ఆర్థిక మంత్రిత్వ శాఖ
2024-25 ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు
Posted On:
31 JAN 2025 2:20PM by PIB Hyderabad
2025 ఆర్థిక సంవత్సరంలో భారత వాస్తవ జిడిపి, జివిఎ వృద్ధి 6.4 శాతంగా అంచనా వేసిన ఆర్థిక సర్వే (మొదటి ముందస్తు అంచనాలు)
2026 ఆర్థిక సంవత్సరానికి 6.3 నుంచి 6.8 శాతం మధ్య వాస్తవ జిడిపి వృద్ధి
మధ్యస్థ-కాల వృద్ధి సామర్థ్యాన్ని, ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని పెంచడానికి మూల-స్థాయి నిర్మాణ సంస్కరణలు, నిబంధనల సడలింపులకు ప్రోత్సాహం
ప్రపంచీకరణ స్థానంలో భౌగోళిక-ఆర్థిక విభజన (జిఇఎఫ్)… ఫలితంగా తక్షణ ఆర్థిక మార్పులూ, సవరణలు
చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగ అభివృద్ధి కోసం సంస్కరణలు, వ్యాపార సౌలభ్యత 2.0పై దృష్టి
మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడంలో ప్రైవేట్ రంగాల భాగస్వామ్యం అత్యంత కీలకం
2021 నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు నిరంతరం మెరుగైన క్యాపెక్స్, సాధారణ ఎన్నికల అనంతరం 8.2 శాతం వార్షిక పెరుగుదల నమోదు
2020 నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు కీలక మౌలిక సదుపాయాల రంగాలపై 38.8 శాతం పెరిగిన మూలధన వ్యయం
ఆర్బిఐ, ఐఎంఎఫ్ ప్రాజెక్ట్ ప్రకారం భారత వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం 2026 ఆర్థిక సంవత్సర లక్ష్యమైన 4 శాతానికి చేరనుంది
2024 ఆర్థిక సంవత్సరంలో ఉన్న 5.4 శాతం నుంచి 2024 ఏప్రిల్ – డిసెంబర్ కాలంలో 4.9 శాతానికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
డిపాజిట్ వృద్ధికి అనుగుణంగా ఉన్న క్రెడిట్ వృద్ధితో స్థిరంగా పెరుగుతున్న బ్యాంకు క్రెడిట్
12 ఏళ్ల కనిష్టానికి తగ్గి 2.6 శాతానికి చేరిన షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల జీఎన్‌పీఏ
దివాలా - దివాలా కోడ్ కింద 2024 సెప్టెంబర్ నాటికి 1,068 ప్రణాళికల రెజల్యూషన్ రాబడి రూ.3.6 లక్షల కోట్లు
2024 డిసెంబర్ నాటికి ఈక్విటీ, డెట్ ద్వారా రూ.11.1 లక్షల కోట్ల సమీకరణ, గతేడాది కంటే 5% పెరుగుదల
136 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతున్న బిఎస్ఇ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ - జిడిపిల నిష్పత్తి
ఇది చైనా (65 శాతం), బ్రెజిల్ (37 శాతం) కంటే చాలా అధికం
2025 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో మొత్తం ఎగుమతుల వృద్ధి 6 శాతం, సేవల వృద్ధి 11.6 శాతం (వార్షికంగా)
యుఎన్‌సిటిఎడి ప్రకారం, ‘టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్’ కోసం ప్రపంచంలో 2వ అతిపెద్ద ఎగుమతిదారుగా భారత్
దేశంలో 640.3 బిలియన్ల డాలర్ల విదేశీ మారక నిల్వలు
10.9 నెలల దిగుమతులు, 90 శాతం విదేశీ రుణాల కోసం సరిపడా నిల్వ
అంతరిక్ష రంగంలో ప్రభుత్వ దార్శనికత 2047లో భాగంగా ఉన్న గగన్‌యాన్, చంద్రయాన్-4 లూనార్ శాంపిల్ రిటర్న్ మిషన్
భారీగా తగ్గిన స్మార్ట్‌ఫోన్ దిగుమతులు
99 శాతం స్మార్ట్‌ఫోన్స్ దేశీయంగా తయారీ: ఆర్థిక సర్వే 2024-25
డబ్ల్యూఐపివో నివేదిక 2022 - ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ కోసం దరఖాస్తు చేస్తున్న తొలి-10 కార్యాలయాల్లో ఆరో స్థానంలో భారత్
ఎంఎస్ఎంఇలకు ఈక్విటీ ఫండింగ్ కోసం రూ.50 వేల కోట్ల స్వయం సమృద్ధ భారత్ నిధి ప్రారంభం
2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–నవంబర్ కాలంలో భారత సేవారంగ ఎగుమతుల్లో 12.8 శాతం వృద్ధి
2024 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 5.7 శాతం అధికం
2023 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో పర్యాటక రంగ వాటా మహమ్మారికి ముందు స్థాయి అయిన 5 శాతానికి చేరింది
ప్రస్తుత ధరల ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరం (పిఇ)లో దేశ జిడిపిలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా సుమారు 16 శాతం
ఖరీఫ్ ఆహార ధాన్యాల ఉత్పత్తి 1647.05 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని అంచనా
ఇది గతేడాది కంటే 89.37 లక్షల మెట్రిక్ టన్నులు అధికం
అత్యధిక సిఎజిఆర్ 8.7 శాతం నమోదు చేసిన మత్స్య రంగం
5.8 శాతం వృద్ధితో ఆ తరువాతి స్థానంలో పశుపోషణ రంగం
శిలాజేతర ఇంధన వనరుల ద్వారా స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మొత్తం సామర్థ్యంలో 46.8 శాతంగా ఉంది
2005 - 2023 మధ్య కాలంలో 2.29 బిలియన్ టన్నుల CO2కు సమానమైన అదనపు కర్భన శోషణ సామర్థ్యం పెరిగింది
2030 నాటికి, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు దాదాపు 440 బిలియన్ల డాలర్లను ఆదా చేయనున్న లైఫ్ చర్యలు
2021 నుంచి 2025 ఆర్థిక సంవత్సరానికి సామాజిక సేవల ఖర్చుల్లో 15 శాతం వృద్ధి నమోదు
ఆరోగ్యంపై 29.0 శాతం నుంచి 48.0 శాతానికి పెరిగిన ప్రభుత్వ వ్యయం ఆరోగ్యంపై 62.6 శాతం నుంచి 39.4 శాతానికి తగ్గిన ప్రజావ్యయం
2017-18లో 6.0 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు 2023-24 నాటికి 3.2 శాతానికి తగ్గింది
అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో మెరుగైన ఉద్యోగావకాశాలు
వికసిత్ భారత్ సాధనలో ఇది చాలా కీలకం
ఉపాధి కల్పన వేగవంతం కోసం ప్రారంభమైన పీఎమ్-ఇంటర్న్‌షిప్ పథకం
పెద్ద ఎత్తున ఏఐ వినియోగంలో ప్రస్తుతం కొనసాగుతున్న అడ్డంకులు
విధానకర్తలు చర్యలు చేపట్టేందుకు ఒక విభాగం ఏర్పాటు
ఏఐ ప్రేరిత ప్రతికూల సామాజిక ప్రభావాలను తగ్గించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు, విద్యాసంస్థల సమిష్టి సహకారం అవసరం
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో 2024-25 ఆర్థిక సర్వేను సమర్పించారు. సర్వేలోని ముఖ్యాంశాలు కింది విధంగా ఉన్నాయి;
ఆర్థిక స్థితి: తిరిగి వేగం పుంజుకుంటోంది
1. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.4 శాతానికి పరిమితం కానుందని సర్వే అంచనా వేసింది (జాతీయాదాయ మొదటి ముందస్తు అంచనాల ప్రకారం), ఇది దాని దశాబ్ద సగటుకు దాదాపు సమానం.
2. వాస్తవ గ్రాస్ వాల్యూ యాడెడ్ (జివిఎ) కూడా 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 6.4 శాతం పెరుగుతుందని అంచనా.
3. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సగటున 3.3 శాతం వృద్ధి చెందింది, అయితే రాబోయే ఐదేళ్లలో ఇది 3.2 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
4. వృద్ధిలో హెచ్చుతగ్గులను దృష్టిలో ఉంచుకుని, 2026 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జిడిపి వృద్ధి 6.3 నుంచి 6.8 శాతం మధ్య పెరుగుతుందని అంచనా.
5. భారత ఆర్థిక వ్యవస్థ మధ్యస్థ-కాల వృద్ధి సామర్థ్యాన్ని, ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని పెంచడం కోసం ప్రాథమిక-స్థాయి నిర్మాణ సంస్కరణలు, నిబంధనల సడలింపులకు ప్రోత్సాహం అందించుటపై దృష్టి సారించడం.
6. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొనసాగుతున్న సంఘర్షణలు, ప్రపంచ వాణిజ్య విధాన నష్టభయాలు ప్రపంచ ఆర్థిక దృక్పథానికి గణనీయమైన సవాళ్లుగా కొనసాగుతున్నాయి.
7. 2024 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం 2024 ఏప్రిల్-డిసెంబర్ నాటికి 4.9 శాతానికి తగ్గింది.
8. 2021 నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు నిరంతరం మెరుగవుతూ కొనసాగిన మూలధన వ్యయం (క్యాపెక్స్), సార్వత్రిక ఎన్నికల అనంతరం, 2024 జూలై-నవంబర్ కాలంలో ఏకంగా 8.2 శాతం పెరిగింది.
9. ప్రపంచ సేవారంగ ఎగుమతుల్లో భారత్ ఏడో అతిపెద్ద వాటాను కలిగి ఉంది, ఇది ఈ రంగంలో మన దేశ ప్రపంచ పోటీతత్వాన్ని చాటుతుంది.
10. 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ కాలంలో, పెట్రోలియ, రత్నాలు, ఆభరణాలు కాకుండా, మిగిలిన ఎగుమతులు 9.1 శాతం పెరిగాయి, ఇది అస్థిరంగా ఉన్న ప్రపంచ పరిస్థితుల మధ్య మన దేశ సరుకుల ఎగుమతుల్లో స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
ద్రవ్య, ఆర్థిక రంగ అభివృద్ధి: గుర్రం ముందర బండి కట్టడం
1. డిపాజిట్ వృద్ధికి అనుగుణంగా క్రెడిట్ వృద్ధి కొనసాగిన క్రమంలో బ్యాంకు క్రెడిట్ స్థిరమైన వృద్ధి నమోదు చేసింది.
2. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల లాభదాయకత మెరుగుపడింది, ఇది స్థూల నిరర్థక ఆస్తుల (జిఎన్‌పిఎలు) తగ్గుదల, మూలధనం - రిస్క్ ఎక్కువగా ఉన్న ఆస్తుల నిష్పత్తి (సిఆర్ఎఆర్) పెరుగుదలతో స్పష్టమవుతోంది.
3. వరుసగా రెండేళ్లుగా క్రెడిట్ వృద్ధి నామమాత్రపు జిడిపి వృద్ధి కంటే ఎక్కువగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (-) 10.3 శాతంగా ఉన్న క్రెడిట్-జిడిపి అంతరం 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (-) 0.3 శాతానికి తగ్గింది, ఇది స్థిరమైన బ్యాంక్ క్రెడిట్ వృద్ధిని సూచిస్తుంది.
4. బ్యాంకింగ్ రంగం ఆస్తుల నాణ్యత, బలమైన మూలధన బఫర్లు, బలమైన కార్యాచరణ పనితీరులో మెరుగుదలను ప్రదర్శిస్తుంది.
5. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (జిఎన్‌పిఎలు) 2024 సెప్టెంబర్ చివరి నాటికి గల స్థూల రుణాలు, అడ్వాన్సుల్లో 12 ఏళ్ల కనిష్ట స్థాయి 2.6 శాతానికి తగ్గాయి.
6. దివాలా మరియు దివాలా కోడ్ కింద, సెప్టెంబర్ 2024 వరకు 1,068 ప్లాన్‌ల పరిష్కారం ద్వారా రూ. 3.6 లక్షల కోట్ల రాబడి వచ్చింది. ఇది లిక్విడేషన్ విలువలో 161 శాతం ప్రమేయం గల ఆస్తుల సరసమైన విలువలో 86.1 శాతంగా ఉంది.
7. ఎన్నికల ఆధారిత మార్కెట్ అస్థిరత సవాళ్లు ఉన్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న వాటి మార్కెట్ సహచరుల కంటే మెరుగ్గా రాణించాయి.
8. ప్రాథమిక మార్కెట్ల (ఈక్విటీ, డెట్) ద్వారా 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు సమీకరించిన మొత్తం వనరుల విలువ రూ. 11.1 లక్షల కోట్లుగా ఉంది, ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో సమీకరించబడిన మొత్తం కంటే ఐదు శాతం ఎక్కువ.
9. 2024 డిసెంబర్ చివరి నాటికి బిఎస్ఇ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ - జిడిపి నిష్పత్తి 136 శాతంగా ఉంది, ఇది చైనా (65 శాతం), బ్రెజిల్ (37 శాతం) వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థల కంటే చాలా అధికం.
10. భారత బీమా మార్కెట్ తన వృద్ధిని కొనసాగించింది, 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బీమా ప్రీమియంలు 7.7 శాతం పెరిగి రూ. 11.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
11. భారతదేశ పెన్షన్ రంగం గణనీయమైన వృద్ధిని సాధించింది, సెప్టెంబర్ 2024 నాటికి మొత్తం పెన్షన్ చందాదారుల సంఖ్య 16 శాతం (వార్షికంగా) పెరిగింది.
అంతర్జాతీయ వ్యవహారాల రంగం: సరైన విధానాలతో ఎఫ్‌డిఐ పొందడం
1. ప్రపంచ అనిశ్చితులు, ప్రతికూలతల మధ్య అంతర్జాతీయ వ్యవహారాల రంగంలో భారత్ సుస్థిరతను ప్రదర్శిస్తూనే ఉంది.
2. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో మొత్తం ఎగుమతులు (వస్తువులు + సేవలు) 6 శాతం (వార్షికంగా) పెరిగాయి. ఇదే కాలంలో సేవల రంగంలో 11.6 శాతం వృద్ధి నమోదైంది.
3. యుఎన్‌సిటిఎడి ప్రకారం, 'టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్' కోసం ప్రపంచ ఎగుమతి మార్కెట్‌లో భారత్ 10.2 శాతం ఆధిక్యంతో, ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది.
4. నికర సేవల వసూళ్లు, వ్యక్తిగత బదిలీ వసూళ్ల పెరుగుదల మద్దతుతో 2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత కరెంట్ ఖాతా లోటు (సిఎడి) జిడిపిలో 1.2 శాతంగా ఉంది.
5. స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) ప్రవాహాలు 2025 ఆర్థిక సంవత్సరంలో పునరుద్ధరణను నమోదు చేశాయి, ఇవి 2024 ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో 47.2 బిలియన్ డాలర్లుగా ఉండగా 2025 ఆర్థిక సంవత్సరం అదే కాలంలో 55.6 బిలియన్ డాలర్లకు పెరిగి, 17.9 శాతం వార్షిక వృద్ధి నమోదు చేశాయి.
6. డిసెంబర్ 2024 చివరి నాటికి భారత విదేశీ మారకం నిల్వలు 640.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి, ఇవి సుమారుగా 10.9 నెలల దిగుమతులకు, 90 శాతం విదేశీ రుణాల కోసం సరిపోతాయి.
7. గత కొన్నేళ్లుగా విదేశీ రుణాల్లో భారత్ స్థిరంగా ఉంది, సెప్టెంబర్ 2024 చివరి నాటికి అంతర్జాతీయ రుణం - జిడిపి నిష్పత్తి 19.4 శాతంగా ఉంది.
ధరలు, ద్రవ్యోల్బణం: గతిశీలతను అర్థం చేసుకోవడం
1. ఐఎంఎఫ్ ప్రకారం, 2022లో గరిష్టంగా 8.7 శాతంగా ఉన్న ప్రపంచ ద్రవ్యోల్బణ రేటు, 2024 నాటికి 5.7 శాతానికి తగ్గింది.
2.2024 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతంగా ఉన్న భారత రిటైల్ ద్రవ్యోల్బణం 2025 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-డిసెంబర్ 2024) నాటికి 4.9 శాతానికి తగ్గింది.
3. ఆర్బిఐ, ఐఎంఎఫ్ అంచనా ప్రకారం భారతదేశ వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ 2026 ఆర్థిక సంవత్సర లక్ష్యంగా ఉన్న 4 శాతానికి చేరనుంది.
4. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రభావాలను తగ్గించడానికి, దీర్ఘకాలిక ధరల స్థిరత్వాన్ని సాధించడానికి, వాతావరణ ప్రభావాలను తట్టుకునే పంట వంగడాలను, మెరుగైన వ్యవసాయ పద్ధతులను అభివృద్ధి చేయడం చాలా అవసరం.
మధ్యస్థ-కాలిక దృక్పథం: నియంత్రణల సడలింపు... వృద్ధికి దారితీస్తుంది
1. భారత ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేని ఆర్థిక సవాళ్లు, అవకాశాలను సూచించే మార్పునకు మధ్యలో ఉంది. భౌగోళిక-ఆర్థిక విభజన (జిఇఎఫ్) ప్రపంచీకరణ స్థానంలోకి వచ్చి, ఇది తక్షణ ఆర్థిక మార్పులకూ, సవరణలకు దారితీస్తుంది.
2. 2047 నాటికి వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడానికి భారత్ సగటున ఒకటి లేదా రెండు దశాబ్దాల పాటు స్థిరమైన ధరల వద్ద దాదాపు 8 శాతం వృద్ధి రేటును సాధించాల్సి ఉంటుంది.
3. భారతదేశ మధ్యకాలిక వృద్ధి దృక్పథం జిఇఎఫ్, చైనా తయారీ నైపుణ్యం, శక్తి పరివర్తన ప్రయత్నాల్లో చైనాపై ఆధారపడటం వంటి కొత్త ప్రపంచ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి.
4. దేశీయ వృద్ధి శక్తులను పునరుజ్జీవింపజేయడానికి, అలాగే వ్యక్తులు, సంస్థలు చట్టబద్ధమైన ఆర్థిక కార్యకలాపాలను సులభంగా కొనసాగించే సాధికారతను కల్పించడానికి భారత్ క్రమబద్ధమైన నియంత్రణ సడలింపుపై దృష్టి పెట్టాలి.
5. భారత్ మధ్యకాలిక వృద్ధి అవకాశాలను బలోపేతం చేయడానికి వ్యక్తులు, చిన్న వ్యాపారాలకు వ్యవస్థాగత నియంత్రణ సడలింపు ఇవ్వడం లేదా ఆర్థిక స్వేచ్ఛను పెంచడం నిస్సందేహంగా అత్యంత ముఖ్యమైన విధాన ప్రాధాన్యం అవుతుంది.
6. సంస్కరణలు, ఆర్థిక విధానాల దృష్టి ఇప్పుడు వ్యాపార సౌలభ్యం 2.0 కింద క్రమబద్ధమైన నియంత్రణ సడలింపు, ఆచరణీయమైన మిటెల్‌స్టాండ్ సృష్టించడం అంటే భారత ఎంఎస్ఎంఇ రంగంపై ఉండాలి.
7. తదుపరి దశలో, రాష్ట్రాలు ప్రమాణాలను, నియంత్రణలను సరళీకరించడం, వాటి అమలు కోసం చట్టపరమైన రక్షణలను ఏర్పాటు చేయడం, సుంకాలు, రుసుములను తగ్గించడం, రిస్క్-ఆధారిత నియంత్రణను వర్తింపజేయడం కోసం పని చేయాలి.
పెట్టుబడి, మౌలిక సదుపాయాలు: యథాతథంగా కొనసాగించడం
1. గత ఐదేళ్ల కాలంలో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం, ఆమోదాలు, వనరుల సమీకరణలను వేగవంతం చేయడంపైనే ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించింది.
2. కీలకమైన మౌలిక సదుపాయాల రంగాలపై కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం 2020 నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు 38.8 శాతం వృద్ధిని నమోదు చేసింది.
3. రైల్వే అనుసంధానం కింద, 2024 ఏప్రిల్ - నవంబర్ మధ్య కాలంలో 2031 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్ ప్రారంభమైంది, 2024 ఏప్రిల్ - అక్టోబర్ మధ్య కొత్తగా 17 జతల వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు.
4. రహదారుల నెట్‌వర్క్ కింద, 2025 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-డిసెంబర్)లో 5853 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయింది.
5. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కింద, మొదటి దశలో వివిధ రంగాలకు పారిశ్రామిక ఉపయోగం కోసం 3788 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 383 ప్లాట్లు కేటాయించబడ్డాయి.
6. ప్రధాన ఓడరేవుల్లో 2024 ఆర్థిక సంవత్సరంలో 48.1 గంటలుగా ఉన్న కంటైనర్ సగటు టర్న్ఎరౌండ్ సమయం 2025 ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్-నవంబర్) నాటికి 30.4 గంటలకు తగ్గడంతో కార్యాచరణ సామర్థ్యం మెరుగుపడింది, ఇది రేవుల అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరిచింది.
7. 2024 డిసెంబర్ నాటికి సౌర, పవన విద్యుత్ ద్వారా పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 15.8 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
8. దేశంలో మొత్తం స్థాపిత సామర్థ్యంలో పునరుత్పాదక ఇంధన వాటా ఇప్పుడు 47 శాతంగా ఉంది.
9. డిడియుజిజెవై, ఎస్ఎయుబిహెచ్ఎజివై వంటి ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యాన్ని మెరుగుపరిచాయి, 18,374 గ్రామాలకు విద్యుదీకరణను అందించాయి, 2.9 కోట్ల గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాయి.
10. ముఖ్యంగా 2024 అక్టోబర్ నాటికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో, ప్రభుత్వ డిజిటల్ అనుసంధాన కార్యక్రమాలు ఆదరణ పొందాయి.
11. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (ఇప్పుడు డిజిటల్ భారత్ నిధి) కింద మారుమూల ప్రాంతాలకు 4జీ మొబైల్ సేవలను అందించే ప్రయత్నాలు గణనీయమైన పురోగతిని సాధించాయి, 2024 డిసెంబర్ నాటికి 10,700లకి పైగా గ్రామాలకు ఈ సౌకర్యం కల్పించారు.
12. జల్ జీవన్ మిషన్ ప్రారంభించినప్పటి నుండి 12 కోట్లకు పైగా కుటుంబాలు కొళాయిల ద్వారా తాగునీటిని పొందాయి.
13. స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీణ్ రెండవ దశ కింద, 2024 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు, క్రమంగా 1.92 లక్షల గ్రామాలను నమూనా కేటగిరీ కింద ఓడిఎఫ్ ప్లస్‌గా ప్రకటించారు, దీంతో మొత్తం ఓడిఎఫ్ ప్లస్ గ్రామాల సంఖ్య 3.64 లక్షలకు చేరుకుంది.
14. పట్టణ ప్రాంతాల్లో, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 89 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది.
15. నగర రవాణా నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది, మెట్రో, రాపిడ్ రైలు వ్యవస్థలు 29 నగరాల్లో పనిచేస్తున్నాయి లేదా నిర్మాణంలో ఉన్నాయి, ఇవి 1,000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేస్తున్నాయి.
16. రియల్ ఎస్టేట్ (నియంత్రణ & అభివృద్ధి) చట్టం, 2016, రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ, పారదర్శకతను నిర్ధారించింది. జనవరి 2025 నాటికి, 1.38 లక్షలకు పైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నమోదు కాగా, 1.38 లక్షల ఫిర్యాదులు పరిష్కారమైనవి.
17. భారత్ ప్రస్తుతం 56 క్రియాశీల అంతరిక్ష అసెట్స్ నిర్వహిస్తోంది. ప్రభుత్వ అంతరిక్ష రంగ లక్ష్యం 2047లో గగన్‌యాన్ మిషన్, చంద్రయాన్-4 లూనార్ శాంపిల్ రిటర్న్ మిషన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు భాగంగా ఉన్నాయి.
18. ప్రభుత్వ రంగ పెట్టుబడి మాత్రమే మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చలేదు, ఈ అంతరాన్ని తగ్గించడానికి ప్రైవేట్ రంగ భాగస్వామ్యం చాలా కీలకం.
19. మౌలిక సదుపాయాలలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్, జాతీయ ద్రవ్యీకరణ పైప్‌లైన్ వంటి విధానాలను రూపొందించింది.
పారిశ్రామిక రంగం: వ్యాపార సంస్కరణలే కీలకం
1. విద్యుత్, నిర్మాణ రంగాల్లో బలమైన వృద్ధి కారణంగా పారిశ్రామిక రంగం 2025 ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం వృద్ధి చెందుతుందని అంచనా (మొదటి ముందస్తు అంచనాలు).
2. ప్రభుత్వం స్మార్ట్ తయారీ, పరిశ్రమలు 4.0ని చురుగ్గా ప్రోత్సహిస్తోంది, సమర్థ్ ఉద్యోగ్ సెంటర్స్ స్థాపనకు మద్దతునిస్తోంది.
3. 2024 ఆర్థిక సంవత్సరంలో, భారత ఆటోమొబైల్ దేశీయ అమ్మకాలు 12.5 శాతం పెరిగాయి.
4. 2015 నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు దేశీయ ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 17.5 శాతం సిఎజిఆర్ వృద్ధిని నమోదు చేసింది.
5. స్మార్ట్‌ఫోన్లలో 99 శాతం ఇప్పుడు దేశీయంగా తయారవుతున్నాయి, భారతదేశం దిగుమతులపై ఆధారపడటాన్ని ఇది గణనీయంగా తగ్గించింది.
6.2024 ఆర్థిక సంవత్సరంలో ఔషధాల మొత్తం వార్షిక టర్నోవర్ ₹4.17 లక్షల కోట్లు కాగా, గత ఐదేళ్లలో ఇది సగటున 10.1 శాతం వృద్ధి చెందింది.
7. డబ్ల్యూఐపివో నివేదిక 2022 ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ కోసం దరఖాస్తు దాఖలు చేసే టాప్ 10 కార్యాలయాల్లో భారత్ ఆరో స్థానంలో ఉంది.
8. భారత ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ) రంగం అత్యంత శక్తివంతమైన రంగంగా అవతరించింది.
9. వృద్ధి చెందగల సామర్థ్యం ఉన్న ఎంఎస్ఎంఇలకు ఈక్విటీ నిధులను అందించడానికి, ప్రభుత్వం ₹50,000 కోట్ల కార్పస్‌తో స్వయం సమృద్ధ భారత్ నిధిని ప్రారంభించింది.
10. దేశవ్యాప్తంగా క్లస్టర్లను అభివృద్ధి కోసం ప్రభుత్వం సూక్ష్మ, చిన్న పరిశ్రమల-క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
సేవలు – అపార అనుభవం ఎదుట సరికొత్త సవాళ్లు
1. మొత్తం జివిఎలో సేవా రంగం వాటా 2014 ఆర్థిక సంవత్సరంలో 50.6 శాతం ఉండగా అది 2025 ఆర్థిక సంవత్సరంలో 55.3 శాతానికి పెరిగింది (మొదటి ముందస్తు అంచనాలు).
2. మహమ్మారికి ముందు సంవత్సరాల్లో (2013– 2020 ఆర్థిక సంవత్సరం) సేవా రంగం సగటు వృద్ధి రేటు 8 శాతంగా ఉంది. మహమ్మారి తర్వాత కాలంలో (2023– 2025 ఆర్థిక సంవత్సరం) ఇది 8.3 శాతంగా ఉంది.
3. 2023లో ప్రపంచ సేవారంగ ఎగుమతుల్లో భారతదేశం 4.3 శాతం వాటాను కలిగి ఉండి, ప్రపంచవ్యాప్తంగా ఏడో స్థానంలో ఉంది.
4. భారతదేశ సేవారంగ ఎగుమతుల వృద్ధి 2024 ఆర్థిక సంవత్సరంలో 5.7 శాతంగా ఉండగా, 2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ కాలంలో 12.8 శాతానికి పెరిగింది.
5. గత దశాబ్దంలో (2013– 2023 ఆర్థిక సంవత్సరం) సమాచారం, కంప్యూటర్ సంబంధిత సేవలు 12.8 శాతం ట్రెండ్ రేటుతో వృద్ధి చెందాయి, మొత్తం జివిఎలో వాటి వాటా 6.3 శాతం నుంచి 10.9 శాతానికి పెరిగింది.
6. 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేలు ప్రయాణీకుల రద్దీలో 8 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా లభించే ఆదాయం 5.2 శాతం పెరిగింది.
7. 2023 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో పర్యాటక రంగం వాటా మహమ్మారికి ముందు ఉన్న 5 శాతానికి తిరిగి వచ్చింది.
అధ్యాయం-9 వ్యవసాయం, ఆహార నిర్వహణ: భవిష్యత్ రంగం
1. ప్రస్తుత ధరల ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరం (పిఇ)లో దేశ జిడిపిలో ‘వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలు’ రంగం దాదాపు 16 శాతం వాటా కలిగి ఉంది.
2. ఉద్యానవనాలు, పశువుల పెంపకం, మత్స్య సంపద వంటి అధిక విలువ కలిగిన రంగాలు మొత్తం వ్యవసాయ వృద్ధికి కీలకమైన చోదక శక్తులుగా మారాయి.
3. 2024 నాటికి ఖరీఫ్ ఆహార ధాన్యాల ఉత్పత్తి 1647.05 లక్షల మెట్రిక్ టన్నులకు (ఎల్ఎంటి) చేరుకుంటుందని అంచనా, ఇది గత సంవత్సరం కంటే 89.37 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటి) అధికం.
4. 2024-25 ఆర్థిక సంవత్సరానికి, కందిపప్పు, సజ్జలకు కనీస మద్దతు ధరను సగటు ఉత్పత్తి వ్యయం కంటే అధికంగా వరుసగా 59 శాతం, 77 శాతం పెంచారు.
5. మత్స్య రంగం అత్యధిక మిశ్రమ వార్షిక వృద్ధి రేటు (సిఎజిఆర్) 8.7 శాతంగా నమోదు చేయగా, పశువుల పెంపకం రంగం 8 శాతం సిఎజిఆర్‌తో రెండో స్థానంలో నిలిచింది.
6. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) 2013, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎమ్‌జికెఎవై) ఆహార భద్రత విధానంలో గణనీయమైన మార్పును సాధించాయి.
7. పిఎమ్‌జికెఎవై కింద మరో ఐదు సంవత్సరాలు ఉచిత ఆహార ధాన్యాలను అందించడం, ఆహారం, పోషకాహార భద్రత పట్ల ప్రభుత్వ దీర్ఘకాలిక నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
8. అక్టోబర్ 31 నాటికి, 11 కోట్లకు పైగా రైతులు పీఎమ్-కిసాన్ కింద ప్రయోజనం పొందారు, అలాగే 23.61 లక్షల మంది రైతులు పీఎమ్ కిసాన్ మంధన్ కింద నమోదు చేసుకున్నారు.
వాతావరణం, పర్యావరణం: ఆచరణే ముఖ్యం
1. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశ హోదాను సాధించాలనే భారత్ ఆశయం ప్రాథమికంగా సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి అనే దార్శనికతతో ముడిపడి ఉంది.
2. భారతదేశం శిలాజేతర ఇంధన వనరుల నుంచి 2,13,701 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసింది, ఇది 2024, నవంబరు 30 నాటికి మొత్తం సామర్థ్యంలో 46.8 శాతంగా ఉంది.
3. 2024 నాటి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం 2005 - 2023 మధ్య 2.29 బిలియన్ టన్నుల CO2కు సమానమైన అదనపు కార్బన్ శోషణ వ్యవస్థ ఏర్పాటు పూర్తయింది.
4. భారత్ నేతృత్వంలో ప్రపంచ ఉద్యమం, పర్యావరణం కోసం జీవనశైలి (ఎల్ఐఎఫ్ఇ) వంటివి, దేశ సుస్థిరత ప్రయత్నాలను మెరుగుపరిచే లక్ష్యంగా కొనసాగుతున్నాయి.
5. 2030 నాటికి, వినియోగాన్ని తగ్గించడం, ధరల తగ్గుదల వంటి ఎల్ఐఎఫ్ఇ చర్యల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు దాదాపు 440 బిలియన్ డాలర్లు ఆదా చేయవచ్చని అంచనా.
సామాజిక రంగం - పరిధిని విస్తరించడం, సాధికారత దిశగా సాగడం
1. 2021 నుంచి 2025 ఆర్థిక సంవత్సరం వరకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సామాజిక సేవల వ్యయం 15 శాతం వార్షిక వృద్ధి రేటుతో పెరిగింది.
2. వినియోగ వ్యయంలో అసమానతలకు కొలమానమైన గిని గుణకం తగ్గుతోంది. గ్రామీణ ప్రాంతాల కోసం ఇది 2022-23లో 0.266 నుంచి 2023-24లో 0.237కి తగ్గింది, పట్టణ ప్రాంతాల కోసం ఇది 2022-23లో 0.314 నుంచి 2023-24లో 0.284కి తగ్గింది.
3. ప్రభుత్వం చేపడుతున్న వివిధ ఆర్థిక విధానాలు ఆదాయ పంపిణీని పునర్నిర్మాణంలో సహాయపడుతున్నాయి.
4. ప్రభుత్వ ఆరోగ్య వ్యయం 29.0 శాతం నుంచి 48.0 శాతానికి పెరిగింది; మొత్తం ఆరోగ్య వ్యయంలో వ్యక్తులు నేరుగా చేసే ఖర్చు వాటా 62.6 శాతం నుంచి 39.4 శాతానికి తగ్గడంతో, కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తగ్గనున్నాయి.
5. ఆరోగ్యం కోసం చేసే ఖర్చులు గణనీయంగా తగ్గించడంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబి పీఎమ్-జెఎవై) నిర్ణయాత్మక పాత్ర పోషించింది, దీనితో ₹1.25 లక్షల కోట్లకు పైగా ప్రజాధనం ఆదా అయింది.
6. గ్రామ పంచాయతీ స్థాయిలో బడ్జెట్‌లు ఎస్‌డిజి లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి ― సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ (ఎస్డిజిలు) వ్యూహాన్ని అవలంబించారు.
ఉపాధి, నైపుణ్యాభివృద్ధి: అస్తిత్వ ప్రాధాన్యాలు
1. 2017-18 (జూలై-జూన్)లో 6.0 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 2023-24 (జూలై-జూన్)లో 3.2 శాతానికి తగ్గడంతో భారత కార్మిక మార్కెట్ సూచీలు మెరుగైనాయి.
2. జనాభాలో దాదాపు 26 శాతం మంది 10-24 సంవత్సరాల వయస్సు గలవారిగా ఉన్న క్రమంలో, భారత్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత యువ దేశాల్లో ఒకటిగా, ఒక ప్రత్యేకమైన జనాభా సమూహం కలిగి శిఖరాగ్రంలో ఉంది.
3. మహిళలకు పరిశ్రమల స్థాపనలో ఊతం ఇవ్వడానికి, వారు సులభంగా రుణాలు పొందడం, మార్కెటింగ్ మద్దతు, నైపుణ్యాభివృద్ధి, మహిళల అంకుర సంస్థలకు మద్దతు ఇవ్వడం మొదలైన అనేక కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించింది.
4. పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, పునరుత్పాదక ఇంధన రంగాలు ఉపాధి కల్పన కోసం మెరుగైన అవకాశాలను అందిస్తున్నాయి, ఇది వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి ప్రధాన అవసరం.
5. ఆటోమేషన్, జనరేటివ్ ఏఐ, డిజిటలైజేషన్, వాతావరణ మార్పుల ప్రభావాల వంటి ప్రపంచ ధోరణులకు అనుగుణంగా ప్రభుత్వం సుస్థిరమైన, ప్రతిస్పందించే నైపుణ్యం కలిగిన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది.
6. ఉపాధిని పెంపొందించడానికి, స్వయం ఉపాధిని మెరుగుపరిచేందుకు, కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం పలు చర్యలు అమలు చేసింది.
7. ఇటీవల ప్రారంభించబడిన పీఎమ్-ఇంటర్న్‌షిప్ పథకం ఉపాధి కల్పనను వేగవంతం చేసింది.
8. గత ఆరు సంవత్సరాల్లో ఇపిఎఫ్‌వో కింద నికర పేరోల్ జోడింపులు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి, ఇది అధికారిక ఉపాధిలో ఆరోగ్యకరమైన వృద్ధిని సూచిస్తుంది.
ఏఐ యుగంలో శ్రమ: సంక్షోభమా లేక ఉత్ప్రేరకమా?
1. కృత్రిమ మేధ (ఏఐ) డెవలపర్లు కొత్త యుగాన్ని సృష్టిస్తామని చెబుతున్నారు. ఆర్థికపరమైన విలువ కలిగిన పని ఇకపైన ఆటోమేటిగ్గా జరుగుతుంది.
2. ఆరోగ్య సంరక్షణ, పరిశోధన, నేరాల్లో న్యాయం, విద్య, వ్యాపారం, ఆర్థిక సేవల వంటి వివిధ రంగాల్లో కీలక నిర్ణయం తీసుకోవడంలో ఏఐ మానవ పనితీరును అధిగమిస్తుందని అంచనా.
3. విశ్వసనీయత పరంగా సమస్యలు, సరిపడా వనరులు లేకపోవడం, మౌలిక సదుపాయాల లోటు వంటి ఆందోళనలు సహా పెద్ద ఎత్తున ఏఐ అమలుపరచడంలో ప్రస్తుతం అడ్డంకులు కొనసాగుతున్నాయి. ఈ సవాళ్లు, ఏఐ ప్రయోగాత్మక స్వభావంతో పాటు, విధాన రూపకర్తలు చర్య తీసుకోవడానికి ఒక విండోను సృష్టిస్తాయి.
4. అదృష్టవశాత్తూ, ఏఐ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉన్నందున, భారత్ తన పునాదులను బలోపేతం చేసుకోవడానికి, దేశవ్యాప్తంగా సంస్థాగత ప్రతిస్పందనను సమీకరించడానికి అవసరమైన సమయం లభించనుంది.
5. తన యువ, చైతన్యవంతమైన, సాంకేతిక పరిజ్ఞానం గల జనాభాను ఉపయోగించుకుని, వారి పని, ఉత్పాదకతను పెంపొందించడానికి ఏఐని ఉపయోగించుకోగల శ్రామిక శక్తిని సృష్టించగల సామర్థ్యాన్ని భారత్ కలిగి ఉంది.
6. భవిష్యత్తు 'ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్' చుట్టూ తిరుగుతుంది, ఇక్కడ శ్రామిక శక్తి మానవ, యంత్ర సామర్థ్యాలను ఏకీకృతం చేస్తుంది. ఈ విధానం మానవ సామర్థ్యాన్ని పెంపొందించడం, ఉద్యోగ పనితీరులో మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరచడం, చివరికి మొత్తం సమాజానికి ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా కలిగి ఉంటుంది.
7. ఏఐ ప్రేరిత ప్రతికూల సామాజిక ప్రభావాలను తగ్గించడానికి ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, విద్యాసంస్థలు పరస్పర సహకారంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది.
***
(Release ID: 2098421)
Visitor Counter : 151
Read this release in:
Odia
,
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Marathi
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil