ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశం

Posted On: 31 AUG 2025 1:58PM by PIB Hyderabad

టియాంజిన్‌లో ఈరోజు జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) నేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చైనా పీపుల్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

2024 అక్టోబరులో కజన్‌లో జరిగిన సమావేశం తర్వాత ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో వచ్చిన సానుకూల మార్పు, స్థిరమైన పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు. ఇరుదేశాలు అభివృద్ధి భాగస్వాములే తప్ప ప్రత్యర్థులు కాదనీ.. తమ మధ్య ఉన్న విభేదాలు వివాదాలుగా మారకూడదని కోరుకుంటున్నట్లు వారు పునరుద్ఘాటించారు. పరస్పర గౌరవం, ప్రయోజనం, సున్నితత్వం ఆధారంగా బలపడే భారత్-చైనా బంధం వారి 2.8 బిలియన్ల మంది ప్రజల సంక్షేమంతో ముడిపడి ఉందన్నారు. సుస్థిర సంబంధం, సహకారం ఇరుదేశాల అభివృద్ధికి, 21వ శతాబ్దపు ధోరణులకు తగిన బహుళ ధ్రువ ప్రపంచం.. బహుళ ధ్రువ ఆసియాకు అవసరమని వారు అభిప్రాయపడ్డారు.

ద్వైపాక్షిక సంబంధాల నిరంతర వృద్ధి కోసం సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత ప్రాముఖ్యతను ప్రధానమంత్రి స్పష్టం చేశారు. గత సంవత్సరం సరిహద్దుల నుంచి ఇరుదేశాల సైన్యం నిష్క్రమణ విజయవంతంగా పూర్తవడం.. అనంతరం సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని, ప్రశాంతతను కొనసాగించడం పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల రాజకీయ దృక్పథం, ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల ఆధారంగా ముందుకుసాగుతూ సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధించడం పట్ల నిబద్ధత వ్యక్తం చేశారు. ఈ నెల ప్రారంభంలో ఇరువురు ప్రత్యేక ప్రతినిధులు తమ చర్చల్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను ప్రస్తావిస్తూ ఆ ప్రయత్నాలకు మరింత మద్దతునివ్వడానికి అంగీకరించారు.

కైలాస్ మానససరోవర్ యాత్రను, పర్యాటక వీసాలను తిరిగి ప్రారంభించడం వంటి చర్యల ఆధారంగా.. నేరుగా విమానాలు నడపడం, వీసా ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయవలసిన అవసరాన్ని ఇరువురు నేతలు ప్రస్తావించారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాలను ప్రస్తావిస్తూ ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరీకరించడంలో ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థల పాత్రను వారు గుర్తించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను విస్తరించడానికి.. వాణిజ్య లోటును తగ్గించడానికి.. రాజకీయంగా, వ్యూహాత్మకంగా ముందుకు సాగవలసిన అవసరాన్ని వారు ప్రధానంగా ప్రస్తావించారు.

భారత్-చైనాలు రెండూ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తినే అనుసరిస్తాయని.. ఇరుదేశాల సంబంధాలను మూడో దేశం దృష్టితో చూడకూడదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉగ్రవాదం, న్యాయమైన వాణిజ్యం వంటి ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రాపంచిక సమస్యలు-సవాళ్లపై సమష్టి ప్రయత్నాలను విస్తరించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.

చైనా ఎస్‌సీవో అధ్యక్ష పదవికి, టియాంజిన్‌లో శిఖరాగ్ర సదస్సు నిర్వహణకు ప్రధానమంత్రి మద్దతును ప్రకటించారు. 2026లో భారత్ నిర్వహించనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనవలసిందిగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రధానమంత్రి ఆహ్వానించారు. ఈ ఆహ్వానం పట్ల అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బ్రిక్స్ అధ్యక్షత విషయంలో భారత్‌కు చైనా మద్దతు ఉంటుందని తెలిపారు.

చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు శ్రీ కాయ్ ఖితో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల పట్ల తమ దార్శనికతను ఆయనకు వివరించారు. ఇరువురు నేతల దార్శనికత సాకారం కోసం ఆయన మద్దతు కోరారు. ఇరువురు నేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయానికి అనుగుణంగా ద్వైపాక్షిక ఒప్పందాలను విస్తరించాలని, సంబంధాలను మరింత మెరుగుపరచాలనే చైనా పక్షం కోరికను ఈ సందర్భంగా శ్రీ కాయ్ ఖి పునరుద్ఘాటించారు.

 

 

***


(Release ID: 2162548) Visitor Counter : 2