ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై ప్రత్యేక చర్చ కింద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Posted On: 29 JUL 2025 10:06PM by PIB Hyderabad

గౌరవ అధ్యక్షా!


ప్రస్తుత పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు నేను పత్రికా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా- ఈ సమావేశాన్ని దేశ కీర్తిప్రతిష్ఠలను ప్రస్తుతించేదిగా, భారత్‌ ‘విజయోత్సవం’గా పరిగణిద్దామని గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ విజ్ఞప్తి చేశాను.

గౌరవ అధ్యక్షా!

ఈ ‘విజయోత్సవం’ గురించి వివరించే నేపథ్యంలో ఉగ్రవాద ప్రధాన కేంద్రం నేలమట్టం కావడాన్ని సూచించే వేడుకగా దీన్ని పేర్కొంటున్నా. విజయోత్సవం అంటున్నానంటే- నుదుటి సిందూరం సాక్షిగా చేసిన ప్రతిన నెరవేర్చడంగా అభివర్ణిస్తున్నా. ఈ విజయోత్సవం మన సాయుధ దళాల శౌర్యపరాక్రమాలకు నీరాజనం. ఈ విజయోత్సవం 140 కోట్ల మంది భారతీయుల ఐక్యత, సంకల్ప శక్తి, సమష్టి విజయానికి చిహ్నమంటున్నా.

గౌరవ అధ్యక్షా!

ఈ విజయమిచ్చిన స్ఫూర్తితోనే సభ సమక్షాన భారత్ దృక్పథాన్ని దృఢంగా చాటుతున్నా. ఈ దృక్కోణాన్ని దర్శించలేని వారికి స్పష్టంగా అవగతమయ్యేలా నా ప్రసంగంతో అద్దం పడుతున్నా.

గౌరవ అధ్యక్షా!

దేశంలోని 140 కోట్ల మంది పౌరుల భావోద్వేగాలతో గళం కలపడానికే నేనివాళ సభకు వచ్చాను. ఈ సమష్టి భావన సభలో ప్రతిధ్వనిస్తున్న నేపథ్యంలో ఆ స్ఫూర్తికి నా స్వరం కూడా  జోడిస్తున్నా.

గౌరవ అధ్యక్షా!

ఆపరేషన్ సిందూర్ సమయంలో తిరుగులేని మద్దతుతో ఆశీర్వదించిన దేశ ప్రజానీకానికి సదా రుణపడి ఉంటాను. ఈ విజయంలో పౌరులు పోషించిన పాత్రకు కృతజ్ఞుడినై, వారికి అభివందనం చేస్తున్నా!

గౌరవ అధ్యక్షా!

పహల్గామ్‌లో 2025 ఏప్రిల్ 22నాటి అమానుష ఉగ్రదాడి క్రూరత్వానికి పరాకాష్ఠ. ఉగ్రవాదులు మతం గురించి వాకబు చేసి మరీ, అమాయకులను కాల్చి చంపారు. దేశంలో మత విద్వేషం రెచ్చగొట్టి, హింసాగ్ని రగల్చాలన్నదే వారి దురుద్దేశం. అయితే, దేశ ప్రజానీకం ఏకతాటిపై నిలిచి, పునరుత్ధాన శక్తితో ముష్కర కుట్రను భగ్నం చేసినందుకు వారికి నా కృతజ్ఞతలు.

గౌరవ అధ్యక్షా!

పహల్గామ్‌ ఉదంతం తర్వాత ప్రపంచానికి భారత్ వైఖరిని స్పష్టం చేయడం కోసం ఆంగ్లంలో కూడా నేను బహిరంగ ప్రకటన చేశాను. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలన్నది భారత్ దృఢ సంకల్పమని, ముష్కరులను మట్టిగరిపిస్తామని నేను ప్రతినబూనా. ఇంతటి క్రౌర్యానికి పాల్పడిన సూత్రధారులను వారు కలలోనైనా ఊహించని రీతిలో శిక్షిస్తామని కూడా ప్రకటించా. ఏప్రిల్‌ 22న విదేశీ పర్యటనలో ఉన్న నేను తక్షణ సమాచారంతో వెంటనే తిరిగి వచ్చి, ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశా. ఉగ్రవాదంపై నిర్ణయాత్మక ప్రతిస్పందన దిశగా ఆ సమావేశంలో విస్పష్ట సూచనలిచ్చా. ఉగ్రవాదంపై జాతీయ సంకల్పంతో నిర్ణయాత్మకంగా ప్రతిస్పందించడం అవశ్యమని స్పష్టం చేశా.

గౌరవ అధ్యక్షా!

మన సాయుధ దళాల శక్తిసామర్థ్యాలు, సాహసంపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆపరేషన్ సమయం, ప్రదేశం, ప్రతిస్పందన విధాన నిర్ణయాధికారం తదితర కార్యాచరణ దిశగా సైన్యానికి సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చాం. ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. వాటిలో కొన్ని ప్రసార-ప్రచురణ మాధ్యమాల్లో కూడా వెల్లడయ్యాయి. ఉగ్రవాదులకు విధించిన శిక్ష అత్యంత ప్రభావశీలం కావడంతో సూత్రధారులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.

గౌరవ అధ్యక్షా!

భారత సాయుధ దళాల విజయం వెనుకగల దృక్కోణాన్ని ఈ సభ ద్వారా దేశంతోపాటు ప్రజల ముందుంచుతున్నా. ఇందులో మొదటిది... పహల్గామ్ దాడి అనంతరం భారత్‌ తీవ్రస్థాయిలో సైనిక చర్యకు దిగుతుందని పాకిస్థాన్‌ తలపోసింది. అందుకే, అణ్వస్త్ర ప్రయోగం పేరిట బెదిరింపులకు దిగింది. అయితే, తద్భిన్నంగా చేపట్టిన ఆపరేషన్‌ ప్రణాళిక మేరకు 2025 మే 6, 7 తేదీల మధ్య అర్ధరాత్రి దాటాక దాడి చేయడంతో పాక్‌ దిగ్భ్రాంతితో చేష్టలుడిగి నిలిచింది. ఆ విధంగా ఏప్రిల్ 22నాటి ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మన సాయుధ దళాలు దీటుగా బదులివ్వడమేగాక నిర్దేశిత లక్ష్యాలను కేవలం 22 నిమిషాల్లో ఛేదించాయి.

గౌరవ అధ్యక్షా!

రెండో కోణంలో- పాకిస్థాన్‌ గతంలోనూ భారత్‌తో పలుమార్లు కయ్యానికి దిగింది. అయితే, తొలిసారి శత్రువుకు అంతుబట్టని వ్యూహాన్ని మనం అమలు చేశాం. దానికి అనుగుణంగా మునుపెన్నడూ స్పృశించని లక్ష్యాలను మన దళాలు సునాయాసంగా ఛేదించాయి. ఇందులో భాగంగా పాకిస్థాన్‌ వ్యాప్తంగాగల ఉగ్రవాద స్థావరాలను నిర్ణయాత్మక లక్ష్యం చేసుకుని నేలమట్టం చేశాయి. దుర్బేధ్యమైనవిగా పాక్‌ పరిగణించే బహావల్పూర్‌, మురిద్కే స్థావరాలు రాళ్లగుట్టలుగా మారిపోయాయి.

గౌరవ అధ్యక్షా!

ఈ రెండు కీలక ప్రదేశాలను నేలమట్టం చేయడం ద్వారా ఉగ్రవాద మూకలను భారత సాయుధ దళాలు విజయవంతంగా హతమార్చాయి. మూడో కోణంలో- అణ్వస్త్ర ప్రయోగం చేస్తామన్న   పాకిస్థాన్ బెదిరింపులు ఉత్తుత్తివేనని తేల్చాం. ఇలాంటి అణు బెదిరింపులకు భారత్‌ బెదిరేది లేదని, ప్రత్యర్థి ఎదుట ఎన్నడూ మోకరిల్లబోదని ఈ ఆపరేషన్తో నిరూపించాం.

గౌరవ అధ్యక్షా!

నాలుగో కోణంలో- పాక్ భూభాగంలోకి లోతుగా దూసుకెళ్లి, కచ్చితమైన దాడులతో భారత్‌ తన అధునాతన సాంకేతిక సామర్థ్యాలను ప్రదర్శించింది. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు భారీగా దెబ్బతిని, ఇప్పటికీ కోలుకునే స్థితిలో లేవు. ఇది సాంకేతిక పరిజ్ఞానాధారిత యుద్ధశకం. ఈ రంగంలో భారత్‌ తన నైపుణ్యాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా రుజువు చేసుకుంది. గత పదేళ్లలో నిత్య సంసిద్ధత దిశగా భారత్‌ కృషి చేయకపోయి ఉంటే- నేటి సాంకేతిక యుగంలో  దేశం అపార కష్టనష్టాలకు లోనయ్యేది. ఇక ఐదో కోణంలో- స్వయం సమృద్ధ భారత్‌ శక్తిసామర్థ్యాలను ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచం తొలిసారి గ్రహించింది. పాక్ రక్షణ వ్యవస్థల దుర్బలత్వాన్ని ‘మేడ్ ఇన్ ఇండియా’ డ్రోన్లు, క్షిపణులు బహిర్గతం చేశాయి.

గౌరవ అధ్యక్షా!

మరో కీలకాంశం ఏమిటంటే - నేను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్‌)ను నియమించాక శ్రీ రాజీవ్ గాంధీ హయాంలో రక్షణ వ్యవహారాలు చూసిన సహాయ మంత్రి ఒకరు నన్ను కలిశారు. ఆయన నా నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంతగానో అభినందించారు. ఈ ఆపరేషన్ సమయంలో సైనిక, నావిక, వైమానిక దళాల సంయుక్త కార్యకలాపాలు- త్రివిధ దళాల సమన్వయంతో పాకిస్థాన్‌ పూర్తిగా నివ్వెరపోయింది.

గౌరవ అధ్యక్షా!

దేశంలో ఇంతకుముందు కూడా ఉగ్రవాద దాడులు ఉండేవి. కానీ, సూత్రధారులకు శిక్ష పడుతుందన్న భయ, సంకోచాలు ఏ కోశానా ఉండేవి కావు. దీంతో మళ్లీమళ్లీ దాడులకు ప్రణాళికలు రచిస్తూనే వచ్చారు. కానీ, నేడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇప్పుడు ఏ దాడికి పాల్పడినా కంటిమీద కునుకు లేకుండా చేస్తామని వారికి అర్థమైంది. భారత్ ప్రతిదాడికి దిగుతుందని, తమ దేశంలోకి ప్రవేశించి ఉగ్రమూకలను అమిత కచ్చితత్వంతో దునుమాడి, తిరిగి వెళ్లగలదని తెలిసివచ్చింది. భారత్‌ దీన్నొక “నవ్య సంప్రదాయం”గా మార్చింది.

గౌరవ అధ్యక్షా!

అంతర్జాతీయ సమాజం ఇప్పుడు భారత్ వ్యూహాత్మక కార్యకలాపాల విస్తృత పరిధి, పరిమాణాలను గుర్తించింది. ‘సిందూర్ నుంచి సింధు’ వరకూ పాక్ అంతటా దాడులతో తన శక్తిని చాటింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చినా, భారత్‌పై ఉగ్రదాడులకు సూత్రధారిగా వ్యవహరించినా, వారితోపాటు సూత్రధారులు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పాకిస్థాన్‌కు తెలిసివచ్చింది. ఇకపై దాడిచేసి తప్పించుకోవడం కుదరదని అవగతమైంది.

గౌరవ అధ్యక్షా!

ఆపరేషన్ సిందూర్‌తో రూపుదిద్దుకున్న మూడు విస్పష్ట సూత్రాలివే. మొదటిది... ఏదైనా ఉగ్రదాడి జరిగితే- స్వీయ నిర్దేశానుగుణంగా, తనదైన శైలిలో, తనకు అనువైన సమయంలో భారత్‌ దీటుగా ప్రతిస్పందిస్తుంది. రెండోది... అణ్వస్త్ర దాడులకు పాల్పడతామనే ఉత్తుత్తి బెదిరింపులను ఇకపై భారత్‌ సహించదు. మూడోది... ఉగ్రవాద ప్రోత్సాహకులు, దాడుల సూత్రధారులను ఒకేవిధంగా పరిగణిస్తుంది.

గౌరవ అధ్యక్షా!

భారత్‌కు ప్రపంచ దేశాల మద్దతు, మన విదేశీ వ్యవహారాల విధానం గురించి పలువురు అనేక విధాలుగా మాట్లాడుతుంటారు. అయితే, ఈ సభ సమక్షంలో నేను కొన్ని కీలకాంశాలను విస్పష్టంగా ప్రకటించదలిచాను. ఆత్మరక్షణ విషయంలో ఏ ఒక్కదేశమూ భారత్‌ను నిలువరించలేదు. ఆపరేష్‌ సిందూర్‌ సమయంలో ఐక్యరాజ్య సమితిలోని 193 సభ్య దేశాలలో మూడు... కేవలం 3 మాత్రమే పాకిస్థాన్‌కు మద్దతు పలికాయి. “క్వాడ్, బ్రిక్స్” వంటి కూటములు సహా ఫ్రాన్స్, రష్యా, జర్మనీ వంటి అగ్ర దేశాలు- అంటే- దేశమేదైనా భారత్‌కు అంతర్జాతీయంగా సంపూర్ణ మద్దతు లభించింది.

గౌరవ అధ్యక్షా!

భారత్‌కు అగ్రరాజ్యాలు సహా యావత్‌ ప్రపంచం అండగా నిలిచినా, మన సాహస సాయుధ దళాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు లభించకపోవడం దురదృష్టకరం. ఏప్రిల్ 22న ఉగ్రవాద దాడి తర్వాత మూడు లేదా నాలుగు రోజులకు “56 అంగుళాల ఛాతీ ఎక్కడ దాక్కుంది?”, “మోదీ ఎక్కడున్నాడు?”, “ఇది మోదీ వైఫల్యం” అంటూ ఆ పార్టీ నాయకులు వెటకరించారు... హేళన చేశారు. రాజకీయంగా తామేదో పైచేయి సాధించినట్లు వారందరూ వినోదించారు. పహల్గామ్‌ దారుణ హత్యల నేపథ్యంలోనూ రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టే ప్రయత్నం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను లక్ష్యం చేసుకున్నారు. కానీ, అలాంటి వ్యాఖ్యలు, చౌకబారు రాజకీయ విమర్శలు మన భద్రత దళాల నైతికస్థైర్యాన్ని గాయపరిచాయి. కొందరు కాంగ్రెస్ నాయకులు భారత్ సామర్థ్యాన్ని లేదా సాయుధ దళాల శౌర్యపరాక్రమాలను విశ్వసించరు. అందుకే, ఆపరేషన్ సిందూర్‌పై ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. తద్వారా, మీకు మాధ్యమాల పతాక శీర్షికల్లో ప్రచారం లభించవచ్చు. కానీ దేశ ప్రజానీకం హృదయాల్లో మీరెన్నటికీ స్థానం సంపాదించలేరు.

గౌరవ అధ్యక్షా!

ఆపరేషన్ సిందూర్ కింద సైనికచర్యను నిలిపివేస్తున్నట్లు మే 10న భారత్ ప్రకటించింది. దీనిపై రకరకాల వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల ఆవలినుంచీ ఇదే ప్రచారం సాగుతోంది. ఈ సైనిక చర్య గురించి మన సాయుధ దళాలు ఇచ్చిన సమాచారంలోని వాస్తవాలను కొందరు అంగీకరించడం లేదు. పైగా పాకిస్థాన్‌ తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహించడానికే ఎక్కువగా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఏదేమైనా, భారత్ వైఖరి ఎప్పుడూ సుస్పష్టం.

గౌరవ అధ్యక్షా!

 

ఈ సందర్భంగా సభకు కొన్ని కీలక సంఘటనలను గుర్తు చేయాలని భావిస్తున్నా. అత్యంత స్పష్టమైన లక్ష్యంతో మనం ఆకస్మిక దాడులు (సర్జికల్ స్ట్రైక్) చేశాం. దీంతో సరిహద్దు అవతలి ఉగ్రవాద ప్రయోగ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. మన సైనికులు రాత్రి ఆపరేషన్ ముగించి, తెల్లవారకముందే తిరిగి రావాలన్నది లక్ష్యంలో భాగం. అది పూర్తిగా నెరవేరింది. ఇక బాలకోట్ వైమానిక దాడి ప్రణాళిక లక్ష్యం కూడా స్పష్టంగా ఉంది- ఉగ్రవాద శిక్షణ కేంద్రాలను నేలమట్టం చేసి, ఉగ్రవాదులను మట్టుబెట్టి అదీ సాధించాం. అలాగే ఆపరేషన్ సిందూర్ పరంగానూ ఉగ్రవాద కేంద్రాలు, పహల్గామ్ దాడి ప్రణాళిక రూపొందిన ప్రదేశాలు, శిక్షణ-సదుపాయాలు-నియామకాలు-నిధుల నిర్వహణ స్థావరాలపై దాడి మా సుస్పష్ట లక్ష్యాలు. తదనుగుణంగా అన్నిటినీ నిర్దిష్టంగా గుర్తించి, నూరుశాతం కచ్చితమైన మెరుపుదాడితో వాటన్నిటినీ పరిపూర్ణంగా సాధించాం.


ఈసారి కూడా మన సాయుధ దళాలు అసలైన భారత్ శక్తిని చాటుతూ తమ లక్ష్యాలను 100% సాధించాయి. కొందరు కావాలనే వాస్తవాలను విస్మరిస్తున్నా,  దేశ ప్రజలు మాత్రం దీనిని మర్చిపోరు.  మే 6వ తేదీ రాత్రి, మే 7వ తేదీ ఉదయం ఈ ఆపరేషన్ జరిగినట్లు దేశం గుర్తించింది. మే  7వ తేదీ ఉదయం, భారత సైన్యం విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. ఉగ్రవాదులను, వారి సూత్రధారులను,  వారి మౌలిక సదుపాయాలను నిర్మూలించాలన్న మా లక్ష్యాన్ని స్పష్టంగా పేర్కొంది.  ఆ లక్ష్యం పూర్తయిందని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశాం. కాబట్టి, రాజ్ నాథ్ నిన్న చెప్పినట్లుగా, నేను సగర్వంగా దానిని పునరుద్ఘాటిస్తున్నా. నిర్దేశిత లక్ష్యాలు సాధించినట్టు భారత సైన్యం నిమిషాల్లోనే పాక్ సైన్యానికి తెలియజేసింది. మేం ఏం చేశామో స్పష్టంగా తెలియజేయడం కోసం, వారి స్పందన ఏమిటో అర్థం చేసుకోవడం కోసం అలా చేశాం. మేం ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నామో, వాటన్నింటినీ విజయవంతంగా సాధించాం. పాకిస్థాన్ తెలివిగా వ్యవహరించి ఉగ్రవాదులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం వంటి అతి పెద్ద తప్పు చేయకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ, వారు నిస్సిగ్గుగా ఉగ్రవాదుల పక్షాన నిలిచే నిర్ణయం తీసుకున్నారు.

అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తూ మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదం, ఉగ్రవాదానికి మద్దతిస్తున్న వారు, దాని కమాండ్ సెంటర్లే మా ఏకైక లక్ష్యమని ప్రపంచానికి చెప్పాం. దాన్ని సాధించాం. ఉగ్రవాదులకు మద్దతివ్వాలని పాకిస్థాన్ నిర్ణయించుకుని యుద్ధరంగంలోకి ప్రవేశించిన తర్వాత, మే 9 రాత్రి, మే 10 ఉదయం జరిగిన సంఘటనలు ఏళ్ల తరబడి గుర్తుండిపోయేలా భారత్ శక్తిమంతమైన దాడితో ప్రతిస్పందించింది.

మన క్షిపణులు వారు ఊహించనంత శక్తితో పాకిస్థాన్ లోని ప్రతి మూలను తాకాయి. పాక్ ను మోకాళ్ల వద్దకు తెచ్చారు. ఆ దేశం నుంచి వచ్చిన స్పందనలను మీరు టీవీలో చూసి ఉంటారు. ‘నేను స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నాను‘ అని ఒకరు అన్నారు. ‘నేను ఆఫీసుకు రెడీ అవుతున్నాను - ఆలోచించేలోపే భారత్ దాడి చేసింది‘ ఆని మరొకరు అన్నారు. అలా పాకిస్థాన్ నుంచి వచ్చిన స్పందనలను యావత్ దేశం చూసింది. ఇంతటి దారుణమైన దెబ్బ తగలడంతో పాకిస్థాన్ బిత్తరపోయింది. దీంతో పాక్ మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో)కు ఫోన్ చేసి 'దయచేసి ఆపండి, మాకు ఇది చాలు. ఇంతకుమించి తీసుకోలేం. దయచేసి దాడి ఆపండి' అని కోరారు. ఇది పాకిస్థాన్ డీజీఎంవో స్థాయి నుంచి ఫోన్ కాల్.  కానీ గుర్తుంచుకోండి - భారత్ ఇప్పటికే మే 7 న విలేకరుల సమావేశంలో మా లక్ష్యాలను సాధించినట్టు ప్రకటించింది. ఇంకా రెచ్చగొడితే భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించింది. నేను మళ్ళీ చెబుతున్నా. ఇది సైన్యంతో కలసి సమన్వయంతో రూపొందించిన స్పష్టమైన, బాగా ఆలోచించిన భారతదేశ విధానం. ఆ విధానం ప్రకారం ఉగ్రవాదం, దాని సూత్రధారులు, దాని స్థావరాలే మా లక్ష్యం. మొదటి రోజు నుంచి మా చర్య అప్రజాస్వామికం కాదని విలేకరుల సమావేశంలో చెప్పాం. మేం ప్రకటించిన విధంగానే వ్యవహరించాం. అందుకే దాడిని ఆపాం.

గౌరవ అధ్యక్షా!

ఆపరేషన్ సిందూర్ ను ఆపాలని ఏ ఒక్క ప్రపంచ నాయకుడు కూడా భారత్  ను కోరలేదు. మే 9వ తేదీ రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు నన్ను ఫోన్ లో సంప్రదించడానికి ప్రయత్నించారు. నన్ను చేరుకోవడానికి దాదాపు గంటసేపు, ఆయన ప్రయత్నించారు. కానీ నేను అప్పుడు నా సైనిక ఉన్నతాధికారులతో సమావేశంలో ఉన్నందున ఆయన ఫోన్ కాల్ తీసుకోలేకపోయాను.

ఆ తర్వాత నేను ఆయనకు కాల్ చేశాను.  "మీరు చాలాసార్లు కాల్ చేయడానికి ప్రయత్నించారు - ఏమిటి విషయం?" అని అడిగాను. పాకిస్థాన్ భారత్ పై భారీ దాడికి కుట్ర పన్నుతోందని తనవద్ద సమాచారం ఉన్నట్టు అమెరికా ఉపాధ్యక్షుడు ఫోన్ లో చెప్పారు. ఇప్పుడు, అర్థం చేసుకోవడానికి ఇష్టపడని వారు అర్థం చేసుకోక పోయినా నష్టం లేదు గానీ నేను విస్పష్టంగా చెప్పింది ఏమిటంటే ” పాకిస్థాన్ ఇక ఎలాంటి దాడికి పాల్పడినా దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. పాక్ దాడి చేస్తే, మా ప్రతిదాడి ఇంకా పెద్దదిగా ఉంటుంది.” “తూటాలకు మేం ఫిరంగులతో సమాధానం ఇస్తాం” అని కూడా నేను చెప్పాను. ఇది మే 9 రాత్రి జరిగిన విషయం. మే 9 రాత్రి నుంచి మే 10 ఉదయానికి పాక్ సైనిక మౌలిక వసతుల్ని భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది. అదే మా ప్రతిస్పందన. అదే మా దృఢ సంకల్పం.

ఇప్పుడు పాకిస్థాన్ కూడా ఇకపై భారత్ నుంచి ప్రతి ప్రతిస్పందన గతం కంటే బలంగా ఉంటుందని స్పష్టంగా అర్థం చేసుకుంది. మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తితే భారత్ ఎలాంటి చర్య అయినా తీసుకోగలదని వారికి తెలిసింది. కాబట్టి, ఈ రోజు, ఈ ప్రజాస్వామ్య దేవాలయం నుంచి నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను: ఆపరేషన్ సిందూర్ ఇప్పటికీ క్రియాశీలకంగా ఉంది. పాకిస్థాన్ మరోసారి ధైర్యం చేస్తే దీటుగా బదులివ్వాల్సి ఉంటుంది.

గౌరవ అధ్యక్షా!

భారత్ ఈరోజు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది. స్వావలంబన బాటలో పూర్తి శక్తితో, అత్యంత వేగంతో ముందుకు సాగుతోంది. భారత్ అంతకంతకూ ఆత్మనిర్భర్ గా మారుతుండడాన్ని యావత్ దేశం స్పష్టంగా చూస్తోంది. అయితే, దేశం ఒక విచిత్రమైన వైరుధ్యాన్ని కూడా చూస్తోంది.  భారత్ స్వావలంబన దిశగా వేగంగా అడుగులు వేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం రాజకీయ మనుగడ కోసం పాకిస్థాన్ పై ఆధారపడుతోంది. ఈ రోజు దాదాపు 16 గంటల పాటు జరిగిన చర్చ మొత్తాన్ని చూశాను. దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ తన సమస్యలను పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.

గౌరవ అధ్యక్షా!

ఈరోజు ఏదైనా యుద్ధం వస్తే అవాస్తవ సమాచారం, కల్పిత కథనాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కృత్రిమ మేధ, ఇతర సాధనాలను ఉపయోగించి  మన శక్తులను నిరుత్సాహపరచడానికి,  ప్రజలలో అపనమ్మకాన్ని సృష్టించడానికి కథనాలు సృష్టిస్తున్నారు దురదృష్టవశాత్తూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పాక్ చేసే ఈ ప్రచారానికి బాకా ఊదుతున్నాయి.

గౌరవ అధ్యక్షా!

మన సాయుధ బలగాలు సర్జికల్ దాడులు చేసినప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది? వెంటనే సైన్యం నుంచి ఆధారాలు కావాలంటూ డిమాండ్ చేశారు. అయితే దేశంలో ఉన్న జాతీయ భావోద్వేగాన్ని, ప్రజల సమైక్య మద్దతును చూసిన తర్వాత వారు తక్షణమే వెనక్కి తగ్గారు. ఇంకా వారేం చెప్పారు? ఈ సర్జికల్ దాడిలో అంత ప్రత్యేకత ఏముందని ప్రశ్నించారు. మేమూ చేశాం అన్నారు. . మూడు సర్జికల్ దాడులు చేశామని ఒకరు పేర్కొన్నారు. మరొకరు ఆరు చేశామని చెప్పారు. ఇంకొకరు పదిహేను దాకా వెళ్లారు. నాయకుడు ఎంత పెద్దవాడైతే  అంత పెద్ద సంఖ్య చెప్పుకున్నారు.

గౌరవ అధ్యక్షా!

ఆ తర్వాత బాలాకోట్ వైమానిక దాడి జరిగింది. ఈసారి, వారు  “మేం కూడా కూడా చేశాం” అని చెప్పలేకపోయారు, ఎందుకంటే ఇది చాలా స్పష్టంగా ఉంది. కానీ దానికి బదులుగా, వారు ఫోటో సాక్ష్యాలను అడగడం ప్రారంభించారు. "ఫోటోలు చూపించు! "బాంబులు ఎక్కడ పడ్డాయి? ఏం నాశనం అయింది? ఎంతమంది చనిపోయారు? అని పదే పదే అదే పాట పాడారు. సరిగ్గా పాకిస్థాన్ కూడా ఇలాగే అడిగింది. అలా వారు పాక్ స్వరాన్ని ప్రతిధ్వనించారు. ఇదొక్కటే కాదు…

గౌరవ అధ్యక్షా!

మన పైలట్ అభినందన్ పాక్ కు పట్టుబడినప్పుడు ఆ దేశం లో సంబరాలు చేసుకోవడం సహజం. కానీ ఇక్కడ కొందరు మూసిన తలుపుల వెనుక గుసగుసలాడుకున్నారు.  "ఇప్పుడు మోదీ చిక్కుకున్నారు" అని మురిసిపోయారు. ఇప్పుడు చూద్దాం మోదీ ఏమి చేస్తాడో” అని వారు అన్నారు. కానీ వారికి సగర్వంగా సమాధానం ఇచ్చాం. అభినందన్ తిరిగి వచ్చాడు. అతన్ని హుందాగా వెనక్కి తీసుకొచ్చాం. దానితో ఈ విమర్శకులు మాటరానివారుగా మౌనం వహించారు.  “ఈ మనిషికి అదృష్టం ఎక్కువగా కలిసి వస్తోంది. మనకు ఉన్న అత్యుత్తమ రాజకీయ ఆయుధాన్ని మనమే కోల్పోయాం” అనే విషయం అప్పుడు వాళ్లకు అర్థమైంది

గౌరవ అధ్యక్షా!

పహల్గామ్ దాడి తర్వాత, మన బిఎస్ఎఫ్ జవానులలో ఒకరిని పాకిస్థాన్ బందీగా పట్టుకున్నప్పుడు కూడా మోదీని ఇరకాటంలో పెట్టవచ్చని, ఇది ఆయనకు ఇబ్బందికరంగా ఉంటుందని కొందరు భావించారు. వారి అనుచర గణం మొత్తం సోషల్ మీడియాలో అన్ని రకాల కథనాలను ప్రచారం చేయడం ప్రారంభించింది. బిఎస్ఎఫ్ సైనికుడికి ఏమి జరుగుతుంది? అతని కుటుంబం సంగతేంటి? అతను తిరిగి వస్తాడా? ఎప్పుడు? ఎలా? ఇలా ఎన్నో ఊహాగానాలు వ్యాపించాయి.

గౌరవ అధ్యక్షా!

కానీ, ఆ బీఎస్ఎఫ్ జవాను కూడా పూర్తి గౌరవంతో, హుందాగా, గర్వంగా తిరిగిరావడంతో ఉగ్రవాదులకు ఏడుపొక్కటే మిగిలింది. వారి నిర్వాహకులు కూడా బాగా నిరాశ చెందారు. వారు ఏడవడం చూసి, ఇక్కడి కొంతమంది కూడా కలత చెందినట్టు కనిపించింది.

ఇప్పుడు గమనించండి: సర్జికల్ దాడి జరిగినప్పుడు, వారు వేరే ఆట ఆడటానికి ప్రయత్నించారు- అది పనిచేయలేదు. వైమానిక దాడుల తర్వాత, వారు మరొక ఎత్తుగడకు ప్రయత్నించారు.  అది కూడా విఫలమైంది. ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ పై కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. ఆపరేషన్ "ఎందుకు ఆపారు?" అంటున్నారు. మొదట్లో ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా అంగీకరించని వారు ఇప్పుడు 'ఎందుకు ఆపారు?' అని అడుగుతున్నారు. ఎంత వైరుధ్యం! ప్రకటనలు చేయడంలో ఈ స్వయం ప్రకటిత నిపుణులు ఇలా మాట్లాడితే ఇంకేమంటాం? వాస్తవానికి, వ్యతిరేకించడానికి మీకు ఒక సాకు కావాలి.  అందుకే నేను మాత్రమే కాదు దేశం మొత్తం మిమ్మల్ని చూసి నవ్వుతోంది.

గౌరవ అధ్యక్షా!

సాయుధ దళాలను వ్యతిరేకించే వైఖరి, వారిపట్ల నిరంతర ప్రతికూలత  చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీ విధానంగా కొనసాగుతోందని ప్రతి ఒక్కరికీ తెలుసు. దేశం ఇటీవలే కార్గిల్ విజయ్ దివస్‌ను గర్వంగా జరుపుకుంది. కానీ, కాంగ్రెస్ పాలనలో, అలాగే ఇప్పటికీ కార్గిల్ విజయాన్ని వారు పూర్తిగా అంగీకరించలేదు, గౌరవించలేదు, అంతేకాకుండా అసలు ఆ విజయాన్ని జరుపుకున్న దాఖలా కూడా లేదు. ఇది దేశ ప్రజలందరికీ బాగా తెలిసిన వాస్తవం. అంత గొప్ప విజయాన్ని అది ఎంత గౌరవానికి పాత్రమైనా, కాంగ్రెస్ పార్టీ అది పొందాల్సిన గౌరవాన్ని ఎప్పుడూ ఇవ్వలేదు. గౌరవ అధ్యక్షా -  దీనికి చరిత్రే సాక్ష్యం. డోక్లామ్‌లో మన సైన్యం తన వీరత్వాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో, కాంగ్రెస్ నాయకులు కొంతమంది వ్యక్తుల నుంచి రహస్యంగా సమాచారం తీసుకున్న విషయం ఇప్పుడు మొత్తం ప్రపంచానికీ తెలుసు. పాకిస్థాన్ లో చేసిన ప్రకటనలను తీసుకొని, ఇక్కడ మమ్మల్ని వ్యతిరేకించే వారి ప్రకటనలతో పోల్చండి. అవి సరిగా సరిపోతాయి. కామాకు కామా, ఫుల్ స్టాప్ కు ఫుల్ స్టాప్. దానికి ఏం చెప్పగలం? అవును, మనం నిజం మాట్లాడినప్పుడు బాధగానే ఉంటుంది.  వారి గళాలు పాక్ స్వరానికి పూర్తి అనుగుణంగా ఉన్నాయి.

గౌరవ అధ్యక్షా!

పాక్‌కు క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ వ్యవహరించడం చూసి దేశం నివ్వెరపోతోంది. ఈ పార్టీ ధైర్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది, వాళ్ల పద్ధతులు ఎప్పటికీ మారడం లేదు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు పాకిస్థానీలు అనడానికి ఆధారాలు ఆధారాలు చూపమంటారా? ఇవేం మాటలు? ఇదెలాంటి దృష్టికోణం? ఇదే డిమాండ్‌ను ఇప్పుడు పాకిస్థాన్ కూడా చేస్తోంది. అంటే, కాంగ్రెస్ అడుగుతున్నదీ, పాక్ కోరుతున్నదీ ఒకటే.

గౌరవ అధ్యక్షా!

నేడు, సాక్ష్యాలకు కొదవ లేనప్పుడు, ప్రతిదీ ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కూడా వారి వైఖరి ఇలా ఉంటే ఇక అటువంటి ఆధారాలు లభ్యం కాకపోతే వారు ఏమి చేసేవారో ఊహించండి.

గౌరవ అధ్యక్షా!

ఆపరేషన్ సిందూర్ లో ఒక కోణం గురించే ఎక్కువగా చర్చిస్తున్నారు. కానీ దేశానికి గర్వకారణమైన మరెన్నో గొప్ప క్షణాలు,  మన బలాన్ని, సామర్థ్యాన్ని చూపించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా మన గుర్తింపునకు, ప్రశంసకు పాత్రమైనవే. మన వైమానిక రక్షణ వ్యవస్థ గురించి ఇప్పుడు మొత్తం ప్రపంచం మాట్లాడుతోంది. పాక్ ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను మన వైమానిక రక్షణ వ్యవస్థ  కొమ్మలుగా ధ్వంసం చేసింది.

గౌరవ అధ్యక్షా!

ఈ రోజు, యావత్ దేశం గర్వించదగ్గ ఒక వాస్తవాన్ని నేను అందించాలనుకుంటున్నాను. కొంతమందికి ఏమి అనిపిస్తుందో నాకు తెలియదు- కానీ దేశం మొత్తం ఎంతో గర్వంగా భావిస్తుంది. మే 9న పాకిస్థాన్ సుమారు 1,000 - అవును ,  వెయ్యి-  క్షిపణులు,  సాయుధ డ్రోన్లతో భారతదేశంపై భారీ దాడికి ప్రయత్నించింది. ఈ క్షిపణులు భారత్ లోని ఏ ప్రాంతంలోనైనా పడి ఉంటే ఊహించని విధ్వంసం జరిగి ఉండేది. కానీ భారత్ మాత్రం ఆకాశంలోనే ఆ వెయ్యి క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేసింది. ఇందుకు ప్రతి పౌరుడు గర్వపడుతున్నాడు. కానీ ఏదో తప్పు జరుగుతుందని,  మోదీ ఎక్కడో విఫలమవుతారని, సంకటంలో పడతారని కొందరు కాంగ్రెస్ నాయకులు ఆశతో ఎదురు చూస్తున్నారు.

అదంపూర్ వైమానిక స్థావరంపై దాడి జరిగినట్టు పాక్ తప్పుడు ప్రచారం చేసింది. ప్రపంచం చేత దానిని నమ్మించడానికి శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి ప్రచారం చేసింది. కానీ ఆ మరుసటి రోజే నేనే స్వయంగా ఆదంపూర్ వెళ్లి ఆ అబద్ధాన్ని బయటపెట్టాను. అలాంటి తప్పుడు కథనాలు ఇక పనిచేయవని అప్పుడే వారికి అర్థమైంది.

 

గౌరవ అధ్యక్షా!


రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి పాలనా పగ్గాలు చేపట్టని చిన్న పార్టీలలోని మన సహచరులు ఈ విధంగా మాట్లాడినప్పుడు నేను అర్థం చేసుకోగలను. కానీ కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఈ దేశాన్ని పాలించింది. వారికి పరిపాలనా వ్యవస్థల గురించి బాగా తెలుసు. వారు ఆ వ్యవస్థల నుంచే వచ్చారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో వారికి పూర్తిగా తెలుసు. వారికి అనుభవం ఉంది. అయినప్పటికీ.. విదేశాంగ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించినప్పుడు, వారు దానిని అంగీకరించేందుకు నిరాకరిస్తారు. విదేశాంగ మంత్రి ఇంటర్వ్యూలు ఇస్తారు. ఆయన పదే పదే మాట్లాడుతారు. కానీ వారు దానిని అంగీకరించేందుకు నిరాకరిస్తారు. హోం మంత్రి, రక్షణ మంత్రి మాట్లాడుతారు అయినప్పటికీ వారు ఎవరినీ నమ్మరు. చాలా సంవత్సరాలు పాలించిన పార్టీ ఇక దేశంలోని వ్యవస్థలను నమ్మకపోతే వారు ఏ విధంగా తయారయ్యరన్న విషయాన్ని ఆలోచించాల్సి వస్తుంది.

గౌరవ అధ్యక్షా!

ఇప్పుడు కాంగ్రెస్ నమ్మకం అనేది పాకిస్థాన్ రిమోట్ కంట్రోల్ ద్వారా ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.

గౌరవ అధ్యక్షా!

కాంగ్రెస్ కొత్త ఎంపీలలో ఒకరున్నారు. అయితే వారిని మనం క్షమించొచ్చు. ఎందుకంటే వారు సభకు కొత్త. కానీ కాంగ్రెస్ హైకమాండ్ వారికి రాసి ఇచ్చి మరీ పలు వ్యాఖ్యలు చేయించింది. ఎందుకంటే వారికి దానిని స్వయంగా చెప్పే ధైర్యం లేదు. ఆపరేషన్ సిందూర్ ఒక డ్రామా అని వారితో చెప్పించారు. ఇది ఉగ్రవాదులు 26 మందిని అనాగరికంగా చంపిన ఘోర గాయంపై యాసిడ్ పోయటం తప్ప మరేమీ కాదు. దీనిని 'డ్రామా' అని వారు అన్నారు.  అది వారి అభిప్రాయం ఎలా అవుతుంది?. ఇవి కాంగ్రెస్ నాయకులు.. ఇతరులతో గట్టిగా చేయించే ప్రకటనలే.

గౌరవ అధ్యక్షా!

నిన్న మన భద్రతా దళాలు ఆపరేషన్ మహాదేవ్‌లో పహల్గామ్ దాడి చేసిన ఉగ్రవాదులను న్యాయం ముందు నిలబెట్టాయి. కానీ ఎవరో బిగ్గరగా నవ్వుతూ “ఇన్ని రోజులుంటే.. నిన్నే ఎందుకు ఇది జరిగింది?” అని అడిగినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. వీరికి ఏం అవుతోందన్నది నాకు అర్థమవటం లేదు. శ్రావణ మాసంలోని పవిత్ర సోమవారం రోజున ఆపరేషన్ చేపట్టాలా? వారికి ఏమైంది? వారు చాలా నిరాశగా, నిరాశాజనకంగా ఉన్నారు ! చమత్కారం ఏంటంటే.. “సరే, మీరు ఆపరేషన్ సిందూర్ చేశారు, కానీ పహల్గామ్ ఉగ్రవాదుల సంగతేంటి?” అని గత కొన్ని వారాలుగా వారే అడుగుతున్నారు. ఇప్పుడు ఆ ఉగ్రవాదులను మట్టుబెట్టిన తర్వాత.. ‘ఇప్పుడే ఎందుకు?’ అని వారే అడుగుతున్నారు.

గౌరవ అధ్యక్షా!

మన గ్రంథాలు “శాస్త్రేణ రక్షితే రాష్ట్రే శాస్త్ర చింతా ప్రవర్తతే” అని చెబుతున్నాయి. అంటే ఒక దేశం ఆయుధాల రక్షణలో ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం, తాత్వాక భావనలు వృద్ధి చెందుతాయి.  మన సరిహద్దులు బలంగా ఉండి, మన దళాలు అప్రమత్తంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుంది.

గౌరవ అధ్యక్షా!

గత దశాబ్ద కాలంగా భారత్ సాయుధ దళాల బలోపేతానికి ఆపరేషన్ సిందూర్ ప్రత్యక్ష సాక్ష్యం. ఇది ఆకస్మికంగా జరగలేదు. కాంగ్రెస్ పాలనలో సాయుధ దళాల స్వావలంబన ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. మహాత్మా గాంధీ ఆలోచనల నుంచి వచ్చినప్పటికీ "స్వావలంబన" అనే దానిని నేటికీ ఎగతాళి చేస్తున్నారు. ప్రతి రక్షణ ఒప్పందాన్ని కాంగ్రెస్.. లాభం కోసం ఉన్న ఒక అవకాశంగా చూసేది. వారి హయాంలో చిన్న ఆయుధాల కోసం కూడా భారత్ విదేశాలపై ఆధారపడింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, రాత్రి సమయాల్లో చూసేందుకు ఉపయోగించే కెమెరాలు కూడా అందుబాటులో లేని సందర్భాలు ఉన్నాయి. జీపుల నుంచి  బోఫోర్స్, హెలికాప్టర్ల వరకు ప్రతి కొనుగోలు ఒప్పందం కుంభకోణాల చుట్టూ తిరిగింది.

గౌరవ అధ్యక్షా!

మన సాయుధ దళాలు ఆధునిక ఆయుధాల కోసం దశాబ్దాలుగా వేచి చూడాల్సి వచ్చింది. స్వాతంత్ర్యానికి ముందు రక్షణ తయారీలో భారత్ గొంతు బలంగా వినిపించేది. చరిత్రే దీనికి సాక్ష్యం. కత్తులతో యుద్ధం చేసే కాలంలో భారతీయ కత్తులు ఉన్నతమైనవిగా పరిగణించేవారు. రక్షణ రంగ సంపత్తిలో మనం ముందున్నాం. కానీ స్వాతంత్య్రం  తర్వాత, మన బలమైన రక్షణ తయారీ వ్యవస్థ క్రమంగా విచ్ఛిన్నమైంది. పరిశోధన, తయారీకి ఉన్న మార్గాలను ఉద్దేశపూర్వకంగా మూసేశారు. మనం అదే తోవలో నడిచి ఉంటే 21వ శతాబ్దంలో ఆపరేషన్ సిందూర్ లాంటి దాని గురించి భారత్ ఊహించి కూడా ఉండేది కాదు. వాళ్లు దేశాన్ని ఏ విధంగా విడిచిపెట్టారంటే, మనం.. సైనిక చర్య చేయాలంటే మనకు ఆయుధాలు ఎక్కడి నుంచి  వస్తాయి? వనరులు ఎక్కడ దొరుకుతాయి? మందుగుండు సామగ్రి సమయానికి వస్తుందా? సరఫరా మధ్యలో నిలిచిపోతుందా? అని అడగాల్సి వచ్చేది. మనం ఈ ఆందోళనతోనే ఉండాల్సి ఉండేది.

గౌరవ అధ్యక్షా!

గత దశాబ్దంలో భారత్‌లో తయారీ కింద తయారైన ఆయుధాలు ఈ సైనిక చర్యలో నిర్ణయాత్మక పాత్ర పోషించాయి.

గౌరవ అధ్యక్షా!

ఒక దశాబ్దం క్రితం భారత ప్రజలు.. ‘మన దేశం బలంగా, స్వావలంబనగా, ఆధునికంగా మారుతుందన్న’ ప్రతిజ్ఞ తీసుకున్నారు. రక్షణ, భద్రతకు సంబంధించిన సంస్కరణల విషయంలో ఒకదాని తర్వాత మరొకటి ఇలా నిర్దిష్ట చర్యలు తీసుకున్నాం. వరుసగా సంస్కరణలను అమలు చేశాం. ఈ దశాబ్దంలో సైన్యంలో తీసుకొచ్చిన సంస్కరణలు.. స్వాతంత్య్రం అనంతరం ఈ తరహా సంస్కరణల్లో మొదటివి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) నియామకం కొత్త ఆలోచన కాదు. ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. కానీ భారత్‌లో దీనిపై ఎప్పుడూ నిర్ణయం తీసుకోలేదు. మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ వ్యవస్థను అంగీకరించి, హృదయపూర్వక ఆహ్వానం పలికిన మన త్రివిధ దళాలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మన దళాల ఏకీకరణ, అవి కలిసి పనిచేయటమే నేడు గొప్ప బలాన్నిస్తోంది. నావికాదళం, వైమానిక దళం లేదా సైన్యం ఏదైనా ఏకీకరణ, కలిసి పనిచేయటం అనేది మన బలాన్ని విపరీతంగా పెంచింది. ఫలితాలు అందరికీ కనిపిస్తున్నాయి. మేం వీటిని అందరి ముందు పెట్టాం. ప్రభుత్వ రంగ రక్షణ రంగ తయారీ సంస్థలలో కూడా మేం సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రారంభంలో ఆందోళనలు, నిరసనలు, సమ్మెలను ప్రేరేపించే ప్రయత్నాలు చేశారు. ఇవి ఇప్పటికీ పూర్తిగా ఆగలేదు. కానీ ఈ రక్షణ రంగ తయారీ సంస్థల్లోని వారు.. జాతీయ ప్రయోజనాలను అత్యంత ముఖ్యమైనవిగా గుర్తించి, సంస్కరణలను అంగీకరించారు. ఇప్పుడు అధిక ఉత్పాదకత సాధిస్తున్నారు. అంతే కాదు.. మేం రక్షణ రంగ ద్వారాలను ప్రైవేట్ రంగానికి కూడా తెరిచాం. నేడు భారత ప్రైవేట్ రంగం ముందుకు దూసుకెళ్తోంది. రక్షణ రంగంలో మన యువత, ముఖ్యంగా 27-30 సంవత్సరాల వయస్సు గల ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన యువత నేతృత్వంలోని అనేక అంకురాలు చురుకుగా పనిచేస్తున్నాయి. చాలా సందర్భాల్లో యువతులు ఈ అంకురాలకు నాయకత్వం వహిస్తున్నారు. నేడు వందలాది అంకురాలు రక్షణ రంగంలో పనిచేస్తున్నాయి.

డ్రోన్ల విషయానికి వస్తే.. భారత్‌లో జరుగుతోన్న డ్రోన్ సంబంధిత పనుల్లో ఎక్కువ భాగం యువకులే, బహుశా 30–35 సంవత్సరాల సగటు వయస్సు గల వారే చేపడుతున్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వందలాది మంది ఇందులో నిమగ్నమై ఉన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో వారి సహాయ సహకారాల తోడ్పాటు స్పష్టంగా కనిపించింది. వారి కృషిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ముందుకు సాగుతూ ఉండండి, దేశం ఇప్పుడు ఆగిపోదు అనే హామీ నేను వారికి ఇస్తున్నాను.

గౌరవ అధ్యక్షా!

రక్షణ రంగంలో భారత్‌లో తయారీ అనేది కేవలం నినాదం కాదు. మేం బడ్జెట్ కేటాయింపులు పెంచాం. విధానాలను మార్చేశాం. అవసరమైన చోట కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టాం. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మేం సుస్పష్టమైన ముందుచూపుతో సాగాం. నేడు భారత్‌లో తయారీ కింద రక్షణ రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోంది.

గౌరవ అధ్యక్షా!

గత దశాబ్దంలో, రక్షణ బడ్జెట్ దాదాపు మూడు రెట్లు పెరిగింది. రక్షణ ఉత్పత్తిలో దాదాపు 250 శాతం పెరుగుదల ఉంది. గత 11 సంవత్సరాలలో రక్షణ ఎగుమతులు 30 రెట్లు ఎక్కువ పెరిగాయి. నేడు మన రక్షణ ఎగుమతులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు చేరుకున్నాయి.

గౌరవ అధ్యక్షా!
 
చరిత్రపై లోతైన ప్రభావాన్ని చూపే సంఘటనలు కొన్ని ఉంటాయి. ఆపరేషన్ సిందూర్ ప్రపంచ రక్షణ మార్కెట్‌లో భారత్ జెండాను లోతుగా నాటింది. భారతీయ ఆయుధాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇది దేశీయ పరిశ్రమలను, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలను కూడా ప్రోత్సహిస్తుంది. ఇది మన యువతకు ఉపాధిని అందిస్తుంది. యువ భారతీయులు ఇప్పుడు వారి  ఆవిష్కరణల ద్వారా ప్రపంచానికి తమ బలాన్ని ప్రదర్శించగలుగుతారు.. అవును నిజమే, ఇది ఇప్పుడు వాస్తవంగా మారుతోంది. రక్షణలో స్వావలంబన దిశగా మనం తీసుకుంటోన్న చర్యలను నేను చూస్తున్నాను. కొంతమంది వారి సంపదను దోచుకుంటున్నట్లు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నట్లు తెలిసి నేను ఆశ్చర్యపోతున్నాను. ఇది ఎలాంటి మనస్తత్వం? ఇలాంటి వారిని దేశం గుర్తించాలి.

గౌరవ అధ్యక్షా!

‘రక్షణలో భారత్ స్వావలంబన పొందడం మనకు మాత్రమే కాదు. ప్రపంచ శాంతికి కూడా, ముఖ్యంగా ఈ ఆయుధ పోటీ యుగంలో చాలా ముఖ్యమైనది’ అని నేను సుస్పష్టం చేస్తున్నాను. నేను ఇంతకు ముందే చెప్పాను.. భారత్ యుద్ధ భూమి కాదు, బుద్ధుని భూమి. శ్రేయస్సు, శాంతిని మనం కోరుకుంటున్నాం. కానీ శ్రేయస్సు , శాంతికి మార్గం బలం ద్వారా సమకూరుతుందన్న విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.

గౌరవ అధ్యక్షా!

మన దేశం ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాజా రంజిత్ సింగ్, రాజేంద్ర చోళ, మహారాణా ప్రతాప్, లచిత్ బోర్ఫుకన్, మహారాజా సుహెల్దేవ్‌ల భూమి.

గౌరవ అధ్యక్షా!

అభివృద్ధి, శాంతి కోసం మేం వ్యూహాత్మక సామర్థ్యంపై కూడా దృష్టి పెట్టాం.

గౌరవ అధ్యక్షా!

జాతీయ భద్రత విషయంలో కాంగ్రెస్‌కు ఏనాడు దార్శనికత అనేది లేదు. గతంలో లేదు. ఇప్పుడైతే కచ్చితంగా లేదు. దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ రాజీ పడింది. నేడు కొంతమంది పీఓకేను (పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్) ఎందుకు వెనక్కి తీసుకోలేదని అడుగుతున్నారు. సరే ఆ ప్రశ్న మరెవరినీ అడగకూడదు.. నన్ను మాత్రమే అడగాలి. కానీ అలా అడిగే ముందు… పాకిస్థాన్ పీఓకేను ఆక్రమించుకునేలా ఎవరి ప్రభుత్వం చేసిందన్న ప్రశ్నకు వారు సమాధానం చెప్పాలి. దీనికి జవాబు స్పష్టంగా ఉంది. నేను నెహ్రూ గురించి ప్రస్తావించినప్పుడల్లా.. కాంగ్రెస్, దాని అనుబంధ వ్యవస్థ మొత్తం ఆందోళన చెందుతుంది. ఎందుకో నాకు తెలియదు.

గౌరవ అధ్యక్షా!
 
నేను విన్న ఒక సామెత ఉంది. నాకు దీనిపై పూర్తి పట్టు లేదు కానీ అది ఇలా ఉంటుంది.. "లంహోన్ నే ఖాటా కి, సదియోన్ నే సజా పాయీ." (ఒక్క క్షణం చేసిన తప్పు శతాబ్దాల శిక్షకు దారితీస్తుంది). స్వాతంత్య్రం వచ్చిన వెంటనే తీసుకున్న నిర్ణయాల వల్ల దేశం ఇప్పటికీ వారి కోసం బాధపడుతోంది. దీనిని చాలాసార్లు ప్రస్తావించాను కానీ నేను మళ్లీ చేబుతున్నాను. అక్సాయ్ చిన్ మొత్తం ప్రాంతం బంజరు భూమిగా ప్రకటించారు. దాని కారణంగా, మనం 38,000 చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోయాం.

గౌరవ అధ్యక్షా!

నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు బాధను కలగజేస్తాయని నాకు తెలుసు. కానీ 1962, 1963 మధ్య కాంగ్రెస్ నాయకులు వాస్తవానికి భారత్‌లోని పూంచ్, యురి, నీలం లోయ, కిషన్‌గంగా ప్రాంతాలను అప్పగించాలని ప్రతిపాదించారు.

గౌరవ అధ్యక్షా!

శాంతి పేరు మీదు ఇదంతా చేశారు. 1966లో రాణ్‌ ఆఫ్ కచ్ వివాద  సమయంలో వారు విదేశీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించారు. అదీ వారి "జాతీయ భద్రతా దృక్పథం".  దీని ఫలితంగా భారత్ దాదాపు 800 చదరపు కిలోమీటర్ల భూమిని పాకిస్థాన్‌కు ఇవ్వాల్సి వచ్చింది. 1965 యుద్ధంలో మన సైన్యం హాజీ పిర్ పాస్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది. కానీ కాంగ్రెస్ దానిని తిరిగి అప్పగించింది. 1971లో మన అదుపులో 93,000 మంది పాకిస్థాన్ సైనికులు ఉన్నారు. వేలాది చదరపు కిలోమీటర్ల ఆ దేశ భూమి మన నియంత్రణలో ఉంది. మనం చాలా లాభం పొందగలిగేవాళ్లం. మనం విజయ సాధించే స్థితిలో ఉన్నాం. కొంచెం ఎక్కువ సంకల్పం లేదా ఆలోచన ఉంటే.. మనం పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోగలిగేవాళ్లం. అదే సరైన సమయం.. కానీ వృథా చేశారు. అంతే కాదు చర్చించేందుకు చాలా విషయాలు ఉన్నా వారు కర్తార్‌పూర్ సాహిబ్‌ను కూడా తిరిగి పొందలేకపోయారు. 1974లో భారత్ కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు బహుమతిగా ఇచ్చింది. నేటికీ మన జాలర్లు దాని వల్ల ఇబ్బంది పడుతున్నారు. వారి ప్రాణాలకు ముప్పు ఉంది. తమిళనాడు జాలర్లు ఏ నేరం చేశారని వారి హక్కులను లాక్కొని భూమిని దానం చేశారు?. సియాచిన్‌లో సైన్యాన్ని ఉపసంహరించుకోవాలనే ఆలోచనను దశాబ్దాలుగా కాంగ్రెస్ చేస్తోంది.

 

గౌరవ అధ్యక్షా!


2014లో దేశం వారికి అవకాశం ఇచ్చి ఉంటే ఈ రోజు సియాచిన్ మనతో ఉండేది కాదు.

గౌరవ అధ్యక్షా!

ఇప్పుడు, అదే కాంగ్రెస్ ప్రజలు దౌత్యం గురించి మాకు పాఠాలు చెప్పాలనుకుంటున్నారా? వారు అనుసరించిన దౌత్యం గురించి వారికి గుర్తు చేస్తాను. 26/11 ముంబయి దాడుల అనంతరం, అంత పెద్ద ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత కూడా వారికి పాకిస్థాన్ మీద ప్రేమ చావలేదు. ఈ దాడులు జరిగిన కొన్ని వారాల అనంతరం, విదేశాల ఒత్తిడితో కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్థాన్‌తో చర్చలు ప్రారంభించింది.

గౌరవ అధ్యక్షా!

26/11 దాడి జరిగినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పాకిస్థానీ దౌత్యవేత్తను కూడా బహిష్కరించలేదు. ఆ సంగతి వదిలేయండి.. ఒక్క వీసాను కూడా వారు రద్దు చేయలేకపోయారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర దాడులు కొనసాగుతున్నప్పటికీ, యూపీఏ ప్రభుత్వం ‘అత్యంత అనుకూలమైన దేశంగా’ పాకిస్థాన్‌ను కొనసాగించింది. ఈ హోదాను వారు ఎప్పుడూ రద్దు చేయలేదు. ఓ వైపు ముంబయి దమన కాండకు దేశం న్యాయాన్ని కోరుకుంటే.. మరో వైపు.. పాకిస్థాన్‌తో వాణిజ్యంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మన నేలపై రక్తం చిందించడానికి పాకిస్థాన్ ఉగ్రవాదులను పంపుతుంటే.. స్నేహాన్ని కాంక్షిస్తూ.. ‘‘శాంతి కవిత్వ సమావేశాలు’’- ముషాయిరాలు - నిర్వహించడంలో కాంగ్రెస్ తలమునకలై ఉంది. మేము ఆ ఏకముఖ ఉగ్రవాద ట్రాఫిక్‌ను నిలువరించాం. శాంతి చర్చలను పక్కన పెట్టాం. మేం పాకిస్థాన్ ఎంఎఫ్ఎన్ స్థాయిని, వీసాలను రద్దు చేశాం. అటారీ-వాఘా సరిహద్దును మూసివేశాం.

గౌరవ అధ్యక్షా!

భారత్ అవసరాలను తాకట్టు పెట్టడం కాంగ్రెస్ పార్టీకున్న పాత అలవాటు. దానికి పెద్ద ఉదాహరణే సింధూ జలాల ఒప్పందం. ఈ సింధూ జలాల ఒప్పందంపై ఎవరు సంతకం చేశారు? నెహ్రూ జీ. ఈ సమస్య దేని గురించి? భారత్ లో పుట్టిన నదులు, మన నదీ జలాల గురించి. ఈ నదులు వేల ఏళ్లుగా భారత సాంస్కృతిక వారసత్వంలో భాగంగా ఉన్నాయి. ఇవి భారత్‌కు జీవనాడి. దేశాన్ని సుభిక్షంగా, సారవంతంగా మార్చడానికి దోహదపడ్డాయి. శతాబ్దాలుగా భారత్ గుర్తింపుగా సింధూనది నిలిచింది - ఆ పేరుతోనే భారత్ ప్రసిద్ధి పొందింది - కానీ సింధు, జీలం నదుల వివాదాన్ని నెహ్రూ జీ, కాంగ్రెస్ ఎవరికి అప్పగించారు? ప్రపంచ బ్యాంకుకు. ఈ విషయంలో ఏం చేయాలో నిర్ణయించమని వారు ప్రపంచ బ్యాంకును అడిగారు - నదులు మనవి, నీరు మనదే. భారత్ గుర్తింపు, ఆత్మ గౌరవానికి చేసిన తీవ్రమైన ద్రోహమే ఈ సింధూ జలాల ఒప్పందం.

గౌరవ అధ్యక్షా!

ఈ విషయం నేటి యువత వింటే.. ఇలాంటి వ్యక్తులా మన దేశాన్ని నడిపించింది అని ఆశ్చర్యపోతారు. నెహ్రూజీ వ్యూహాత్మకంగా ఇంకేం చేశారు? భారత్ నుంచి ప్రవహించే నదుల్లోని 80 శాతం నీటిని పాకిస్థాన్‌కు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇంత విస్తారమైన భారత్‌కు కేవలం 20 శాతం నీటిని మిగిల్చారు. దీన్ని ఎవరైనా నాకు అర్థమయ్యేలా చెప్పండి - ఇదేం తరహా జ్ఞానం? దీనివల్ల జాతికి ఏం ప్రయోజనం కలిగింది? ఇది ఏ రకమైన దౌత్యం? ఏ పరిస్థితిలోకి దేశాన్ని తీసుకెళ్లారు? ఇంత పెద్ద జనాభా ఉన్న దేశానికి, నదులు పుట్టిన మన నేలకు - మనకు కేవలం 20 శాతం నీరు. భారత్ తమ శత్రుదేశంగా బహిరంగంగా ప్రకటించే దేశానికి 80 శాతం జలాలు. ఈ నీటిపై న్యాయంగా ఎవరికి హక్కు ఉంది? మన దేశ రైతులు, మన ప్రజలు, మన పంజాబ్, మన జమ్ము కశ్మీర్‌కు. ఈ ఒక్క నిర్ణయం కారణంగా దేశంలో పెద్ద భాగం నీటి సంక్షోభంలోకి కూరుకుపోయింది. రాష్ట్రాల మధ్యలో సైతం విభేదాలు తలెత్తాయి. పోటీ నెలకొంది. హక్కుగా మనకు దక్కాల్సిన ప్రయోజనాలను పాకిస్థాన్ ఆస్వాదించింది. ఇలాంటి ఈ వ్యక్తులు ప్రపంచ దౌత్యం గురించి మాకు పాఠాలు చెబుతున్నారు.

గౌరవ అధ్యక్షా!

ఈ ఒప్పందం మీద సంతకం చేయకుండా ఉండి ఉంటే.. పశ్చిమ నదులపై ఎన్నో పెద్ద ప్రాజెక్టులు నిర్మాణమై ఉండేవి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రైతులకు పుష్కలంగా నీరు లభించి ఉండేది. తాగునీటి సదుపాయానికి ఎలాంటి సమస్యలూ ఎదురయ్యేవి కాదు. పారిశ్రామిక అభివృద్ధి కోసం భారత్ విద్యుత్ ఉత్పత్తి చేసి ఉండేది. ఇదొక్కటే కాదు.. ఆ తర్వాత కూడా పాకిస్థాన్ కాలువలు నిర్మించుకొనేందుకు కోట్ల రూపాయలను నెహ్రూజీ ఇచ్చారు.

గౌరవ అధ్యక్షా!

ఇంతకంటే విస్మయం కలిగించే విషయం ఏంటంటే.. ఇది దేశాన్ని ఆశ్చర్యపరుస్తుంది - ఇవి దాచి ఉంచిన, మరుగున పెట్టిన అంశాలు. ఎప్పుడు ఆనకట్టను నిర్మించినా, దానిని శుభ్రపరచడానికి, పూడిక తీయడానికి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే ఒండ్రు మట్టి, కలుపు, ఇతర చెత్త పేరుకుపోయి డ్యామ్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అందుకే డీసిల్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. కానీ పాకిస్థాన్ పట్టుపట్టడంతో డ్యాంలో పేరుకుపోయి ఒండ్రు మట్టి, వ్యర్థ్యాలను తొలగించకూడదనే షరతుకు నెహ్రూ జీ అంగీకరించారు. డీసిల్టింగ్‌కు అనుమతి లేదు. డ్యాం మన దేశంలో ఉంది, నీరు మనది, నిర్ణయం మాత్రం పాకిస్థాన్‌ది. పూడిక తీయడానికి అనుమతి లేదంటే మీరు నమ్మగలరా? అదే కాదు - నేను దీనిని పూర్తిగా అధ్యయనం చేసినప్పుడు, ఒక ఆనకట్టలో డీ సిల్టింగ్ కోసం ఉపయోగించే గేటును వెల్డింగ్ చేసి మూసివేశారని నేను గుర్తించాను. దానివల్ల ఆ గేటును తెరిచి పూడిక తీయడానికి అవకాశం ఉండదు. తమ అనుమతి లేకుండా.. భారత్ ఆనకట్టల పూడిక తీయదని నెహ్రూ జీతో పాకిస్థాన్ ఒప్పందం చేసుకుంది. ఇది భారత్ ఆసక్తులకు వ్యతిరేకం. తర్వాత ఈ తప్పును నెహ్రూజీ కూడా ఒప్పుకున్నారు. ఈ ఒప్పందంలో నిరంజన్ దాస్ గులాటీ అనే పెద్ద మనిషి పాల్గొన్నారు. ఆయన రాసిన పుస్తకంలో దీని గురించి పేర్కొన్నారు. ‘‘గులాటీ, ఇతర సమస్యలను సైతం ఈ ఒప్పందం పరిష్కరిస్తుందని ఆశించాను. కానీ మనం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే ఉన్నాం’’ అని 1961, ఫిబ్రవరిలో తనతో నెహ్రూ అన్నారని రాశారు. నెహ్రూజీయే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. స్వల్పకాలిక ప్రభావాన్ని మాత్రమే నెహ్రూజీ చూడగలిగారు. అందుకే ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నామని అన్నారు. కానీ వాస్తవేమిటంటే.. ఈ ఒప్పందం వల్ల దేశం బాగా వెనకబడిపోయింది. ఈ దేశం చాలా నష్టపోయింది. రైతులకు హాని జరిగింది. మన పంటలు దెబ్బ తిన్నాయి. రైతుకు స్థానం, ప్రాధాన్యం లేని దౌత్యాన్ని నెహ్రూజీ అనుసరించారు. ఇది ఆయన కల్పించిన పరిస్థితి.

గౌరవ అధ్యక్షా!

దశాబ్దాల తరబడి భారత్‌తో ప్రత్యక్ష, పరోక్ష యుద్దాన్ని పాకిస్థాన్ కొనసాగిస్తోంది. ఆ తర్వాత కూడా సింధూ జలాల ఒప్పందాన్ని పున:సమీక్షించాలని, నెహ్రూజీ చేసిన ఘోర తప్పిదాన్ని సరిదిద్దాలని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ ఆలోచించలేదు.

గౌరవ అధ్యక్షా!

ఇప్పుడు, ఆ తప్పిదాన్ని సరిచేస్తూ.. దృఢమైన నిర్ణయాన్ని భారత్ తీసుకుంది. మన జాతీయ ఆసక్తులను, మన రైతుల ప్రయోజనాలను అనిశ్చితిలో పడేసేలా నెహ్రూజీ చేసిన తప్పిదం - సింధూ జలాల ఒప్పందం. మన దేశ సంక్షేమానికి వ్యతిరేకంగా ఉన్న ఈ ఒప్పందాన్ని ప్రస్తుత రూపంలో కొనసాగించలేం. ఈ విషయాన్ని భారత్ సుస్పష్టంగా చెప్పింది: రక్తం, నీరు కలసి ప్రవహించలేవు.

గౌరవ అధ్యక్షా!

ఉగ్రవాదం గురించి ఇక్కడ ఉన్న సభ్యులు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తున్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు, వారికి పాలించే అవకాశం లభించినప్పుడు, ఈ దేశ పరిస్థితి ఎలా ఉండేదో ప్రజలు ఈ నాటికీ మరచిపోలేదు. 2014కు ముందు దేశంలో అభద్రతాపూరితమైన వాతావరణం ఉండేది. దాన్ని ఇఫ్పుడు గుర్తు చేసుకున్నా.. ప్రజలు భయంతో కంపించిపోతారు.

గౌరవ అధ్యక్షా!

మనందరికీ గుర్తుంది - ఇప్పటి తరానికి అది తెలియకపోవచ్చు - కానీ మనందరికీ బాగా గుర్తుంది. ఎక్కడికి వెళ్లినా ప్రకటనలు వినిపించేవి. మీరు రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్‌పోర్టు, మార్కెట్, గుడి లేదా ఏదైనా రద్దీగా ఉండే ప్రదేశానికి వెళ్లినా.. ఒకే ప్రకటన వినిపించేది - ‘‘అనుమానాస్పద వస్తువులు గమనించినట్లయితే వాటిని తాకవద్దు. వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. అది బాంబు కావచ్చు’’ అని. 2014 వరకు దీన్ని మనం వింటూనే ఉన్నాం. ఇదీ అప్పట్లో మన దేశ పరిస్థితి. దేశంలోని ప్రతి మూలలో, అడుగడుగునా బాంబులు అమర్చినట్లు ఉండేది. మన పౌరులు తమని తాము రక్షించుకోవాల్సి వచ్చేది. తాము ఏమీ చేయలేమని ఈ బహిరంగ ప్రకటనల ద్వారా అధికారులు చేతులెత్తేశారు.

గౌరవ అధ్యక్షా!

బలహీనమైన కాంగ్రెస్ ప్రభుత్వాల కారణంగా, ఈ దేశం ఎన్నో ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. మన సొంత ప్రజలను మనం కోల్పోయాం.

గౌరవ అధ్యక్షా!

ఉగ్రవాదాన్ని నియంత్రించవచ్చు. గడచిన 11 ఏళ్లలో మా ప్రభుత్వం దాన్ని చేసి చూపించింది - దానికి బలమైన సాక్ష్యం ఉంది. 2004 నుంచి 2014 మధ్య జరిగిన ఉగ్రదాడుల సంఖ్య ఆ తర్వాతి కాలంలో గణనీయంగా తగ్గింది. అందుకే దేశం కూడా తెలుసుకోవాలనుకుంటోంది: మా ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణచివేయగలిగినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉగ్రవాదం పెరిగేలా ఎందుకు అనుమతించాయి అని.

గౌరవ అధ్యక్షా!

కాంగ్రెస్ పరిపాలనలో ఉగ్రవాదం పెరగడానికి ప్రధాన కారణం బుజ్జగింపు రాజకీయాలే. వారి ఓటు బ్యాంకు విధానాలే. ఢిల్లీలో భట్ల హౌస్ ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు, ఓ పెద్ద కాంగ్రెస్ నాయకుని కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే ఉగ్రవాదులు హతమయ్యారు కాబట్టి. ఓట్లను ఎక్కువ సాధించుకోవడానికి ఈ విషయాన్ని దేశం నలుమూలలకు చేరుకొనేలా చేశారు.

 

గౌరవ అధ్యక్షా!

దేశ పార్లమెంట్ భవనంపై 2001లో దాడి జరిగినప్పుడు, అఫ్జల్ గురు ఆ పని చేసి ఉండకపోవచ్చన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు మాట్లాడారు.

గౌరవ అధ్యక్షా!

ముంబయిలో 26/11 నాడు అంత పెద్ద ఉగ్రవాద దాడి జరిగింది. పాక్ టెర్రరిస్టు దొరికిపోయాడు. అతడు పాకిస్థానీయే అని పాక్ సొంత మీడియా, చివరకు ప్రపంచం సైతం ఒప్పుకొన్నాయి. అంత ఘోరమైన ఉగ్రవాద చర్యకు  పాక్ పాల్పడితే దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ చేసిందేమిటి? ఓట్ బ్యాంకు రాజకీయాల కోసం వారు ఏమేం నాటకాలు ఆడారు?  పాక్‌ను జవాబుదారుగా నిలబెట్టే బదులు, దీనిని ‘‘కాషాయ ఉగ్రవాదం’’ అని ముద్ర వేయడానికి  కాంగ్రెస్ పార్టీ  పడరాని పాట్లు పడింది. హిందూ అతివాద సిద్దాంతాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. భారత్‌లో లష్కరే తోయిబా   కన్నా పెద్ద ముప్పు  హిందూ గ్రూపులతో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అమెరికాకు చెందిన ఒక ప్రముఖ దౌత్యవేత్తతో అన్నారు. నిజంగానే ఈ మాటలను చెప్పారు. కొన్ని వర్గాలకు సంతృప్తి కలిగేటట్లు.. కాంగ్రెస్ భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేడ్కర్ తీర్చిదిద్దిన రాజ్యాంగాన్ని, జమ్మూకాశ్మీర్‌లో పూర్తి స్థాయిలో అమలు చేయనీయకుండా అడ్డుకొంది. రాజ్యాంగం అక్కడ అమల్లోకి రాకుండా బయటే ఉంచేశారు. కొన్ని వర్గాలను సంతోషపెట్టడం కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల దృష్టితో దేశ భద్రతను కాంగ్రెస్ పదేపదే పణంగా పెడుతూ వచ్చింది.

గౌరవ అధ్యక్షా!

కొన్ని వర్గాలను సంతృప్తిపరచడం కోసం ఉగ్రవాదానికి సంబంధించిన చట్టాలను కాంగ్రెస్ బలహీనమైనవిగా మార్చింది. దీనిని గురించి గౌరవ హోం మంత్రి సభకు ఈ రోజు ఇప్పటికే వివరంగా తెలియజేశారు కాబట్టి ఈ విషయాన్ని నేను మళ్లీ చెప్పాలనుకోవడంలేదు.

గౌరవ అధ్యక్షా!

ఈ సమావేశం మొదట్లోనే, నేను ఒక విజ్ఞప్తి చేశాను. అది.. పార్టీ ప్రయోజనాల విషయంలో మన అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నా కూడా.. దేశ హితం విషయానికి వస్తే మనందరి ఆలోచనలు ఒకే విధమైనవిగా ఉండితీరాలి అనేదే. పహల్‌గామ్‌ ఘోర దురంతం ఒక పట్టాన మానని గాయాలను మిగిల్చింది. అది దేశ పౌరులను కుదిపేసింది. దీనికి సమాధానంగానే, మనం ఆపరేషన్ సిందూర్‌కు నడుం బిగించాం. మరి మన బలగాల ధైర్య సాహసాలకు తోడు మన స్వయంసమృద్ధి సాధన ప్రచార ఉద్యమం జతపడి దేశవ్యాప్తంగా ‘‘సిందూర్ స్ఫూర్తి’’ని రగిల్చింది. మన దేశం తరఫున వాదనను వినిపించడానికి మన ప్రతినిధి వర్గాలు ప్రపంచాన్ని చుట్టి రావడానికి  వెళ్లినప్పుడూ మనం ఇదే సిందూర్ స్ఫూర్తిని గమనించాం. ఆ  సహచర సభ్యులందరినీ నేను మనసారా అభినందిస్తున్నా. మీరు భారత్ వైఖరిని శక్తిమంతంగానూ, క్షమాపణ వేడుకోకుండానూ ప్రపంచానికి తెలియజెప్పారు. అయితే నాకు ఒక విషయంలో విచారం, విస్మయం కలిగాయి. ఎందుకంటే.. భారత్ వైఖరిని ప్రపంచవ్యాప్తంగా చాటినందుకు కాంగ్రెస్ పార్టీలో తమను తాము సీనియర్ నేతలుగా భావించే కొందరు విచారానికి లోనయ్యారు. కొంతమంది నాయకులను సభలో మాట్లాడవద్దంటూ ఆంక్షలు విధించినట్లు అనిపిస్తోంది.        

గౌరవ అధ్యక్షా!

ఈ మనస్తత్వాన్ని వదుల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఒక  కవితలో కొన్ని పంక్తులు నాకు గుర్తుకొస్తున్నాయి. నా భావాలను ఆ కవితాపంక్తులతో తెలియజెప్పాలనుకుంటున్నా:

చర్చించండి, ఎంతగా అంటే
శత్రువు భయంతో గడగడ వణికేటట్లుగా
ఒకటే గుర్తుపెట్టుకోండి,
ఎన్ని ప్రశ్నలు తలెత్తినా సరే, సిందూరానికున్న గౌరవం, మన సైన్య పరాక్రమం చెక్కుచెదరకుండుగాక
భరత మాతపైన దాడి జరిగితే, వెను వెంటనే భారీ స్థాయిలో దెబ్బలు పడతాయి
శత్రువు ఎక్కడ నక్కినప్పటికీ, భారత్ కోసమే మనం జీవించి తీరతాం.

కాంగ్రెస్ పార్టీకి చెందిన తోటి సహచరులకు నేను ఒక విన్నపం చేస్తున్నా: ఒక కుటుంబం ఒత్తిడికి లొంగిపోయి, పాకిస్థాన్ తప్పేమీ లేదని చెప్పకండి. భారత్ సాధించుకున్న ఈ విజయోత్సవ ఘడియను జాతీయ అపహాస్యం స్థాయికి తీసుకుపోకండి. కాంగ్రెస్ తను చేసిన పొరపాట్లను దిద్దుకొని తీరాలి. ఈ రోజున, ఈ సభలో నేనొకటి చాలా స్పష్టంగా చెప్పదల్చుకొన్నా:  ఉగ్రవాదుల్ని భారత్ ఇక వారి స్థావరాల్లోనే మట్టికరిపిస్తుంది. భారత్ భవిష్యత్తుతో పాకిస్థానును మేం ఇకపై ఆటలాడుకోనివ్వం. ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదు.. అది ఇక ముందూ కొనసాగుతుంది. ఇది పాకిస్థానుకు ఒక గమనిక కూడా: వారు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పోషించే తీరును మానుకోనంత వరకు, భారత్ నిర్ణయాత్మక చర్యల్ని తీసుకొంటూనే ఉంటుంది. భారత్ భవిత సురక్షితంగా, సమృద్ధంగా ఉంటుంది. ఇది మా దృఢ సంకల్పం. ఇదే స్ఫూర్తితో, నేను మరోసారి అర్ధవంతమైన చర్చను నిర్వహించినందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా.

గౌరవ అధ్యక్షా!

నేను భారత్ అనుసరిస్తున్న వైఖరిని చాటిచెప్పడంతో పాటు మన దేశ ప్రజల ఉద్వేగాలను కూడా తెలియజేశా. ఈ సభకు నేను మరో సారి నా కృతజ్ఞత‌ను తెలియజేస్తున్నా.

మీకు అనేకానేక ధన్యవాదాలు.

 

***

 


(Release ID: 2150490)