హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూ ఢిల్లీలో జరిగిన రెండు రోజుల ‘వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ (వీవీపీ)’సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన కేంద్ర హోంశాఖ, సహకార మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పినట్లు, జనాభా వలస ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశం. సరిహద్దు గ్రామాల జిల్లాల కలెక్టర్లు దీన్ని తమ బాధ్యతగా భావించాలి.

వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం (వీవీపీ)ను మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. సరిహద్దు గ్రామాల నుంచి వలసలను అడ్డుకోవడం, 100 శాతం మౌలిక సదుపాయాల సమృద్ధిని సాధించడం దీని లక్ష్యం.

ఈ కార్యక్రమం ద్వారా సరిహద్దు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, సంస్కృతిని పరిరక్షించి మెరుగుపరచడం, పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందివ్వడంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.

సరిహద్దు గ్రామాల్లో జిల్లా కలెక్టర్‌లు పాల డెయిరీ సహకార సంఘాలు ఏర్పాటు చేసి, ఈ పాలను సీఏపీఎఫ్‌, సైన్యానికి సరఫరా చేయాలి.

సరిహద్దుల్లో కనీసం 30 కిలోమీటర్ల పరిధిలో ఆక్రమణలు లేకుండా చూడాలి.

వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ కారణంగా అరుణాచల్ ప్రదేశ్‌ సరిహద్దు గ్రామాల్లో జనాభా పెరగడం సరిహద్దు గ్రామాలకు ఒక సానుకూల అంశం.

దేశ పౌరులు తమ గ్రామాలను వదిలి పోకుండా చూసుకోవడం, గ్రామాల జనాభా పెరిగేలా చర్యలు తీసుకోవడం కలెక్టర్ల బాధ్యత.

హోమ్ స్టే లాంటి ప్రయోగాలను ప్రతి గ్రామానికి విస్తరించి, బు

Posted On: 26 AUG 2025 1:40PM by PIB Hyderabad

రెండు రోజుల వైబ్రెంట్‌ విలేజెస్ ప్రోగ్రామ్ (VVP) సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ, సహకార మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. న్యూఢిల్లీలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ , సరిహద్దు నిర్వహణ విభాగం దీనిని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా  వైబ్రెంట్‌ విలేజెస్ ప్రోగ్రామ్ లోగోను కూడా ఆవిష్కరించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్, హోం కార్యదర్శి ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, సరిహద్దు నిర్వహణ కార్యదర్శి, వీవీపీ తొలి, రెండో దశలోని సరిహద్దు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సరిహద్దు రక్షణ కోసం మోహరించిన భద్రతా దళాల డైరెక్టర్ జనరల్‌లు, సంబంధిత జిల్లాల జిల్లా కలెక్టర్లతోపాటు పాటు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.

వైబ్రెంట్‌ విలేజెస్ ప్రోగ్రామ్ మూడు కీలక అంశాలపై ఆధారపడి ఉందని కేంద్ర హోంమంత్రి  అమిత్ షా తన ప్రసంగంలో పేర్కొన్నారు. అవి సరిహదు గ్రామాల నుంచి వలసలను అరికట్టడం, సరిహద్దు గ్రామాల్లోని ప్రతి పౌరుడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నూటికి నూరు శాతం అందేలా చూడటం, వీవీపీ కింద ఉన్న గ్రామాలను సరిహద్దు, జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి బలమైన వ్యవస్థగా అభివృద్ధి చేయడం. వైబ్రెంట్‌ విలేజెస్ ప్రోగ్రామ్ ఆలోచనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి వివరించినప్పుడు దీనిని దశలవారీగా అమలు చేయాలని ఆయన నిర్ణయించారని అమిత్‌ షా తెలిపారు. ప్రతి సరిహద్దు గ్రామంలో అన్ని సౌకర్యాలు కల్పించడమే కాకుండా,అక్కడ నివసించే ప్రతి పౌరుడికి, వారి జీవితాలను మెరుగుపరచడానికి కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని పథకాలను చేరుస్తారు. అంతేగాక ఈ గ్రామాలను దేశ, సరిహద్దుల భద్రతకు బలమైన సాధనాలుగా అభివృద్ధి చేస్తారు. దేశంలోని చివరి గ్రామాన్ని మొదటి గ్రామంగా గుర్తించడం ద్వారా సరిహద్దు గ్రామాల పట్ల మన దృక్పథాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చారని అమిత్‌ షా తెలిపారు.

వైబ్రెంట్‌ విలేజెస్ ప్రోగ్రామ్ కింద ముందుగా గుర్తించిన గ్రామాలు రాబోయే సంవత్సరాల్లో దేశం, సరిహద్దుల భద్రతలో కీలక సాధనాలుగా మారుతాయని అమిత్ షా అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి సంస్కృతిని పరిరక్షించడానికి, మెరుగుపరచడానికి, పర్యాటకం ద్వారా ఉపాధిని కల్పించేందుకు, గ్రామీణ జీవితాన్ని అన్ని విధాలా చైతన్యపరిచేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్‌లో చేర్చిన గ్రామాల జిల్లా కలెక్టర్‌లు, అన్ని కేంద్ర సాయుధ పోలీసు దళాలు ఈ కార్యక్రమానికి మాత్రమే పరిమితం కాకుండా, దీని లక్ష్యాలను సాధించేందుకు అదనంగా ఏ చర్యలు తీసుకోవచ్చో ఆలోచించాల్సిన బాధ్యత వారిపై ఉందని అమిత్‌ షా పేర్కొన్నారు. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సమిష్టిగా పనిచేయడం అవసరమని ఆయన తెలిపారు. ఈ సరిహద్దు గ్రామాలను దేశ భద్రతకుముఖ్య ప్రాధాన్యత కలిగిన సాధనాలుగా మార్చడానికి అందరూ కలిసి పనిచేయడం చాలా అవసరమని తెలిపారు.

వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ లక్ష్యాన్ని ఆచరణలోకి తీసుకురావాలంటే ప్రభుత్వ పథకాలను 100 శాతం అందించడం పర్యాటకానికి అవసరమైన ప్రజా సౌకర్యాలను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి సహకార సంస్థలను ప్రోత్సహించడం అవసరమని అమిత్ షా పేర్కొన్నారు. హోమ్‌స్టేల వంటి కార్యక్రమాలను సరిహద్దు గ్రామాలకు విస్తరించడం, బుకింగ్‌ల కోసం  రాష్ట్ర పర్యాటక శాఖలు సరైన ఏర్పాట్లు చేయడం వల్ల సరిహద్దు గ్రామాల్లోని ప్రతి ఇంటికి ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు. జిల్లాలతో కలిసి ఈ గ్రామాల గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖలు కృషి చేయాలని  తెలిపారు. ఈ గ్రామాల గౌరవాన్ని నిలబెట్టడానికి రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖలు కృషి చేయాలని, ఈ ప్రయత్నంలో జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. గ్రామాల్లో అన్ని సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు ఉంటే, స్థానికులు వలస వేళ్లేందుకు ఇష్టపడరని అన్నారు. పౌరులు తమ గ్రామాలను విడిచిపెట్టకుండా, వలసలను అరికట్టి, గ్రామ జనాభా  పెరిగేలా  జిల్లా యువ కలెక్టర్లు చూసుకోవాలని హోం మంత్రి అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం అమలు చేసిన తర్వాత అనేక సరిహద్దు గ్రామాల్లో జనాభా పెరిగిందని కేంద్రమంత్రి అమిత్‌షా తెలిపారు. గ్రామాల వైపు తిరిగి వలస వెళ్లే ధోరణి సరైన దిశలో సాగుతోందనేది.. దేశంలోని అన్ని సరిహద్దు గ్రామాలకు ఒక సానుకూల సందేశమని చెప్పారు.

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి మాట్లాడుతూ.. వలసలు దేశ భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని పేర్కొన్నట్లు అమిత్ షా తెలిపారు. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్‌లో చేర్చిన జిల్లాల కలెక్టర్లు ఈ అంశంపై భాద్యతతో వ్యవహరించి, పూర్తి వివరాలను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పులు దేశ, సరిహద్దుల భద్రతపై నేరుగా ప్రభావం చూపిస్తాయని తెలిపారు. ఇవి భౌగోళిక పరిస్థితుల వల్ల జరుగుతున్నాయని అనుకోరాదని, ఉద్దేశపూర్వకంగా రచించిన వ్యూహంలో భాగంగా జరుగుతోందని స్పష్టంగా తెలిపారు. ఈ అంశంపై రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర సాయుధ పోలీసు దళాలుకూడా సమగ్ర దృష్టితో స్పందించాలని హోం మంత్రి పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పథకాలను 100 శాతం పౌరులకు అందించేందుకు జిల్లా కలెక్టర్లు, కేంద్ర సాయుధ పోలీసు దళాలతో సమన్వయం చేసుకోగలరా లేదా అనే విషయాన్ని పరిగణన లోకి తీసుకోవాలని అమిత్‌షా పేర్కొన్నారు.   ఆరోగ్యం, క్రీడలు, విద్యా రంగాలలో సీఏపీఎఫ్‌లు సహాయం అందించగలవని ఆయన అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో వైబ్రెంట్ గ్రామాల నుంచి పాలు, కూరగాయలు, గుడ్లు, ధాన్యాలు వంటి రోజువారీ నిత్యావసరాలను కొనుగోలు చేయడంలో ఐటీబీపీ ప్రయోగం విజయవంతమైందని పేర్కొన్నారు. ప్రతి సరిహద్దు గ్రామంలో ఈ ప్రయోగాన్ని అమలు చేయవలసిన అవసరాన్ని ఆయన తెలియజేశారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ,  రక్షణ మంత్రిత్వ శాఖ సమన్వయంతో సరిహద్దుల వద్ద మోహరించిన సైన్యం వైబ్రెంట్ గ్రామాలలో ఉపాధిని సృష్టించే బాధ్యతను తీసుకోవాలని అన్నారు.

గ్రామాల నుంచి సీఏపీఎఫ్‌, సైన్యానికి కావాల్సిన పాల అవసరాలను తీర్చేందుకు పాడి సహకార సంఘాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను కేంద్ర సాయుధ పోలీసు దళాలు, జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఇది ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది అని ఆయన అన్నారు. ఈ ప్రయోగాన్ని ఒక ప్రామాణిక మోడల్‌గా అభివృద్ధి చేసి, ప్రతి వైబ్రెంట్ విలేజ్‌లో అమలు చేయాలని సూచించారు. దీనిలో హోం మంత్రిత్వ శాఖ, అన్ని సీఏపీఎఫ్‌లు, సైనికులు, జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని ఆయన స్పష్టం చేశారు. ఉపాధి కల్పన జరిగినప్పుడు వలసలు వాటంతట అవే తగ్గిపోతాయని అన్నారు.

సరిహద్దు గ్రామాల్లో టెలికమ్యూనికేషన్, రహదారి అనుసంధానం, విద్య, వైద్యారోగ్యం, శుద్ధమైన తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం కేవలం ఒక ప్రభుత్వ పథకంగా కాకుండా పరిపాలనా తత్వంగా మారాలని ఆయన సూచించారు. పరిపాలనా  వ్యవస్థలో అంతర్భాగంగా మారినప్పుడే ఈ కార్యక్రమ లక్ష్యం నెరవేరుతుందని హోంమంత్రి అన్నారు. వీవీపీ, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కింద కొత్త చెరువులను నిర్మించడం,  అడవుల పెంపకం, శాశ్వత మౌలిక సదుపాయాలను నిర్మించడం వంటి అంశాలను కూడా పరిగణించాలని ఆయన సూచించారు.

వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్-1 లో చేపట్టిన చర్యలు కేవలం ఆ కార్యక్రమానికే పరిమితమవ్వగా.. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్-2లో పాలనా విధానంలో మార్పు అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. మతపరమైన అక్రమ ఆక్రమణలను తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సరిహద్దు జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ఈ ఆక్రమణలు  ఉద్దేశపూర్వకంగా చేసేవేనని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు నుంచి కనీసం 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని అక్రమ ఆక్రమణలను తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విషయంలో గుజరాత్ రాష్ట్రం జల, భూ సరిహద్దులలో పలు ఆక్రమణలను తొలగించి ప్రశంసలు అందుకుందని అమిత్ షా గుర్తుచేశారు.


(Release ID: 2161063) Visitor Counter : 5