ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

మేఘాలయలోని మావ్లింగ్‌ఖుంగ్ (షిల్లాంగ్ సమీపంలో) నుంచి అస్సాంలోని పంచ్‌గ్రామ్ (సిల్చార్ సమీపంలో) వరకు హ్యామ్ (హెచ్ఏఎం) తరహాలో కొత్తగా 166.80 కి.మీ. (జాతీయ రహదారి-6) హై స్పీడ్ కారిడార్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

కారిడార్ మొత్తం మూలధన వ్యయం రూ.22,864 కోట్లు

Posted On: 30 APR 2025 4:05PM by PIB Hyderabad

మేఘాలయలోని మావ్లింగ్‌ఖుంగ్ (షిల్లాంగ్ సమీపంలో) నుంచి అస్సాంలోని పంచగ్రామ్ (సిల్చార్ సమీపంలో) వరకు ట్రాఫిక్ అంతరాయాలను తొలగించి ఎలాంటి అడ్డంకిలేని ప్రయాణానికి అనువుగా (యాక్సెస్ కంట్రోల్డ్) 166.80 కిలోమీటర్ల కొత్త రహదారి (జాతీయ రహదారి-6) నిర్మాణం, పరిరక్షణ, నిర్వహణ ప్రతిపాదనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. మిశ్రమ వార్షిక చెల్లింపు విధానం లో అంతరాయం లేకుండా అత్యంత వేగంగా వాహనాల రాకపోకలకు అవకాశం కల్పించే (యాక్సెస్ కంట్రోల్డ్) కొత్త

 

Hide quoted text

 

హైస్పీడ్ కారిడార్‌గా దీనిని చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం మూలధన వ్యయం రూ. 22,864 కోట్లు. ప్రాజెక్టు పొడవు 166.80 కి.మీ. కాగా, మేఘాలయలో 144.80 కి.మీ, అస్సాంలో 22.00 కి.మీ విస్తరించి ఉంది.

Hide quoted text

ప్రతిపాదిత కొత్త హైస్పీడ్ కారిడార్ గౌహతి నుంచి సిల్చార్‌కు వెళ్ళే ట్రాఫిక్‌కు సంబంధించి సేవల స్థాయిని మెరుగుపరుస్తుంది. ఈ కారిడార్ అభివృద్ధి వలన త్రిపుర, మిజోరాం, మణిపూర్, అస్సాంలోని బరాక్ లోయ ప్రాంతం నుంచి ప్రధాన భూభాగానికీ గౌహతికీ రవాణా సదుపాయం మెరుగుపడుతుంది. ప్రయాణ దూరం, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతాయి. ఇది దేశంలో రవాణా సామర్థ్యాన్ని పెంచడానికి దోహదం చేస్తుంది.

 

మేఘాలయలోని సిమెంటు, బొగ్గు ఉత్పత్తి ప్రాంతాల గుండా వెళ్లే కారిడార్ అస్సాం, మేఘాలయ మధ్య రవాణాను మెరుగుపరచడమే కాకుండా.. మేఘాలయలో పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుంది. గౌహతి నుంచి సిల్చార్ ను కలిపే ఈ కారిడార్.. మెరుగైన రవాణా సదుపాయాలున్న గౌహతి, షిల్లాంగ్, సిల్చార్ (ప్రస్తుత జాతీయ రహదారి-6) విమానాశ్రయాల నుంచి వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు మెరుగైన సేవలందిస్తుంది. ఇది ఈశాన్య భారతంలోని సుందరమైన పర్యాటక ప్రదేశాలను కలుపుతూ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది.

 

కీలకమైన ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మేఘాలయలోని రి భోయి, తూర్పు ఖాసీ కొండలు, పశ్చిమ ఖాసీ కొండలు, తూర్పు జాయింతియా కొండలు, అస్సాంలోని కచార్ జిల్లాల గుండా.. గౌహతి, షిల్లాంగ్, సిల్చార్ మధ్య ప్రయాణం కోసం అనుసంధానాన్ని పెంచుతుంది. ప్రస్తుత జాతీయ రహదారి-6పై రద్దీని తగ్గించడంతోపాటు ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ బృహత్ప్రణాళికకు అనుగుణంగా రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధిని మెరుగుపరుస్తుంది.

 

గౌహతి, షిల్లాంగ్, సిల్చార్, డియెంగ్‌పాసో, ఉమ్ములాంగ్, ఫ్రేమర్, ఖలీరియట్, రాటాచెరా, ఉమ్కియాంగ్, కలైన్ ప్రాంతాలకు అంతరాయం లేకుండా రవాణా సదుపాయాన్ని అందిస్తూ... జాతీయ రహదారులు- 27, 106, 206, 37 సహా ప్రధాన రవాణా కారిడార్లను ఈ ప్రాజెక్టు ప్రణాళిక అనుసంధానిస్తుంది.

 

షిల్లాంగ్ - సిల్చార్ కారిడార్ పూర్తయితే ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిలో అది కీలక పాత్ర పోషిస్తుంది. గౌహతి, షిల్లాంగ్, సిల్చార్, ఇంఫాల్, ఐజ్వాల్, అగర్తల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. ఆత్మనిర్భర భారత్.. మేఘాలయ, అస్సాం, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో ఉపాధి కల్పనతోపాటు సామాజిక- ఆర్థికాభివృద్ధిని పెంపొందించాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు.


(Release ID: 2125582)