ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్-ఫిజీ సంయుక్త ప్రకటన: పరస్పర స్నేహభావం స్పూర్తిగా భాగస్వామ్యం

Posted On: 25 AUG 2025 1:52PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. ఫిజీ రిపబ్లిక్ ప్రధానమంత్రి శ్రీ సితివేని రబుకా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు ఫిజీ ప్రధాని అధికారిక పర్యటన భారత్‌లో కొనసాగనుంది. ప్రధాని హోదాలో తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్న శ్రీ రబుకా వెంట ఆయన సతీమణి, ఫిజీ వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ ఆంటోనియో లాలాబలావు, ఫిజీ రిపబ్లిక్ ప్రభుత్వ సీనియర్ అధికారుల ప్రతినిధి బృందం ఉన్నారు.

ఫిజీ ప్రధానమంత్రి రబుకాతో పాటు ఆయన ప్రతినిధి బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా స్వాగతించారు. ద్వైపాక్షిక అంశాలు, పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలు, భవిష్యత్ పరిణామాలను గురించి ఇరువురు నేతలు సమగ్రంగా చర్చించారు. ఇరు దేశాల సంబంధాల వృద్ధి పట్ల ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, వాణిజ్యం, పెట్టుబడులు, చిన్న-మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి, సహకార సంస్థలు, సంస్కృతి, క్రీడలు, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో విస్తృతమైన, సమ్మిళితమైన, భవిష్యత్తు ఆధారితమైన భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి వారి నిబద్దతను పునరుద్ఘాటించారు.

ఇటీవలి సంవత్సరాల్లో ఊపందుకున్న ద్వైపాక్షిక ఒప్పందాల పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. 2024 ఆగస్టు నెలలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చారిత్రాత్మక ఫిజీ పర్యటన, భారత్-ఫిజీ మధ్య ఉమ్మడి భాషా-సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ 2023 ఫిబ్రవరిలో ఫిజీలోని నాడి నగరంలో 12వ ప్రపంచ హిందీ సదస్సును విజయవంతంగా నిర్వహించిన విషయాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.
భారత్-ఫిజీ మధ్య బలమైన, దీర్ఘకాలిక సంబంధాలను, ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను ఇరువురు నేతలు శ్లాఘించారు. 1879 - 1916 మధ్య ఫిజీకి వలస వచ్చిన 60,000 మందికి పైగా భారతీయ ఒప్పంద కార్మికులైన గిర్మిటియాలు ఫిజీ బహుళ సాంస్కృతిక గుర్తింపు, వైవిధ్యమైన సమాజం, ఆర్థిక వ్యవస్థ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారన్నారు. మే నెలలో జరిగిన 146వ గిర్మిట్ దినోత్సవ స్మారక కార్యక్రమంలో పాల్గొన్న భారత విదేశాంగ, జౌళి శాఖ సహాయమంత్రి శ్రీ పబిత్ర మార్గరీటా ఫిజీ రిపబ్లిక్ పర్యటన అభినందనీయమని ప్రధానమంత్రి రబుకా పేర్కొన్నారు.

గత నెలలో జరిగిన 6వ రౌండ్ విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు విజయవంతం కావడం పట్ల ఇరువురు నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇది పురోగతిని సమీక్షించడానికి, పరస్పర సహకారానికి సంబంధించిన కొత్త అంశాలను గుర్తించడానికి ఒక ప్రధాన వేదికగా నిలిచిందని వారు అభిప్రాయపడ్డారు.

ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరువురు నాయకులు అంగీకరించారు. అలాగే అన్ని ఉగ్రవాద రూపాలను, వ్యక్తీకరణలను వారు ఖండించారు. 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఇరువురు నాయకులు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని వారు పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం పట్ల ద్వంద్వ ప్రమాణాలను ఖండించారు. ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే వారిని ఎదుర్కోవడానికి.. ఉగ్రవాద ప్రయోజనాల కోసం కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల దోపిడీని నిరోధించడానికి.. సమష్టి కృషి, సామర్థ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఉగ్రవాద నియామకాలను, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఐక్యరాజ్యసమితి, ఇతర బహుపాక్షిక వేదికలతో కలిసి పనిచేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

భారత మిషన్ లైఫ్, బ్లూ పసిఫిక్ కాంటినెంట్ కోసం 2050 వ్యూహం స్ఫూర్తిగా వాతావరణ సంరక్షణ చర్యలు, అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే వ్యవస్థల నిర్మాణం, సుస్థిర అభివృద్ధి పట్ల ఇరువురు నాయకులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ), విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ), ప్రపంచ జీవఇంధనాల కూటమి (జీబీఏ)లో ఫిజీ సభ్యత్వాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఐఎస్ఏతో త్రైపాక్షిక అవగాహన ఒప్పందం ద్వారా ఫిజీ నేషనల్ యూనివర్సిటీలో ఎస్‌టీఏఆర్-సెంటర్‌ను ఏర్పాటు చేయడం, ఫిజీలోని ప్రాధాన్య రంగాల్లో సౌర విద్యుదీకరణ విస్తరణ స్థాయిని పెంపొందించడం కోసం దేశ భాగస్వామ్య విధాన ఒప్పందంపై సంతకం చేయడం సహా ఐఎస్ఏలో మెరుగవుతున్న సహకారాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. సాంకేతిక సహాయం, సామర్థ్యాలను పెంపొందించడం, ప్రపంచ వేదికలపై గళం వినిపించడం ద్వారా సీడీఆర్ఐ విధానంలో ఫిజీ జాతీయ సుస్థిర లక్ష్యాలకు మద్దతు ఇవ్వడం పట్ల భారత్ నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
ప్రపంచ జీవఇంధనాల కూటమి (జీబీఏ) విధానంలో సుస్థిరత ఇంధన పరిష్కారంగా జీవ ఇంధనాలను ప్రోత్సహించడం పట్ల ఇరువురు నాయకులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. కూటమి వ్యవస్థాపక, క్రియాశీల సభ్యులుగా.. ఇంధన భద్రతను పెంపొందించడంలో, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో, సమ్మిళిత గ్రామీణాభివృద్ధిని పెంపొందించడంలో జీవ ఇంధనాల కీలక పాత్రను ఇరు పక్షాలు ప్రధానంగా ప్రస్తావించాయి. ఫిజీలో సుస్థిర జీవ ఇంధన ఉత్పత్తి, విస్తరణను పెంచేందుకు మద్దతు ఇవ్వడం కోసం సామర్థ్యాలను పెంపొందించడం, సాంకేతిక సహాయం, పాలసీల రూపకల్పనలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి వారు అంగీకరించారు.

ద్వైపాక్షిక వాణిజ్యంలో సుస్థిర వృద్ధిని, భారత్-ఫిజీ మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు గల అపారమైన సామర్థ్యాన్ని ఇరువురు నేతలు ధ్రువీకరించారు. ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత ఏకీకృతం చేయడానికి, వాణిజ్య దస్త్రాలను వైవిధ్యపరచడానికి, సరఫరా వ్యవస్థను  మరింత బలోపేతం చేయడానికి పరస్పర ప్రయోజన రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. భారత నెయ్యిని  ఫిజీ మార్కెట్లో విక్రయించుకోవడానికి అనుమతించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు.

దృఢమైన, సమ్మిళితమైన, సుస్థిరమైన ఇండో-పసిఫిక్ ఆర్థిక నిర్మాణం కోసం తమ ఉమ్మడి దృక్పథాన్ని పునరుద్ఘాటిస్తూ.. పరస్పర శ్రేయస్సును ప్రోత్సహించడానికి కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇరువురు నేతలు ప్రకటించారు. యాక్షన్-ఓరియెంటెడ్ ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్ఐపీఐసీ) ద్వారా యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద ఫిజీ సహా పసిఫిక్ ద్వీప దేశాలతో మెరుగవుతున్న భారత్ సంబంధాలను, పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం (పీఐఎఫ్)లో చర్చల భాగస్వామిగా భారత్ భాగస్వామ్యాన్ని ఇరువురు నేతలు ధ్రువీకరించారు. 2023 మే నెలలో జరిగిన 3వ ఎఫ్ఐపీఐసీ సదస్సు తీర్మానాలను గుర్తుచేసుకుంటూ.. ఫిజీ ప్రాధాన్యాలు కేంద్రంగా చేపట్టే విస్తృత కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి భాగస్వామ్యం పట్ల భారత్ నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఆరోగ్య సంరక్షణను కీలక ప్రాధాన్యాంశంగా ప్రస్తావిస్తూ.. సువాలో 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రణాళిక, నిర్మాణం, ప్రారంభం, కార్యాచరణ, నిర్వహణ గురించిన అవగాహన ఒప్పందంపై సంతకం చేయడాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. ఇది పసిఫిక్ ప్రాంతంలో గ్రాంట్-ఇన్-ఎయిడ్ కార్యక్రమం కింద భారత్ చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్.

ఫిజీ రిపబ్లిక్‌ ఔషధ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి.. నాణ్యమైన, సరసమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, సేవలు మెరుగ్గా అందుబాటులో ఉండేలా నిర్ధారించే ఇండియన్ ఫార్మకోపోయియా గుర్తింపు అవగాహన ఒప్పందంపై మే నెలలో సంతకాలు చేయడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. తక్కువ ధరకు జనరిక్ ఔషధాలను అందించడానికి ఫిజీలో జన్ ఔషధి కేంద్రాల (పీపుల్స్ ఫార్మసీలు) ఏర్పాటుకు భారత్ మద్దతును ఆయన పునరుద్ఘాటించారు. భారత ప్రధాన టెలీమెడిసిన్ కార్యక్రమం అయిన ఈ-సంజీవని కింద సహకారం, రిమోట్ హెల్త్‌కేర్ సేవలను సులభతరం చేయడం, భారత్-ఫిజీ మధ్య డిజిటల్ హెల్త్ కనెక్టివిటీని పెంచడం కోసం ఈ నెల 13న ఆరోగ్య రంగంపై ఇరు దేశాల మధ్య 3వ జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ నిర్వహించడాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. ఆరోగ్య రంగంలో సహకారాన్ని బలోపేతం చేస్తూ.. 2వ జైపూర్ ఫుట్ క్యాంప్‌ను ఫిజీలో నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఫిజీ ఓవర్సీస్ మెడికల్ రిఫరల్ కార్యక్రమానికి అనుబంధంగా 'హీల్ ఇన్ ఇండియా' కార్యక్రమం కింద 10 మంది ఫిజీ దేశస్థులకు భారత ఆసుపత్రుల్లో ప్రత్యేక/తృతీయ వైద్య సంరక్షణ సేవలను కూడా భారత్ అందిస్తుంది.

భారత్-ఫిజీ సహకారానికి మూలస్తంభంగా అభివృద్ధి భాగస్వామ్యాన్ని వారు పునరుద్ఘాటించారు. 2024లో టోంగాలో జరిగిన 53వ పసిఫిక్ దీవుల ఫోరం లీడర్స్ సమావేశంలో భారత్ ప్రకటించిన విధంగా ఫిజీ రిపబ్లిక్‌లో మొదటి క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ (క్యూఐపీ) గా తుబాలేవు గ్రామ భూగర్భ జల సరఫరా ప్రాజెక్టు అవగాహన ఒప్పందంపై సంతకం చేయడాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. ఇది స్థానికులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి వీలు కల్పిస్తుంది.

ద్వైపాక్షిక రక్షణ సంబంధాల్లో పెరుగుతున్న వేగాన్ని ఇరువురు నాయకులు ధ్రువీకరించారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరత, శ్రేయస్సును మరింత ముందుకు తీసుకెళ్లడంలో తమ ఉమ్మడి ప్రయోజనాల ప్రాముఖ్యాన్ని వారు స్పష్టం చేశారు. 2017లో సంతకం చేసిన రక్షణ సహకార అవగాహన ఒప్పందంలో పేర్కొన్న సహకార ప్రాధాన్య రంగాలను ముందుకు తీసుకెళ్లడం, ఈ రంగాల్లో ఫిజీ వ్యూహాత్మక ప్రాధాన్యాలకు మద్దతు ఇవ్వడం పట్ల భారత్ నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ కార్యకలాపాలు (యూఎన్‌పీకేవో), మిలిటరీ మెడిసిన్, వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ఛేంజ్ (డబ్ల్యూఎస్ఐఈ), రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ సైనిక దళాల సామర్థ్యాలను పెంపొందించడం వంటి రంగాల్లో మెరుగైన సహకారం సహా రక్షణ రంగంలో తొలి జాయింట్ వర్కింగ్ గ్రూప్ (జేడబ్ల్యూజీ) నిర్ణయాలను ఇరువురు నాయకులు స్వాగతించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న రక్షణ సహకారం పట్ల ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంబంధాలను మరింత బలోపేతం చేయడం పట్ల తమ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. రక్షణ రంగం, సముద్ర భద్రతలో సహకారాన్ని మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఫిజీ ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్) భద్రత ప్రాముఖ్యతను ప్రధానమంత్రి రబుకా ప్రధానంగా ప్రస్తావించారు. ఫిజీ రిపబ్లిక్ భద్రతా అవసరాలను తీర్చడంలో సహాయం కోసం, సముద్ర రంగ సహకారాన్ని, పరస్పర కార్యాచరణను పెంపొందించేందుకు భారత నావికాదళ నౌక ద్వారా ఫిజీలో ప్లాన్డ్ పోర్ట్ ఏర్పాటు కోసం భారత్ హామీని ప్రధానమంత్రి రబుకా స్వాగతించారు.

రక్షణ రంగంలో ద్వైపాక్షిక కార్యక్రమాలను వేగవంతం చేయటం, ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలను ప్రోత్సహించడం.. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడమే లక్ష్యంగా కొత్త కార్యక్రమాలను చేపట్టేందుకు, తద్వారా రక్షణ సహకారాన్ని మరింతగా పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇరువురు తెలిపారు. ఫిజీ దేశ సైనిక దళాలకు రెండు అంబులెన్స్‌లను బహుమతిగా ఇస్తున్నట్లు, సువాలోని భారత హైకమిషన్‌లో రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. రెండు దేశాల మధ్య సహకారం విషయంలో  సైబర్ భద్రతకు పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా.. ఫిజీలో సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ సెల్ (సీఎస్‌టీసీ) ఏర్పాటును నాయకులు స్వాగతించారు. ముఖ్యంగా నౌకావాణిజ్యం, మానవతా సహాయం - విపత్తు ఉపశమనం (హెచ్ఏడీఆర్), సాంకేతికత రంగాలలో ప్రస్తుతం ఉన్న, కొత్తగా వస్తోన్న సవాళ్లను పరిష్కరించడంలో ఇరు దేశాల భాగస్వామ్యానికి ఉన్న సామర్థ్యాన్ని రెండు దేశాల నాయకులు ప్రధానంగా పేర్కొన్నారు.


స్వేచ్ఛాయుత, బహిరంగ, సురక్షిత, సమ్మిళితత్వంతో కూడిన ఇండో-పసిఫిక్ ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యతను ఇద్దరు ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రాంతీయ సముద్ర భద్రతను బలోపేతం చేస్తూ ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వానికి కృషి చేసే విషయంలో సహకరించుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు వారు ప్రకటించారు.

భారత్‌-ఫిజీ సంబంధాలను, ముఖ్యంగా ఆర్థిక-సాంస్కృతిక సంబంధాలను మరింతగా బలోపేతం చేసే విషయంలో పౌర సంబంధాలు ఆధారంగా పనిచేస్తాయని ఇరువురు నాయకులు వర్ణించారు. ఆయా అంశాల్లో సంబంధాలను చాలా రెట్లు పెంచే సామర్థ్యం వీటికి ఉన్నట్లు పేర్కొన్నారు. భారత్, ఫిజీ మధ్య ప్రయాణాలు, మానవ రవాణా విషయంలో ఉద్దేశ్య ప్రకటనపై సంతకం చేయడాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. ఇది రెండు దేశాల మధ్య నిపుణులు, విద్యార్థుల రాకపోకలను సులభతరం చేయనుంది.

ఇరు దేశాల మధ్య భాషా, సాంస్కృతిక సంబంధాలను మరింత ప్రోత్సహించనున్న హిందీ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయంలో సహాయం అందించేందుకు ఫిజీ విశ్వవిద్యాలయానికి హిందీ-సంస్కృత ఉపాధ్యాయుడిని నియమించడాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. ఈ సంవత్సరం చివర్లో భారత్‌లో జరిగే 'అంతర్జాతీయ గీతా మహోత్సవ్'లో (ఐజీఎం 2025) పాల్గొనే ఫిజీ పండితులకు శిక్షణ ఇచ్చేందుకు భారత్ సుముఖంగా ఉన్నట్లు మోదీ తెలిపారు. భారత్‌లో జరగనున్న ఐజీఎం-2025 వేడుకలతో సమానమైన స్థాయిలో అంతర్జాతీయ గీతా మహోత్సవ్ కార్యక్రమాన్ని ఫిజీ నిర్వహించనుంది..

ఫిజీ- భారత్ భాగస్వామ్యానికి సామర్థ్య నిర్మాణం అనేది ఒక ప్రధానమైన అంశమని ఇరువురు నేతలు పేర్కొన్నారు. భారత సాంకేతిక, ఆర్థిక సహకార (ఐటీఈసీ) కార్యక్రమం ద్వారా ఫిజీ ప్రభుత్వ అధికారులకు సామర్థ్యాలు పెంచుకునే అవకాశాలను భారత్ అందిస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు.

ద్వైపాక్షిక సహకారం విషయంలో వ్యవసాయం, ఆహార భద్రత ప్రాముఖ్యతను ఇద్దరు ప్రధానులు గుర్తించారు. ఫిజీలో ఆహార భద్రత, వ్యవసాయ ధృడత్వానికి మద్దతు ఇచ్చేందుకు 2025 జూలైలో భారత్ పంపించిన 5 మెట్రిక్ టన్నుల అధిక నాణ్యత గల అలసంద గింజల సహాయం పట్ల ఆ దేశ ప్రధాన మంత్రి రబుకా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఫిజీ దేశంలో పంచదారకు సంబంధించిన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, ఉత్పాదకతను పెంచేందుకు 12 వ్యవసాయ డ్రోన్లు, 2 మొబైల్ మట్టి పరీక్ష ప్రయోగశాలలను సహాయం రూపంలో (గ్రాంట్ ఇన్ ఎయిడ్) బహుమతిగా ఇస్తున్నట్లు ప్రధాన మంత్రి మోదీ ప్రకటించారు. ఈ రంగానికి మరింత సహాయం అందించేందుకు ఫిజీ చక్కెర రంగ నిపుణుల కోసం ప్రత్యేక ఐటీఈసీ శిక్షణా కార్యక్రమాల నిర్వహణతో పాటు, ఫిజీ పంచదార కార్పొరేషన్‌కు ఐటీఈసీ నిపుణుడిని పంపే ఉద్దేశంతో ఉన్నట్లు ప్రధాని ప్రకటించారు.

రెండు దేశాల మధ్య పెరుగుతున్న క్రీడా సంబంధాలను.. ముఖ్యంగా ఫిజీలో క్రికెట్ పట్ల, భారతదేశంలో రగ్బీ పట్ల పెరుగుతున్న ఉత్సాహాన్ని ఇరువురు ప్రధానంగా ప్రస్తావించారు. ఫిజీ అభ్యర్థన మేరకు ఆట విషయంలో స్థానిక ప్రతిభను పెంచేందుకు ఫిజీ క్రికెట్ జట్లకు భారతీయ క్రికెట్ కోచ్ సహాయం చేయనున్నారు. తద్వారా క్రీడలలో యువత పాల్గొనడాన్ని ప్రోత్సహించనున్నారు.

