ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీ కర్తవ్య పథ్‌లో కర్తవ్య భవన్ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

Posted On: 06 AUG 2025 9:20PM by PIB Hyderabad

కేంద్ర కేబినెట్ సహచరులు, కార్యక్రమానికి హాజరైన గౌరవ పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వోద్యోగులు, ఇతర విశిష్ట అతిథులు, సోదరీ సోదరులారా!

 

ఆగస్టు నెల విప్లవాల మాసం. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఈ చరిత్రాత్మక ఘట్టం! నవ భారత నిర్మాణం దిశగా ఒక్కో విజయమూ సాకారమవుతోంది. ఇక్కడే దేశ రాజధాని ఢిల్లీలో కర్తవ్య పథ్, కొత్త సంసద్ భవన్ (పార్లమెంట్ భవనం), కొత్త రక్షా భవన్ (రక్షణ కార్యాలయ సముదాయం), భారత్ మండపం, యశోభూమి, అమరవీరుల స్మారకార్థం జాతీయ యుద్ధ స్మారక చిహ్నం, నేతాజీ సుభాష్ బాబు విగ్రహం, ఇప్పుడు ఈ కర్తవ్య భవన్‌లను నిర్మించాం. ఇవి కేవలం కొత్త భవనాలో లేదా సాధారణ మౌలిక సదుపాయాలో మాత్రమే కాదు... ఈ భవనాల్లోనే ఈ అమృతకాలంలో ‘వికసిత భారత్’ కోసం విధానాలు రూపుదిద్దుకోబోతున్నాయి. ‘వికసిత భారత్’ కోసం కీలక నిర్ణయాలను ఇందులోనే తీసుకోబోతున్నారు. వచ్చే దశాబ్దాల్లో ఈ భవనాలే దేశం దశా దిశా నిర్ణయించబోతున్నాయి. కర్తవ్య భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ, దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లు, కార్మికులందరికీ కూడా ఈ వేదికపై నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 

 

మిత్రులారా,

 

అనేక చర్చోపచర్చల అనంతరం ఈ భవనానికి ‘కర్తవ్య భవన్’గా పేరు పెట్టాం. కర్తవ్య పథ్, కర్తవ్య భవన్ వంటి పేర్లు మన ప్రజాస్వామ్యం, మన రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు – న మే పార్థ అస్తి కర్తవ్యం త్రిశు లోకేశు కించన్, నాన్ వాప్తం అవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణీ. అంటే మనం ఏమి సాధించాలో లేదంటే ఇంకా దేన్ని సాధించలేదో అన్న ఆలోచనలకు అతీతంగా కర్తవ్య స్ఫూర్తితో పనిచేయాలి. భారతీయ సంస్కృతిలో ‘కర్తవ్యం’ అంటే కేవలం బాధ్యతకే పరిమితం కాదు. కర్తవ్యమన్నది ఆచరణ ప్రధాన తాత్వికతకు మౌలిక స్ఫూర్తి. ‘నేను’ అనే భావనకు అతీతంగా సమస్తాన్నీ ఆదరించే ఓ గొప్ప దార్శనికత. అదే కర్తవ్యానికి నిజమైన నిర్వచనం. అందుకే, ‘కర్తవ్య’ కేవలం ఓ భవనం పేరు మాత్రమే కాదు.. కోట్లాది భారతీయుల కలలను సాకారం చేసే పవిత్ర వేదిక ఇది. కర్తవ్యమే ఆరంభం, కర్తవ్యమే లక్ష్యం. కారణ్యమూ అంకితభావాలతో ముడిపడి ఉన్న కృషి.. అదే కర్తవ్యం. స్వప్నాలను సాకారం చేసుకోవడంలో తోడుండేది కర్తవ్యం. దృఢచిత్తంతో కూడిన సంకల్పమది. కఠోర పరిశ్రమకు పరాకాష్ట. అందరి జీవితాలనూ దేదీప్యం చేయగల సంకల్పశక్తి కర్తవ్యానికుంది. కోట్లాది దేశప్రజల హక్కుల పరిరక్షణకు కర్తవ్యమే పునాది. భరతమాత జీవశక్తికి పతాకధారి ఇది. నాగరిక దేవో భవః అన్న మంత్ర పఠనమే అది. దేశం పట్ల భక్తితో చేసే ప్రతి చర్య కర్తవ్యమే.

 

మిత్రులారా,

 

స్వాతంత్ర్యానంతరం దశాబ్దాల పాటు దేశ పరిపాలన యంత్రాంగం బ్రిటీష్ హయాంలో నిర్మించిన భవనాల నుంచే కొనసాగింది. దశాబ్దాల కిందట నిర్మించిన ఈ పరిపాలన భవనాల్లో పని పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉండేవో మీకు తెలుసు. దానిపై ఇప్పుడే ఓ వీడియోను మనం చూశాం. అక్కడ పనిచేసే వారికి తగినంత స్థలమూ సరైన వెలుతురూ లేవు. వాయు ప్రసారం తగినంత జరిగేది కాదు. ఒకసారి ఊహించండి - హోం శాఖ వంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖ దాదాపు వందేళ్లుగా తగిన సదుపాయాలు లేకుండానే అదే భవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంతేకాదు, భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు ఢిల్లీలోని 50 వేర్వేరు ప్రదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో చాలా వరకు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. వీటికి చెల్లిస్తున్న అద్దె కూడా భారీగానే ఉంది. నిజానికి ఈ ఖర్చు మొత్తాన్నీ లెక్కిస్తే అది భారీగా ఉంటుంది. కానీ స్థూలంగా ఓ అంచనాకొచ్చినా కూడా.. అది ఏడాదికి దాదాపు రూ. 1,500 కోట్లు అవుతుంది. ఇంత మొత్తాన్నీ భారత ప్రభుత్వం ఏటా వివిధ మంత్రిత్వ శాఖల అద్దెల కోసమే ఖర్చు చేస్తోంది. మరో సమస్య కూడా ఉంది. సహజంగానే పని అవసరాల రీత్యా ఉద్యోగులు ఒక మంత్రిత్వ శాఖ నుంచి మరో శాఖకు వెళ్లాల్సి వస్తుంది. రోజుకు 8 వేల నుంచి 10 వేల ఉద్యోగులు ఆ విధంగా వెళ్లాల్సి వస్తోందని ఓ అంచనా. దీనివల్ల వందలాది వాహనాల రాకపోకలు, అదనపు ఖర్చులు, రోడ్డుపై రద్దీ పెరగడంతోపాటు సమయం వృథా అవుతుంది. వీటితో పనితీరు మందగించడం మినహా మరేమీ కాదు.

మిత్రులారా,

 

21వ శతాబ్దపు భారత్‌కు ఈ శతాబ్దానికి తగిన ఆధునిక వ్యవస్థలు అవసరం. అవే ప్రమాణాలతో.. టెక్నాలజీ, భద్రత, సౌలభ్యం పరంగా అద్భుతమైన భవనాలు కూడా అవసరమే. ఉద్యోగులకు సౌకర్యంగా, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేలా, సేవలు సులభంగా అందుబాటులో ఉండేలా వాటిని తీర్చిదిద్దాలి. అందుకే, కర్తవ్య పథ్ చుట్టుపక్కల ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంతో కర్తవ్య భవన్ వంటి బృహత్తర భవనాలను నిర్మిస్తున్నాం. నిర్మాణం పూర్తయిన మొదటి కర్తవ్య భవన్ ఇదే. మరెన్నో నిర్మాణాల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ కార్యాలయాలు ఒకదానికొకటి సమీపంలోకి వచ్చిన తర్వాత.. ఉద్యోగులకు సరైన పని వాతావరణం, అవసరమైన సౌకర్యాలు లభిస్తాయి. వారి పనితీరులో సమర్థత కూడా పెరుగుతుంది. ఇప్పుడు అద్దె కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్న రూ.1,500 కోట్లు కూడా ఆదా అవుతాయి.

 

మిత్రులారా,

 

