కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2025, ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న ‘పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎం-వీబీఆర్‌వై)’

Posted On: 25 JUL 2025 1:04PM by PIB Hyderabad

కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహక (ఈఎల్ఐ) పథకం ‘‘పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎం-వీబీఆర్‌వై) పేరుతో 2025, ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది. వికసిత్ భారత్ మొత్తం లక్ష్యాలకు అనుగుణంగా ఈ పథకం పేరు ఉంది. అలాగే దేశంలో సమ్మిళిత, సుస్థిర ఉద్యోగావకాశాలు కల్పించాలనే ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

మొదట, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పీఎంవీబీఆర్‌వై పథకాన్ని ఆమోదించారు. దీని అంచనా వ్యయం రూ. 99,446 కోట్లు. రెండేళ్ల కాలవ్యవధిలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను కల్పించడమే ఈ పథకం లక్ష్యం. వీటిలో 1.92 కోట్ల మంది లబ్ధిదారులు తొలిసారిగా ఉద్యోగంలో చేరతారు. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జులై 31 మధ్య కాలంలో సృష్టించిన ఉద్యోగాలకు ఈ పథకం ప్రయోజనాలు వర్తిస్తాయి.

నూతన ఉద్యోగాలను కల్పించేందుకు యజమానులకు ఈ పథకం ప్రోత్సాహకాలు అందిస్తుంది. తయారీ రంగంపై ప్రధాన దృష్టి సారిస్తూ.. మిగిలిన రంగాల్లో సైతం కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రయోజనాలు అందించడమే దీని లక్ష్యం. ఉద్యోగ ఆధారిత అభివృద్ధి ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయాలనే భారత వ్యూహంలో ఇది కీలకమైన భాగం.

ఈ పథకంలో రెండు భాగాలుంటాయి. తొలిసారి ఉద్యోగం సాధించిన వారిపై పార్ట్ ఎ, యజమానులపై పార్ట్ బి దృష్టి సారిస్తాయి.

పార్ట్ ఎ: తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ప్రోత్సాహకం

తొలిసారి ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్‌వోలో నమోదైనవారిని ఈ పార్ట్ ఎ లక్ష్యంగా చేసుకుంటుంది. రూ. 15,000 వరకు ఒక నెల ఈపీఎఫ్ వేతనాన్ని రెండు వాయిదాల్లో అందిస్తుంది. రూ. లక్ష వరకు వేతనం పొందే ఉద్యోగులు దీనికి అర్హులు. 6 నెలల సర్వీసు అనంతరం మొదటి వాయిదాను, 12 నెలల ఉద్యోగ కాలం అనంతరం, ఉద్యోగి ఆర్థిక అక్షరాస్యతా కార్యక్రమం పూర్తయిన పిమ్మట రెండో వాయిదాను చెల్లిస్తారు. పొదుపు అలవాటును పెంపొందించాలనే ఆలోచనతో.. ఈ ప్రోత్సాహకంలో కొంత భాగాన్ని పొదుపు పథకాలు లేదా డిపాజిట్ ఖాతాలో నిర్దేశిత కాలం ఉంచుతారు. వ్యవధి పూర్తయిన తర్వాత ఉద్యోగి వీటిని ఉపసంహరించుకోవచ్చు.

పార్ట్ బి: యజమానులకు తోడ్పాటు

తయారీ రంగంపై ప్రధాన దృష్టి సారిస్తూ.. ఇతర రంగాల్లో సైతం అదనపు ఉద్యోగావకాశాలను కల్పించేలా ఈ భాగం తోడ్పడుతుంది. రూ. లక్ష వరకు వేతనం ఉన్న ఉద్యోగుల విషయంలో యజమానులు ప్రోత్సాహకాలు పొందుతారు. కనీసం ఆరు నెలల పాటు ఉద్యోగం కొనసాగించిన ప్రతి అదనపు ఉద్యోగికి నెలకు రూ. 3,000 చొప్పున రెండేళ్ల పాటు యజమానులకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుంది. తయారీ రంగం విషయానికి వస్తే.. ఈ ప్రోత్సాహకాలు మూడో ఏడాదికి, నాలుగో ఏడాదికి పొడిగిస్తారు.

ఈ పథకం ప్రయోజనాలు పొందడానికి ఈపీఎఫ్‌వోలో నమోదైన సంస్థలు కనీసం ఆరు నెలల పాటు స్థిర ప్రాతిపదికన ఇద్దరు అదనపు ఉద్యోగులు (50 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న యజమానులకు) లేదా ఐదుగురు అదనపు ఉద్యోగులను (50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులన్న యజమానులు) నియమించుకోవాలి.

 

ప్రోత్సాహకాల విధానం దిగువ చూపిన విధంగా ఉంటుంది:

అదనపు ఉద్యోగికి ఈపీఎఫ్ వేతన స్లాబులు

యజమానికి ప్రయోజనం (ప్రతి అదనపు ఉద్యోగికి గాను నెలకు)

రూ. 10,000 వరకు*

రూ. 1,000 వరకు

రూ. 10,000 కంటే ఎక్కువ – రూ. 20,000 వరకు

రూ. 2,000

రూ. 20,000 కంటే ఎక్కువ (నెలకు రూఒక లక్ష వరకు)

రూ. 3,000

రూ. 10,000 వరకు ఈపీఎఫ్ వేతనం ఉన్న ఉద్యోగులు నిర్దిష్ట నిష్పత్తిలో ప్రోత్సాహకం పొందుతారు.


ప్రోత్సాహక చెల్లింపు విధానం:

పథకంలోని పార్ట్ ఎ కింద తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ఆధార్ బ్రిడ్జి పేమెంట్ సిస్టమ్ (ఏబీపీఎస్) ఉపయోగించి డీబీటీ (ప్రత్యక్ష ప్రయోజన బదిలీ) ద్వారా అన్ని చెల్లింపులు చేపడతారు. పార్ట్ బి కింద యజమానులకు పాన్ - అనుసంధానమైన ఖాతాలకు నేరుగా చెల్లింపులు జరుగుతాయి.


 

***


(Release ID: 2148419) Visitor Counter : 41