రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

79వ స్వాతంత్ర్య దినోత్సవం ముందురోజు సాయంత్రం దేశానుద్దేశించి - భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ముగారు ఇచ్చిన సందేశం

Posted On: 14 AUG 2025 7:40PM by PIB Hyderabad

 

నా ప్రియమైన సహ పౌరులారా 

 

రేపు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి భారతీయుడు స్వాతంత్ర దినోత్సవాన్ని, గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహంతో స్ఫూర్తితో జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. ఈ ఉత్సవాలు మనకి మనం భారతీయులమన్న సగర్వ భావనను గుర్తుచేస్తాయి. 

 

ఆగస్టు 15 మన సమిష్టి స్మృతిలో శాశ్వతంగా లిఖించిన తేదీ. సుదీర్ఘ కాలం సాగిన వలస పాలనలో తర తరాల భారతీయులు స్వాతంత్రం సిద్దించే రోజు కోసం కలలు కన్నారు. దేశంలో అన్ని ప్రాంతాలలో పురుషులు-మహిళలు వృద్ధులు-యువజనులు విదేశీ పాలన అనే బరువును వదిలించుకోవాలని తాపత్రయపడ్డారు. వారి పోరాటానికి సారం అయిన బలమైన ఆశావాదమే స్వాతంత్య్రం అనంతరం మన ప్రగతిని కూడా ముందుకి నడిపిస్తోంది. రేపు మన త్రివర్ణ పతాకానికి మనం నమనం చేసినప్పుడు, 78 సంవత్సరాల క్రితం ఆగస్టు 15వ తేదీన భారత్ స్వాతంత్రం సాధించేందుకు స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను కూడా స్మరించుకుని వారికి నివాళి అర్పిస్తాము. 

 

స్వాతంత్రం సముపార్జించుకున్న తర్వాత, అందరికీ ఓటు హక్కు గల ప్రజాస్వామ్యంగా మనం ఆవిర్భవించాం. మరో విధంగా చెప్పాలంటే, ఇతర ప్రజాస్వామ్యాల్లో చాలా మంది ప్రజల ఓటు హక్కుకు అడ్డుగా నిలిచిన లింగ, మత ఇతర వివక్షలు, పరిమితులు లేకుండా భారత ప్రజలమైన మనము మన భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తిని ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంచాము. ఎన్నో సవాళ్లను అధిగమించి, భారత ప్రజలు ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రస్థానం మన ప్రాచీన ప్రజాస్వామిక స్ఫూర్తికి సహజమైన ప్రతిబింబం. భారత్లో ప్రపంచంలోనే అతి పురాతనమైన గణతంత్రాలు ఉండేవి. ప్రజాస్వామ్యానికి మాతృదేశంగా మన దేశం గుర్తింపు పొందడం కూడా అత్యంత సమంజసమైన విషయం. మనం ఆమోదించిన రాజ్యాంగ పునాదులపై , మన ప్రజాస్వామ్యం నిర్మితం అయింది. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింతగా పటిష్టం చేసే ప్రజాస్వామ్య సంస్థలను మనం నిర్మించుకున్నాము. మన రాజ్యాంగం, మన ప్రజాస్వామ్యాలకు మనం అన్నిటికంటే ఎక్కువ విలువనిస్తాము. 

 

గతంలోకి వెనుతిరిగి చూసుకుంటే, దేశ విభజన వల్ల మనకు కలిగిన వేదనను మర్చిపోరాదు. ఈరోజు విభజన విభీషక స్మృతి దినోత్సవం కూడా జరుపుకున్నాం. దేశంలో భయానక హింసకాండ జరిగింది. విభజన వల్ల కోట్లాదిమంది ప్రజలు నిర్వాసితులయ్యారు. ఈరోజు చరిత్రలో జరిగిన తప్పిదాల బాధితులకు కూడా మనం నివాళి అర్పిస్తున్నాము. 

 

నా ప్రియ పౌరులారా 

 

మన రాజ్యాంగంలో ఉన్న నాలుగు విలువలు మన ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్తంభాలుగా నిలిచాయి. అవి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఈ నాగరికత సిద్ధాంతాలను మనం స్వాతంత్ర సంగ్రామ సమయంలో తిరిగి కనుగొన్నాము. మానవ ఆత్మ గౌరవం అనేది వీటన్నిటికీ కేంద్ర బిందువు అని నేను విశ్వసిస్తున్నాను. ప్రతి మానవుడు సమానుడే. ప్రతి ఒక్కరికి కూడా గౌరవం పొందే అర్హత ఉంది. ఆరోగ్య సంరక్షణ, విద్యా ప్రతి ఒక్కరికి సమానంగా అందాలి. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు లభించాలి. సంప్రదాయంగా అణచివేతకు గురైన వారికి చేయూతను అందించాలి. 

 

ఈ సిద్ధాంతాలను ప్రాతిపదికలుగా ఉంచుకుని మనం 1947లో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాము. సుదీర్ఘ విదేశీ పాలన తర్వాత, స్వాతంత్ర సమయంలో భారత్ కటిక పేదరికంలో ఉంది. కానీ అప్పటినుంచి గడచిన 78 ఏళ్ళలో మనం అన్ని రంగాల్లో అసాధారణమైన ప్రగతి సాధించాము. ఆత్మ నిర్భరత గల దేశంగా ఆవిర్భవించే దిశగా భారత్ అత్యంత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. 

 

ఆర్థిక రంగంలో మనం సాధించిన విజయాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఆరున్నర శాతం జిడిపి వృద్ధి రేటుతో, ప్రపంచ ప్రధాన అర్థ వ్యవస్థల్లో భారత్ అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా నిలిచింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడి నెలకొన్నప్పటికీ, మన దేశంలో డిమాండ్ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. ఎగుమతులు పెరుగుతున్నాయి. అన్ని కీలక సూచీలు మన అర్థవ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉన్న విషయాన్ని సూచిస్తున్నాయి. అత్యంత జాగ్రత్తగా చేపట్టిన సంస్కరణలు, వివేకంతో జరిపిన ఆర్థిక నిర్వహణ దీనికి ఎంతగా దోహదం చేశాయో.... మన కార్మికులు, రైతుల శ్రమ, అంకితభావం కూడా అంతగా దోహదపడ్డాయి.  

 

పెద్ద సంఖ్యలో ప్రజలను మనం సుపరిపాలనతో పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాము. పేదల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. దాంతో పాటూ, దారిద్ర్యరేఖ నుంచి పైకి వచ్చినా, దుర్బల పరిస్థితుల్లో మళ్లీ దారిద్ర్యరేఖ దిగువకు జారిపోయే ప్రమాదం ఉన్నవారి కోసం కూడా పథకాలు అమలు చేస్తోంది. సామాజిక సేవలపై చేస్తున్న ఖర్చు పెరగడం ఈ విషయాన్ని ప్రతిఫలిస్తోంది. ఆదాయంలో వ్యత్యాసాలు తగ్గుతున్నాయి. ప్రాంతీయ వ్యత్యాసాలు కూడా కనుమరుగవుతున్నాయి. గతంలో బలహీన ఆర్థిక పనితీరు చూపిన రాష్ట్రాలు, ప్రాంతాలు,….. ఇప్పుడు తమ నిజమైన సామర్ధ్యాన్ని ప్రదర్శించి, ఇతర అగ్రగామి రాష్ట్రాలకు దీటుగా పోటీపడుతున్నాయి. 

 

మన అగ్ర స్థాయి వ్యాపారవేత్తలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, వాణిజ్యవేత్తలు ఎప్పుడూ తాము ‘చేసి చూపించగలమన్న’ స్ఫూర్తిని ప్రదర్శించారు. అవసరమైనదల్లా.... సంపద సృష్టిలో అడ్డంకులను తొలగించడమే. గత దశాబ్ద కాలంగా జరిగిన మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఇది స్పష్టంగా గోచరిస్తుంది. భారత్ మాల పరియోజన కింద మన జాతీయ రహదారుల నెట్వర్క్ ను మనం విస్తరించి మరింత బలోపేతం చేసాము. రైల్వేలలో కూడా, సృజనాత్మక ఆవిష్కారాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త తరం రైళ్లను, కోచ్ లను పట్టాలెక్కించాము. కాశ్మీర్ లోయలో రైలు లింకు ప్రారంభోత్సవం చెప్పుకోదగ్గ భారీ విజయం. కాశ్మీర్ లోయలో రైలు కనెక్టివిటీ ఆ ప్రాంతంలో వాణిజ్య, పర్యాటకాలను పెంచి కొత్త ఆర్థిక అవకాశాలకు దారులు తెరిచింది. కాశ్మీర్లోని ఈ ఇంజనీరింగ్ అద్భుతం మనదేశానికే ఒక చారిత్రాత్మకమైన మైలురాయి. 

 

దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. అందువల్ల, నగరాల్లో స్థితిగతులను మెరుగుపరిచటంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కీలకమైన పట్టణ రవాణా అవసరాలను గుర్తించి, ప్రభుత్వం మెట్రో రైలు సౌకర్యాలను విస్తరించింది. మెట్రో రైలు సర్వీస్ ఉన్న నగరాల సంఖ్య దశాబ్ద కాలంలో అనేక రెట్లు పెరిగింది. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ – అమృత్ ద్వారా మరిన్ని కుటుంబాలకు కొళాయి కనెక్షన్ తో మంచినీరు సరఫరా అవుతోంది. మురుగునీటి పారుదల అందుబాటులోకి వచ్చింది. ఈ కనీస జీవన సౌకర్యాలను పౌరుల హక్కుగా ప్రభుత్వం భావిస్తోంది. అన్ని గ్రామీణ నివాసాలకూ కొళాయి నీటిని సరఫరా చేసే పని జల జీవన్ మిషన్ ద్వారా పురోగతిలో ఉంది. 

 

ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆయుష్మాన్ భారత్ పరిధిలో చేపట్టిన పలు పథకాల ద్వారా కీలకమైన వ్యవస్థాగతమైన మార్పును చూస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే ఈ మాదిరి అతి పెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం. ఈ పథకం కింద ఇప్పటికే 55 కోట్ల మందికి పైగా ప్రజలు ఉచిత సంరక్షణ పొందారు. 70 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులందరికీ వారి ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఈ పథకం ప్రయోజనాలను విస్తరించింది. ఆరోగ్య సేవలు అందుకోవడంలో ఉన్న అసమానతలు తొలగిపోవడంతో, పేదలు దిగువ మధ్య తరగతి ప్రజలు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలు, సదుపాయాలు పొందుతున్నారు. 

 

 ఈ డిజిటల్ శకంలో, ఏదైనా రంగం అత్యంత నాటకీయమైన ప్రగతి సాధించిందంటే... అది సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగం. దేశంలో దాదాపు అన్ని గ్రామాలకు 4 G మొబైల్ కనెక్టివిటీ ఉంది. మిగిలిపోయిన కొన్ని వేల గ్రామాలకు కూడా త్వరలో ఈ సౌకర్యం అందుతుంది. దీనివల్ల డిజిటల్ చెల్లింపు సాంకేతిక పరిజ్ఞానాలను పెద్ద ఎత్తున అవలంబించేందుకు వీలు కలిగింది. అతి తక్కువ కాలంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. ఇది ప్రత్యక్ష నగదు బదిలీకి దోహదం చేసి, ఎలాంటి అడ్డంకులూ, లీకేజీలు లేకుండా సంక్షేమ పథకాల ఫలాలు లక్షిత లబ్ధిదారులకు అందుతున్నాయి. ప్రపంచంలో జరిగే డిజిటల్ లావాదేవీలలో సగానికి పైగా మనదేశంలోనే జరుగుతున్నాయి. ఈ పరిణామాలు అత్యంత చైతన్యవంతమైన డిజిటల్ అర్ధ వ్యవస్థను సృష్టించడంతో, దేశ GDPలో ఈ రంగం వాటా ఏటేటా పెరుగుతూ వస్తోంది.  

 

సాంకేతిక పరిజ్ఞాన ప్రగతిలో కృత్రిమ మేధస్సు తదుపరి దశ. ఇది ఇప్పటికే మన జీవితాల్లోకి ప్రవేశించింది. దేశం కృత్రిమ మేథో సామర్ధ్యాలను పెంచటానికి ప్రభుత్వం ‘భారత్ -AI మిషన్’ ను ప్రారంభించింది. మనదేశ ప్రత్యేక అవసరాలను తీర్చేందుకు అవసరమైన AI నమూనాల నిర్మాణానికీ ఇది తోడ్పడుతోంది. 2047 నాటికి ప్రపంచ AI కేంద్రంగా ఆవిర్భవించాలని ఆకాంక్షిస్తుండగా, సామాన్య ప్రజలకోసం, .....పరిపాలనను మెరుగుపరచటం ద్వారా వారి జీవితాలను మెరుగుపరిచేందుకు .... సాంకేతిక పరిజ్ఞాన ప్రగతిని వినియోగించటంపైనే మన దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. 

 

సామాన్య ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం వ్యాపార, జీవన సౌలభ్యాలను మెరుగుపరచటంపై కూడా సమాన ప్రాధాన్యత ఉంది. సమాజం అంచుల్లో ఉన్నవారికి తోడ్పడి వారికి కొత్త అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి ప్రయోజనం నెరవేరుతుంది. ఇంకా, వీలైన ప్రతి రంగంలోనూ మనం ఆత్మ నిర్భరతను పెంచుకుంటూ వెళుతున్నాము. దీనివల్ల మన ఆత్మవిశ్వాసం పెరిగి వికసిత్ భారత దిశగా మన ప్రయాణానికి మరింతగా ఊపు లభించింది. 

 

గతవారం ఆగస్టు ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవంనాడు మన చేనేత కార్మికులు, వారి ఉత్పత్తులను గౌరవించుకున్నాం. స్వాతంత్ర సంగ్రామం సమయంలో 1905లో జరిగిన స్వదేశీ ఉద్యమాన్ని స్మరించుకునేందుకు 2015 సంవత్సరం నుంచి ఏటా ఈ రోజు జరుపుకుంటున్నాం. మనదేశంలో వృత్తి కళాకారులు స్వేదం చిందించి, శ్రమకోర్చి చేసిన ఉత్పత్తులను ప్రోత్సహించటానికీ, వారి అనుపమానమైన నైపుణ్యాలకు గుర్తింపు తీసుకురావటానికీ స్వదేశీ స్ఫూర్తిని మహాత్మా గాంధీ మరింతగా పెంపొందించారు. మనదేశంలో మేక్ ఇన్ ఇండియా పథకం ఆత్మ నిర్భరతా అభియాన్ వంటి జాతీయ పథకాలకు, ఉద్యమాలకు ఈ స్వదేశీ భావనే స్ఫూర్తిగా ఉంది. భారతీయ ఉత్పత్తులనే కొనుగోలు చేస్తామనీ, వినియోగిస్తామని మనం కృత నిశ్చయం చేసుకోవాలి. 

 

ప్రియమైన సహ పౌరులారా, 

 

సర్వతోముఖ ఆర్థిక వృద్ధికి తోడు సామాజిక రంగంలో పథకాలతో, 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించేందుకు మార్గం సుగమమైంది. అమృతకాలంలో దేశం ప్రగతి పథాన ముందుకి సాగుతుండగా, మనమందరం కూడా మన శక్తి యుక్తుల మేరకు మన వంతు కృషి అందిస్తున్నాం. సమాజంలో ముఖ్యంగా మూడు వర్గాలు - యువజనులు, మహిళలు, అణచివేతకు గురై గుర్తింపుకు నోచుకోని వర్గాల వారు- ఈ ప్రస్థానానికి నాయకత్వం వహిస్తారని నా విశ్వాసం. 

 

మన యువజనులకు తమ కలలు సాకారం చేసుకునేందుకు ఎట్టకేలకు సరైన వాతావరణం లభించింది. జాతీయ విద్యా విధానం అత్యంత కీలకమైన మార్పులు తీసుకువచ్చి విలువలను అభ్యాసంతోను, నైపుణ్యాలను సంప్రదాయంతోను సంధానం చేసింది. ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతున్నాయి. పారిశ్రామిక ఆకాంక్షలున్నవారి కోసం ప్రభుత్వం అత్యంత సానుకూల వ్యవస్థను ఏర్పాటు చేసింది. యువ మస్తిష్కాల ఇంధనంతో మన అంతరిక్ష కార్యక్రమం మునుపెన్నడూ లేని స్థాయిలో విస్తరిస్తోంది. శుభాన్షు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి జరిపిన ప్రయాణం ఒక తరం యావత్తుకు ----- స్వప్నసాకార స్ఫూర్తిని అందించిందని నేను భావిస్తున్నాను. త్వరలో మన దేశం చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర -- గగన్ యాస్ కు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. తొణికిసలాడుతున్న కొత్త ఆత్మవిశ్వాసంతో మన యువజనులు క్రీడలలో తమదైన ముద్ర వేస్తున్నారు. ఉదాహరణకి, చదరంగం భారతీయ యువజనులకు మునుపెన్నడూ లేని స్థాయిలో ఇప్పుడు విజయ క్షేత్రంగా మారింది. 2025 జాతీయ క్రీడా విధానంలో ఉన్న దార్శనికత ప్రకారం, ప్రపంచ క్రీడా కేంద్రంగా భారత్ ఆవిర్భవించేందుకు అవసరమైన పరివర్తనాత్మకమైన మార్పులను మనం త్వరలో చూడబోతున్నాం. 

 

మన ఆడపిల్లలు మనకు గర్వకారణం. రక్షణ, భద్రత సహా ప్రతి రంగంలోనూ వారు అన్ని అడ్డంకులనూ అధిగమిస్తున్నారు. అత్యుత్తమ ప్రతిభ, సాధికారత, శక్తి యుక్తులకు క్రీడలు ఒక ముఖ్యమైన సూచిక. భారత్ నుంచి 19 సంవత్సరాల యువతి, 38 ఏళ్ళ మహిళ ---- FIDE మహిళా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోటీ లో ఫైనల్స్ లో తలపడటం గమనార్హం. భిన్న తరాల మన మహిళల్లో ఉన్న సుస్థిర, ప్రపంచస్థాయికి దీటైన నైపుణ్యాలను ఇది రుజువు చేస్తోంది. ఉపాధి రంగంలో కూడా లింగ వ్యత్యాసాలు తగ్గుతున్నాయి. ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ అమలుతో మహిళల సాధికారత ..... నినాదానికే పరిమితం కాలేదు. వాస్తవ రూపం దాల్చింది.  

 

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు ఇతర వర్గాల తో కూడిన మన ప్రధాన సామాజిక వర్గం ---- అణచివేత అన్న పేరును త్యజిస్తోంది. వారి సామాజిక ఆర్థిక ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చురుకుగా సహాయం అందిస్తోంది. 

 

భారత్ తన నిజమైన సామర్ధ్యాన్ని ప్రదర్శించేందుకు అత్యంత వేగవంతంగా ముందుకు సాగుతోంది. మన సంస్కరణలు, విధానాలు ఒక సమర్థవంతమైన వేదికను సృష్టించడంతో, ముందున్న ఉజ్వల శకం నాకు కనిపిస్తోంది. అందులో ప్రతి ఒక్కరూ అత్యంత శక్తివంతంగా సర్వజనుల సౌభాగ్యానికి, సంతోషానికి తోడ్పడేలాగా తమ వంతు కృషి అందిస్తారని నేను భావిస్తున్నాను. 

 

సుస్థిరమైన సుపరిపాలన, అవినీతి రహిత భవిష్యత్తు దిశగా మనం ముందుకు సాగుతున్నాం. మహాత్మా గాంధీ చేసిన ఒక ముఖ్యమైన వ్యాఖ్య ఈ సమయంలో నాకు గుర్తుకొస్తోంది. 

 

అవినీతి, కృతకమైన ద్వంద్వ ప్రమాణాలు ప్రజాస్వామ్యానికి తప్పనిసరి పర్యవసానాలు కాకూడదు అని ఆయన అన్నారు. 

 

మహాత్మా గాంధీ ఈ ఆదర్శాన్ని మనం సాకారం చేస్తామని, అవినీతిని కూకటి వేళ్ళతో పెకలిస్తామనీ ప్రతిన చేద్దాం. 

 

ప్రియమైన సహ పౌరులారా, 

 

ఈ ఏడాది మనం ఉగ్రవాద పెను సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది. కశ్మీర్లో విహారయాత్రలో ఉన్న అమాయకులైన పౌరులను హతమార్చడం పిరికితనంతో కూడుకున్న, అమానుషమైన చర్య. మన దేశం దీనికి నిర్ణయాత్మకమైన పద్ధతిలో స్పందించి ఉక్కు సంకల్పంతో బదులిచ్చింది. దేశ రక్షణ విషయంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మన సాయిధ దళాలు సన్నద్ధంగా ఉన్నాయి అన్న విషయాన్ని ఆపరేషన్ సిందూర్ స్పష్టం చేసింది. వ్యూహాత్మక స్పష్టతతో, సాంకేతిక సామర్థ్యంతో మన సాయుధ దళాలు సరిహద్దు ఆవల ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేశాయి. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదం పై మానవాళి జరుపుతున్న పోరాటానికి ఒక అత్యుత్తమ ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోతుందని నేను విశ్వసిస్తున్నాను. 

 

ఉగ్రవాద దాడికి మనం ఇచ్చిన బదులులో ప్రధానంగా గుర్తించవలసింది మన సమైక్యత. మనని విభజించాలని కుట్రపన్నిన వారికి జవాబు అత్యంత దీటుగా ఇవ్వడంలో ఉన్న సమైక్యత. పార్లమెంట్ సభ్యులు వివిధ దేశాలకు ప్రయాణించి ఉగ్రవాదం పట్ల మన దేశ వైఖరిని వివరించినప్పుడు కూడా ఇదే సమైక్యత గోచరించింది. మన వైఖరిని ప్రపంచం అంతా గుర్తించింది. మనం ఏనాటికి దురాక్రమణ దాడులకు పాల్పడబోమని, కానీ మన పౌరుల రక్షణ కోసం దీటుగా జవాబు ఇచ్చేందుకు వెనుకాడబోమని ప్రపంచం ఈనాడు గుర్తించింది. 

 

ఆపరేషన్ సిందూర్ రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత మిషన్ కు ఒక ప్రయోగంగా కూడా నిలిచింది. ఈ ప్రయోగ ఫలితం మనం సరైన మార్గంలో ముందుకు సాగుతున్నాం అన్న విషయం రుజువు కావడం. మన దేశీయ తయారీ రంగం మన భద్రతా అవసరాలను తీర్చుకోవడంలో స్వావలంబన సాధించామని, స్పందనకు అవసరం అయిన క్రిటికల్ స్థాయికి మన తయారీ చేరుకుందని కూడా చూపించింది. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారత రక్షణ చరిత్రలో ఇవి చెప్పుకోదగ్గ కీలక విజయాలు. 

 

ప్రియమైన సహపౌరులారా 

 

ఈ సందర్భంగా నేను పర్యావరణాన్ని కాపాడేందుకు మీలో ప్రతి ఒక్కరూ చేయగలిగినంత కృషి చేయాలని పిలుపునిస్తున్నాను. వాతావరణంలో మార్పులను ఎదుర్కొనేందుకు మనం కూడా మారాలి. మన అలవాట్లను ప్రపంచం పట్ల మన దృక్పథాన్ని మార్చుకోవాలి. మన భూమి నదులు పర్వతాలు మన మొక్కలు వన్యప్రాణులతో మనకున్న అనుబంధాన్ని మార్చుకోవాలి. మనమందరము కలిసి కృషి చేస్తే సహజ పద్ధతిలో జీవనం వికసించి, వృద్ధి చెంది, విలసిల్లే ఒక భూగ్రహాన్ని భవిష్యత్తరాలకు అందించి వెడతాము. 

 

ప్రియమైన సహ పౌరులారా, 

 

మన సరిహద్దులను కాపాడుతున్న సైనికులు, పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల గురించి ఈనాడు ప్రత్యేకంగా నేను ఆలోచిస్తున్నాను. వారికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విదేశాల్లో దౌత్య కార్యాలయాల్లో ఉన్న భారతీయ అధికారులకు, భారతీయ సంతతికి చెందిన వారికి కూడా నా స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు.

 

దేశ ప్రజలందరికీ కూడా మరొకసారి నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 

 

ధన్యవాదాలు 

జైహింద్, జై భారత్

 

***


(Release ID: 2156622)