సువాలో భారత హైకమిషన్‌కు సంబంధించిన కార్యాలయం- సాంస్కృతిక కేంద్రం (ఛాన్సరీ-కమ్-కల్చరల్ సెంటర్) నిర్మాణం కోసం భూమిని కేటాయించినందుకు ఫిజీ దేశ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ విషయంలో అద్దె ఒప్పందాన్ని అప్పగించడాన్ని స్వాగతించారు. ఫిజీ ప్రభుత్వం తన హైకమిషన్ కార్యాలయాన్ని నిర్మించేందుకు 2015లో ఢిల్లీలో భూమిని కేటాయించారు.

కీలక రంగాలలో సహకారాన్ని మరింతగా పెంచే లక్ష్యంతో ఈ ఒప్పందాలపై సంతకాలు చేయటాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు: (i) గ్రామీణాభివృద్ధి, వ్యవసాయానికి సంబంధించిన ఆర్థిక సహాయం, ఆర్థిక సమ్మిళితత్వంలో పెంపొందించే విషయంలో ఫిజీ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎఫ్‌డీబీ), భారత్‌కు చెందిన జాతీయ వ్యవసాయ- గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) మధ్య అవగాహన ఒప్పందం,  (ii) ప్రామాణీకరణకు సంబంధించిన సహకారంపై భారత్‌కు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఫిజీ దేశానికి చెందిన జాతీయ వాణిజ్య కొలతలు-ప్రమాణాల విభాగం (డీఎన్‌టీఎంఎస్) మధ్య అవగాహన ఒప్పందం (iii) మానవ వనరుల సామర్థ్య నిర్మాణం, నైపుణ్యాభివృద్ధి రంగంలో సహకారం విషయంలో భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), ఫిజీలోని పసిఫిక్ పాలిటెక్నిక్ మధ్య అవగాహన ఒప్పందం (iv) ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఫిజీ వాణిజ్యం-యజమానుల సమాఖ్య (ఎఫ్‌సీఈఎఫ్) మధ్య అవగాహన ఒప్పందం (v) జన్ ఔషధి పథకం కింద ఔషధాల సరఫరాకు సంబంధించి హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్, ఫిజీ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య-వైద్య సేవల మంత్రిత్వ శాఖ మధ్య ఒప్పందం

ప్రజాస్వామ్య, చట్టపరమైన సంబంధాలను బలోపేతం చేయటంలో పార్లమెంటు సభ్యుల మధ్య భాగస్వామ్యాలకు ఉన్న ప్రాముఖ్యతను ఇరువురు ప్రధానంగా పేర్కొన్నారు. ఫిజీకి చెందిన పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందం 2026లో చేపట్టనున్న ప్రతిపాదిన పర్యటనను ప్రధాని మోదీ స్వాగతించారు. ఫిజీలో సామాజిక సమైక్యత, సమాజ అభివృద్ధిని ప్రోత్సహించడంలో గ్రేట్ కౌన్సిల్ ఆఫ్ చీఫ్స్ (జీసీసీ) పోషించిన ముఖ్యమైన పాత్రను ఆ దేశ ప్రధానమంత్రి రబుకా ప్రధానంగా చెప్పారు. రెండు దేశాల మధ్య పౌర సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి జీసీసీ ప్రతినిధి బృందం భారత్‌లో చేపట్టనున్న ప్రతిపాదిత పర్యటనను మోదీ స్వాగతించారు.

ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను ఇరు దేశాల నాయకులు పంచుకున్నారు. శాంతి, వాతావరణానికి సంబంధించిన న్యాయం, సమ్మిళిత అభివృద్ధి, గ్లోబల్ సౌత్ స్వరాన్ని విస్తృతంగా వినిపించటం పట్ల వారి ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారు. గ్లోబల్ సౌత్‌లో భారతదేశ నాయకత్వ పాత్రను ఆ దేశ ప్రధానమంత్రి రబుకా ప్రశంసించారు. బహుపాక్షిక వేదికలలో ఒకరికొకరు ఇస్తున్న విలువైన మద్దతు పట్ల ఇరువురు ప్రశంసలు వ్యక్తం చేశారు.

ఐక్యరాజ్యసమితిలో సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిన తక్షణ అవసరాన్ని ఇద్దరు నాయకులు పేర్కొన్నారు. సమకాలీన భౌగోళిక రాజకీయ వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని రెండు విభాగాల్లో సభ్యత్వాన్ని విస్తరించాలని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యునిగా భారత్‌ను చేర్చేందుకు మద్దతు ఇవ్వడంతో పాటు.. 2028-29 కాలానికి భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశంగా భారతదేశ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వనున్నట్లు ఫిజీ పునరుద్ఘాటించింది.

సమకాలీన ప్రపంచ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో గ్లోబల్ సౌత్ సహకారాన్ని నిరంతరం పెంచుకోవటాన్ని అవసరమైన చర్యగా ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. ప్రపంచ స్థాయి సహకార సంస్థల్లో మెరుగైన, సమాన ప్రాతినిధ్యంతో సహా గ్లోబల్ ‌సౌత్‌ దేశాలన్నింటికి ఆందోళన కలిగించే అంశాలపై కలిసి పనిచేయడానికి అంగీకరించారు. అభివృద్ధి చెందుతోన్న దేశాల ఉమ్మడి ఆందోళనలు, సమస్యలు, అభివృద్ధి ప్రాధాన్యతలపై చర్చించడానికి కీలకమైన వేదికగా పనిచేసే ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సు’లను నిర్వహించే విషయంలో భారత్ చేసిన కృషి, తీసుకున్న నాయకత్వాన్ని ప్రధాన మంత్రి రబుకా ప్రశంసించారు. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సులలో ఫిజీ చురుకుగా పాల్గొనడాన్ని ప్రధాన మంత్రి మోదీ అభినందించారు. సదస్సు‌లో నాయకులకు సంబంధించిన సెషన్‌లో పాల్గొన్నందుకు ప్రధాన మంత్రి రబుకాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గ్లోబల్ సౌత్ దేశాల ఉమ్మడి అనుభవంలో మిళితమైన ఉన్న అభివృద్ధి పరిష్కారాలను ఆవిష్కరించటంలో గ్లోబల్ సౌత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ‌అయిన దక్షిణ్‌తో ఫిజీ దేశం నిరంతరం పనిచేయటాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు.

సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించే బహిరంగ, సమ్మిళిత, స్థిరమైన, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్‌కు మద్దతు ఇచ్చే విషయంలో తమ నిబద్ధతను ఇద్దరు ప్రధానులు పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమంలో(ఐపీఓఐ) చేరేందుకు ఫిజీ ఆసక్తితో ఉన్నట్లు ఆదేశ ప్రధాన మంత్రి తెలిపారు. సముద్రాల నిర్వహణ, వాటి పరిరక్షణ, సుస్థిరంగా మార్చే విషయంలో సారూప్య దృక్పథం ఉన్న దేశాలతో ఉన్న ఈ భాగస్వామ్యంలో చేరేందుకు ఆ దేశాన్ని ప్రధాన మంత్రి మోదీ స్వాగతించారు. ఇండ- పసిఫిక్ ప్రాంతానికి శాంతియుత, స్థిరమైన, సురక్షితమైన, స్థిరమైన భవిష్యత్తు, శ్రేయస్సును అందించే విషయంలో ‘శాంతియుతమైన మహాసముద్రం(ఓషియన్ ఆఫ్ పీస్)' భావనను ప్రధాన మంత్రి రబుక ప్రధానంగా పేర్కొన్నారు. పసిఫిక్ ప్రాంతంలో 'శాంతియుతమైన మహాసముద్రాన్ని’ సాధించడంలో ప్రధాన మంత్రి రబుక నాయకత్వాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు.

తనకు, తన ప్రతినిధి బృందానికి అందించిన ఆత్మీయ ఆతిథ్యానికి భారత ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధాన మంత్రి రబుకా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఫిజీ పర్యటనకు రావాలని ప్రధాన మంత్రి మోదీని ఆయన ఆహ్వానించారు.

 

***


(Release ID: 2160768)