ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీ పరిధిలోని యూఈఆర్-II, ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారి విభాగాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం

Posted On: 17 AUG 2025 4:19PM by PIB Hyderabad

కేంద్ర కేబినెట్‌లో నా సహచరుడు నితిన్ గడ్కరీ గారు, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ గారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు అజయ్ తమ్టా గారు, హర్ష మల్హోత్రా గారు, ఈ కార్యక్రమానికి హాజరైన ఢిల్లీ, హర్యానా ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రియమైన సోదర సోదరీమణులారా...

ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి పేరు ద్వారక. ఈ కార్యక్రమం జరుగుతున్న ప్రదేశం పేరు రోహిణి. జన్మాష్టమి ఆహ్లాదం వెల్లివిరుస్తోందిక్కడ. యాదృచ్చికమే అయినా నేనూ ఆ ద్వారకాధీశుడి ప్రాంతానికి చెందినవాడినే. ఇక్కడి వాతావరణమంతా కృష్ణమయమైంది.

మిత్రులారా,

స్వతంత్రత, విప్లవ కాంతులతో ఈ ఆగస్టు మాసం కళకళలాడుతుంది. ఈ స్వాతంత్య్ర వేడుకల నడుమ.. దేశంలో అభివృద్ధి విప్లవానికి రాజధాని ఢిల్లీ నేడు సాక్షిగా నిలుస్తోంది. కొద్దిసేపటి కిందటే ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారి, నగర విస్తరణ రహదారుల రూపంలో ఢిల్లీకి మెరుగైన రవాణా సదుపాయాలు లభించాయి. ఇది  ఢిల్లీ, గురుగ్రామ్‌తోపాటు మొత్తం రాజధాని ప్రాంత ప్రజలకు సౌలభ్యాన్ని పెంచుతుంది. కార్యాలయాలు, ఫ్యాక్టరీలకు రాకపోకలు సులభతరమవుతాయి. అందరికీ సమయం ఆదా అవుతుంది. వ్యాపార వర్గానికి, రైతులకు ఈ ప్రాజెక్టులు విశేషంగా లాభాలు చేకూరుస్తాయి. ఈ ఆధునిక రహదారులు, ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి నేపథ్యంలో ఢిల్లీ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు.



మిత్రులారా,

నిన్న గాక మొన్నే, ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా దృఢమైన నమ్మకంతో దేశ ఆర్థిక వ్యవస్థ, స్వావలంబన, ఆత్మవిశ్వాసాల గురించి మాట్లాడాను. నేడు భారత్ ఏం ఆలోచిస్తోంది, దేన్ని స్వప్నిస్తోంది, దేశ సంకల్పం ఏమిటి... వీటన్నింటినీ ప్రపంచం నిశితంగా గమనిస్తోంది.

మిత్రులారా,

ప్రపంచదేశాలు భారత్‌ను చూసి దేశ పురోగతిపై ఓ అంచనాకు రావాలంటే, రాజధాని ఢిల్లీపైనే మొదటగా అందరి దృష్టీ పడుతుంది. అందుకే.. ‘అవును, వేగంగా పురోగమిస్తున్న భారత్ రాజధాని ఇది’ అన్న భావనను అందరికీ కలిగించే అభివృద్ధి నమూనాగా మనం ఢిల్లీని నిలబెట్టాల్సి ఉంది.

మిత్రులారా,

ఈ పురోగతిని సాధించడానికి గత 11 సంవత్సరాలుగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వివిధ స్థాయుల్లో నిరంతరం కృషి చేసింది. ఇప్పుడు రవాణా సమస్యనే చూడండి.. రవాణాపరంగా మునుపెన్నడూ లేనంత అభివృద్ధిని గత దశాబ్ద కాలంలో రాజధాని ఢిల్లీ సాధించింది. ఈ ప్రాంతంలో ఆధునిక, విస్తారమైన ఎక్స్‌ప్రెస్ రహదారులున్నాయి. మెట్రో నెట్‌వర్క్ పరంగా చూస్తే.. ప్రపంచంలో అతిపెద్ద నెట్వర్క్ ప్రాంతాల్లో ఢిల్లీ ఒకటిగా ఉంది. నమో భారత్ వంటి అధునాతన ర్యాపిడ్ రైలు వ్యవస్థలు ఇక్కడున్నాయి. అంటే, గతంలో పోలిస్తే.. కిందటి పదకొండేళ్లలో ఢిల్లీలో రాకపోకలు చాలా సులభతరమయ్యాయి.

మిత్రులారా,

ఢిల్లీని అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు మేం నిరంతరాయంగా కృషి చేస్తున్నాం. ఈ రోజు కూడా మనం దీన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ద్వారకా ఎక్స్ ప్రెస్ రహదారి అయినా, నగర విస్తరణ రోడ్డు అయినా.. రెండింటినీ అద్భుతంగా నిర్మించారు. శివారు రహదారి తర్వాత.. ఇప్పుడీ నగర విస్తరణ రహదారి ఢిల్లీకి ఎంతగానో సహాయపడనుంది.

మిత్రులారా,

నగర విస్తరణ రహదారికి సంబంధించి మరో విశేషముంది. ఢిల్లీని మురికికూపాల నుంచి విముక్తం చేయడంలోనూ ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఈ రోడ్డు నిర్మాణంలో లక్షల టన్నుల వ్యర్థాలను వినియోగించారు. అంటే, చెత్త కుప్పలను తొలగించి ఆ వ్యర్థ పదార్థాలను రోడ్డు వేయడానికి ఉపయోగించారు. ఇది శాస్త్రీయ పద్ధతిలో జరిగింది. భల్స్వా వ్యర్థ నిర్వహణ ప్రాంతం సమీపంలోనే ఉంది. ఈ చుట్టుపక్కల నివసించే కుటుంబాలకు ఇది ఎంత సమస్యగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇలాంటి ప్రతి సమస్య నుంచి ఢిల్లీ ప్రజలకు పరిష్కారం అందించేలా మా ప్రభుత్వం కృషి చేస్తోంది.

మిత్రులారా,

శ్రీమతి రేఖా గుప్త నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు యమునా నదిని శుద్ధి చేయడంలో నిమగ్నమై ఉండడం హర్షణీయం. యమునా నది నుంచి ఇప్పటికే 16 లక్షల మెట్రిక్ టన్నుల పూడికను తొలగించినట్టు నాకు చెప్పారు. ఇదొక్కటే కాదు.. అనతికాలంలోనే ఢిల్లీలో 650 దేవి ఎలక్ట్రిక్ బస్సులను ఢిల్లీలో ప్రారంభించారు. అంతేకాదు, నగరంలో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులు భారీగా పెరిగి, వాటి సంఖ్య రెండు వేలు దాటుతుంది. ‘గ్రీన్ ఢిల్లీ క్లీన్ ఢిల్లీ’ మంత్రాన్ని ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుంది.

మిత్రులారా,

చాలా ఏళ్ల తర్వాత రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. చాలా రోజులుగా కొద్ది కాలం కూడా మేమిక్కడ అధికారంలో లేము. గత ప్రభుత్వాలు ఢిల్లీని ఎలా భ్రష్టు పట్టించాయో, ఎంత దారుణ స్థితిలోకి నెట్టేశాయో మనం చూశాం. సుదీర్ఘకాలంగా పేరుకుపోయిన సమస్యల నుంచి ఢిల్లీని బయటకు తేవడం కొత్త బీజేపీ ప్రభుత్వానికి ఎంత కష్టమైన పనో నాకు తెలుసు. మొదట ఆ గందరగోళాలను పరిష్కరించడానికే శక్తినంతా వెచ్చించాల్సి వస్తుంది. అప్పుడు, చాలా కష్టం మీద కొద్దిగా పనిచేసినట్టు మనకు కనిపిస్తుంది. కానీ, ఢిల్లీలో మీరు ఎంపిక చేసుకున్న బృందం కష్టపడి పనిచేస్తుందని, దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఢిల్లీని బయటపడేస్తుందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

ఢిల్లీ, హర్యానా, యూపీ, రాజస్థాన్‌లలో అంతటా బీజేపీ ప్రభుత్వాలే ఉండడం ఇదే మొదటిసారి. ఈ ప్రాంతమంతా బీజేపీని, మనందరినీ ఎంతో నమ్మకంగా ఆశీర్వదించిందనడానికి ఇది నిదర్శనం. అందుకే మా బాధ్యతను గుర్తెరిగి రాజధాని ఢిల్లీ అభివృద్ధిలో నిమగ్నమయ్యాం. అయితే, ఈ ప్రజా తీర్పును కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రజల నమ్మకాన్ని, క్షేత్రస్థాయి వాస్తవికతను వారు ఏమాత్రం అర్థం చేసుకోలేక, వాటికి చాలా దూరమయ్యారు. కొన్ని నెలల కిందటే ఢిల్లీ, హర్యానా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎలాంటి కుట్రలు జరిగాయో మీకు గుర్తుండే ఉంటుంది. హర్యానా ప్రజలు ఢిల్లీ నీటిని విషపూరితం చేస్తున్నారని కూడా చెప్పారు. ఇప్పుడు ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం మొత్తానికీ ఇలాంటి ప్రతికూల రాజకీయాల నుంచి విముక్తి కలిగింది. రాజధాని ప్రాంతంలో మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధిని పరుగులు పెట్టించాలన్న సంకల్పంతో ఇప్పుడు మనం ముందుకెళ్తున్నాం. మనం దాన్ని సాధిస్తామన్న నమ్మకం నాకుంది.

మిత్రులారా,

సుపరిపాలనే బీజేపీ ప్రభుత్వాల అస్తిత్వం. బీజేపీ ప్రభుత్వాలకు ప్రజలే సర్వోన్నతులు. మీరే మా అధిష్ఠానం. ప్రజలకు జీవన సౌలభ్యం కల్పించేందుకే మేం నిరంతరం కృషిచేస్తున్నాం. మా విధానాల్లో ఇది ప్రతిబింబిస్తుంది. మా నిర్ణయాల్లో ఇది కనిపిస్తుంది. హర్యానాలో కాంగ్రెస్ హయాంలో ఖర్చి-పర్చి (డబ్బులివ్వడమో లేదా ఇతరత్రా సాయమో చేయడం) లేకుండా ఒక్క నియామకమూ పొందడం కష్టంగా ఉండేది. కానీ హర్యానాలో బీజేపీ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో లక్షలాది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలనిచ్చింది. నాయబ్ సింగ్ సైనీ నాయకత్వంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

మిత్రులారా,

ఇక్కడ ఢిల్లీలో కూడా.. మురికివాడల్లో కాలం వెల్లదీసే వారికి, సొంత ఇళ్లు లేని వారికి పక్కా ఇళ్లు లభిస్తున్నాయి. విద్యుత్, నీరు, గ్యాస్ కనెక్షన్ లేని చోట అన్ని సదుపాయాలు అందుతున్నాయి. దేశం గురించి మాట్లాడుకుంటే.. గత 11 ఏళ్లలో దేశంలో రికార్డు స్థాయిలో రహదారులను నిర్మించాం. మన రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్నాం. వందేభారత్ వంటి ఆధునిక రైళ్లు మనకెంతో గర్వకారణం. చిన్న నగరాల్లోనూ విమానాశ్రయాలను నిర్మిస్తున్నాం. రాజధానిలోనే ఎన్ని విమానాశ్రయాలను నిర్మించామో చూడండి. ఇప్పుడు హిందన్ విమానాశ్రయం నుంచి కూడా అనేక నగరాలకు విమానాలు వెళ్లడం మొదలైంది. నోయిడాలో విమానాశ్రయం కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది.

మిత్రులారా,

గత దశాబ్ద కాలంలో దేశం పాత పద్ధతులను మార్చుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. దేశానికి అవసరమైన స్థాయిలో మౌలిక సదుపాయాలను, వాటిని నిర్మించాల్సిన వేగాన్ని గతంలో అందుకోలేదు. ఇప్పుడు మనకు తూర్పు, పశ్చిమ శివారు ఎక్స్‌ప్రెస్ రహదారులున్నాయి. రాజధాని ఢిల్లీకి దశాబ్దాలుగా దీని అవసరం ఎంతగానో ఉంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించిన ఫైళ్లలో కదలిక మొదలైంది. కానీ మీరు మాకు సేవాభాగ్యాన్ని ఇచ్చిన తర్వాతే పనులు ప్రారంభమయ్యాయి. కేంద్రంలోనూ హర్యానాలోనూ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే ఇది సాధ్యమైంది. నేడు ఈ రహదారులు సేవలందిస్తున్నాయని చెప్పడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను.

మిత్రులారా,

అభివృద్ధి ప్రాజెక్టుల పట్ల ఈ నిర్లక్ష్య పరిస్థితి ఒక్క రాజధాని ఢిల్లీ ప్రాంతానికే పరిమితం కాదు. దేశం మొత్తం ఇదే పరిస్థితి. గతంలో మౌలిక సదుపాయాల కోసం కేటాయించే బడ్జెట్ చాలా తక్కువగా ఉండేది. మంజూరైన ప్రాజెక్టులు కూడా ఏళ్ల తరబడి పూర్తి కాలేదు. గత 11 ఏళ్లలో మౌలిక సదుపాయాలకు కేటాయించే బడ్జెటును ఆరు రెట్లు పెంచాం. పథకాలను త్వరితగతిన పూర్తి చేయడంపై ఇప్పుడు దృష్టి సారించాం. అందుకే ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారి వంటి ప్రాజెక్టులు నేడు పూర్తవుతున్నాయి.

సోదర సోదరీమణులారా,

పెట్టుబడి పెడుతున్న ఈ మొత్తం డబ్బులతో సౌకర్యాలు లభించడం మాత్రమే కాకుండా, ఈ ప్రాజెక్టులు కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలనూ కల్పిస్తున్నాయి. భారీ నిర్మాణ కార్యకలాపాలతో కార్మికుల నుంచి ఇంజినీర్ల వరకు లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. నిర్మాణ సామగ్రి సంబంధిత కర్మాగారాలు, దుకాణాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

మిత్రులారా,

సుదీర్ఘకాలం ప్రభుత్వాలను నడిపిన వారు ప్రజలపై పెత్తనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజల జీవితాల్లో నుంచి ప్రభుత్వ ఒత్తిడిని, జోక్యాన్ని తొలగించడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఇంతకుముందు ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉండేదో మరో ఉదాహరణ చెబుతాను. ఇది వింటే మీకు విస్మయం కలగకమానదు. ఢిల్లీ పారిశుద్ధ్య చర్యల్లో నిమగ్నులై ఉండే మా స్వచ్ఛ మిత్రలు అత్యంత కీలక పాత్ర పోషిస్తారు. వారి బాధ్యత చాలా పెద్దది. ఉదయం లేవగానే ముందుగా వారికి కృతజ్ఞతలు చెప్పాలి. కానీ గత ప్రభుత్వాలు వీరిని బానిసలుగా చూశాయి. నేను చెబుతున్నది నా ఈ చిన్న స్వచ్ఛతా సోదరుల గురించే. ఇప్పుడు రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుని నాట్యమాడుతున్న వారే అప్పుడు రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కారో, బాబా సాహెబ్ భావాలకు వారు ఎలా ద్రోహం తలపెట్టారో.. ఆ నిజాన్ని నేను ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. నేను చెప్పేది విని మీరు ఆశ్చర్యపోతారు. ఢిల్లీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న నా అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లపై.. మన దేశంలోనే, ఈ ఢిల్లీ నగరంలో ఓ ప్రమాదకరమైన చట్టాన్ని అమలు చేసేవారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో ఒక విషయం రాసి ఉంది. పారిశుధ్య కార్మికులెవరైనా సమాచారం ఇవ్వకుండా విధులకు రాకపోతే, వారిని నెల రోజుల పాటు జైల్లో పెట్టవచ్చు. మీరే చెప్పండి.. మీరే ఆలోచించండి.. సఫాయీ కర్మచారుల గురించి వాళ్లేమనుకున్నారు? పారిశుద్ధ్య కార్మికులను జైలులో పెడతారా? అదీ ఓ చిన్న పొరపాటుకే. నేడు సామాజిక న్యాయం గురించి గొప్పగా మాట్లాడుతున్నవారే దేశంలో ఇలాంటి అనేక నిబంధనలు, చట్టాలను అమలు చేశారు. ఇలాంటి తప్పుడు చట్టాలను తవ్వి తీసి, వాటిని తొలగిస్తోంది మోదీయే. మా ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి వందలాది చట్టాలను రద్దు చేసింది. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. 


(Release ID: 2157586)