విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలితో సంయుక్త పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన (28.02.2025)

Posted On: 28 FEB 2025 3:04PM by PIB Hyderabad

గౌరవనీయురాలు, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు,

 

యూరోపియన్ కాలేజ్ ఆఫ్ కమిషనర్స్,

 

ప్రతినిధులు,

 

ప్రసార మాధ్యమాలకు చెందిన మిత్రులారా,

 

నమస్కారం.

 

యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలితోపాటు కాలేజ్ ఆఫ్ కమిషనర్స్ భారత్‌కు రావడం ఇదివరకు ఎన్నడూ జరుగనేలేదు.

 

ఇది యూరోపియన్ కమిషన్ భారత్ లో తొలిసారి పర్యటించడం ఒక్కటే కాదు.. ఏ ఒక్క దేశంలోనైనా ఇంత సమగ్ర స్థాయిలో సందర్శించడం కూడా మొదటిసారే. అలాగే కొత్త కమిషన్ తన తాజా పదవీకాలంలో జరుపుతున్న తొలి సందర్శనలలో ఇదొకటని చెప్పాలి. ఈ చరిత్రాత్మక సందర్భంలో, నేను యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలికి , కాలేజ్ ఆఫ్ కమిషనర్స్‌కు స్నేహపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.  

 

 

మిత్రులారా,

 

ఈయూకు, భారతదేశానికి మధ్య ఇరవై సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న వ్యూహాత్మక భాగస్వామ్యం స్వాభావికమైందీ, సజీవమైందీనూ. విశ్వాసం, ప్రజాస్వామ్య విలువలంటే ఉన్న ఉమ్మడి నమ్మకం, సమృద్ధి పట్లా, ఉమ్మడి ప్రగతి పట్లా ఉభయ పక్షాల పరస్పర నిబద్ధత.. బలమైన ఈ పునాదులపై ఈ భాగస్వామ్యం నిలబడి ఉంది.

 

ఇదే స్ఫూర్తితో, మనం నిన్న, నేడు విభిన్న రంగాలకు సంబంధించిన సుమారు 20 మంత్రిత్వ స్థాయి సమావేశాలను నిర్వహించాం. ప్రాంతీయ, ప్రపంచ విషయాలపై నిజాయతీతో, అర్ధవంతమైన చర్చలు జరిగాయి. మన భాగస్వామ్యాన్ని మరిన్ని రంగాలకు విస్తరించి, వేగంగా ముందుకు తీసుకుపోవాలని అనేక ముఖ్య నిర్ణయాలు తీసుకొన్నాం.

వ్యాపారం, టెక్నాలజీ, పెట్టుబడులు, నవకల్పనలు, హరిత ప్రధానమైన వృద్ధి సాధన, భద్రత, నైపుణ్యాలకు పదును పెట్టుకోవడం, మొబిలిటీ వంటి రంగాలలో పరస్పర సహకారానికి మనమొక నమూనాను రూపొందించాం. ఉభయపక్షాలకు పరస్పరం ప్రయోజనకారి కాగలిగే ద్వైపాక్షిక స్వేచ్ఛా వ్యాపార ఒప్పందాన్ని ఈ ఏడాది చివరికల్లా ఖాయపరచాల్సిందిగా మనం మన బృందాలకు ఆదేశాలు ఇచ్చాం.

 

మిత్రులారా,

 

పెట్టుబడులకు సంబంధించిన ఫ్రేంవర్కును పటిష్టపరచడానికి, ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ అండ్ జీఐ అగ్రిమెంటు పక్రియను ప్రోత్సహించాలనే అంశం సైతం ప్రస్తావనకు వచ్చింది. టెక్నాలజీ, నవకల్పన రంగంలో ఒక విశ్వసనీయమైన, సురక్షితమైన వేల్యూ చైనును ఏర్పాటు చేయాలనేది మన ఉమ్మడి ప్రాథమ్యంగా ఉంది.

 

సెమీకండక్టర్స్, కృత్రిమ మేధ (ఏఐ), ఉన్నతమైన పనితీరును కలిగి ఉండే కంప్యూటింగ్, ఇంకా 6జి.. ఈ రంగాల్లో సహకారాన్ని పెంచుకోవాలని కూడా మనం సమ్మతిని తెలియజేసుకొన్నాం. అంతరిక్ష మాధ్యమ సంభాషణ ప్రక్రియను కూడా మొదలుపెట్టాలని మనం నిర్ణయించుకొన్నాం.  

 

 

మిత్రులారా,

 

పర్యావరణానికీ, ఆర్థిక వ్యవస్థకూ మధ్య సమతౌల్యం మన ఉమ్మడి నిబద్ధతగా ఉంటూ వచ్చింది. మరి మనం ఈ దిశలో మన సహకారాన్ని కూడా పటిష్టపరుచుకొన్నాం. ‘గ్రీన్ హైడ్రోజన్ ఫోరమ్ అండ్ ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ బిజినెస్ సమ్మిట్‌’ను నిర్వహించాలని మనం నిర్ణయించుకొన్నాం. విద్యుత్తు వాహనాలలో ఉపయోగించే బ్యాటరీలు, మరీన్ ప్లాస్టిక్స్, గ్రీన్ హైడ్రోజన్‌.. వీటిపైన సంయుక్త పరిశోధనలను చేపడుతాం. మనం ఎక్కువ కాలం కొనసాగే పట్టణాభివృద్ధి విషయంలో మన సంయుక్త ప్రణాళికను కూడా ముందుకు తీసుకుపోతాం.

 

సంధానం (కనెక్టివిటీ) రంగంలో, ఇండియా – మిడిల్ ఈస్ట్ – యూరోప్ ఎకనామిక్ కారిడార్ లేదా ‘‘ఐఎంఈఈసీని ముందుకు తీసుకుపోవడానికి పక్కా చర్యలను చేపడతాం. రాబోయే కాలంలో ప్రపంచ వాణిజ్యం, స్థిర వృద్ధి, సమృద్ధిలను పరుగుపెట్టించే చోదక శక్తిగా ఐఎంఈఈసీ పరిణమిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.  

మిత్రులారా,

 

రక్షణ, భద్రతలకు సంబంధించిన అంశాలలో అంతకంతకు విస్తరిస్తున్న మన సహకారం మన మధ్య పరస్పర విశ్వాసానికి ఒక సూచిక అని చెప్పాలి. సైబర్ భద్రత, నౌకావాణిజ్య భద్రత, ఉగ్రవాదంపై పోరాటం.. ఈ అంశాల్లో మా సహకారాన్ని మనం మరింతగా బలోపేతం చేసుకొందాం.  

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వం, సమృద్ధి.. వీటికి ఉన్న ప్రాముఖ్యంపై ఇరు పక్షాలు సమ్మతిని వ్యక్తం చేస్తున్నాయి. ‘‘ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనీషియేటివ్’’లో చేరాలని ఈయూ నిర్ణయించుకోవడాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఇండో-పసిఫిక్ ప్రాంతంతోపాటు ఆఫ్రికాలో ఎక్కువ కాలం కొనసాగగలిగే విధమైన అభివృద్ధి, ఫలాలు అన్ని వర్గాలకు అందే తరహా అభివృద్ధి కోసం త్రికోణాభివృద్ధి పథకాలను రూపొందించడానికి మేం కలసి పనిచేస్తాం.

 

 

మిత్రులారా,

 

ప్రజలకు, ప్రజలకు మధ్య పరస్పర సంబంధాలు మన భాగస్వామ్యానికి అతి బలమైన సంపదగా ఉంటున్నాయి. మన మధ్య విద్య, పరిశోధన, పరిశ్రమల పరంగా భాగస్వామ్యాలను పెంపొందింపచేసుకోవడానికి మనం ఈ రోజున ఒక కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాం. భారతదేశంలో యువ ప్రతిభావంతులు, యూరోప్‌లోని నవకల్పన చేతులు కలిపితే అపరిమిత అవకాశాలను సృష్టించగలుగుతాయని నేను నమ్ముతున్నాను.  

 

ఈయూ అనుసరించ తలపెట్టిన కొత్త వీజా క్యాస్కేడ్ రెజీమ్‌ను మేం స్వాగతిస్తున్నాం. ఇది భారత్‌కు చెందిన ప్రతిభావంతులైన యువత శక్తి యుక్తులకు మేలైన అవకాశాల్ని అందిస్తుంది.

 

భారత్-ఈయూ భాగస్వామ్యాన్ని ఈ సంవత్సరం తరువాతా కొనసాగించడానికి ఒక సాహసభరితమైన, మహత్వాకాంక్ష కలిగిన మార్గసూచీని రూపొందించాలని మనం ఈ రోజు నిర్ణయించాం. దీనిని రాబోయే ఇండియా-ఈయూ సమ్మిట్‌ కాలంలో అమలుచేద్దాం.

 

గౌరవనీయురాలా,

 

భారత్‌కు మీరు రావడంతో, మన భాగస్వామ్యంలో కొత్త జోరు, శక్తి, ఉత్సాహాలు ప్రవేశించాయి. మన మహత్వాకాంక్ష ఆచరణ రూపాన్ని దాల్చడంలో ఈ యాత్ర అతి పెద్ద ఉత్ప్రేరకంగా పనిచేయనుంది.

 

రాబోయే ఇండియా-ఈయూ సమ్మిట్‌కుగాను భారత్‌లో మీకు మరో సారి స్వాగతం పలకడం కోసం నేను ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను.

 

మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.


(Release ID: 2107095) Visitor Counter : 15