సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వేవ్స్ 2025 ‘రీల్ మేకింగ్’ పోటీలకు 3,300కు పైగా ఎంట్రీలు.. దేశవ్యాప్తంగానే కాక 20 దేశాల నుంచి కళాకారుల నమోదు


డిజిటల్ రీల్స్ నుంచి అంతర్జాతీయ డీల్స్ వరకు: విజేతలకు అపూర్వ అవకాశాలు, గుర్తింపు.. మంత్రిత్వ శాఖ సహకారంతో అంతర్జాతీయ పోటీలకు ఫైనలిస్టులు

సాంకేతిక, మౌలిక సదుపాయాల్లో భారత పురోగతిని చాటే ‘వికసిత భారత్’, ‘ఇండియా @ 2047’ ఇతివృత్తాలను ప్రతిబింబించేలా రీల్స్

భారత సృజనాత్మక ప్రస్థానాన్ని చాటేలా ప్రదర్శనలు.. నమోదుకు చివరి తేదీ మార్చి 15

Posted On: 05 FEB 2025 3:25PM by PIB Hyderabad

ప్రపంచ దృశ్య, శ్రవ్య సదస్సు (వేవ్స్)లో నిర్వహించనున్న ‘రీల్ మేకింగ్’ పోటీలకు అద్భుత స్పందన లభించింది. దేశవ్యాప్త భాగస్వామ్యంతోపాటు 20 దేశాల నుంచి 3,379 మంది నమోదు చేసుకున్నారు.
 


క్రియేట్ ఇన్ ఇండియా

వేవ్స్ లో కీలక కార్యక్రమంగా ప్రారంభిస్తున్న ఈ పోటీ.. మీడియా, వినోద రంగాల్లో అంతర్జాతీయ కేంద్రంగా ఎదుగుతున్న భారత్ ప్రాధాన్యాన్ని చాటుతుంది. డిజిటల్ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ దేశంలో వేగంగా విస్తరిస్తున్న తీరునూ ఇది ప్రతిబింబిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ‘క్రియేట్ ఇన్ ఇండియా’ దార్శనికతకు అనుగుణంగా రూపొందించిన ఈ పోటీలు దేశం నలుమూలలతోపాటు అంతర్జాతీయంగానూ ప్రతిభావంతులైన కళాకారులకు సాధికారిక అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

ఈ పోటీల్లో ఆఫ్ఘనిస్థాన్, అల్బేనియా, అమెరికా, ఆంటిగ్వా, బార్బుడా, బంగ్లాదేశ్, యూఏఈ, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాల నుంచి గణనీయ సంఖ్యలో కళాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. భారత సృజనాత్మక రంగ ప్రాధాన్యం పెరుగుతుందనడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజనకారులకు ప్రధాన వేదికగా వేవ్స్ నిలుస్తుందనడానికి ఈ అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యం నిదర్శనం.

తవాంగ్ నుంచి పోర్ట్ బ్లెయిర్ వరకు: దేశవ్యాప్తంగా వెల్లివిరుస్తున్న కథనోత్సాహం

దేశీయంగా తవాంగ్ (అరుణాచలప్రదేశ్), దిమాపూర్ (నాగాలాండ్), కార్గిల్ (లద్దాఖ్), లేహ్, షోపియాన్ (కాశ్మీర్), పోర్ట్ బ్లెయిర్ (అండమాన్ - నికోబార్ దీవులు), తెలియామోరా (త్రిపుర), కాసరగోడ్ (కేరళ), గ్యాంగ్ టక్ (సిక్కిం) సహా దేశంలోని వివిధ ప్రాంతాలు, మారుమూల ప్రదేశాల నుంచి కూడా ఎంట్రీలు వచ్చాయి. వేవ్స్ ‘రీల్ మేకింగ్’ పోటీలకు చిన్న పట్టణాల నుంచీ విశేష స్పందన రావడం, సృజనకు నిలయంగా అవి ఎదుగుతుండడం సుసంపన్న భారత కథన సంప్రదాయాలను, సాంకేతిక సృజన రంగంలో వృద్ధిని ఇది ప్రతిబింబిస్తోంది.

20 ఏళ్ల వయస్సు దాటిన వారు పోటీకి అర్హులు. ఇందులో భాగంగా.. సాంకేతిక, మౌలిక సదుపాయాల్లో భారత ప్రస్తుత పురోగతిని చాటేలా ‘వికసిత భారత్’, ఈ రంగాల్లో దేశ భవిష్యత్ వృద్ధిని ప్రతిబింబించేలా ‘ఇండియా @ 2047’ వంటి ఇతివృత్తాలపై రీల్స్ రూపొందించాల్సి ఉంటుంది. భారత సృజనాత్మక ప్రస్థానాన్ని 30 నుంచి 60 సెకన్ల చిత్రాల్లో సంక్షిప్తంగా ప్రదర్శిస్తూ.. దేశాభివృద్ధి దిశగా వారి సృజనాత్మకతను, దూరదృష్టినీ చాటేలా ఇవి కథకులకు ఓ వేదికను అందిస్తాయి.

రీల్ మేకింగ్ పోటీ విజేతలకు లభించే ప్రత్యేకమైన అవకాశాలు:

మెటా నిర్వహించే కార్యక్రమం, రీల్స్ మాస్టర్ క్లాస్ కు ఆహ్వానం అందుతుంది.
వేవ్స్ లో పాల్గొనడం కోసం వ్యయాలన్నింటినీ చెల్లిస్తారు. అక్కడ వారికి విశేష గౌరవం లభిస్తుంది.
అంతర్జాతీయ స్థాయి కంటెంట్ సృజనాత్మక పోటీల్లో పాల్గొనేలా ఫైనలిస్టులకు మంత్రిత్వ శాఖ సహకరిస్తుంది.
విజేతల రీల్స్ ను వేవ్స్ యశో వేదిక (హాల్ ఆఫ్ ఫేమ్)పై, అధికారిక వెబ్ సైట్ లో, సామాజిక మాధ్యమ వేదికలపై ప్రదర్శిస్తారు.

‘మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’

భారత సృజనాత్మక శక్తికి సరికొత్త అంతర్జాతీయ గుర్తింపును తేవడంతోపాటు మీడియా, వినోదం, సృజన రంగాలకు భారత్ ను ప్రధాన గమ్యస్థానంగా నిలపాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత, సంకల్పాలే వేవ్స్ కు స్ఫూర్తి. ఈ రంగంలో అగ్రగాములు, భాగస్వాములు, ఆవిష్కర్తలందరినీ ఒక్కచోటికి చేర్చి.. ప్రస్తుత ధోరణులపై చర్చించడానికి, సహకారాన్ని పెంపొందించడానికి, భారత సృజనాత్మక సంపత్తిని ప్రదర్శించడానికి.. తద్వారా ‘మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ అన్న ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేయడానికి వేవ్స్ అవకాశం కల్పిస్తుంది.

దేశవ్యాప్తంగా నలుమూలల నుంచీ 20 ఇతర దేశాల నుంచీ కళాకారులు పాల్గొంటున్న ఈ రీల్ మేకింగ్ పోటీ వైవిధ్యభరిత, క్రియాశీల భారత కథన కౌశలానికి నిదర్శనం. మీడియా, వినోద రంగంలో ప్రధాన అంతర్జాతీయ కేంద్రంగా భారత్ స్థానాన్ని ఇది సుస్థిరం చేస్తుంది.

మరిన్ని వివరాల కోసం సందర్శించండి: https://wavesindia.org/challenges-2025

 

***


(Release ID: 2100139) Visitor Counter : 11