సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్-2025లో భారత లైవ్ ఈవెంట్స్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ: వ్యూహాత్మక వృద్ధి ఆవశ్యకతపై శ్వేతపత్రం విడుదల చేయనున్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్
2030 నాటికి ప్రపంచంలోని అయిదు అగ్రగామి వినోద గమ్యస్థానాలలో ఒకటిగా నిలవనున్న భారత్
భారత మీడియా, వినోద వ్యవస్థలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటిగా లైవ్ ఈవెంట్స్
Posted On:
01 MAY 2025 1:27PM
|
Location:
PIB Hyderabad
‘భారత లైవ్ ఈవెంట్స్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ: వ్యూహాత్మక వృద్ధి ఆవశ్యకత’పై శ్వేతపత్రాన్ని కేంద్ర సమాచార- ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ ఎల్. మురుగన్ విడుదల చేయనున్నారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించి ఈ తరహాలో ఇదే మొదటి శ్వేతపత్రం. వేవ్స్-2025 నాలెడ్జ్ పార్ట్‌నర్లలో ఒకటైన ఈవెంట్ఎఫ్ఏక్యూస్ దీనిని రూపొందించింది.
ముంబయిలో వేవ్స్ సదస్సు - 2025 సందర్భంగా మే 3న ఈ శ్వేతపత్రాన్ని అధికారికంగా విడుదల చేయనున్నారు. దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న ప్రత్యక్ష ప్రసార వినోద పరిశ్రమపై సమగ్ర విశ్లేషణను అందించడంతోపాటు కొత్త ధోరణులను, అభివృద్ధి మార్గాలను, ఈ రంగంలో నిరంతర పురోగమనం కోసం వ్యూహాత్మక సిఫార్సులను ఇది వివరిస్తుంది.
భారత్‌లో లైవ్ ఈవెంట్ల రంగంలో విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి – విడివిడిగా ఉన్న రంగం నిర్మాణాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. దేశ సాంస్కృతిక, సృజన రంగ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే మూలాధారంగా ఇది నిలుస్తోంది. 2024 నుంచి 2025 వరకు ఉన్న కాలం ఓ నిర్ణయాత్మక మలుపునకు కేంద్రంగా మారింది. అహ్మదాబాద్, ముంబయిలలో ‘కోల్డ్ ప్లే’ వంటి అంతర్జాతీయ ప్రదర్శనలతో.. ప్రపంచ స్థాయి కార్యక్రమాల నిర్వహణలో భారత సంసిద్ధతను చాటిన కాలమది.
ఈవెంట్ టూరిజం పెరగడంతోపాటు ఈ రంగంలో కీలక ధోరణులను గమనించవచ్చు. ప్రత్యేకించి సంగీత కార్యక్రమాల కోసం దాదాపు అయిదు లక్షల మంది ప్రయాణించి రావడం సంగీత పర్యాటక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతున్న విధానాన్ని సూచిస్తుంది. వీఐపీ అనుభవాలు, మెరుగైన లభ్యత, విలాసవంతమైన ఆతిథ్యం వంటి ప్రీమియం టికెటింగ్ విభాగాలు గతేడాదితో పోలిస్తే 100 శాతం వృద్ధిని సాధించాయి. మెరుగైన అనుభవాలను పొందిన ప్రేక్షకులు పెరుగుతుండడాన్ని ఇది సూచిస్తుంది. వివిధ నగరాల్లో పర్యటనలు, ప్రాంతీయ ఉత్సవాలకు పెరుగుతున్న ఆదరణ కారణంగా ఇందులో ద్వితీయ శ్రేణి నగరాల భాగస్వామ్యం పెరిగింది.
2024లో వ్యవస్థీకృత ప్రత్యక్ష కార్యక్రమాల విభాగంలో 15% వృద్ధి నమోదైంది. ఇది అదనంగా రూ. 1,300 కోట్ల ఆదాయాన్ని అందించింది. భారత మీడియా, వినోద వ్యవస్థలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నిర్ణీత రంగాల్లో ఒకటిగా ఇది నిలిచింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కో భారీ స్థాయి కార్యక్రమం సాధారణంగా దాదాపు 2,000 నుంచి 5,000 తాత్కాలిక ఉద్యోగాలను అందిస్తుంది. ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధిలో ఈ రంగం వాటా పెరుగుతుండడాన్ని ఇది సూచిస్తుంది.
కేంద్రీకృత పెట్టుబడులు, విధానపరమైన మద్దతు, మౌలిక సదుపాయాల నవీకరణల ద్వారా.. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా అయిదు అగ్రగామి లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ గమ్యస్థానాలలో ఒకటిగా నిలవడం లక్ష్యంగా భారత్ పయనిస్తోంది. ఆ దిశగా ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, పర్యాటకం, అంతర్జాతీయంగా సాంస్కృతిక అస్తిత్వాన్ని మెరుగుపరిచేలా సరికొత్త మార్గాలను ఆవిష్కరిస్తోంది.
***
Release ID:
(Release ID: 2126008)
| Visitor Counter:
8
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Nepali
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam