ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎస్‌సీవో ఇరవై అయిదో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం

Posted On: 01 SEP 2025 10:14AM by PIB Hyderabad

ఎస్‌సీవో ఇరవై అయిదో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నందుకు సంతోషిస్తున్నాను. సాదర స్వాగతం పలికినందుకు, చక్కని ఆతిథ్యాన్ని అందించినందుకు అధ్యక్షుడు శ్రీ శీ జిన్‌పింగ్ ‌కు నేను హృదయపూర్వక కృత‌జ్ఞత‌లు తెలియజేస్తున్నాను.

ఈ రోజు ఉజ్బెకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం. నిన్న కిర్గిజిస్థాన్ జాతీయ దినోత్సవం. ఈ సందర్భంగా, ఇద్దరు నేతలకూ నేను శుభాకాంక్షలతో పాటు శుభాభినందనలు  తెలియజేస్తున్నాను.

గౌరవనీయులారా,

గత ఇరవై నాలుగేళ్లుగా యూరేసియా ప్రాంతంలోని విస్తారిత కుటుంబాన్ని సంధానించడంలో ఎస్‌సీవో కీలక పాత్రను పోషించింది. భారత్ ఒక క్రియాశీల సభ్య దేశం ఎల్లప్పుడూ ఫలప్రదమైన, సానుకూలమైన రీతిన తన తోడ్పాటును అందిస్తోంది.

ఎస్‌సీవో విషయంలో భారత్ దార్శనికత, అనుసరిస్తున్న విధానం మూడు ముఖ్య స్తంభాలపై ఆధారపడి ఉంది. అవి:

ఎస్ అంటే సెక్యూరిటీ (భద్రత)
సీ అంటే కనెక్టివిటీ (సంధానం)
ఓ అంటే ఆపర్చునిటీ (అవకాశం).

ముందుగా మొదటి స్తంభం ‘ఎస్’ను గురించి. ‘ఎస్’ భద్రతను సూచిస్తుంది. భద్రత, శాంతి, స్థిరత్వం.. ఇవి ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా మూలాధారంగా ఉంటాయని నేను స్పష్టం చేయదలచుకున్నాను. ఏమైనా, ఉగ్రవాదం, వేర్పాటువాదం.. వీటితో పాటు అతివాదం.. ఇవి ఈ దారిలో ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయి.

ఉగ్రవాదం ఏ ఒక్క దేశ భద్రతకు ముప్పు అని కాక పూర్తి మానవాళికి ఒక ఉమ్మడి సవాలును విసురుతోంది. ఈ సవాలు విషయంలో ఏ దేశం, ఏ సమాజం, ఏ పౌరుడు/ పౌరురాలు గాని సురక్షితులం అని భావించ జాలవు. ఈ  కారణంగానే ఉగ్రవాదంపై పోరాడే అంశంలో అంతా ఏకతాటి మీద నిలవడానికి ప్రాధాన్యాన్నివ్వాలని భారత్ తరచు స్పష్టం చేస్తోంది.

ఈ విషయంలో ఎస్‌సీవో-ఆర్ఏటీఎస్ చాలా ముఖ్య పాత్రను నిర్వహించింది. ఈ సంవత్సరం, జాయింట్ ఇన్ఫర్మేషన్ ఆపరేషన్‌కు నాయకత్వాన్ని వహిస్తూ ‘అల్-ఖైదా’తో పాటు దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలతో పోరాడేందుకు భారత్ నడుం బిగించింది. సమూల సంస్కరణవాదానికి విరుద్ధంగా సమన్వయాన్ని ఇప్పటి కన్నా పెంచాలని, కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలని కూడా మేం ఒక ప్రతిపాదనను తీసుకువచ్చాం.

ఉగ్రదాద సంస్థలకు ఆర్థికంగా సహాయం చేయడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకించాం. ఈ ప్రయత్నంలో మీరంతా మీ మద్దతును తెలియజేసినందుకు నేను నా మనసారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

గౌరవనీయులారా,

గత నలభై ఏళ్లుగా, భారత్ చాలా సందర్భాల్లో ఉగ్రవాదం వల్ల తీవ్రాతితీవ్ర గాయాలకు గురవుతోంది. ఎంతో మంది తల్లులు పిల్లలను కోల్పోవాల్సి వచ్చింది. ఎంతో మంది పిల్లలు అనాధలుగా మారాల్సి వచ్చింది.

ఇటీవల, పహల్గామ్ ఉగ్రవాదం అత్యంత ఘోర రూపాన్ని మనమంతా చూశాం. ఈ దు:ఖ భరిత ఘడియల్లో మా వెన్నంటి నిలిచిన మిత్ర దేశాలన్నిటికి నేను నా కృతజ్ఞత‌లు తెలియజేస్తున్నా. ఈ దాడి భారత్ అంతరాత్మపై చేసిన దాడే కాక మానవతను నమ్మే ప్రతి ఒక్క దేశం పైన, ప్రతి ఒక్క వ్యక్తి పైన కూడా రువ్విన ఒక నేరు సవాలు.

ఇలాంటి పరిస్థితుల్లో, ఒక ప్రశ్న రావడం సహజం.. ఉగ్రవాదాన్ని కొన్ని దేశాలు బహిరంగంగా సమర్ధించడం మనకు ఆమోదయోగ్యమేనా? అనేదే ఈ  ప్రశ్న.

గౌరవనీయులారా,

మనం స్పష్టంగాను, ముక్తకంఠంతోను స్పష్టం చేసి తీరాల్సిన అంశం.. అది.. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కానే కాదు అనే అంశం. మనమందరం కలిసికట్టుగా.. ఉగ్రవాదాన్ని దాని ప్రతి రంగులోను, ప్రతి రూపంలోను ఎదిరించి తీరాలి. ఇది మానవత పట్ల మన ఉమ్మడి బాధ్యత.

గౌరవనీయులారా,

ఇప్పుడు ఇక రెండో స్తంభం ‘‘సి’’ గురించి నా ఆలోచనలు తెలియజేస్తాను . ‘సి’ అనేది కనెక్టివిటీని (సంధానాన్ని) సూచిస్తుంది. బలమైన సంధానం వాణిజ్యానికి అనుకూలంగా ఉండటం మాత్రమే కాకుండా విశ్వాసానికి, అభివృద్ధికి కూడా తలుపులను తెరుస్తుందని భారత్ ఎల్లవేళలా నమ్ముతోంది.

ఈ ఆలోచనతోనే చాబహార్ ఓడరేవు, ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ వంటి కార్యక్రమాల విషయంలో మనం ముందుకు పోతున్నాం. వీటి ద్వారా మనం అఫ్గానిస్తాన్‌తో పాటు మధ్య ఆసియాతో కూడా సంబంధాలను పెంచుకొనేందుకు వీలుంది.

సంధానాన్ని ఏర్పరిచే దిశగా సాగే ప్రతి ప్రయత్నంలో సార్వభౌమత్వం తో పాటు ప్రాదేశిక సమగ్రతా సిద్ధాంతాలను కూడా పరిరక్షించుకోవాలి. ఈ అంశాన్నే ఎస్‌సీవో చార్టర్ కీలక సిద్ధాంతాల్లోనూ  ప్రస్తావించుకొన్నాం.

సంధానం అనేది సార్వభౌమత్వానికి మించి ఎదిగితే, అంతిమంగా విశ్వాసం తో పాటు అర్ధాన్ని  కూడా నష్టపోతుంది.

గౌరవనీయులారా,

మూడో  స్తంభం ‘ఓ’.. అంటే అవకాశం. సహకరించుకోవడానికి, సంస్కరణలకు సంబంధించిన అవకాశం.

భారత్ అధ్యక్షత వహించిన 2023లో, ఎస్‌సీవోకు సరికొత్త ఉత్సాహం, ఆలోచనలు లభించాయి. అంకుర సంస్థలు, నవకల్పన, సాంప్రదాయ వైద్యం, యువతకు సాధికారత కల్పన, డిజిటల్ సమ్మిళితత్వాలతో పాటు మన ఉమ్మడి బౌద్ధ వారసత్వం.. ఇలాంటి కొత్త విషయాలను మన సహకార ప్రాధాన్య రంగాల్లో చేర్చుకున్నాం.
 
ఎస్‌సీవోను ప్రభుత్వాల పరిధికి మించి కూడా పనిచేయించే దిశగా తీసుకుపోవాలనేదే మన ప్రయత్నం. సామాన్య ప్రజానీకాన్ని, యువ శాస్త్రవేత్తలను, పండితులను, అంకుర సంస్థలను కూడా పరస్పరం సంధానించాలి.

మన దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పటిష్ట పరిచేందుకు ఇవాళ, నేను ఒక ప్రతిపాదన తీసుకురాదలిచాను. అది.. ఎస్‌సీవోలో భాగంగా ఒక సివిలిజేషనల్ డైలాగ్ ఫోరమ్ (నాగరికత ప్రధానమైన చర్చా వేదిక)ను ఏర్పాటు చేయాలి.. అనే ప్రతిపాదన. ఈ  వేదిక మన ప్రాచీన నాగరికతలు, కళలు, సాహిత్యాలతో పాటు మన సంప్రదాయాల గొప్పతనాన్ని కూడా ప్రపంచ వేదికపై పంచుకొనేందుకు మనకు తోడ్పడగలుగుతుంది.  

గౌరవనీయులారా,

ప్రస్తుతం, భారత్ సంస్కరణలను కొనసాగిస్తూ, చక్కని పనితీరును కనబరుస్తూ, మార్పును తీసుకురావాలనే ధ్యేయంతో ముందుకు కదులుతోంది. కోవిడ్ సంక్షోభం నుంచి ప్రపంచంలోని  ఆర్థిక అనిశ్చితుల వరకు, మేం సవాళ్లను అవకాశాలుగా మార్చుకొనేందుకు శ్రమించాం.

విస్తృత శ్రేణి సంస్కరణలను తీసుకువచ్చేందుకు మేం నిరంతరంగా కృషి చేస్తున్నాం. దీంతో దేశంలో అభివృద్ధితో పాటు అంతర్జాతీయ సహకారానికి కూడా కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. భారత ప్రగతి ప్రయాణంలో పాల్గొనాల్సిందిగా నేను మీ అందరినీ స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.

గౌరవనీయులారా,

కాలంతో పాటు ఎస్‌సీవో మారుతుండడం ఎంతో సంతృప్తినిస్తోంది. వ్యవస్థీకృత నేరం, మత్తుమందుల అక్రమ రవాణా, సైబర్ భద్రత ల వంటి ఈ కాలపు సవాళ్లను పరిష్కరించడానికి నాలుగు కొత్త  కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సంస్కరణల వైపు మొగ్గు చూపుతున్న ఈ విధానాన్ని మేం స్వాగతిస్తున్నాం.

ప్రపంచ సంస్థల్లో సంస్కరణలను తీసుకువచ్చే విషయంలో ఎస్‌సీవో సభ్యులు పరస్పర సహకారాన్ని ఇప్పటి కన్నా పెంచేందుకు అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి 80 వ వార్షికోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు తీసుకురావాలంటూ మనం ముక్తకంఠంతో విజ్ఞప్తి చేయొచ్చు.

అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలను కాలం చెల్లిన వ్యవస్థలు అంటూ గిరి గీయడమంటే అది భావి తరాలకు అన్యాయం చేస్తున్నట్లే. నవతరం వర్ణమయ స్వప్నాలను మనం నలుపు, తెలుపుల తెర మీద ప్రదర్శించలేం. తెరను మార్చాల్సిన అవసరముంది.
 
బహు పక్షవాదంతో పాటు సమ్మిళిత ప్రపంచ వ్యవస్థ ..  వీటి విషయంలో మార్గదర్శక భూమికను పోషించే అవకాశం ఎస్‌సీవోకు ఉంది. ఈ ముఖ్య అంశంపై ఈ రోజు ఒక ప్రకటనను విడుదల చేస్తుండడాన్ని నేను స్వాగతిస్తున్నాను .  

గౌరవనీయులారా,

మేం భాగస్వామ్య దేశాలన్నిటితోను సమన్వయ, సహకారాలతో ముందుకువెళ్తున్నాం. ఎస్‌సీవో తదుపరి చైర్మన్, కిర్గిజ్‌స్థాన్ అధ్యక్షుడు, నా స్నేహితుడైన శ్రీ జాపారోవ్‌కు నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
 
మీకందరికీ ధన్యవాదాలు.

గమనిక: ఇది ప్రధాని ప్రకటనకు సుమారు అనువాదం. ఆయన హిందీలో మాట్లాడారు.

 

***


(Release ID: 2162692) Visitor Counter : 2