ఈ అద్భుతమైన కర్తవ్య భవన్, ఈ ప్రాజెక్టులు, కొత్త రక్షణ కార్యాలయాల సముదాయం, దేశంలోని అన్ని ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు... ఇవన్నీ దేశ వేగవంతమైన పురోగతిని మాత్రమే కాకుండా, భారత అంతర్జాతీయ దృక్పథాన్నీ ప్రతిబింబిస్తున్నాయి. ప్రపంచానికి భారత్ అందిస్తున్న ప్రతి ఆదర్శాన్నీ అది ఆచరిస్తున్న తీరును అవి కళ్లకు కడుతున్నాయి. మన మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ‘మిషన్ లైఫ్’ను మనం ప్రపంచానికి అదించాం, ‘ఒకే భూమి, ఒకే సూర్యుడు, ఒకే గ్రిడ్’ భావనను అందించాం. ఆశాజనకమైన మానవాళి భవిత దిశగా భారత్ దార్శనికతను ఇవి వెల్లడిస్తున్నాయి. ప్రజోపయోగమే పరమావధిగా ఆత్మలోనూ, పర్యావరణ హితంగా నిర్మాణంలోనూ రూపుదిద్దుకున్న కర్తవ్య భవన్ వంటి ఆధునిక మౌలిక సదుపాయాలు నేడు మీకు కనిపిస్తున్నాయి. కర్తవ్య భవన్ పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. వ్యర్థాల నిర్వహణ కోసం అధునాతన వ్యవస్థలను అనుసంధానించారు. పర్యావరణ హితంగా భవన నిర్మాణాలకు భారత్‌లో ప్రస్తుతం ఆదరణ పెరుగుతోంది.

 

మిత్రులారా,

 

సమగ్ర దృక్పథంతో దేశ పునర్నిర్మాణంలో మా ప్రభుత్వం నిమగ్నమై ఉంది. నేడు దేశంలో అభివృద్ధి ప్రవహించని ప్రాంతమంటూ లేదు. ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తే.. దేశవ్యాప్తంగా 30 వేలకు పైగా పంచాయతీ భవనాలను కూడా నిర్మించాం. ఇక్కడ కర్తవ్య భవన్ వంటి నిర్మాణాలను చేపడుతుండగా.. అదే సమయంలో పేదల కోసం నాలుగు కోట్లకు పైగా శాశ్వత గృహాలను నిర్మించాం. ఇక్కడ జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని, పోలీసు స్మారకాన్ని నిర్మించగా.. దేశవ్యాప్తంగా 300కు పైగా కొత్త మెడికల్ కాలేజీలను నెలకొల్పాం. ఇక్కడ భారత్ మండపాన్ని నిర్మించాం. మరోవైపు, దేశవ్యాప్తంగా 1,300కు పైగా కొత్త అమృత భారత్ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. అలాగే ఇక్కడి యశోభూమి వైభవం.. గత పదకొండేళ్లలో నిర్మించిన దాదాపు 90 కొత్త విమానాశ్రయాల్లోనూ ప్రతిబింబిస్తుంది.

 

మిత్రులారా,

 

హక్కులు, విధులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని మహాత్మాగాంధీ చెప్పేవారు. విధులను సక్రమంగా నిర్వర్తిస్తేనే మన హక్కులు బలోపేతమవుతాయి. ప్రజలు తమ విధులను నిర్వర్తించాలని ఆశిస్తున్నాం. అలాగే ప్రభుత్వం కూడా తన విధులకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తే, అది పరిపాలనలో ప్రతిబింబిస్తుంది. గత దశాబ్దం దేశంలో సుపరిపాలన దశాబ్దమన్న విషయం మీ అందరికీ తెలిసిందే. సుపరిపాలనకూ అభివృద్ధి ప్రవాహానికీ సంస్కరణలే మూలం. సంస్కరణలన్నవి స్థిరమైన, నిర్దేశిత కాల వ్యవధితో కూడిన ప్రక్రియలు. అందుకే దేశంలో ఎప్పటికప్పుడు కీలక సంస్కరణలు చేపట్టాం. మా సంస్కరణలు స్థిరమైనవి, క్రియాశీలమైనవి, ముందుచూపుతో కూడినవి. ప్రభుత్వానికీ ప్రజలకూ నడుమ సంబంధాలను బలోపేతం చేస్తూ, జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తూ, అణగారిన వర్గాలకు ప్రాధాన్యమిస్తూ, మహిళలను సాధికారులను చేస్తూ, ప్రభుత్వ పనితీరును మెరుగుపరుస్తూ... వినూత్న మార్గాల్లో ఈ దిశగా దేశం నిరంతరం కృషిచేస్తోంది. గత పదకొండేళ్లలో దేశంలో పారదర్శకమైన, అంతరాయాలు లేని, ప్రజలే కేంద్రంగా ఉన్న పాలన వ్యవస్థను నెలకొల్పినందుకు గర్విస్తున్నాం. 

 

మిత్రులారా,

 

నేను ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా, జన్ ధన్- ఆధార్- మొబైల్ (‘జేఏఎం’) ఈ మూడింటి గురించే.. అందరూ ప్రస్తావిస్తున్నారు. జేఏఎంకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. మన దేశంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాల్ని ప్రజలకు అందించడంలో పారదర్శకత్వానికి జేఏఎం పెద్దపీట వేయడంతో పాటు, ఆ ప్రయోజనాలను దక్కవలసిన వాళ్లకు కాకుండా ఇతర వర్గాలకు మళ్లించడాన్ని అడ్డుకుంది. దేశంలో రేషన్ కార్డును, గ్యాస్ సబ్సిడీని అందుకొనేవాళ్లు కావొచ్చు.. స్కాలర్‌షిప్ లబ్ధిదారులు కావొచ్చు.. సుమారు 10 కోట్ల మంది అసలు పుట్టినట్టు దాఖలాయే లేదని తెలిసి, ముక్కుమీద వేలేసుకొన్నారు చాలా మంది. అవును, ఈ సంఖ్య చూస్తే మీరు షాకవుతారు. 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారుల పేర్ల మీద ఇదివరకటి ప్రభుత్వాలు డబ్బును పంపుతూ ఉంటే, ఆ డబ్బు మధ్యవర్తుల ఖాతాల్లో పడుతూవచ్చింది. అలాంటి 10 కోట్ల నకిలీ పేర్లను ఈ ప్రభుత్వం జాబితాల్లోంచి తీసేసింది. దీంతో 4.3 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ సొమ్ము అర్హులు కానివారి చేతుల్లోకి పోకుండా మిగిలిందని తాజా సమాచారాన్ని బట్టి చూస్తే తెలిసింది. మీరే ఊహించండి.. 4.3 లక్షల కోట్ల రూపాయల చోరీ.. ఇప్పుడు ఈ డబ్బును దేశాభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. అంటే అటు లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారు, ఇటు జాతి వనరులనూ రక్షించినట్లయింది.      

 

మిత్రులారా,

 

ఇది ఒక్క అవినీతి, ప్రయోజనాలను వాటిని ఉద్దేశించిన వర్గాలకు కాకుండా ఇతరులకు అందజేయడం.. ఈ రెండూ మాత్రమే కాకుండా అనవసర నియమ, నిబంధనలు.. ఇవి కూడా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వచ్చాయి. ప్రభుత్వం నిర్ణయాల్ని మెల్లగా తీసుకొనేటట్లు చేశాయివి. అందుకే మేం 1,500 కన్నా మించిన పాత చట్టాల్ని రద్దు చేశాం. ఈ చట్టాల్లో చాలా చట్టాలు బ్రిటిషు కాలం నాటివి. ఎన్నో దశాబ్దాలు గడిచిపోయినా ఇవి అడ్డంకులుగా నిలుస్తూ వచ్చాయి. చట్ట నిబంధనల్ని పాటించాల్సిన ఒక పెద్ద బరువును కూడా మన దేశం మోయాల్సివచ్చింది. ఏ పనిని మొదలుపెట్టాలన్నా, అనేక పత్రాల్ని దాఖలు చేయాల్సివచ్చేది. గత పదకొండేళ్లుగా, పాటించి తీరాల్సిన 40 వేల కంటే ఎక్కువ నియమాల్ని తొలగించాం. ఈ పని పూర్తయిపోలేదు.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

 

 

మిత్రులారా,

 

కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ సెక్రటరీలుగా ఉన్నవారు ఈ సభకు హాజరయ్యారు. ఇంతకు ముందు.. చాలా విభాగాగాల్లో, మంత్రిత్వ శాఖల్లో బాధ్యతలు, అధికారాలు చాలా మంది చేతుల్లో ఉండేవన్న విషయం మీకు తెలుసు. దీంతో నిర్ణయాలను వాయిదా వేయడంతో పాటు పనిలో జాప్యమయ్యేది. చేసిన పనిని మళ్లీ చేయకుండా వివిధ విభాగాల్ని మేం కలిపేశాం. కొన్ని శాఖల్ని కలిపి, అవసరమైన చోట్ల కొత్త శాఖల్ని ఏర్పాటు చేశాం. ఉదాహరణకి, జల భద్రతపై దృష్టి పెట్టి జలశక్తి శాఖను ఏర్పాటు చేశాం. సహకార ఉద్యమాన్ని బలపరిచే ఉద్దేశంతో సహకార శాఖను ఏర్పాటు చేశాం. మొట్టమొదటిసారి, మత్స్య పరిశ్రమకంటూ ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. మరి మన యువతను దృష్టిలో పెట్టుకొని నైపుణ్యాభివృద్ధి శాఖను నెలకొల్పాం. ఈ నిర్ణయాలు ప్రభుత్వ సామర్థ్యాన్నిపెంచి, సేవల్ని వెంటనే అందించడానికి తోడ్పడ్డాయి.

మిత్రులారా,

 

ప్రభుత్వంలో పనులు పూర్తయ్యే పద్ధతుల్ని మెరుగుపరచడానికి మేం శ్రమిస్తున్నాం. ‘మిషన్ కర్మయోగి’, ‘ఐ-గాట్’ (i-GOT) వంటి డిజిటల్ వేదికలతో మన ప్రభుత్వోద్యోగులను సాంకేతికంగా మెరికలుగా తీర్చిదిద్దుతున్నారు. ‘ఈ-ఆఫీస్’ వ్యవస్థలు, ఫైళ్లు ఏ దశలో ఉందీ గుర్తించడం, డిజిటల్ పద్ధతిలో ఆమోదాన్ని తెలియజేయడం.. ఇవి వేగవంతమైన, జాడ తెలుసుకోగలిగిన ఫ్రేంవర్కును మనకు అందిస్తున్నాయి.

 

 

మిత్రులారా,

 

మనం ఒక కొత్త ఇంట్లోకి వెళ్లినప్పుడు, మనకు భలే హుషారుగా ఉంటుంది. మనలో శక్తి ఉరకలేస్తూ ఉంటుంది. ఇప్పుడు, అదే ఉత్సాహంతో, మీరు ఈ కొత్త భవనంలో మీమీ బాధ్యతల్ని నిర్వర్తించబోతున్నారు. మీరు చేస్తున్న ఉద్యోగం ఏదైనా, మీ పదవీకాలం గుర్తుండిపోయే విధంగా పనిచేయండి. మీరు ఈ స్థలాన్ని విడిచిపెట్టేటప్పుడు, దేశానికి సేవ చేయడానికి మీలో ఉన్న శక్తినంతా ధారపోశారని మీకు అనిపించాలి.

 

 

మిత్రులారా,

 

ఫైళ్ల విషయంలో మన ఆలోచనల తీరును కూడా మార్చుకోవాలి. ఒక ఫైలు, ఫిర్యాదు, దరఖాస్తు.. ఇవి రోజువారీ అంశాలే కదా అని అనిపించవచ్చు. అయితే కొందరికి మాత్రం, ఈ ఒక్క కాగితమే వారి ఆశల పల్లకీ కావొచ్చు.. ఒకే ఒక ఫైలు ఎంతో మంది జీవితాలతో ముడిపడ్డ బంధం కావొచ్చు. ఉదాహరణకు, ఒక లక్ష మందిని ప్రభావితం చేసే ఒక ఫైలు ఉందనుకొందాం.. ఆ ఫైలు మీ దగ్గర ఒకే రోజు నిలిచిపోయిందనుకోండి.. దానర్థం ఒక లక్ష పనిదినాలు నష్టపోయినట్లే. మీరు చేయాల్సిన పనిని ఈ విధంగా చూస్తే, మీకు సౌకర్యవంతంగా ఉందా?, మీ సొంత ఆలోచన ఏమిటి? అనే వాటి కంటే ఇది మించింది అనే సంగతిని మీరు గ్రహిస్తారు.. సేవ చేయడానికొక భారీ అవకాశం దక్కింది కదా అని మీరు భావిస్తారు. మీకు ఒక కొత్త ఆలోచన వస్తే ఒక పెనుమార్పునకు మీరు పునాది వేసినట్లు కావొచ్చు. ఇలాంటి కర్తవ్య నిర్వహణ స్ఫూర్తితో, మనమందరం దేశాభివృద్ధికి సదా అంకితమవ్వాలి. కర్తవ్య పాలన ద్వారానే ‘వికసిత్ భారత్’ కలలు నెరవేరుతాయి అని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుని తీరాలి.

 

మిత్రులారా,

 

ఈ రోజు, విమర్శలు గుప్పించడానికి తగిన సందర్భమేంకాదు.. మనసు లోపలికి తొంగి చూసుకు తీరాల్సిన సందర్భమిది. మనం స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్న కాలంలోనే స్వతంత్రాన్ని సాధించుకున్న అనేక దేశాలు అభివృద్ధి బాటలో దూసుకుపోయాయి. అయితే భారత్ ఆ జోరును కనబరచలేకపోయింది.. దీనికి కారణాలు అనేకం ఉండి ఉండాలి. ఇక, ఏమైనా, సమస్యల్ని రాబోయే తరాల వారికి మిగల్చకూడదన్నదే మన మీద ఉన్న బాధ్యత. పాత భవనాల్లో మనం తీసుకున్న నిర్ణయాలు, మనం రూపొందించిన విధానాలు 25 కోట్ల మందిని పేదరిక వలయంలో నుంచి బయటకు తీసుకువచ్చే ధైర్యాన్ని మనకు అందించాయి. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్న నిజం ఒక గొప్ప విజయం. అయితే ప్రతి విజయం సాధించిన తర్వాత, మరొక కొత్తదానిని గురించి నేను ఆలోచిస్తూ ఉంటా. ఇప్పుడు, ఈ కొత్త భవనాల్లో, మనం మరింత ఎక్కువ దక్షతతో, మనకు చైతనైనంతవరకు దేశానికి సేవ చేయాలనే మనస్తత్వంతో పనిచేసి తీరాలి. అలా పనిచేసినప్పుడు, మనం భారత్‌ను పేదరికం ఆనవాళ్లే ఉండని దేశంగా తీర్చిదిద్దొచ్చు. ఈ భవనాల్లో శ్రమిస్తూనే, ‘వికసిత్ భారత్’ కలను నెరవేరుస్తాం. ఈ లక్ష్యం మనందరి ఉమ్మడి కృషితోనే నెరవేరుతుంది. మనం కలిసికట్టుగా, మన దేశాన్ని ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా నిలబెట్టితీరాలి. మనం కలిసికట్టుగా, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ విజయ గాథల్ని రాసితీరాలి. మన సొంత పనితీరుతో పాటు దేశం పనితీరును కూడా మరింతగా మెరుగుపరుస్తామని మనం సంకల్పం చెప్పుకోవాలి. పర్యటన రంగం విషయానికి వస్తే, ప్రపంచం నలుమూలల నుంచీ ప్రజలు భారత్‌కు తరలిరావాలి. బ్రాండ్ల ప్రస్తావన వస్తే, ప్రపంచ దేశాలన్నీ భారతీయ బ్రాండ్లకేసే చూడాలి. విద్యారంగం ప్రసక్తి వస్తే, ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు భారత్‌లో చదువుకోవడానికి కదిలిరావాలి. భారత్ శక్తిని బలపరచడమే మీ జీవిత లక్ష్యంగా మారాలి.        

 

 

మిత్రులారా,

 

విజయవంతమైన దేశాలు ముందుకు సాగిపోయేటపుడు, తమ సానుకూల దృక్పథాన్ని విడిచిపెట్టవు, నిలబెట్టుకొంటాయి. ప్రస్తుతం భారత్ ఈ తరహా ‘వికాస్-విరాసత్’ (అభివృద్ధితో పాటు వారసత్వం) దృష్టికోణంతో పురోగమిస్తోంది. కొత్త కర్తవ్య భవన్‌ను ప్రారంభించినందువల్ల, నార్త్ బ్లాక్‌తో పాటు సౌత్ బ్లాకు కూడా భారత ఘన వారసత్వంలో భాగమవుతాయి. ఈ బ్లాకులను ‘‘యుగే యుగీన్ భారత్’’ పేరుతో దేశ ప్రజలకు ఉద్దేశించిన ఒక మ్యూజియంగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో మన దేశ చరిత్రాత్మక ప్రస్థానాన్ని దేశ పౌరులు కళ్లారా చూడగలుగుతారు. మనం కర్తవ్య భవన్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఈ స్థలానికి ఉన్న వారసత్వాన్ని, ఇది అందించే ప్రేరణను మనమంతా గుండెలో నింపుకొంటామని నేను నమ్ముతున్నా. కర్తవ్య భవన్ ప్రారంభ వేళ నా తోటి భారతీయులకు నేను మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా.

 

ధన్యవాదాలు. ‌

 

***

 


(Release ID: 2153965)