ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

Posted On: 03 JAN 2025 4:50PM by PIB Hyderabad

 

భారత్ మాతా కీ – జై!

భారత్ మాతా కీ – జై!

కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు – మనోహర్ లాల్ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు, తోఖాన్ సాహు గారు, డాక్టర్ సుకాంత మజుందార్ గారు, హర్ష మల్హోత్ర గారు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా గారు.. నా సహచర పార్లమెంటు సభ్యూలు, ఎమ్మెల్యేలు, ప్రియమైన సోదరీసోదరులారా...

మీ అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. దేశ అభివృద్ధి కోసం అనేక కొత్త అవకాశాలను ఈ యేడు మోసుకొచ్చింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే దిశగా మన ప్రస్థానం ఈ సంవత్సరం మరింత ఊపందుకుంటుంది. ప్రపంచంలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వానికి భారత్ నేడు ప్రతీకగా నిలుస్తోంది. ఈ పాత్రలో భారత్ స్థానం 2025లో మరింత బలోపేతవుతుంది. ఈ సంవత్సరం అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ పెరుగుతుంది, భారత్ ప్రధాన ఉత్పాదక కేంద్రంగా నిలుస్తుంది, కొత్త అంకుర సంస్థలు దూసుకెళ్తాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగే వారి సంఖ్యా పెరుగుతుంది. వ్యవసాయ రంగం కొత్త మైలురాళ్లను చేరుకుంటుంది. మనకు మంత్రప్రదమైన ‘మహిళా నేతృత్వంలో అభివృద్ధి’ ఈ యేడు కొత్త పుంతలు తొక్కుతుంది. జీవన సౌలభ్యాన్నీ, జీవన ప్రమాణాలనూ మెరుగుపరచడం ఈ సంవత్సరం ప్రధాన లక్ష్యం కాబోతోంది. నేటి కార్యక్రమం కూడా ఆ సంకల్పంలో భాగమే.

మిత్రులారా,

నిరుపేదలకు ఇళ్లతోపాటు పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నేడు జరిగాయి. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. గుడిసెల నుంచి శాశ్వత నివాసాల్లోకీ, అద్దె ఇళ్ల నుంచి సొంతిళ్లలోకీ వెళ్లడం – నిజంగా కొత్త ఆరంభమే. కొత్త జీవితాలు మొదలవుతున్న ఆ కుటుంబాలకు.. ఆ తల్లులూ, అక్కాచెల్లెల్లకూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తున్నాను. వారికి వచ్చిన ఇళ్లు గౌరవానికీ, స్వాభిమానానికీ ప్రతీకలు. ఇవి కొత్త ఆశలకూ, కొత్త కలలలకూ నిలయాలు. మీ సంతోషంలో, వేడుకలో పాలుపంచుకోవడానికి ఈరోజు ఇక్కడికొచ్చాను. ఇక్కడికి వస్తే అనేక పాత జ్ఞాపకాలు సహజంగానే గుర్తొస్తాయి. బహుశా మీలో కొందరికి తెలిసే ఉంటుంది.. అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ఇందిరాగాంధీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దేశం ఉద్యమించింది. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం కొనసాగింది. చాలా మందిలాగే నేనూ అజ్ఞాత ఉద్యమంలో పాల్గొన్నాను. అప్పుడు నేను అశోక్ విహార్ లో ఉండేవాడిని. ఈరోజు మళ్లీ ఇక్కడికొచ్చాను.. ఆ జ్ఞాపకాల వెల్లువ ముంచెత్తుతోంది.

మిత్రులారా,

‘వికసిత భారత్’ నిర్మాణంపైనే నేడు దేశమంతా దృష్టిపెట్టింది. ‘వికసిత భారత్’ అంటే ప్రతి ఒక్కరికీ తలదాచుకోవడానికి ఒక మంచి ఇల్లుండడం. ఈ లక్ష్యంతోనే మేం పనిచేస్తున్నాం. దీన్ని సాధించడంలో ఢిల్లీ పాత్ర ముఖ్యమైనది. అందుకే, మురికివాడల స్థానంలో శాశ్వత ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కల్కాజీ ప్రాంతంలోని మురికి వాడల్లో నివసిస్తున్న సోదరీ సోదరుల కోసం దాదాపు 3,000 ఇళ్లను ప్రారంభించే అవకాశం రెండేళ్ల క్రితం నాకు లభించింది. తరతరాలుగా మురికివాడల్లో ఆశల్లేకుండా జీవిస్తున్న కుటుంబాలు ఇప్పుడు తొలిసారిగా శాశ్వత నివాసాల్లోకి మారుతున్నాయి. అది ప్రారంభం మాత్రమేనని నేనప్పుడే చెప్పాను. ఈరోజు మరో 1,500 గృహాలను వాటి యజమానులకు అప్పగించాం. ఈ ‘స్వాభిమాన్ అపార్టుమెంట్లు’ నిరుపేదల గౌరవానికి, స్వాభిమానానికీ ప్రతీక. ఇంతకుముందు కొందరు లబ్ధిదారులతో నేను మాట్లాడాను. వారిలో సంతోషాన్నీ, గర్వాన్నీ, నవోత్తేజాన్నీ ఆస్వాదించాను. అక్కడ కొందరు పిల్లలను కలిసినప్పుడు.. వారి కలలు స్వాభిమాన్ అపార్టుమెంట్ల కన్నా ఎత్తుకు ఎగిసినట్టు అనిపించింది.

అంతేకాకుండా మిత్రులారా,

ఈ ఇళ్ల యజమానుల్లో ఢిల్లీలోని వివిధ ప్రదేశాలకు చెందినవారున్నారు. కానీ, వారంతా కుటుంబసభ్యులే.

మిత్రులారా,

మోదీ తనకంటూ ఒక ఇల్లు కూడా కట్టుకోలేదనే విషయం దేశానికి బాగా తెలుసు. కానీ, గత పదేళ్లలో 4 కోట్ల మందికి పైగా నిరుపేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వడం ద్వారా వారి కలను మోదీ నెరవేర్చాడు. నేను కూడా ఓ ‘షీష్ మహల్ (విలాసవంతమైన ఇల్లు)’ నిర్మించుకోగలిగేవాడినే. కానీ, నా తోటి పౌరులందరికీ తలదాచుకోవడానికి మంచి నివాసాలుండేలా చూడడమే నా లక్ష్యం. మీరెవరినైనా కలిసిన సమయంలో.. ముఖ్యంగా ఇప్పటికీ మురికి వాడలు, గుడిసెల్లో ఉంటున్న వారిని కలిసినప్పుడు నా తరఫున వారికొక భరోసా ఇవ్వండని నేను మీ అందరినీ కోరుతున్నాను. నేడో రేపో వారి కోసం ఒక ఇల్లు నిర్మితమవుతుందనీ, వారికి ఓ సొంతిల్లు వస్తుందనీ చెప్పండి. ‘మీ అందరూ మోదీలే’ అని నేననుకుంటున్నాను. అందుకే, మీరు ధీమాగా ఈ హామీ ఇవ్వొచ్చు. నిరుపేదల కోసం నిర్మించే ఈ గృహాల్లో మెరుగైన జీవితం కోసం అవసరమైన అన్ని సౌకర్యాలూ ఉంటాయి. ఇవి గౌరవాన్ని పెంచుతాయి, ఆత్మవిశ్వాసం నింపుతాయి, ‘వికసిత భారత’ వాస్తవిక శక్తిని చాటుతాయి. అయితే మనమిక్కడే ఆగబోము. ఢిల్లీలో ఇలాంటి మరో 3,000 గృహాల నిర్మాణం పూర్తవుతోంది. త్వరలోనే ఢిల్లీ వాసులకు వేల సంఖ్యలో కొత్త గృహాలు లభిస్తాయి. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. వారి నివాసాలు కూడా చాలా పాతవిగా మారాయి. వారి కోసం కూడా కొత్త గృహాల నిర్మాణం జరుగుతోంది. ఢిల్లీ నగరం గతంలో ఎన్నడూ లేనివిధంగా విస్తరిస్తున్న దృష్ట్యా, నరేలా ఉప నగర అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఇంతకుముందు రోహిణి, ద్వారక ఉపనగరాలను అభివృద్ధి చేసింది.

మిత్రులారా,

‘వికసిత్ భారత్’ నిర్మాణంలో నగరాలు కీలకమైన పాత్రను పోషిస్తాయి. పెద్ద కలలతో వివిధ ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చినవారు తమ ఆశయాలను నెరవేర్చుకొనేందుకే తమ జీవితాలను అంకింతం చేస్తారు. అందుకే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నగరాల్లో నివసించే ప్రతి కుటుంబానికి నాణ్యమైన జీవితం అందించేందుకు కట్టుబడి ఉంది. పేదవారైనా, మధ్య తరగతికి చెందినవారైనా, వారికంటూ మంచి ఇల్లు సమకూర్చేందుకే మేం కృషి చేస్తున్నాం. గ్రామాల నుంచి నగరాలకు తరలి వచ్చిన వారికి చౌకగా అద్దె ఇంటి వసతిని కల్పించే దిశగా పనిచేస్తున్నాం. మధ్యతరగతి కుటుంబాల వారు తమ సొంతింటి కలను నెరవేర్చుకొనేలా ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తోంది. గడచిన దశాబ్దంగా ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ప్రధానమంత్రి ఆవాస యోజన (పట్టణ) ద్వారా గత పదేళ్లలో దేశవ్యాప్తంగా కోటికి పైగా ఇళ్లను నిర్మించాం. ఈ పథకం ద్వారా ఢిల్లీలోనే దాదాపుగా 30,000 కొత్త ఇళ్లను నిర్మించాం.

స్నేహితులారా,

ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు మేం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. తర్వాతి దశలో ప్రధానమంత్రి ఆవాస యోజన (పట్టణ) పథకం ద్వారా నగరాల్లోని పేదలకు కోటి ఇళ్లను నిర్మిస్తాం. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఇళ్లకు ఆర్థిక సహకారం అందిస్తుంది. 9 లక్షల రూపాయల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రత్యేక ప్రయోజనాలు పొందుతాయి. అలాగే, మధ్యతరగతి వారు తమ సొంతింటి కలను నెరవేర్చుకొనే దిశగా గృహ రుణాలపై వడ్డీల్లో భారీ రాయితీని ఇచ్చి దాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.

మిత్రులారా,

తమ పిల్లలు బాగా చదువుకోవాలని, నేర్చుకోవాలని, స్వావలంబన సాధించాలని ప్రతి కుటుంబం కోరుకుంటుంది. అందుకే నాణ్యమైన విద్యనందించే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, నైపుణ్య సంస్థలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. చిన్నారులకు విద్యను అందించడం మాత్రమే కాకుండా ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా వారిని సిద్ధం చేయడమే మా లక్ష్యం. ఇదే ఆలోచనను దృష్టిలో పెట్టుకొని నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) రూపొందించాం. పేద, మధ్యతరగతికి చెందిన చిన్నారులకు నూతన అవకాశాలను అందేలా చేయడమే ఈ నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యం. మధ్య తరగతి, పేద కుటుంబాల నుంచి వచ్చిన వారికి డాక్టర్లు, ఇంజినీర్లు, ప్రతిష్ఠాత్మక కోర్టుల్లో న్యాయవాదులుగా మారాలనే కలలు ఎంతో ముఖ్యమైనవి. కానీ భరించలేని ఖర్చుతో కూడుకున్న ఆంగ్ల మాధ్యమ విద్య వారికి అడ్డంకిగా మారింది. ఆంగ్లంలో సరిగ్గా మాట్లాడలేనంత మాత్రాన మధ్యతరగతి, పేద కుటుంబాల పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కోల్పోవాలా? డాక్టర్లు, ఇంజినీర్లు కావాలనే తమ కలలను నెరవేర్చుకొనే వీలు వారికి లేదా? అందుకే సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న సంస్కరణను మీ ‘సేవకుడు’ అమల్లోకి తెచ్చాడు. ఇప్పుడు తమ మాతృభాషలో చదువుకున్న చిన్నారులు వైద్యులు, ఇంజినీర్లు అవ్వచ్చు. లేదా ఈ దేశంలోని ఉన్నత న్యాయస్థానాల్లో వాదనలు వినిపించవచ్చు.

మిత్రులారా,

దేశంలో విద్యావ్యవస్థను మెరుగుపరచడంలో సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) గణనీయమైన పాత్ర పోషిస్తోంది. దాని విస్తృతి క్రమంగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే సీబీఎస్‌ఈ కోసం కొత్త భవనం నిర్మించాం. ఇది విద్య, పరీక్షల నిర్వహణలో ఆధునిక పద్దతులను అవలంబించడానికి సహాయపడుతుంది.

స్నేహితులారా,

ఉన్నత విద్యాభ్యాసంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం ఖ్యాతి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో నేను కూడా విద్యార్థినవడం నా అదృష్టం. ఇక్కడే ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)లో ఉన్నత విద్యను అభ్యసించే దిశగా మరిన్ని అవకాశాలను అందించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు కొత్త క్యాంపస్‌ల కోసం వేసిన పునాది రాళ్లు ఇకపై ప్రతి ఏటా అదనంగా వందల మంది విద్యార్థులు డీయూలో చదువుకొనేలా వీలు కల్పిస్తాయి. డీయూ తూర్పు, పశ్చిమ ప్రాంగణాలు నిర్మించాలనే ప్రతిపాదన చాలాకాలం నుంచే ఉంది. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడింది. సూరజ్‌మల్ విహార్‌లో తూర్పు క్యాంపస్, ద్వారకలో పశ్చిమ క్యాంపస్ పనులు వేగంగా సాగుతున్నాయి. అదనంగా నజఫ్‌గడ్‌లో వీర సావర్కర్ పేరుతో కొత్త కళాశాలను నిర్మిస్తున్నాం.

మిత్రులారా,

ఓ వైపు ఢిల్లీలో విద్యావ్యవస్థను మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. మరో వైపు, రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోంది. గత పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ పాఠశాల విద్యావ్యవస్థకు అపారమైన నష్టం కలిగించింది. పరిస్థితులు ఎంత తీవ్రంగా మారాయంటే, సమగ్ర శిక్షా అభియాన్ నిమిత్తం కేంద్రం ఇచ్చిన నిధులను సరిగ్గా వినియోగించలేదు. ఢిల్లీ చిన్నారుల భవిష్యత్తు పట్ల ఉదాసీనంగా వ్యవహరించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కేటాయించిన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయలేకపోయింది.

స్నేహితులారా,

ఇది దేశ రాజధాని, సుపరిపాలన పొందే హక్కు ఢిల్లీ ప్రజలకు ఉంది. కానీ, గత పదేళ్లుగా ఢిల్లీ పెద్ద ‘ఆప్-ద’ (ఆపద)లో చిక్కుకుంది. అన్నా హజారేనే ముందు నిలబెట్టి కొంతమంది అవినీతిపరులు ఢిల్లీని పెద్ద ఆప్-ద లోకి తోసేశారు. మద్యం ఒప్పందాల్లో కుంభకోణాల నుంచి, పాఠశాలల్లో అవకతవకలు, పేదలకందించే వైద్యసేవల్లో మోసాలు, కాలుష్యంపై పోరాటం, నియామకాల ముసుగులో అవినీతి వరకు - ఒకప్పుడు ఢిల్లీ సంక్షేమం గురించి మాట్లాడినవారే ఇప్పుడు ఈ నగరానికి ‘ఆప్-ద’గా పరిణమించారు. వారు అవినీతిలో కూరుకుపోవడమే కాకుండా దాని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. దొంగ చేసిన గాయానికి అవమానం తోడైనట్లుగా ఈ ‘ఆప్-ద’ ఢిల్లీని ఇంకా పాలిస్తోంది. అందుకే ఈ ‘ఆప్-ద’కు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు పోరాటాన్ని ప్రారంభించారు. ఈ ‘ఆప్-ద’ నుంచి నగరాన్ని రక్షించేందుకు ఇక్కడి ఓటర్లు కృతనిశ్చయంతో ఉన్నారు. ‘‘ఈ ‘ఆప్-ద’ను మేము ఉపేక్షించబోం, మార్పు తీసుకువస్తాం’’, ‘‘ఈ ‘ఆప్-ద’ను మేము ఉపేక్షించబోం, మార్పు తీసుకువస్తాం’’, ‘‘ఈ ‘ఆప్-ద’ను మేము ఉపేక్షించబోం, మార్పు తీసుకువస్తాం’’, ‘‘ఈ ‘ఆప్-ద’ను మేము ఉపేక్షించబోం, మార్పు తీసుకువస్తాం’’, ‘‘ఈ ‘ఆప్-ద’ను మేము ఉపేక్షించబోం, మార్పు తీసుకువస్తాం’’ అంటూ ఢిల్లీలోని ప్రతి పౌరుడూ, ప్రతి చిన్నారి, నగరంలోని ప్రతి మూల నుంచి నినదిస్తున్నారు.

స్నేహితులారా,

దేశానికి ఢిల్లీ రాజధాని, కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని అధిక వ్యయంతో నిర్మిస్తున్న అనేక ప్రాజెక్టులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రోడ్లు, మెట్రో లైన్లు, పెద్ద ఆసుపత్రులు, కళాశాలల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. కానీ ఈ ‘ఆప్-ద’ ప్రభుత్వం తన వంతుగా చేపట్టాల్సిన బాధ్యతను విస్మరించి ప్రగతికి అడ్డంకులు సృష్టిస్తోంది. నగరాన్ని సంక్షోభంలో ముంచేసిన ఈ ‘ఆప్-ద’ ప్రభుత్వానికి భవిష్యత్తు గురించి ఆలోచనే లేదు. ప్రస్తుతం యమునా నది పరిస్థితి ఈ ‘ఆప్-ద’కి ఓ ఉదాహరణ. ఇక్కడికి రావడానికి ముందు స్వాభిమాన్ గృహాల లబ్ధిదారులతో నేను ముచ్చటించాను. వారిలో ఎక్కువ మంది ఉత్తర ఢిల్లీలో నివాసముంటారు. వారిని ఛట్ పూజ గురించి అడిగినప్పుడు యమనానది పరిస్థితి దిగజారిపోయిందని, పూజలు సరిగ్గా చేయలేకపోయామని చేతులు జోడిస్తూ చెప్పారు. నదీమ తల్లిని క్షమించమని కోరుతూ చిన్నపాటి నైవేద్యంతో సరిపెట్టుకున్నారు. ఢిల్లీలోని ప్రతి ఒక్కరికీ యుమన పరిస్థితి గురించి తెలుసు.

స్నేహితులారా,

పదేళ్ల తర్వాత కూడా నిస్సిగ్గుగా, బాధ్యతారహితంగా వారు మాట్లాడుతున్నారు - ఈ ‘ఆప్-ద’తోనే మనం పోరాడుతున్నాం. యుమనా నదిని శుభ్రం చేస్తే ఓట్లు పడవని వారు చెబుతున్నారు. అంటే దాని అర్థం ఓట్లు రావని ