ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర బడ్జెట్ 2025-26 ముఖ్యాంశాలు

Posted On: 01 FEB 2025 1:29PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో శనివారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ముఖ్యాంశాలు:

 

బడ్జెట్ అంచనాలు 2025-26

 

·         అప్పుల రూపంలో సమకూరే సొమ్ములు మినహా మొత్తం వసూళ్లు రూ. 34.96 లక్షల కోట్లు, మొత్తం వ్యయం రూ. 50.65 లక్షల కోట్లుగా ఉంటాయని అంచనా.

 

·         నికర పన్ను రాబడుల అంచనా రూ.28.37 లక్షల కోట్లు.

 

·         ద్రవ్యలోటు జీడీపీలో 4.4 శాతంగా ఉంటుందని అంచనా.

 

·         స్థూల మార్కెట్ రుణాలు రూ.14.82 లక్షల కోట్లుగా ఉండొచ్చు.

 

·         2025-26 లో మూలధన వ్యయం రూ. 11.21 లక్షల కోట్లు (జీడీపీలో 3.1 శాతం).

 

అభివృద్ధికి తొలి చోదకశక్తిగా వ్యవసాయం

 

ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజనవ్యవసాయ జిల్లాల అభివృద్ధి కార్యక్రమం

 

·         రాష్ట్రాల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తక్కువ ఉత్పాదకత, మోస్తరు పంటల సాంద్రత, సగటు కన్నా తక్కువ రుణ సదుపాయాలు ఉన్న 100 జిల్లాలు దీని పరిధిలోకి రానున్నాయి. 1.7 కోట్ల మంది రైతులకు దీని ద్వారా ప్రయోజనం కలుగుతుంది.

 

గ్రామాల శ్రేయస్సు, అభ్యున్నతి

 

·         నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతికత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కలిగించడం ద్వారా వ్యవసాయంలో స్వల్ప ఉద్యోగిత సమస్యను పరిష్కరించడం కోసం వివిధ రంగాల మధ్య సమన్వయంతో సమగ్ర కార్యక్రమాన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రారంభించనున్నారు.

 

 

 

 అభివృద్ధికి మూడో చోదకశక్తిగా పెట్టుబడులు

 

 

 

 

      I.    ప్రజల సంక్షేమంపై పెట్టుబడి

 

సాక్షం అంగన్వాడి, పోషణ్ 2.0

 

·    పోషకాహారాన్ని అందించడానికి చేసే ఖర్చులు సమయానుగుణంగా పెరుగుతాయి.

 

అటల్ టింకరింగ్ ప్రయోగశాలలు

 

·      రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ప్రయోగశాలల ఏర్పాటు

 

ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్బ్యాండ్ సదుపాయం

 

·      భారత్నెట్ ప్రాజెక్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్బ్యాండ్ సదుపాయం కల్పిస్తారు.

 

భారతీయ భాషా పుస్తక్ పథకం

 

·     పాఠశాల, ఉన్నత విద్యలో డిజిటల్ విధానంలో భారతీయ భాషల పుస్తకాలను అందించేందుకు భారతీయ భాషా పుస్తక్ పథకాన్ని ప్రకటించారు.

 

నైపుణ్యాలను మెరుగపరిచేందుకు జాతీయ నైపుణ్య కేంద్రాలు

 

·     ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్లో భాగంగా తయారీరంగానికి తగిన విధంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలు, భాగస్వామ్యాలతో కూడిన 5 జాతీయ నైపుణ్య కేంద్రాలను నెలకొల్పుతారు.

 

ఐఐటీల సామర్థ్య విస్తరణ

 

·         2014 తర్వాత ప్రారభించిన 5 ఐఐటీల్లో మరో 6,500 మంది విద్యార్థులకు విద్యను అందించేలా అదనపు సౌకర్యాలను కల్పిస్తారు.

 

విద్యారంగంలో కృత్రిమ మేధ వినియోగానికి నైపుణ్య కేంద్రం

 

·         రూ. 500 కోట్ల వ్యయంతో విద్యారంగంలో కృత్రిమ మేధ వినియోగానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు

 

వైద్య విద్య విస్తరణ

 

·        వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో వచ్చే ఏడాది అదనంగా మరో 10,000 సీట్లను జోడిస్తారు. వచ్చే ఐదేళ్లలో సంఖ్య 75,000కు పెరగనుంది.

 

అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు

 

·         రానున్న మూడేళ్లలో అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. తొలుత 2025-26 లో 200 కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

 

పట్టణ జీవనోపాధిని మెరుగుపరచడం

 

·       పట్టణ ప్రాంత కార్మికుల సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి, వారి ఆదాయాన్ని పెంపొందించి, స్థిరమైన జీవనోపాధిని అందించే పథకాన్ని ప్రకటించారు.

 

పీఎం స్వనిధి

 

·         బ్యాంకులు అందించే రుణాల పరిమితి పెంపు, రూ.30,000 పరిమితితో యూపీఐ అనుసంధాన క్రెడిట్ కార్డులు అందించడం, సామర్థ్య నిర్మాణాన్ని పెంపొందించేలా పథకాన్ని మెరుగుపరిచారు.

 

ఆన్లైన్ వేదికల్లో పనిచేసేవారి సంక్షేమానికి సామాజిక భ్రదతా పథకం

 

·        గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు, -శ్రామ్ పోర్టల్లో నమోదు, పీఎం జన ఆరోగ్య యోజన ద్వారా ఆరోగ్య సేవలను ప్రభుత్వం అందిస్తుంది.

 

      II.        ఆర్థిక ప్రగతికి పెట్టుబడులు

 

మౌలికవసతుల కల్పను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం

 

·       పీపీపీ పద్ధతిలో మూడేళ్ల కాలానికి అమలు చేయాల్సిన పథకాలను మౌలికవసతులకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు తయారుచేస్తాయి. విషయంలో రాష్ట్రాలకు సైతం ప్రోత్సాహం అందుతుంది.

 

మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రాలకు చేయూత

 

·         మూలధన పెట్టుబడి వ్యయం, ప్రోత్సాహాకాలు, సంస్కరణల నిమిత్తం రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు అందించేందుకు 1.5 లక్షల కోట్ల వ్యయ ప్రతిపాదన.

 

ఆస్తుల విక్రయ ప్రణాళిక 2025-30

 

·     ప్రకటించిన కొత్త ప్రాజెక్టుల నుంచి రూ. 10 లక్షల కోట్ల సంపాదించేలా 2025-30 కు రెండో ప్రణాళిక

 

జల్ జీవన్ మిషన్

 

·      ప్రాజెక్టు వ్యయ అంచనాను పెంచి 2028 వరకు పథకాన్ని పొడిగించారు.

 

అర్బన్ ఛాలెంజ్ ఫండ్

 

·      ‘అభివృద్ధి కేంద్రాలుగా నగరాలు’, ‘నగరాల సృజనాత్మక పునరాభివృద్ధి’ ‘నీరు, పారిశుద్ధ్యంతదితర ప్రతిపాదనలను అమలు చేసేందుకు రూ.లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ప్రకటించారు. 2025-26 ఏడాదికి రూ.10,000 కోట్లు కేటాయించారు.

 

వికసిత్ భారత్ సాధనకు అణుశక్తి కార్యక్రమం

 

·  అణశక్తి చట్టానికి సవరణలు, పౌర అణు నష్ట పరిహార చట్టం అమలు.

 

·   రూ. 20,000 కోట్ల అంచనా వ్యయంతో చిన్న మాడ్యులర్ రియాక్టర్ (ఎస్ఎంఆర్) పరిశోధన, అభివృద్ధికి అణశక్తి కార్యక్రమ రూపకల్పన. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఎస్ఎంఆర్లు 2033 నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తాయి.

 

నౌకా నిర్మాణం

 

·       నౌకా నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు అందించే విధానానికి సంస్కరణలు

 

·        నిర్దేశించిన పరిమాణం కంటే పెద్దవిగా ఉన్న నౌకలను మౌలిక వసతుల హార్మోనైజ్డ్ మాస్టర్ లిస్ట్ (హెచ్ఎంఎల్)లో చేరుస్తారు.

 

నౌకా వాణిజ్య అభివృద్ధి నిధి

 

·     రూ. 25,000 కోట్ల కార్పస్తో నౌకా వాణిజ్య అభివృద్ధి నిధి ఏర్పాటు. దీనిలో 49 శాతం ప్రభుత్వ వాటా కాగా మిగిలిన మొత్తాన్ని పోర్టుల, ప్రవేటు రంగ సంస్థలు సమకూరుస్తాయి.

 

ఉడాన్ - ప్రాంతీయ అనుసంధాన పథకం

 

·       రానున్న పదేళ్లలో 120 కొత్త ప్రదేశాలను అనుసంధానిస్తూ, 4 కోట్ల ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేరవేసేలా ఉడాన్ పథకానికి మార్పులు చేశారు.

 

·       కొండ ప్రాంతాలు, ఆకాంక్షాత్మక, ఈశాన్య ప్రాంత జిల్లాల్లో హెలిప్యాడ్లు, చిన్న విమానాశ్రయాలకు తోడ్పాటు అందిస్తారు.

 

బీహార్లో కొత్త  విమానాశ్రయాలు

 

·       బీహార్లో కొత్త విమానాశ్రయాల నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పాట్నా విమానాశ్రయం, బిహ్తాలోని విమానాశ్రయాల సామర్థ్యాన్ని విస్తరిస్తారు.

 

మిథిలాంచల్లో పశ్చమి కోషి కాల్వ ప్రాజెక్టు

 

·         బీహార్లోని పశ్చిమ కోషి కాల్వ ఈఆర్ఎం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం.

 

గనుల రంగంలో సంస్కరణలు

 

·       గనుల తవ్వకాల వ్యర్థాల నుంచి కీలకమైన ఖనిజాల సేకరణకు ఒక విధానాన్ని తీసుకువచ్చారు.

 

స్వామిహ్ నిధి 2

 

·     ప్రభుత్వం, బ్యాంకులు, ప్రవేటు పెట్టుబడిదారుల సాయంతో ఒక లక్ష గృహాలను వేగంగా నిర్మించడమే లక్ష్యంగా రూ. 15,000 కోట్ల నిధిని ప్రకటించారు.

 

ఉద్యోగ ఆధారిత పర్యాటకాభివృద్ధి

 

·     రాష్ట్రాల సహకారంతో దేశంలోని 50 అగ్రశ్రేణి పర్యాటక ప్రాంతాలను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేయనున్నారు.

 

     III.        ఆవిష్కరణలకు పెట్టుబడి

 

పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ

 

·      జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటించిన ప్రైవేట్ రంగ ఆధారిత పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల కార్యక్రమాన్ని అమలు చేయడానికి రూ. 20,000 కోట్ల కేటాయింపు

 

అంకుర సంస్థలకు  నిధులు

 

·        తర్వాతి తరం అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు వివిధ మార్గాల ద్వారా నిధులు

 

పీఎం రీసెర్చి ఫెలోషిప్

 

·         మెరుగైన ఆర్థిక సాయంతో ఐఐటీలు, ఐఐసీల్లో సాంకేతిక పరిశోధనకు 10,000 ఫెలోషిప్లు

 

మొక్కల్లోని జీవ పదార్థాల కోసం జన్యుబ్యాంకు

 

·   భవిష్యత్తులో ఆహారం, పోషకాహార భద్రత కోసం 10 లక్షల మొక్కల జన్యువులతో రెండో జన్యుబ్యాంకు ఏర్పాటు

 

జాతీయ జియోస్పేషియల్ మిషన్

 

·        జియోస్పేషియల్ మౌలిక వసతులను అభివృద్ది చేయడానికి, సమాచార సేకరణకు జాతీయ జియోస్పేషియల్ కార్యక్రమాన్ని ప్రకటించారు.

 

జ్ఞాన భారతం కార్యక్రమం

 

·      విద్యాసంస్థలు, మ్యూజియంలు, గ్రంథాలయాలు, వ్యక్తుల నుంచి సుమారు కోటి పురాతన రాత ప్రతులను సేకరించి వాటిని భద్రపరిచేందుకు జ్ఞాన భారతం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.

 

అభివృద్ధికి నాలుగో చోదకశక్తిగా ఎగుమతులు

 

ఎగుమతుల ప్రోత్సాహక కార్యక్రమం

 

·        వాణిజ్యం, ఎంఎస్ఎంఈ, ఆర్థిక మంత్రిత్వశాఖలు, విభాగాల సంయుక్త లక్ష్యాలతో ఎగుమతుల ప్రోత్సాహక కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తారు.

 

భారత్ ట్రేడ్ నెట్

 

·    అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ, ఆర్థిక పరిష్కారాల నిమిత్తం ఏకీకృత వేదికగాభారత్ ట్రేడ్ నెట్’ (బీటీఎన్) ను ఏర్పాటు చేస్తారు.

 

జీసీసీకి జాతీయ నియమావళి

 

·       ద్వితీయ శ్రేణి నగరాలను అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు (జీసీసీ)గా మార్చేందుకు రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసేలా జాతీయ నియమావళి రూపకల్పన

 

 

సంస్కరణలే  ఊతంగా ఆర్ధిక రంగంలో సంస్కరణలు-అభివృద్ధి

 

 

 

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)

 

 

 

·         పూర్తి ప్రీమియాన్ని భారత్లో పెట్టుబడి పెట్టే బీమా కంపెనీలకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచనున్నారు.

 

          క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీని తీసుకురానున్న  నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ (ఎన్ఏబీఎఫ్ఐడీ)

 

 ·         మౌలిక సదుపాయాల రంగానికి కార్పొరేట్ బాండ్లను అందించడానికి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ (ఎన్ఏబీఎఫ్ఐడీ) ఒకపార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తుంది.

 

 

 

గ్రామీణ్ క్రెడిట్ స్కోరు

 

 ·     స్వయంసహాయ బృందాల (ఎస్హెచ్జీ) సభ్యుల, గ్రామీణ ప్రాంతాల ప్రజల రుణ అవసరాలను తీర్చడానికి  ప్రభుత్వ రంగ బ్యాంకులుగ్రామీణ్ క్రెడిట్ స్కోర్ను రూపొందిస్తాయి.

 

పింఛను రంగం

 

·         పింఛను రంగంలో కొత్త కొత్త పథకాలను రూపొందించడంతోపాటు వాటికి సంబంధించిన నియంత్రణపూర్వక సమన్వయాన్ని అందించడానికి ఒక ఫోరమ్ను ఏర్పాటు చేస్తారు.

 

 నియంత్రణపూర్వక సంస్కరణల కోసం ఉన్నత స్థాయి కమిటీ

 

 ·         ఆర్థికేతర రంగంలోని అన్ని నియమాలు, ధ్రువీకరణలు, లైసెన్సులతోపాటు అనుమతులను సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు.

 

రాష్ట్రాలకు పెట్టుబడి స్నేహపూర్వక సూచీ

 

 ·         రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ఒక పెట్టుబడులకు అనుకూలమైన సూచీని ఏడాది ప్రారంభించనున్నట్లు ప్రకటించారుస్పర్ధాత్మక సహకార ప్రధాన సమాఖ్యవాదం స్ఫూర్తిని పెంచడమే దీని ఉద్దేశం.

 

జన్ విశ్వాస్ బిల్లు 2.0

 

 ·         వివిధ చట్టాల్లోని 100కు పైగా నిబంధనలను నేరాలపరిధిలో నుంచి తప్పించే ఉద్దేశంతో జన్ విశ్వాస్ బిల్లు 2.0ను తీసుకువస్తారు.

 

 పార్ట్ బి

 

 ప్రత్యక్ష పన్నులు

 

 

 

·         రూ. 12 లక్షల ఆదాయం వరకు (అంటే కేపిటల్ గెయిన్స్ వంటి ప్రత్యేక రేటుండే ఆదాయం కానిది, సగటున నెలకు రూ. 1 లక్ష ఆదాయం అన్నమాట) కొత్త విధానంలో ఎలాంటి వ్యక్తిగత ఆదాయపు పన్నును చెల్లించనక్కరలేదు.

 

 ·         పరిమితి స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000 గా ఉన్న కారణంగా జీతం అందుకొంటూ పన్ను చెల్లించే వారి విషయంలో రూ. 12.75 లక్షల వరకు పన్ను చెల్లించనక్కర్లేదు.

 

 ·         కొత్త పన్ను స్వరూపం మధ్యతరగతి వారికి పన్నుల్లో చెప్పుకోదగ్గ తగ్గింపునివ్వడంతోపాటు ఖర్చు చేయడానికి వారి వద్ద మరింత డబ్బు మిగిలేటట్లు చేయనుంది. దీంతో కుటుంబ వినియోగం, పొదుపు, పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది.

 

 ·         కొత్త ఆదాయపు పన్ను బిల్లు పాఠం స్పష్టంగా, సూటిగా ఉండబోతోంది. పన్ను చెల్లింపుదారులు, పన్ను వసూళ్ల యంత్రాంగం సులభంగా అర్థం చేసుకొనేందుకు వీలుగా దీనిని రూపొందిస్తారు. పన్నులు రూఢిగా వసూలు అయ్యేటట్లు, న్యాయస్థానాలలో దావాలు దాఖలు కావడాన్ని తగ్గించాలనేదే దీనిలోని ఉద్దేశం.

 

 ·         ప్రత్యక్ష పన్నుల రూపేణా దాదాపుగా రూ. 1 లక్ష కోట్ల రాబడిని (రెవిన్యూ) ప్రభుత్వం కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేశారు.

 

 

 

 సవరించిన పన్ను రేట్ల స్వరూపం

 

 కొత్త పన్ను విధానంలో సవరించిన పన్ను రేటు స్వరూపం కింది విధంగా ఉండబోతోంది:

 

 

0-4 లక్షల రూపాయలు

పన్ను ఏమీ లేదు

4-8 లక్షల రూపాయల

5 శాతం

8-12 లక్షల రూపాయలు

10 శాతం

12-16 లక్షల రూపాయలు

15 శాతం

16-20 లక్షల రూపాయలు

20 శాతం

20- 24 లక్షల రూపాయలు

25 శాతం

24 లక్షల రూపాయలకు పైన

30 శాతం

 

·           ఇబ్బందుల్నితగ్గించడానికి టీడీఎస్, టీసీఎస్లను క్రమబద్ధీకరించారు

o    మూలం వద్ద పన్ను మినహాయింపు (ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్.. టీడీఎస్)ను క్రమబద్ధీకరిస్తారు. దీని కోసం రేట్లతోపాటు  టీడీఎస్ను తగ్గిస్తున్న త్రెషోల్డుల సంఖ్యను కూడా తగ్గించనున్నారు.

 

 o    సీనియర్ సిటిజన్లకు వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ. 50,000 నుంచి రెట్టింపు చేసి రూ. 1 లక్ష గా చేశారు.

 

 o    అద్దెపై టీడీఎస్కు ఇప్పుడున్న వార్షిక పరిమితి రూ. 2.40 లక్షలు. దీనిని రూ. 6 లక్షలకు పెంచారు.

 

 o    దేశం బయటి నుంచి దేశంలోకి పంపిస్తున్న డబ్బుల (రెమిటెన్సెస్)పై రిజర్వు బ్యాంకు నిర్దేశించిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీము (ఎల్ఆర్ఎస్)లో భాగంగా ట్యాక్స్ ఎట్ సోర్స్ (టీసీఎస్)ను వసూలు చేయడానికి వర్తింపచేస్తున్న త్రెషోల్డును రూ. 7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు.

 

 o    టీడీఎస్ను అధిక స్థాయిలో మినహాయించడానికి సంబంధించిన నిబంధనలను, పాన్ అనేదే లేని సందర్భాల్లో (non-PAN) మాత్రమే, వర్తింపచేస్తారు.

 

 o    స్టేట్మెంటును సమర్పించడానికి ఉద్దేశించిన తేదీ వరకు టీసీఎస్ చెల్లింపులో జాప్యాలు జరిగిన కేసులను అపరాధిగా ప్రకటించ కూడదనే (డీక్రిమినలైజేషన్) వెసులుబాటునిచ్చారు.

 

·         నియమ పాలన భారాన్ని తగ్గించడం

 

 o    చిన్న చారిటబుల్ ట్రస్టులు, సంస్థలకు నియమ పాలనకు సంబంధించిన బాద్యతల బరువును (కాంప్లయన్స్ బర్డెన్) ఆయా ట్రస్టులు, సంస్థల నమోదు కాలాన్ని.. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచడం ద్వారా.. తగ్గిస్తున్నారు.

 

o    సెల్ఫ్-ఆక్యుపైడ్ ప్రాపర్టీల వార్షిక విలువను సున్నా (నిల్) గా క్లెయిం చేసుకొనే ప్రయోజనాన్ని ఎలాంటి షరతులకు తావు ఇవ్వకుండా తరహా రెండు సెల్ఫ్-ఆక్యుపైడ్ ప్రాపర్టీలకు విస్తరించనున్నారు.

·         వ్యాపార నిర్వహణలో సౌలభ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)

 

o    మూడు సంవత్సరాల కాలానికి గాను అంతర్జాతీయ లావాదేవీల కేసుల్లో ఆర్మ్స్ లెంత్ విలువ నిర్ధారణ కోసం ఒక పథకాన్ని తీసుకువస్తారు.

 

o    అంతర్జాతీయ పన్నుల విధానంలో న్యాయస్థానాలకు వెళ్లి వేసే దావాల సంఖ్యను తగ్గించడానికి, అంతర్జాతీయ పన్నుల విధానంలో నిశ్చితత్వాన్ని తీసుకు రావడానికి సేఫ్ హార్బర్ రూల్స్ పరిధిని విస్తరించనున్నారు.

 

o    వ్యక్తులు జాతీయ పొదుపు పథకం (నేషనల్ సేవింగ్స్ స్కీమ్..ఎన్ఎస్ఎస్) నుంచి 2024 ఆగస్టు 29 గాని, లేదా తరువాతి నుంచి గాని ఉపసంహరించుకొనే మొత్తాలపై మినహాయింపు సదుపాయం లభిస్తుంది.

o    సాధారణ ఎన్పీఎస్ ఖాతాలకు మొత్తంమీద పరిమితులకు లోబడి ప్రస్తుతం లభిస్తున్న వెసులుబాటునే ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాలకు కూడా అందించనున్నారు.

 

·         ఉద్యోగకల్పన, పెట్టుబడి

ఎలక్ట్రానిక్స్ తయారీ పథకాల విషయంలో పన్నుల పరంగా నిశ్చితి

 

o    ఎలక్ట్రానిక్స్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసే లేదా తరహా కర్మాగారాన్ని నడిపే ఒక రెసిడెంట్ కంపెనీకి సేవలను అందించే ప్రవాసులకు సంభావ్య పన్ను పద్ధతి (ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ రెజీమ్)ని అమల్లోకి తీసుకు రానున్నారు.

 

o    ప్రత్యేక వర్గానికి చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లకు సరఫరా చేయడానికి గాను కాంపొనంట్స్ను నిలవ చేసే

ప్రవాసులకు పన్నును విధించడానికి ఒక సేఫ్ హార్బర్ నియమాన్ని ప్రవేశపెడతారు.

 

అంతర్దేశీయ నౌకలకు పన్ను విధింపు పథకం

 

ఇప్పుడు అమలు చేస్తున్న నౌకలకు పన్ను విధింపు పథకాన్ని (టన్నేజ్ ట్యాక్స్ స్కీము) ఇండియన్ వెసల్స్ యాక్టు, 2021 పరిధిలో నమోదైన అంతర్దేశీయ నౌకలు (ఇన్లాండ్ వెసల్స్)కు కూడా వర్తింపచేస్తారు. నిర్ణయంలోని ఉద్దేశం దేశంలో అంతర్దేశీయ జల రవాణాను ప్రోత్సహించాలన్నదే.

·         అంకుర సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహం

2030 ఏప్రిల్ 1 కన్నా ముందుగా ఏర్పాటయ్యే అంకుర సంస్థల (స్టార్ట్-అప్స్)కు 5 సంవత్సరాల దాకా విస్తరణ తాలూకు  ప్రయోజనాలను అందించనున్నారు.

·         ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు (ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్..ఏఐఎఫ్)

మౌలిక సదుపాయాల కల్పన రంగం, తరహా ఇతర రంగాలలో పెట్టుబడుల బాధ్యతను తీసుకొంటున్న ఒకటో కేటగిరీ, రెండో కేటగిరీ ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల (ఏఐఎఫ్)కు సెక్యూరిటీల నుంచి అందే లాభాలపై తప్పనిసరిగా పన్నును విధించాలని ప్రతిపాదించారు.

 

·         సావరిన్, పెన్షన్ ఫండులకు పెట్టుబడి తేదీని పొడిగించడం

సావరిన్ వెల్త్ ఫండ్లలో, పెన్షన్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడానికి గడువును మరో 5 సంవత్సరాల పాటు పొడిగించి 2030 మార్చి 31గా పేర్కొన్నారు. ఆయా ఫండ్ నుంచి మౌలిక సదుపాయాల రంగానికి ఆర్థిక పోషణను ప్రోత్సహించాలన్నదే నిర్ణయం ప్రధానోద్దేశంగా ఉంది.

 

 పరోక్ష పన్నులు

 

పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించి కస్టమ్స్ సుంకాల వ్యవస్థ హేతుబద్ధీకరణ

 

2025-26 కేంద్ర బడ్జెట్ ప్రతిపాదిస్తున్న మార్పులు:

 

       i.         2023-24 బడ్జెట్ లో తొలగించిన ఏడు సుంకాలకు అదనంగా మరో ఏడు రకాల సుంకాలను తొలగింపు. ఇకపైజీరోరేటు సహా కేవలం ఎనిమిది రేట్లు అమల్లో ఉంటాయి.

 

      ii.       కొద్ది వస్తువుల మినహా మిగతా వస్తువులపై అనుగుణమైన సుంకాల విధింపుతద్వారా దిగుమతి సుంకం నిర్వహణ సులభం. మినహాయించిన వస్తువుల దిగుమతి సుంకం తగ్గనుంది.

 

     iii.     ఏదేని వస్తువు/సేవపై ఒకటి కంటే ఎక్కువ పన్ను విధించరాదు. దాంతో సామాజిక సంక్షేమ పన్ను చెల్లిస్తున్న 82 సేవలకు ఇకపై పన్ను నుంచి  మినహాయింపు లభించనుంది.

 

పరోక్ష పన్నుల ద్వారా లభిస్తున్న రూ. 2600 కోట్ల ఆదాయాన్ని కోల్పోనున్న ప్రభుత్వం

 

దిగుమతి చేసుకునే ఔషధాలు/మందులకు పన్ను ఊరట

 

·         36 ప్రాణాధారమైన మందులు/ఔషధాలను మౌలిక కస్టమ్స్ సుంకం (బీసీడీ) జాబితా నుంచి  తొలగించారు. ఇకపై వీటిపై ఎటువంటి దిగుమతి సుంకాన్నీ వసూలు చేయబోరు.

 

·     6 ప్రాణాధార మందులపై 5% రాయితీతో కూడిన కస్టమ్స్ సుంకం.

 

·     రోగుల సంక్షేమార్థం ఫార్మా కంపెనీల ఆధ్వర్యంలో నడిచే కార్యక్రమాల్లో వినియోగించే ప్రత్యేక మందులపై ఎటువంటి బీసీడీ చెల్లించనక్కరలేదు. జాబితాలోకి మరో 13 రోగుల సంక్షేమ కార్యక్రమాలు, 37 మందులను జోడించారు

 

దేశీయ ఉత్పాదనకు, విలువ జోడింపు ప్రక్రియలకు చేయూత

 

·         కీలక ఖనిజాలు:

 

o    కోబాల్ట్ రజను, వ్యర్థాలు, లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాలు, సీసం, జింకు తదితర 12 కీలక ఖనిజాలపై ఇకపై ఎటువంటి బీసీడీ వసూలు చేయరు.

 

·         జౌళి రంగం:

 

o    మరో రెండు రకాల నాడె-రహిత మగ్గాలకు బీసీడీ నుంచి  సంపూర్ణ మినహాయింపు.

 

o    అల్లిక వస్త్రాలపై సుంకం పరిధిని “10% లేదా 20%” నుంచి  “20% లేదా కిలోకి రూ.115” కి మార్పువీటిలో ఏది అధికమైతే రుసుము చెల్లించవలసి ఉంటుంది.

 

·       ఎలక్ట్రానిక్ వస్తువులు

 

o   ‘ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేపై బీసీడీ 10 శాతం నుంచి 20 శాతానికి పెంపు

 

o   ఓపెన్ సెల్, విడిభాగాలపై బీసీడీ 5 శాతం మేర తగ్గింపు

 

o   ఓపెన్ సెల్స్ లో వినియోగించే కొన్ని విడిభాగాలకు బీసీడీ నుంచి  పూర్తి మినహాయింపు.

 

·       లిథియం-అయాన్ బ్యాటరీ:

 

o    ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) బ్యాటరీ ఉత్పాదనలో వినియోగించే 35 అదనపు పరికరాలు, మొబైల్ ఫోన్ ఉత్పాదనలో వినియోగించే 28 అదనపు సామాగ్రికి బీసీడీ నుంచి  పూర్తి మినహాయింపు.

