సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మహా కుంభమేళాలో సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ మీడియా విభాగాల పనులను పరిశీలించిన కార్యదర్శి సంజయ్ జాజు
ప్రజోపయోగం కోసం సమాచార శాఖ ప్రదర్శన
మీడియా కేంద్రాన్ని సందర్శించిన శ్రీ సంజయ్ జాజు.. పాత్రికేయులతో సంభాషణ
మహా కుంభమేళాను డిజిటల్ గా మార్చేలా చేసిన ఏర్పాట్లపై ప్రసార భారతిని అభినందించిన కార్యదర్శి
Posted On:
23 JAN 2025 10:08PM by PIB Hyderabad
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ మీడియా విభాగాలు మహా కుంభమేళాలో చేస్తున్న పనులను ఆ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు గురువారం పరిశీలించారు. ‘జన్ భాగిదారీ సే జన్ కల్యాణ్’తోపాటు గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ విజయాలు, కార్యక్రమాలు, విధానాలు, పథకాలను వివరిస్తూ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో త్రివేణి మార్గ్ లోని ప్రదర్శన సముదాయంలో ఏర్పాటు చేసిన మల్టీమీడియా ప్రదర్శనను కేంద్ర కార్యదర్శి పరిశీలించారు.
ఈ ప్రదర్శనను అందరూ వీక్షించవచ్చని కార్యదర్శి తెలిపారు. వాల్, ఎల్ఈడీ టీవీ తెరలు, హాలోగ్రాఫిక్ సిలిండర్ వంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏర్పాటు చేసిన అనామోర్ఫిక్, మల్టీమీడియా ప్రదర్శన వివిధ పథకాలపై ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని అందిస్తోందన్నారు.
మహా కుంభమేళాలోని మీడియా కేంద్రాన్ని సందర్శించిన శ్రీ సంజయ్ జాజు పాత్రికేయులతో అక్కడ అందిస్తున్న సదుపాయాలను సమీక్షించారు. మీడియా కేంద్రంలోని వర్క్ స్టేషన్లలో ఉన్న పాత్రికేయులతో ఆయన ముచ్చటించారు.
అంతకుముందు మహా కుంభమేళా ప్రాంతంలోని సెక్టార్ 4లో ఏర్పాటు చేసిన దూరదర్శన్, ఆకాశవాణి తాత్కాలిక కేంద్రాన్ని కూడా కార్యదర్శి సందర్శించారు. టెలివిజన్, మొబైల్, ఇతర మాధ్యమాల ద్వారా దూరదర్శన్, ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు వీక్షకులు, శ్రోతలకు మహా కుంభమేళా వైభవాన్ని, పవిత్ర ఘట్టాల విశేషాలను తెలియజేస్తున్నాయన్నారు. ఇందుకోసం ప్రసార భారతి అనేక కెమెరాల ద్వారా ప్రత్యక్ష ప్రసారాల కోసం ఏర్పాట్లు చేసినట్టు కార్యదర్శి తెలిపారు.
ప్రత్యేక ఎఫ్ఎం ఛానల్ కుంభవాణి ద్వారా సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే, ఎఫ్ఎం రేడియో ప్రసారాలను మహా కుంభమేళాలో ప్రజలందరికీ చేరేలా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఇది భక్తులకు ప్రయోజనం చేకూరుస్తోంది. మహా కుంభమేళా ప్రాంతంలో పనిచేస్తున్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులతో కేంద్ర కార్యదర్శి సమీక్ష సమావేశం నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు.
144 ఏళ్ల తర్వాత జరుగుతున్న విశిష్టమైన ఈ మహా కుంభమేళాకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తున్నారని సమాచార ప్రసార శాఖ కార్యదర్శి తెలిపారు. దేశం నలుమూలల నుంచి భక్తులు మహా కుంభమేళాకు వచ్చి భేద భావాల్లేకుండా శాంతి కోసం ప్రార్థిస్తారన్నారు. సుసంపన్నమమైన మన సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మహా కుంభమేళా విశేష పాత్ర పోషిస్తుందని శ్రీ జాజు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రచురణల విభాగం ఏర్పాటు చేసిన స్టాల్ ను కూడా ఆయన సందర్శించారు. అక్కడ బాలభారతి పత్రికను చూసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ఆయన.. ఇప్పటికీ దాని ప్రచురణను కొనసాగిస్తుండడంపై ప్రశంసలు తెలిపారు.
****
(Release ID: 2095885)
Visitor Counter : 24
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam