ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలో రెండో అతి పెద్ద దేశంగా భారత్..
2014లో 2 యూనిట్లు ఉండగా, ప్రస్తుతం దేశమంతటా 300కు పైగా యూనిట్లు పనిచేస్తున్నాయి
దిగుమతుల నుంచి స్వతంత్రత వరకు:
భారత్‌లో ప్రస్తుతం అమ్ముడవుతున్న మొబైల్ ఫోన్లలో 99.2 శాతం ఫోన్లను మన దేశంలోనే తయారీ..
తయారవుతున్న ఫోన్ల విలువ రూ. 4,22,000 కోట్లకు..
వీటి ఎగుమతుల విలువ 2024లో రూ. 1,29,000 కోట్లకు పైనే
చార్జర్లు, బ్యాటరీ ప్యాక్స్ మొదలు కెమెరా మాడ్యూల్స్, డిస్‌ప్లే మాడ్యూల్స్ వగైరా ముఖ్య ఎలక్ట్రానిక్స్ వస్తువుల్ని దేశంలో ఉత్పత్తి చేయడానికి ఊతాన్నిచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’
సెమీకండక్టర్ చిప్స్, ఇతర విడిభాగాల అభివృద్ధిపై భారత్ ప్రత్యేక దృష్టి..
తయారీ సంబంధిత వేల్యూ చైన్‌ను విస్తరిస్తూ పురోగతి మార్గంలో పరుగుతీస్తున్న ఇండియా..
Posted On:
04 FEB 2025 5:03PM by PIB Hyderabad
ప్రపంచానికి తయారీ కూడలిగా భారత్ రూపొందుతుండడంలో ప్రధాన మంత్రి ‘మేక్ ఇన్ ఇండియా’ దార్శనికత సాయపడుతోంది. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన పదేళ్లలో ఇది మనదేశాన్ని స్వయంసమృద్ధి దిశగా ముందుకు తీసుకుపోవడం, ఉత్పత్తికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా ఉద్యోగాల్ని కూడా సృష్టిస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేలు, సమాచార-ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ఈ సమాచారాన్ని పంచుకోవడంతోపాటు గత దశాబ్ద కాలంలో మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భారత్‌లో ప్రశంసనీయ మార్పు చోటుచేసుకొందని కూడా ప్రధానంగా చెప్పారు.
దిగుమతుల స్థాయి నుంచి స్వతంత్రత దిశగా: మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ ఎదుగుదల
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ తయారీలో దేశం చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించి ప్రపంచంలో మొబైల్ తయారీ అతి పెద్ద దేశాల్లో రెండో దేశంగా నిలిచింది. 2014లో, భారత్‌లో కేవలం 2 మొబైల్ తయారీ యూనిట్లు ఉండేవి. అయితే ప్రస్తుతం మన దేశంలో ఈ తయారీ యూనిట్లు 300కు పైగా పనిచేస్తూ, ఈ కీలక రంగంలో గణనీయ విస్తరణ నమోదైన విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి.
దేశంలో 2014 -15 లో అమ్ముడవుతూన్న మొబైల్ ఫోన్లలో 26 శాతం ఫోన్లు మాత్రమే భారత్‌లో తయారు అవుతూ, మిగతా ఫోన్లు బయటి దేశాల నుంచి దిగుమతి అవుతూ ఉండేవి. ప్రస్తుతం, దేశంలో అమ్ముడువుతున్న మొత్తం మొబైల్ ఫోన్లలో 99.2 శాతం ఫోన్లు ఇక్కడ తయారైనవే. మొబైల్ ఫోన్ల తయారీ విలువ 2014 ఆర్థిక సంవత్సరంలో రూ. 18,900 కోట్లు ఉండగా 2024 ఆర్ధిక సంవత్సరానికి రూ. 4,22,000 కోట్లకు చేరుకొంది.
ఇండియాలో ఒక ఏడాదిలో 32.5 కోట్ల నుంచి 33 కోట్లకు పైగా మొబైల్ ఫోన్లను తయారు చేస్తున్నారు. మన దేశంలో సగటున లెక్కగడితే, సుమారు 100 మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. భారత్‌లో తయారైన మొబైల్ ఫోన్లు దేశీయ విపణిని ఇంచుమించు పూర్తిగా కమ్మేశాయి. మొబైల్ ఫోన్ల ఎగుమతులు అమాంతం జోరందుకున్నాయంటే దానికి కారణం కూడా ఇదే. 2014లో ఎగుమతులు దాదాపుగా అసలు ఏమీ లేవనే చెప్పాలి. అలాంటిది ఇప్పుడు ఎగుమతుల విలువ రూ. 1,29,000 కోట్ల కన్నా మించింది.
పదేళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఉద్యోగాల కల్పన
ఈ రంగాన్ని విస్తరించడం ఉద్యోగాల కల్పనకు ఒక ప్రముఖ చోదకశక్తిగా కూడా నిలిచింది. ప్రత్యక్షంగాను, పరోక్షంగాను దాదాపు 12 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ ఉద్యోగ అవకాశాలు అనేక కుటుంబాల ఆర్థిక స్థితి బాగుపడడానికి తోడ్పడడం ఒక్కటే కాకుండా, దేశంలో సామాజిక ఆర్థిక స్థితులు మెరుగుపడడానికి కూడా దోహదం చేశాయి.
ఈ ముఖ్య విజయాల్ని సాధించడంలో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది. ఇది చార్జర్, బ్యాటరీ ప్యాక్స్, అన్ని రకాల మేకానిక్స్, యూఎస్‌బీ కేబుల్స్‌తో పాటు లిథియం అయాన్ సెల్స్, స్పీకర్, మైక్రోఫోన్లు, డిస్‌ప్లే అసెంబ్లీస్, కెమెరా మాడ్యూల్స్ వంటి మరింత జటిల విడిభాగాలను దేశీయంగా ఉత్పత్తి చేయడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పరిచింది.
భవిష్యత్తులో వేల్యూ చైన్‌ను, ముఖ్యంగా విడిభాగాలు, సెమీకండక్టర్ల ఉత్పత్తిని విస్తరించడంపైన దృష్టిని కేంద్రీకరించనున్నారు. ఈ మార్పు స్వయంసమృద్ధిని పెంచుకోవడంతోపాటు భారత్‌ను ప్రపంచ ఎలక్ట్రానిక్స్ విపణిలో ఒక ప్రముఖ పాత్రధారిగా నిలపాలన్న ఒక విస్తృత వ్యూహంలో ఓ భాగమే ఈ మార్పు అని చెప్పాలి.
వేల్యూ చైన్‌ను విస్తరించడం: ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ పురోగమించేటట్లు చూడడం
ఫైన్ కాంపొనంట్స్, సెమీకండక్టర్ల ఉత్పత్తికి ప్రాధాన్యాన్నిస్తూ వేల్యూ చైన్‌ను మరింతగా విస్తరించడానికి శ్రద్ధ వహిస్తున్నట్లు మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ప్రస్తావించారు. దీంతో ఎలక్ట్రానిక్ విడిభాగాల అనుబంధ విస్తారిత వ్యవస్థ దేశీయంగా అభివృద్ధి చెందేందుకు మార్గం సుగమం కానుంది. ఇది ప్రపంచ స్థాయిలో ప్రధాన ఎలక్ట్రానిక్స్ విపణుల్లో ఒకటిగా భారత్ పటిష్ట స్థితికి చేరుకోవడానికి తోడ్పడుతుంది.
1950 నుంచి 1990 మధ్య ఆంక్షలతో కూడిన విధానాలు తయారీకి ఇబ్బందులు కలిగించాయి. అయినప్పటికీ, ‘మేక్ ఇన్ ఇండియా’ వేల్యూ చైన్‌లో బాగా విస్తరణకు కారణమై, కాంపొనంట్స్, చిప్స్ ఉత్పత్తిని పెంచి ఈ ధోరణిని పూర్తిగా మార్చివేసింది.
దేశంలో సెమీకండక్లర్ల తయారీకి ఒక పునాదిని ఏర్పాటు చేయాలనేది మేక్ ఇన్ ఇండియాలో ఒక ముఖ్య భాగంగా ఉంది. దీనిని నెరవేర్చాలని భారత్ గత ఆరు దశాబ్దాలకు పైగా ప్రయత్నిస్తోంది.
ఇండియా సెమీకండక్టర్ మిషనును ప్రారంభించడం, మైక్రోన్‌తో మొదలుపెట్టి టాటా ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టులు రెండు, సీజీ పవర్ కు చెందిన ఒక ప్రాజెక్టు, కీన్స్‌కు చెందిన ఒక ప్రాజెక్టు కలుపుకొని అయిదు ప్రధాన ప్రాజెక్టులకు ఆమోదం లభించడంతో ఈ దేశంలో సెమీకండక్టర్లకు సంబంధించి వాస్తవిక తయారీకి పునాదిని వేస్తున్నట్లవుతోంది.
కొత్త ఆర్థిక యుగానికి రూపురేఖలు తీర్చిదిద్దుతున్న మేక్ ఇన్ ఇండియా
ఆటవస్తువులు మొదలు మొబైల్ ఫోన్లు, రక్షణ ఉపకరణాల వరకు ఉత్పత్తి విషయంలో మళ్ళీ అందరూ భారత్ వైపే చూడటం మొదలుపెట్టారు. ప్రపంచానికి తయారీ కూడలిగా మన దేశాన్ని రూపొందించాలన్నదే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెబుతున్న ‘మేక్ ఇన్ ఇండియా’ దార్శనికతలో ప్రధానసూత్రంగా ఉంది. ఈ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం స్వయంసమృద్దిని ప్రోత్సహిస్తోంది. ఉత్పత్తి ప్రక్రియకు ఊతాన్నిస్తోంది. ఉద్యోగాలను కల్పిస్తోంది. దీంతో దేశం ఆర్థికంగా బలోపేతం కావడంలో కీలక తోడ్పాటు లభిస్తోంది.
***
(Release ID: 2100141)
Visitor Counter : 53
Read this release in:
Assamese
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali-TR
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam