పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. ప్రత్యేక అతిథులుగా 210 మంది పంచాయతీ నేతలు
• దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఏఐ ఆధారిత ‘‘సభాసార్’’కు శ్రీకారం..
• పంచాయతీ నేతలకు సత్కారం
Posted On:
13 AUG 2025 11:25AM by PIB Hyderabad
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంద్రాగస్టుకు న్యూఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించే వేడుకలో 28 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 210 మంది పంచాయతీ ప్రతినిధులకు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ (ఎంఓపీఆర్) ఆతిథ్యమివ్వనుంది. తమ జీవన భాగస్వాములు, నోడల్ అధికారులు సహా మొత్తం 425 మంది ఈ సంబరాల్లో పాల్గొననున్నారు.
ఈ ప్రత్యేక అతిథులకు ఒక రోజు ముందుగానే అంటే ఈ నెల 14న న్యూఢిల్లీలో సంప్రదాయపూర్వకంగా ఒక సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్‌తో పాటు ఆ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘెల్ కూడా హాజరు కానున్నారు. ఎంఓపీఆర్ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ సహా మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సంవత్సరం నిర్వహించే కార్యక్రమానికి ‘‘ఆత్మనిర్భర్ పంచాయతీ, వికసిత్ భారత్‌కు గుర్తు’’ అనే అంశాన్ని ప్రధాన ఇతివత్తంగా ఎంపిక చేశారు. ఇది ‘వికసిత్ భారత్’ వైపు పయనించడంలో స్వావలంబన సహిత పంచాయతీల ఏర్పాటు కీలకం అనే దృష్టి కోణాన్ని చాటిచెబుతుంది. పంచాయతీ ప్రతినిధులకు సత్కారోత్సవంలో భాగంగా, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్.. ఏఐ) చోదక శక్తిగా నిలిచే సభాసార్ అప్లికేషన్ (‘‘SabhaSaar’’ Application)ను ప్రారంభించడంతో పాటు గ్రామోదయ్ సంకల్ప్ పత్రిక 16వ సంచికను ఆవిష్కరించనున్నారు.
పంచాయతీల మహిళా నేతలను అనేక మందిని ఈ ఏడాది ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. ఈ పంచాయతీ ప్రతినిధులు తమ తమ గ్రామ పంచాయతీల్లో మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడం, ప్రజలకు అందించే సేవలను మునుపటికన్నా పెంచడంతో పాటు సమాజంలో అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకు వెళ్లే కార్యక్రమాలను అమలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సరికొత్త నాయకత్వ శక్తి తెర మీదకు రావడానికి మార్గదర్శకత్వాన్ని అందించారు. వీరు దేశంలో వివిధ ప్రాంతాలకు చెందినవారయినప్పటికీ తమ పాలనా బాధ్యతలకు ముందుచూపుతో కూడిన అభివృద్ధి విధానాలను జతపరిచి అనేక విజయాలు సాధించారు. ఈ విశిష్ట అతిథులు ‘హర్ ఘర్ జల్ యోజన’, ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్’, ‘మిషన్ ఇంద్రధనుష్’ తదితర ప్రభుత్వ ప్రధాన పథకాల ఫలాలను లక్షిత లబ్ధిదారులందరికీ అందేటట్లు చూడడమే కాకుండా, క్షేత్రస్థాయుల్లో కొత్త కొత్త కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ, సమస్యలకు సరికొత్త పరిష్కారాలను చూపాల్సిందిగా ఔత్సాహికులను ఆహ్వానించడంలో ముందుంటున్నారు.
***
(Release ID: 2155982)
Read this release in:
English
,
Hindi
,
Punjabi
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Bengali-TR
,
Manipuri
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam