హోం మంత్రిత్వ శాఖ
రాజ్యాంగ (130 వ సవరణ) బిల్లు 2025 తో సహా అనేక ముఖ్యమైన అంశాలపై ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయాలను పంచుకున్న కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా
ఒక ప్రధాని, మంత్రి, ముఖ్యమంత్రి జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం అంటే అది దేశ ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే.
ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాల కోసం ప్రభుత్వ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి జైలుకు వెళ్లడం మన ప్రజాస్వామ్యానికి తగదు
39వ రాజ్యాంగ సవరణలో ప్రధానిని చట్టం పరిధి నుంచి మినహాయించగా, మోదీ ఈ బిల్లులో సీఎం, మంత్రులతో పాటు పీఎంను కూడా చేర్చారు.
ఒక బిల్లుకు వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం, వ్యతిరేకంగా ఓటు వేయడం రాజ్యాంగ పరిధిలోనే ఉన్నా సభను నడవనివ్వని ధోరణి సరికాదు
సుప్రీంకోర్టు, హైకోర్టు గుడ్డిగా కూర్చోవడం లేదు; ముఖ్యమంత్రి లేదా ప్రధానిపై తప్పుడు కేసు దాఖలైతే బెయిల్ మంజూరు చేసే హక్కు కోర్టుకు ఉంది
రాజ్యాంగ రూపకల్పన సమయంలో భవిష్యత్తులో జైలులో ఉంటూ ప్రభుత్వాన్ని నడిపే నాయకులు ఉంటారని రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేదు.
మన నైతిక విలువల స్థాయిని పడిపోనివ్వకూడదు.
Posted On:
25 AUG 2025 3:32PM by PIB Hyderabad
దేశంలో ఏ మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధాని అయినా జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపలేరని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృఢంగా విశ్వసిస్తున్నారని కేంద్ర కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, రాజ్యాంగ (130 వ సవరణ) బిల్లు 2025 తో సహా అనేక ముఖ్యమైన అంశాలపై శ్రీ అమిత్ షా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి లేదా రాష్ట్ర మంత్రి ఏదైనా తీవ్రమైన అభియోగం కింద అరెస్టయి 30 రోజుల్లోగా బెయిల్ మంజూరు కాకపోతే వారు తమ పదవి నుంచి వైదొలగవలసిన నిబంధన రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు 2025 లో ఉందని ఆయన పేర్కొన్నారు. అలా జరగని పక్షంలో వారు చట్టపరంగా స్వయంగా పదవి నుంచి తప్పుకోవల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికైన ప్రభుత్వం ఏ బిల్లునైనా, లేదా రాజ్యాంగ సవరణనైనా సభలో ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించరాదని శ్రీ షా అన్నారు.
ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ఉభయ సభల సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదిస్తామని తామే స్వయంగా స్పష్టం చేశామని శ్రీ అమిత్ షా చెప్పారు. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమని, ఓటింగ్ జరిగినప్పుడు అన్ని పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలను చెప్పవచ్చని ఆయన అన్నారు. ఏ బిల్లునుగానీ, , రాజ్యాంగ సవరణ బిల్లునుగానీ సభలో ప్రవేశపెట్టనివ్వకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ఎంతమాత్రం తగదని శ్రీ షా అన్నారు. పార్లమెంటు ఉభయ సభలు ఉన్నది చర్చలు, వాదన కోసమే తప్ప అల్లరి, గందరగోళం కోసం కాదని ఆయన అన్నారు. బిల్లును ప్రవేశపెట్టనివ్వని ధోరణి ప్రజాస్వామ్యబద్ధం కాదని, ప్రతిపక్షాలు తమ చర్యలకు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని హోంమంత్రి పేర్కొన్నారు.