 

·      సముద్రయాన రంగం

 

o   ముడి సరుకులు, విడిభాగాలు సహా ఓడల నిర్మాణంలో వినియోగించే ఇతర ఉత్పత్తులకు రానున్న పదేళ్ళ పాటు బీసీడీ నుంచి  మినహాయింపు.

 

o     పాత ఓడల భాగాల పునర్వినియోగానికి సంబంధించి ప్రస్తుత పద్ధతి కొనసాగింపు.

 

·       టెలి కమ్యూనికేషన్స్

 

o    క్యారియర్ గ్రేడ్ ఎథర్ నెట్ స్విచ్చులపై బీసీడీ 20 శాతం నుంచి  10 శాతానికి తగ్గింపు

 

ఎగుమతులకు ప్రోత్సాహం

 

·          చేనేత ఉత్పత్తులు

 

o    ఎగుమతి కాల పరిమితి ఆరు నెలల నుంచి  ఏడాది కి పొడిగింపు, అవసరాన్ని బట్టి మరో మూడు నెలల అదనపు సమయం.

 

o   డ్యూటీ-ఫ్రీ (దిగుమతి సుంకాలు లేని) జాబితాలో మరో తొమ్మిది ఉత్పత్తుల చేరిక.

 

·        తోలు పరిశ్రమల రంగం:     

 

o   వెట్-బ్లూ రకం ప్రత్యేక తోలుకు బీసీడీ నుంచీ మినహాయింపు.

 

o   క్రస్ట్ లెదర్ దిగుమతి సుంకం పై 20% రాయితీ.

 

·       సముద్ర ఉత్పత్తులు:

 

o     ‘సురిమిగా పిలువబడే ఫ్రొజెన్ చేపల పేస్ట్ ఉత్పత్తి, పేస్ట్ నుంచి  తయారయ్యే ఇతర ఉత్పత్తులపై విధించే బీసీడీ 30 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు.

 

చేపల, రొయ్యల ఆహారం లో వినియోగించేఫిష్ హైడ్రోలైసేట్పై ప్రస్తుతమున్న 15 శాతం బీసీడీ 5 శాతానికి తగ్గింపు

 

·       రైల్వే సరుకుల నిర్వహణ - దేశీయ సంస్థలు

 

విమానాలు, ఓడల మరమ్మతు పరిశ్రమలకు కల్పించే సౌలభ్యాలను రైల్వే ఉత్పత్తుల మరమ్మతు సంస్థలకు, ఆయా విడిభాగాలకు విస్తరణ.

 

o     ఇటువంటి విడి భాగాల ఎగుమతి కాలపరిమితి ఆరు నెలల నుంచి  ఏడాదికి పొడిగింపు... అవసరాన్నిబట్టి మరో ఏడాది పాటు పొడిగింపు.

 

సులభతర వాణిజ్యం

 

·     తాత్కాలిక అంచనా కాల పరిమితి:

 

o     తాత్కాలిక అంచనా కాల పరిమితి రెండేళ్ళుగా నిర్ధారణ, మరో ఏడాది పొడిగింపునకు అవకాశం

 

·          స్వచ్ఛంద పన్ను చెల్లింపు:

 

o     ఎగుమతి, దిగుమతిదారుల కోసం కొత్త పథకంకస్టమ్స్ అనుమతులు లభించిన అనంతరం, తమ వస్తువుల గురించి స్వచ్ఛందంగా ప్రకటన, ఎటువంటి అపరాధ రుసుము లేకుండా, కేవలం వడ్డీతో కూడిన  పన్నును  చెల్లించే సౌకర్యం

 

·  దిగుమతి చేసుకున్న విడిభాగాలతో తయారయ్యే వస్తువుల ఉత్పాదన కాలపరిమితి పొడిగింపు:

 

o     దిగుమతి చేసుకున్న విడిభాగాలతో తయారయ్యే వస్తువుల ఉత్పాదనకు సంబంధించి, నిబంధనల మేర, ఆరు నెలల నుంచి  ఏడాదికి కాలపరిమితి పొడిగింపు

 

o     ఇటువంటి వస్తువుల ఉత్పాదన చేపట్టే దిగుమతిదార్లు మాసిక నివేదికకు బదులుగా త్రై మాసిక నివేదికను దాఖలు చేయవచ్చు.

 

****


(Release ID: 2098692) Visitor Counter : 167