ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రానున్న దశాబ్దంపై భారత్‌-జపాన్ ఉమ్మడి దృక్కోణం: ఎనిమిది లక్ష్యాలతో ప్రత్యేక వ్యూహాత్మక-ప్రపంచ భాగస్వామ్యానికి సారథ్యం

Posted On: 29 AUG 2025 7:10PM by PIB Hyderabad

ఇండో-పసిఫిక్ ప్రాంతంపై భార‌త్‌, జ‌పాన్‌ దేశాలది ఉమ్మ‌డి దృక్కోణం. ఈ ప్రాంతం చట్టబద్ధ పాలన సహిత స్వేచ్ఛ, సౌహార్ద‌ం, శాంతి, సౌభాగ్యాలతో ఘ‌ర్ష‌ణ ర‌హితంగా పురోగ‌మించాల‌న్న‌ది రెండు దేశాల అభిమతం. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు పరస్పర సహాయకారిగా మెలగుతాయి. వనరులు, సాంకేతికత, ఉత్పత్తి వ్యయం రీత్యా పోటీతత్వంలో రెండింటికీ ప్రత్యేక బలాలున్నాయి. దీంతోపాటు సుదీర్ఘ సుహృద్భావ, చారిత్రక స్నేహబంధం ఉన్నందువల్ల ఇకపైనా జంటగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. రాబోయే దశాబ్దంలో మన దేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మార్పులు, అవకాశాలు అందిరానున్నాయి. వీటన్నిటి సద్వినియోగం దిశగా సంయుక్త సారథ్యానికి మేం సిద్ధంగా ఉన్నామని సందర్భంగా ప్రకటిస్తున్నాం. జాతీయ లక్ష్యాల సాధనతో్పాటు మన దేశాలను, భవిష్యత్తరం పౌరులను మునుపటికన్నా చేరువ చేయడానికి మా నాయకత్వం తోడ్పడుతుంది.

భారత్‌-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం ఏర్పాటు ద్వారా రాబోయే దశాబ్దంలో మా జాతీయ ఆకాంక్షలు, సంకల్పాల సాకారం దిశగా నిర్దేశించుకున్న 8 లక్ష్యాలను అంతర్జాతీయ సమాజం ముందుంచుతున్నాం.

       I.       భవిష్యత్తరం ఆర్థిక భాగస్వామ్యం

ప్రపంచంలో 4, 5 స్థానాల్లోగల అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా పరస్పర ఆర్థిక-ద్రవ్య సామర్థ్యాల బలోపేతానికి మేం నిర్ణయించుకున్నాం. తద్వారా దిగువ పేర్కొన్న విధంగా మా వనరుల ఆదానప్రదానంతోపాటు విపణుల సామర్థ్యానికి ఉత్తేజమివ్వాలని సంకల్పించాం:

·    జపాన్‌ నుంచి భారత్‌కు 2022-2026 మధ్యకాలంలో  ¥5 ట్రిలియన్‌ మేర ప్రభుత్వ-ప్రైవేట్‌ పెట్టుబడులు సహా ఆర్థిక సహాయం లక్ష్యంలో ప్రగతి ప్రాతిపదికన ప్రైవేటు పెట్టుబడులకు ¥10 ట్రిలియన్ల కొత్త లక్ష్యం నిర్దేశించుకున్నాం.

·    భారత్‌-జపాన్ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సెపా) అమలును లోతుగా సమీక్షించి, ద్వైపాక్షిక వాణిజ్యం-పెట్టుబడుల మెరుగుదల వైవిధ్యీకరణకు చర్యలు చేపడతాం.

·    ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కోసం భారత్‌-జపాన్ పారిశ్రామిక పోటీతత్వ భాగస్వామ్యం (ఐజేఐసీపీ) ద్వారా రెండు దేశాల మధ్య పారిశ్రామిక సహకార విస్తృతికి కృషి చేస్తాం. ఈ మేరకు జపాన్ సంస్థలకు అవసరమైన అధిక నాణ్యత గల ఉత్పత్తుల ఆధారంగా భారత్‌లో ఉత్పత్తుల నాణ్యత ఉన్నతీకరణకు చర్యలు తీసుకుంటాం.

·    భారత్‌-జపాన్ ఫండ్ కింద కొత్త ప్రాజెక్టుల అన్వేషణ, భారత్‌లోని ‘గిఫ్ట్‌’ సిటీలోని అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రంలో జపాన్‌ కార్పొరేషన్లకు ప్రోత్సాహంసహా జపాన్‌లో భారత కీలక పారిశ్రామిక సంఘాలు, వాణిజ్య-పెట్టుబడి ప్రోత్సాహక సంస్థలు మరింత విస్తరించేందుకు కృషి చేస్తాం.

·    స్థానిక కరెన్సీ లావాదేవీలు సహా జపాన్, భారత్‌ మధ్య చెల్లింపు వ్యవస్థల సహకారం మరింత పెంచుతాం.

·    జపాన్‌లోని చిన్న-మధ్యతరహా పరిశ్రమ (ఎస్‌ఎంఈ)లను భారత్‌ సందర్శనకు ఆహ్వానించడం ద్వారా రెండు దేశాల్లోని ‘ఎస్‌ఎంఈ’ల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తాం. అలాగే, దిగువ స్థాయి పరిశ్రమల విస్తరణ సహా భారత్‌-జపాన్ ‘ఎస్‌ఎంఈ’ ఫోరమ్‌ను ప్రారంభిస్తాం.

·    విధానపరమైన చర్చలు, వాణిజ్య ఆదానప్రదానాల ద్వారా ఆహార భద్రతను,  వ్యవసాయ-వాణిజ్య సహకారాన్ని ప్రోత్సహిస్తాం. ఆదర్శ వ్యవసాయ క్షేత్రాల్లో ప్రదర్శనల ద్వారా పెట్టుబడులకు ఊతమిస్తాం. భారత్‌-జపాన్‌ వంటకాలకు సంబంధించి పాకశాస్త్ర ప్రవీణులను తీర్చిదిద్దుతాం.

·    ప్రైవేట్ రంగ సంస్థల మధ్య ‘ఐసీటీ’ సహకారం, వ్యాపార అవకాశాల అన్వేషణకు కృషి చేస్తాం.

వర్ధమాన దేశాలతో ఆర్థిక సంబంధాల బలోపేతం సహా ఆయా దేశాల వృద్ధి సామర్థ్య సద్వినియోగం కోసం మా ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందులో భాగంగా “ఆఫ్రికాలో సుస్థిర ఆర్థికాభివృద్ధి కోసం భారత్‌-జపాన్ సహకార కార్యక్రమం”  ప్రారంభం కావడంపై హర్షం ప్రకటిస్తున్నాం. ఈ లక్ష్యంతో భారత్‌, జపాన్‌ దార్శనిక కార్యక్రమాలు ‘మహాసాగర్‌’ (పరస్పర-సంపూర్ణ పురోగమనంతో ఈ ప్రాంత దేశాలన్నిటికీ భద్రత-వృద్ధి), ‘ఈఆర్‌ఐఐఓఏ’ (హిందూ మహాసముద్ర-ఆఫ్రికా ఆర్థిక ప్రాంత అభివృద్ధి) స్ఫూర్తితో భారత్‌లో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తాం. ఈ మేరకు దాని సారథ్యంలో వ్యాపారాలు-పెట్టుబడులకు ఊతమిస్తాం. అంతేకాకుండా దక్షిణాసియా, ఆఫ్రికాలోని ఇతర దేశాలతో వ్యాపార సహకారానికి నవ్యోత్తేజం దిశగా భారత్‌ను జపాన్‌ కంపెనీల కూడలిగా మారుస్తాం.

     II.       భవిష్యత్తరం ఆర్థిక భద్రత భాగస్వామ్యం

మా ద్వైపాక్షిక భాగస్వామ్యం ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్న నేపథ్యంలో భారత్‌-జపాన్ ఆర్థిక భద్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నాం. కీలక వస్తువులు, సామగ్రి సరఫరా శ్రేణిని బలోపేతం చేయడంలో దేశవ్యాప్త ఏకోన్ముఖ కృషి ద్వారా వ్యూహాత్మక సహకారానికి ఊతమివ్వడం దీని లక్ష్యం. దీంతో మార్కెట్ వైవిధ్యం పెరగడమే కాకుండా ప్రైవేట్ రంగం సారథ్యం సహా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన సహకార విస్తృతికి కిందివిధంగా దోహదం చేస్తుంది:

·    వ్యూహాత్మక వాణిజ్యం-సాంకేతికత సహా ఆర్థిక భద్రతపై ప్రభుత్వ, వాణిజ్య రంగాల మధ్య చర్చల ద్వారా సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, ఔషధాలు, జీవ-సాంకేతికత టెలికమ్యూనికేషన్, కాలుష్యరహిత ఇంధనం, నవ్య, వర్ధమాన పరిజ్ఞాన రంగాల్లో నిర్దిష్ట ప్రాజెక్టుల గుర్తింపు అమలు.

·    పైన పేర్కొన్న రంగాలన్నిటా తాజా పరిణామా ఆధారిత ఉత్తమ పద్ధతులపై విధాన దృక్కోణాలు, నిఘా, సమాచార ఆదానప్రదానం.

·    ఖనిజ వనరుల రంగంలో సహకార ఒప్పందం, భారత్‌-జపాన్ డిజిటల్ భాగస్వామ్యం 2.0, సెమీకండక్టర్ సరఫరా శ్రేణి భాగస్వామ్యంపై సహకార ఒప్పందం తదితర విధానాల ద్వారా పునరుత్థాన సరఫరా శ్రేణులు, మార్కెట్ వైవిధ్యీకరణపై సహకారానికి ప్రోత్సాహం.

·    “జేఈటీఆర్‌ఓ, సీఐఐ, జేసీసీఐఐ”ల ద్వారా ఆర్థిక భద్రత సహకారంపై సంయుక్త కార్యాచరణ ప్రణాళికకు మద్దతు ద్వారా ప్రైవేట్ రంగ సారథ్యంలో సహకార విస్తృతికి ప్రోత్సాహం.

·    ఆర్థిక భద్రతపై భారత్‌-జపాన్ చర్చల పరిధిలో ఇదే అంశంపై భారత్‌-జపాన్ ప్రైవేట్ రంగ సంస్థల మధ్య చర్చలకు నాంది పలకడం సహా పైన పేర్కొన్న కార్యాచరణ ప్రణాళికను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన వ్యూహాత్మక వాణిజ్య-సాంకేతిక చర్చలపైనా ఉభయ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి.

·    కృత్రమ మేధ (ఏఐ)పై ద్వైపాక్షిక-బహుళపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడంతోపాటు వినూత్న-విశ్వసనీయ ‘ఏఐ’ వ్యవస్థ వృద్ధి లక్ష్యంగా జపాన్-భారత్‌ ‘ఏఐ’ సహకార కార్యక్రమం (జేఏఐ) అమలు.

·    అన్నివిధాలా సమతుల బ్యాటరీ విపణితోపాటు సముచిత వ్యవస్థను రూపుదిద్దే దిశగా భారత్‌-జపాన్ బ్యాటరీ సరఫరా శ్రేణి మధ్య సహకారానికి ప్రోత్సాహం.

  III.       భవిష్యత్తరం రవాణా

జపాన్‌ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారత ప్రతిభ శక్తిసామర్థ్యాల వినియోగంతో మౌలిక సదుపాయాలు, రవాణా రంగ సౌకర్యాలు, రవాణాలో సమగ్ర సహకారం చట్రం కింద “భవిష్యత్తరం రవాణా భాగస్వామ్యం (ఎన్‌జీఎంపీ) ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా భారత్‌లో అధిక డిమాండ్గల రవాణా రంగ సవాళ్లకు సంయుక్తంగా పరిష్కారాన్వేషణ చేపడతాం. అలాగే ‘మేక్ ఇన్ ఇండియా- మేక్‌ ఫర్ ది వరల్డ్’ దృక్కోణానుగుణ ‘ఎన్‌జీఎంపీ’, సంబంధిత పరిశ్రమల వృద్ధికి సారథ్యం వహించడం మా లక్ష్యం. డిజిటల్-స్మార్ట్ టెక్నాలజీల వినియోగం, సుస్థిర- పర్యావరణ హిత పద్ధతులపై దృష్టి సారించడం, భద్రతతోపాటు విపత్తు పునరుత్థానానికి ప్రాధాన్యం తదితరాలు కూడా మా లక్ష్యాల్లో భాగం. అలాగే, దిగువన పేర్కొన్నవే కాకుండా ఇతరత్రా రంగాల్లో సహకారానికిగల అవకాశాలను అన్వేషిస్తాం:

·    రైల్వే రంగంలో ఇప్పటికేగల సహకారం ప్రాతిపదికగా “మేక్ ఇన్ ఇండియా” భవిష్యత్తరం రోలింగ్‌ స్టాక్‌, ఫంక్షనల్ సిగ్నలింగ్, ఆపరేషనల్ కంట్రోల్ సిస్టమ్స్, సీస్మిక్-ప్రూఫింగ్, ఏఐ ఆధారిత నిర్వహణ-పర్యవేక్షణ, రైల్వే రంగంలో ఇంధన మార్పిడి, ఆధునిక మెట్రో రైలు వ్యవస్థలు, మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్ సహా హైస్పీడ్‌ రైలు వ్యవస్థలపై దృష్టి సారించాం.

·    సమీకృత స్టేషన్ ప్రాంత అభివృద్ధి, ఒక సేవగా రవాణా సేవల వేదికలు, ఇంటర్-సిటీ రోడ్ నెట్‌వర్కులు, రెండువైపులా సంధానం ద్వారా రవాణా ఆధారిత అభివృద్ధి, వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ (పీఆర్‌టీ) వంటి స్వల్ప స్థాయి స్వయంచలిత పట్టణ రవాణాను కూడా దృష్టిలో ఉంచుకున్నాం.

·    అత్యాధునిక నగరాలు, నగరాల్లో కర్బన ఉద్గార నివారణ, ట్రాఫిక్ రద్దీ సహా వాయు కాలుష్య సవాళ్ల పరిష్కారం దిశగా అధునాతన నమూనాలతో ప్రణాళికల రూపకల్పన.

·    రవాణా రంగంలో భద్రత, విశ్వసనీయతకు భరోసా ఇస్తూ సాఫ్ట్‌ వేర్ ఆధారిత వాహనాలతో నడిచే అనుసంధానిత సాంకేతికతల ద్వారా రవాణా రంగంలో డేటా వినియోగంపై దృష్టి.

·    ఆటోమొబైల్స్, విమానాలు, రవాణా నౌకల తయారీసహా సుస్థిర ఇంధన వినియోగం, పర్యావరణ హిత ఇంధన నిల్వ సదుపాయాల ఉపయోగం, రవాణా మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రాధాన్యం.

·    ఆహారం, ఔషధ రవాణా కోసం శీతల గిడ్డంగుల శ్రేణి సేవలపై శ్రద్ధ.

·    విపత్తులపై అవగాహన కల్పన కోసం పట్టణ ప్రణాళిక-అభివృద్ధి విభాగం పరిధిలో ‘3డీ’ నగర నమూనాల వినియోగం సహా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజానీకాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై మార్గదర్శక ప్రణాళికల రూపకల్పన.

పైన పేర్కొన్న ఉత్పత్తులను భారత్‌లో తయారు చేయడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసే దిశగా భారత్‌-జపాన్‌ కంపెనీల మధ్య సహకారాన్ని చురుగ్గా ప్రోత్సహిస్తాం. ఈ రవాణా పరిష్కారాల రూపకల్పన, కార్యకలాపాలు-నిర్వహణ కోసం నిపుణ సిబ్బందిని తీర్చిదిద్దడం లక్ష్యంగా సాంకేతిక శిక్షణ, మానవ వనరుల ఆదానప్రదానం ద్వారా భారత్‌లో సామర్థ్య వికాసానికీ ప్రాధాన్యమిస్తాం.

మరోవైపు పునరుత్థాన సదుపాయాల కల్పన, విపత్తు ముప్పు తగ్గింపు లక్ష్యంగా విపత్తు ముప్పు తగ్గింపుపై ‘సెండై చట్రం’ వంటి బహుళపాక్షిక విధానాల్లో సహకార విస్తృతిని కూడా ప్రధానాంశాల్లో చేర్చాలని నిశ్చయించుకున్నాం.

 IV.       భవిష్యత్తరం పర్యావరణ వారసత్వాలు

“ఒకే భూగోళం-ఒకే భవిష్యత్తు” అనే మా దృక్పథాన్ని ఆచరణలోకి తేవాలన్నది మా లక్ష్యం. ఈ దిశగా భావితరాల కోసం సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనకు ప్రాధాన్యమిస్తాం. అలాగే, పరస్పర సహకారంతో రెండు దేశాల్లో వాతావరణ మార్పు, ఇంధన మార్పిడి, వ్యర్థాల తగ్గింపు, నికర-శూన్య ఉద్గార లక్ష్యాల సాధనకు కిందివిధంగా కృషి చేస్తాం:

·    ‘మిషన్ లైఫ్’ ద్వారా ఇంధన భద్రత, స్వల్ప కర్బన ఉద్గారసహిత ఆర్థిక వృద్ధి, సుస్థిర సమాజాలు-జీవనశైలికి భరోసా.

·    నికర-శూన్య ఉద్గార ఆర్థిక వ్యవస్థ సాకారం కోసం రెండు దేశాల్లో జాతీయ పరిస్థితులను ప్రతిబింబించే వివిధ పరిష్కార మార్గాలు.

·    భారత్‌-జపాన్ కాలుష్యరహిత ఇంధన భాగస్వామ్యం కింద ద్వైపాక్షకిక చర్చల ద్వారా ఇంధన సహకార విస్తృతి.

·    వ్యర్థం నుంచి ఇంధనం దిశగా సాంకేతికతలు, వ్యర్థాల విభజన-రీసైక్లింగ్ పద్ధతులపై సహకారం ద్వారా వర్తుల ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం.

·    వ్యవసాయ ఉత్పాదకతను పెంచే సుస్థిర వ్యవసాయ పద్ధతులు, వాతావరణ ఉపశమన సాంకేతికతలకు ప్రోత్సాహం, సముద్ర-తీరప్రాంత వ్యవస్థల రక్షణ, సుస్థిర అటవీ నిర్వహణ-జీవవైవిధ్య పరిరక్షణ, వ్యవసాయ అటవీ పెంపకం, వెదురువంటి సహజ వనరుల సుస్థిర వినియోగం.

·    కాలుష్యరహిత ఇంధనం, ఉద్గారాలు-కాలుష్యం తగ్గింపుపై సహకారం. ఇందుకోసం “జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం (జేసీఎం), ఇనిషియేటివ్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ మొబిలిటీ అండ్ ఇన్ఫ్రా ఫర్ నెక్స్ట్-జనరేషన్ (ఐసీఈఎంఏఎన్‌), గ్రీన్ హైడ్రోజన్ వాల్యూ చైన్” ఏర్పాటు. దీంతోపాటు ఉద్గారాలపై అంచనా కోసం ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞాన  వినియోగం వంటి కార్యక్రమాలు చేపట్టడం.

·    ‘లీడర్‌షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ (లీడ్‌ఐటి) గ్రూప్’ వంటి బహుళపాక్షిక వ్యవస్థల దిశగా మరింత కృషి.

    V.       భవిష్యత్తరం సాంకేతికత-ఆవిష్కరణల భాగస్వామ్యం

నవ్య సాంకేతిక పరిజ్ఞానాల వాణిజ్యీకరణను వేగిరపరచడంపై మా లక్ష్యం దిశగా ప్రాథమిక విజ్ఞానశాస్త్రాల్లో పరిశోధనలతోపాటు వివిధ రంగాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి పరస్పర శాస్త్ర-సాంకేతిక సామర్థ్యాలు, సంస్థలు, మానవ వనరులను కిందివిధంగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాం:

·    కెఇకె, సుకుబా వద్ద ఇండియన్ బీమ్‌లైన్ ద్వారా ప్రాథమిక పరిశోధనలో సహకారం, క్వాంటం సాంకేతికతలు, భావితరం పరిశోధన ఉపకరణల రూపకల్పన కోసం హై-పెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్.

·    జపాన్ ప్రారంభించిన ‘జపాన్-ఇండియా స్టార్టప్ సపోర్ట్ ఇనిషియేటివ్’ (జేఐఎస్‌ఎస్‌ఐ) ద్వారా సార్వత్రిక ఆవిష్కరణలు, సామాజిక సమస్యల పరిష్కారం, ఆధునిక సాంకేతికత, డేటా-వినియోగం, ఇంక్యుబేషన్-ఫైనాన్స్‌ సహకారం, ఆవిష్కరణావరణ వ్యవస్థల అనుసంధానం, రెండు దేశాలలో అంకుర సంస్థల వ్యాపార కార్యకలాపాల విస్తరణ సౌలభ్యం కల్పన.

·    “భారత్‌-జపాన్ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌” ద్వారా కృత్రిమ మేధ రంగంలో ఉన్నవి సహా అంకుర సంస్థల కోస నిధుల సమీకరణ.

·    భారత్‌-జపాన్ ఐసీటీ సహకార చట్రం కింద సంయుక్త కార్యాచరణ బృందం ద్వారా సహకారానికి ప్రోత్సాహం.

·    లూనార్-పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ (లూపెక్స్‌) మిషన్ ద్వారా అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సహకారం మెరుగుదల. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ వాణిజ్య సంస్థలు, అంకుర సంస్థల మధ్య సంబంధాలకు సౌలభ్యం కల్పన.

·    ఐటీఈఆర్‌, చిన్న మాడ్యులర్, అధునాతన రియాక్టర్లపై సంయుక్త పరిశోధన సహా విచ్ఛిత్తి-సంలీన సాంకేతికతలపై చర్చలు.

·    జి-20 న్యూఢిల్లీ తీర్మానం, ‘భావితరం వ్యవసాయ సాధికారత కోసం ఆవిష్కరణలకు ప్రోత్సాహం’ (ఏఐ-ఎంగేజ్‌) కార్యక్రమాలకు అనుగుణంగా చిరుధాన్యాలపై సహా ఆహార సాంకేతికత, వ్యవసాయ శాస్త్ర రంగాల్లో సంయుక్త పరిశోధన.

 VI.       భావితరం ఆరోగ్య రంగంలో పెట్టుబడులు

క్లినికల్-వైద్య పరిశోధన రంగంలో సహకార విస్తృతికి సంయుక్త ప్రోత్సాహం, మహమ్మారులతోపాటు భవిష్యత్‌ ఆరోగ్య సవాళ్ల పరిష్కారం, చౌకధరతో ప్రాణరక్షక ఔషధాల లభ్యతకు భరోసా, సంప్రదాయ-ప్రత్యామ్నాయ వైద్య సామర్థ్య వినియోగంతో రెండు దేశాల ప్రజారోగ్యం, శ్రేయస్సు లక్ష్యంగా సంపూర్ణ సామర్థ్య సద్వినియోగానికి కిందివిధంగా పెట్టుబడులు పెట్టాలన్నది మా లక్ష్యం:

·    భారత్‌లో అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ జపాన్ ‘ఆసియా హెల్త్ అండ్ వెల్‌బీయింగ్’ కార్యక్రమాలు సహా ప్రపంచ ఆరోగ్య రంగంలో సహకార బలోపేతం.

·    క్రమం తప్పకుండా సంయుక్త కమిటీ సమావేశాల నిర్వహణ ద్వారా సహకారానికి అవకాశంగల మరిన్ని రంగాల గుర్తింపు.

·    వృద్ధాప్య వైద్యం, మూలకణ చికిత్స, పునరుత్పత్తి వైద్యం, జన్యు చికిత్స, సింథటిక్ బయాలజీ, కేన్సర్ చికిత్స, డిజిటల్ ఆరోగ్యం-ఆటోమేటెడ్ డయాగ్నస్టిక్ సొల్యూషన్స్ వంటి వర్ధమాన రంగాలపై సంయుక్త పరిశోధన.

·    ‘సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ’ (యూహెచ్‌సీ) కార్యక్రమాన్ని వేగిరపరచడంపై “యూహెచ్‌సీ నాలెడ్జ్ హబ్”తో సహకారం దిశగా కృషి.

·    వైద్య సంస్థల మధ్య మరింత సహకారంతో వైద్య నిపుణుల ఆదానప్రదానానికి ప్రోత్సాహం సహా వారికోసం ‘ఫెలోషిప్‌’కు శ్రీకారం.

·    రెండు దేశాల్లో కీలక ఔషధాలు, ‘ఏపీఐ’లు వైద్య పరికరాల సరఫరా సౌలభ్యంతోపాటు మౌలిక వైద్య సదుపాయాల బలోపేతం.

·    భారత్‌లోని ఆయుష్ మంత్రిత్వ శాఖ మద్దతుతో జపాన్‌లో యోగా, ధ్యానం, ఆయుర్వేదం, సంపూర్ణ ఆరోగ్య విధానాలను ప్రోత్సహించే నైపుణ్య కేంద్రాల ఏర్పాటు.

VII.       ప్రజల మధ్య భావితరం భాగస్వామ్యం

రెండు దేశాల మధ్య చారిత్రక-సాంస్కృతిక సంబంధాలను గుర్తిస్తూ, ఆర్థిక-జనాభా పరమైన  సవాళ్లను పరిష్కరించడంలో మన మానవ వనరుల సామర్థ్య వినియోగానికి కృషి చేయడంతోపాటు కిందివిధంగా ప్రజల మధ్య సంబంధాలు ఇనుమడించేలా చూడాలన్నది మా సంకల్పం:

·    భారత్‌-జపాన్ మధ్య మానవ వనరుల ఆదానప్రదానం, సహకారం దిశగా కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం. రాబోయే ఐదేళ్లలో రెండువైపులా 5,00,000 మందికిపైగా సిబ్బంది రాకపోకలు దీని లక్ష్యం. ఈ మేరకు భారత్‌ నుంచి జపాన్‌కు 50,000 మంది నిపుణ సిబ్బంది, భావి ప్రతిభావంతులు వెళ్తారు.

·    ‘జపాన్-ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్’ (జేఐఎం), ‘జపనీస్ ఎండోడ్ కోర్సులు’ (జేఈసీ) కార్యక్రమాల ప్రగతి ప్రాతిపదికగా ‘భారత్‌-నిప్పాన్ ప్రోగ్రామ్ ఫర్ అప్లైడ్ కాంపిటెన్సీ ట్రైనింగ్’ (ఇన్‌ప్యాక్ట్‌) కింద భారత్‌లో విదేశీ సహకారాధారిత కోర్సులు, వృత్తి శిక్షణా కార్యక్రమాల విస్తరణ సహా జపాన్‌లో భారత సిబ్బందికి శిక్షణ.

·    ‘ఇండియా-జపాన్ టాలెంట్ బ్రిడ్జ్’ (ఐటీజేబీ) కింద జపాన్‌లోని ‘ఎంఈటీఐ’ ద్వారా రెండు దేశాల మధ్య ప్రతిభా ప్రవాహానికి ప్రోత్సాహం దిశగా ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు. దీనిద్వారా ఉపాధి ప్రోత్సాహక, ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాలు, ఉపాధి సర్వేలు, సమాచార విస్తరణకు శ్రీకారం.

·    జపాన్‌లోని ‘ఎంఈఎక్స్‌టీ'’ద్వారా ‘సాకురా సైన్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’, ‘లోటస్‌ ప్రోగ్రామ్’, ‘హెచ్‌ఓపీఈ’ సమావేశాల నిర్వహణ. ఇంటర్-యూనివర్శిటీ ఎక్స్ఛేంజ్ ప్రాజెక్ట్ ద్వారా పరిశోధకులు-విద్యార్థుల ఆదానప్రదానం బలోపేతం. ‘ఎడ్యూ-పోర్ట్ జపాన్’ కార్యక్రమం ద్వారా విద్యారంగంలో సహకారానికి మద్దతు.

·    భారత్‌లోని ‘ఇ-మైగ్రేట్ పోర్టల్’, ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల’ ద్వారా సంస్థాగత సహకారం, పని ప్రదేశాల మెరుగుదల.

·    పరస్పర సాంస్కృతిక వారసత్వ ప్రదర్శనల ద్వారా ద్వైపాక్షిక పర్యాటక రాకపోకల పెంపు.

·    జపాన్‌ భాషా ఉపాధ్యాయులకు శిక్షణ అవకాశాల విస్తరణ సహా జపాన్‌ భాషా విద్యా సంస్థ నుంచి నిపుణులను పంపడం ద్వారా పాఠ్యాంశాలు-సరంజామా రూపకల్పనకు  మద్దతు.

·    భారత్‌లోని జపాన్‌ భాషా ఉపాధ్యాయులు, విద్యార్థులకు చేయూత కోసం “నిహోంగో పార్ట్‌ నర్స్‌”, జపాన్ భాషా బోధక సహాయకులను భారత్‌ పంపడం.

VIII.       రాష్ట్రాల స్థాయి భావితరం భాగస్వామ్యం

పైన పేర్కొన్న అన్ని సంకల్పాల సాకారంలో భారత రాష్ట్రాలు-జపాన్‌ ప్రిఫెక్చర్లు (రాష్ట్రాల వంటివి) పోషించే కీలక పాత్రకు ప్రాధాన్యం. తదనుగుణంగా భారత్‌-జపాన్‌ భాగస్వామ్యంపై మరింత సమగ్ర దృక్పథం దిశగా కిందివిధంగా వాటి శక్తిసామర్థ్యాలను వినియోగించుకోగల వేదికలను సృష్టించాలన్నది మా లక్ష్యం:

·    పరస్పర వనరుల నిధులు, చారిత్రక సంబంధాల ప్రాతిపదికన కొత్త ‘సిస్టర్-సిటీ’, స్టేట్-ప్రిఫెక్చర్ భాగస్వామ్యాలకు ప్రోత్సాహం.

·    భారత, జపాన్ దేశాల్లోని నగరాల మధ్య ప్రత్యక్ష విమాన అనుసంధానం పెంపు.

·    చిన్న-మధ్య తరహా సంస్థలు సహా వాణిజ్య-వ్యాపార భాగస్వామ్యాల బలోపేతం. స్థానిక పరిశ్రమల పునరుద్ధరణ, భారత్‌-కాన్సాయ్ వ్యాపార వేదిక ద్వారా ప్రాంతీయాభివృద్ధికి ప్రోత్సాహం. అదేవిధంగా భారత్‌-క్యుషు మధ్య ఇదేతరహా భాగస్వామ్యం అవకాశాల అన్వేషణ.

·    భారత్‌, జపాన్‌లలో ప్రాంతీయ అవకాశాలపై రాష్ట్రాలు, ప్రిఫెక్చర్‌ల మధ్య మరింత సమాచార ఆదానప్రదానం సౌలభ్యంతోపాటు ఉమ్మడి సవాళ్లకు పరిష్కారాన్వేషణ, ఉత్తమ పద్ధతుల పరస్పరానుసరణ.

·    భారత్‌-జపాన్‌ విదేశాంగశాఖ మంత్రిత్వశాఖల సంయుక్త నాయకత్వంలో ఏటా 3వంతున రాష్ట్రాలు-ప్రిఫెక్చర్‌ స్థాయి ప్రతినిధుల సందర్శనలకు ప్రోత్సాహం.

ద్వైపాక్షిక సంబంధాలు 8వ దశాబ్దంలో ప్రవేశించిన సందర్భంగా పైన పేర్కొన్న 8 లక్ష్యాల దిశగా కృషి ద్వారా భారత్‌-జపాన్ జనాధారిత భాగస్వామ్యంలో ప్రగతిశీల మార్పులకు నాంది పలికినట్లు కాగలదు. భవిష్యత్తరాలకు ఇది విస్పష్ట ప్రయోజనాలు, సహకార అవకాశాలను అందుబాటులోకి తేవాలని మేం ఆకాంక్షిస్తున్నాం.

జపాన్ ప్రధానమంత్రి శ్రీ ఇషిబా షిగేరు ఆహ్వానం మేరకు ఆగస్టు 29-30 తేదీలలో టోక్యోలో నిర్వహిస్తున్న వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాబోయే దశాబ్దంపై ఉమ్మడి దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ ఈ పత్రాన్ని మేం ఆమోదిస్తున్నాం.

 

***


(Release ID: 2162145) Visitor Counter : 33