ఈ బిల్లు ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకం కాదని, మన ముఖ్యమంత్రులను కూడా దీని పరిధిలోకి తెస్తుందని హోం మంత్రి అన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం లేదంటూ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. 30 రోజుల్లోగా బెయిల్ మంజూరు అయితే బిల్లు ప్రకారం ఎలాంటి చర్యలు ఉండవని, అలాగే, తప్పుడు కేసు అయితే బెయిల్ ఇచ్చేందుకు దేశంలో కోర్టులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఏ కేసులో అయినా బెయిల్ ఇచ్చే హక్కు హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ఉందని, బెయిల్ మంజూరు చేయకపోతే ఆ వ్యక్తి రాజీనామా చేయాల్సి ఉంటుందని అన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా, ప్రధాని అయినా, మంత్రి అయినా జైల్లో ఉంటూ ప్రభుత్వాన్ని నడపాలా, ఇది దేశ ప్రజాస్వామ్యానికి మంచిదా? అని ప్రశ్నించారు. 30 రోజుల తర్వాత బెయిల్ మంజూరైతే మళ్లీ ప్రమాణ స్వీకారం చేయొచ్చని చెప్పారు.
జైలు శిక్ష విధించే నిబంధనను తమ ప్రభుత్వం చేయలేదని, అది ఏళ్ల తరబడి కొనసాగుతోందని హోం మంత్రి అన్నారు. ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షను 130వ రాజ్యాంగ సవరణ తీవ్రమైన నేరంగా పరిగణిస్తుందని, అలాంటి వారు రాజీనామా చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఐదేళ్లకు పైగా జైలు శిక్ష పడే నేరాల్లో జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం సరికాదన్నారు ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఏ ప్రజాప్రతినిధికైనా రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడితే ఎంపీ పదవి నుంచి తప్పించే నిబంధన ఇప్పటికీ ఉందని అన్నారు. నైతిక కారణాలను నిర్ణయించడానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ చట్టం అమలులో ఉందని ఆయన అన్నారు. చాలా మంది సభ్యత్వాలను రద్దు చేయడం, నిర్దోషులుగా తేలిన తర్వాత వాటిని పునరుద్ధరించడం జరిగిందని శ్రీ షా గుర్తు చేశారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎంతో మంది నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేసి జైలుకు వెళ్లారని అమిత్ షా గుర్తు చేశారు. కానీ జైలుకు వెళ్లిన తర్వాత కూడా రాజీనామా చేయని ధోరణి ఇప్పుడు మొదలైందని, తమిళనాడుకు చెందిన కొందరు మంత్రులు, అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేయలేదని అన్నారు. ప్రభుత్వ కార్యదర్శి, డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జైలుకు వెళ్లి వారి ఆదేశాలు తీసుకోవాలా అని ప్రశ్నించారు. ఇది తీవ్రంగా తీసుకోవలసిన అంశమని, దీనిపై విస్తృతంగా చర్చ జరగాలని శ్రీ షా అన్నారు.
ప్రధాని మోదీ స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఈ రాజ్యాంగ సవరణ బిల్లు పరిధిలోకి తీసుకొచ్చారని హోంమంత్రి తెలిపారు.ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన అప్పటి ప్రధాని 39వ రాజ్యాంగ సవరణను తీసుకువచ్చారని, అందులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు ప్రధాని పదవిని కూడా చట్ట పరిధికి దూరంగా ఉంచారని, కానీ ఇప్పుడు నరేంద్రమోదీ స్వయంగా ప్రధానమంత్రిని కూడా చేరుస్తూ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టారని, దీని ప్రకారం ఒకవేళ జైలుకు వెళ్తే ప్రధాని కూడా రాజీనామా చేయాల్సి ఉంటుందని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ చట్టంలో కోర్టు జాప్యం ఉండదని, కోర్టు వెంటనే జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. న్యాయస్థానాలు కూడా చట్టం తీవ్రతను అర్థం చేసుకుంటాయి కాబట్టి ఇది సత్వర నిర్ణయానికి దారితీస్తుందని పేర్కొన్నారు.
దేశంలో ఏ మంత్రి, ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి జైలులో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నడపలేరని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా విశ్వసిస్తున్నారని శ్రీ అమిత్ షా అన్నారు. రాజ్యాంగాన్ని తయారుచేసే సమయంలో ఏ ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్లి పదవిలో కొనసాగుతారని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరని ఆయన అన్నారు. మన నైతిక విలువల స్థాయిని పడిపోనివ్వకూడదని ఆయన అన్నారు. ఈ చట్టం నైతిక విలువల స్థాయికి పునాది వేస్తుంది. మన ప్రజాస్వామ్యాన్ని కచ్చితంగా బలోపేతం చేస్తుంది. మన న్యాయస్థానాలు సునిశితమైనవని, ఎవరైనా తమ పదవులను కోల్పోతే కచ్చితంగా కోర్టులు నిర్ణీత గడువులోగా బెయిల్ పై నిర్ణయం తీసుకుంటాయని ఆయన అన్నారు.
కక్షసాధింపు గురించి ప్రధాన ప్రతిపక్షం మాట్లాడటం తగదని, ప్రతిపక్ష ప్రభుత్వ హయాంలో కనీసం 12 కేసుల్లో కోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు జరిగిందని, చాలామందిని కేసుల్లోకి నెట్టారని హోం మంత్రి గుర్తు చేశారు. ప్రతిపాదిత చట్టంపై జేపీసీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తర్వాత కూడా ఏదైనా పార్టీ దాన్ని బహిష్కరిస్తే, ప్రభుత్వానికి వేరే ప్రత్యామ్నాయం ఉండదని ఆయన అన్నారు. ఈ బిల్లు ముఖ్యమని, అందువల్ల అన్ని పార్టీల సభ్యులతో సంప్రదించి జేపీసీ అభిప్రాయం తీసుకోవాలని శ్రీ షా అన్నారు. ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తోందని, కానీ ప్రతిపక్షాలు తన అభిప్రాయాలను తెలియజేయడానికి ఇష్టపడటం లేదని, దేశ ప్రజలు దీనిని గమనిస్తున్నారని ఆయన అన్నారు.ఎవరైనా తీవ్రమైన అవినీతికి పాల్పడితే అరెస్టు చేస్తారని, జైలుకు వెళ్లక తప్పదని, రాజీనామా చేయాల్సి ఉంటుందని హోంమంత్రి స్పష్టం చేశారు.
నైతిక విలువలపై ప్రతిపక్షాలు తనకు పాఠాలు చెప్పకూడదని శ్రీ అమిత్ షా అన్నారు. తనపై ఆరోపణలు వచ్చి, సీబీఐ తనకు సమన్లు పంపడంతో మరుసటి రోజే తాను రాజీనామా చేశానని, తరువాత తాను నిర్దోషిగా తీర్పు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఆ తీర్పులో ఇది పూర్తిగా కక్ష సాధింపు కేసు అని, తనకు ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. తనను ఆధారాలు లేని కారణంగా నిర్దోషిగా ప్రకటించలేదని, తనపై నమోదైన కేసునే కొట్టివేశారని శ్రీ షా తెలిపారు. 96వ రోజున తనకు బెయిల్ మంజూరైందని, అయినా తాను హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదని చెప్పారు. అంతేగాక, తనపై ఉన్న అభియోగాలన్నీ కొట్టివేసే వరకు తాను ఏ రాజ్యాంగ పదవినీ తీసుకోలేదని చెప్పారు.
నైతిక విలువలు ఎన్నికల గెలుపు ఓటములతో ముడిపడి లేవని అమిత్ షా అన్నారు. అవి సూర్యచంద్రుల మాదిరి స్థిరంగా వాటి స్థానంలో ఉంటాయని శ్రీ అమిత్ షా అన్నారు. తమ మిత్రపక్షాలన్నీ ఈ సూత్రంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాయని ఆయన చెప్పారు. పార్లమెంటు ఎలా పనిచేయాలో నిర్ణయించేది అధికార పార్టీ మాత్రమే కాదని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రతిపక్షాలు ఏ బిల్లుకైనా, రాజ్యాంగ సవరణకైనా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించకపోతే దేశ ప్రజలు దానిని గమనిస్తారని పేర్కొన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందుతుందని, నైతిక విలువల ప్రాతిపదికన మద్దతిచ్చే వారు ప్రతిపక్షంలో చాలా మంది ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
(Release ID: 2160770)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam