రమం గ్రామీణ మహిళల్లో ఔత్సాహిక వ్యాపారాభివృద్ధిని బలోపేతం చేస్తుందని, సమాజం నేతృత్వంలోని సంస్థల వృద్ధిని పెంపొందిస్తుందని అంచనా వేస్తున్నారు. బీహార్ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది మహిళలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారు.

 


(Release ID: 2163220) Visitor Counter : 2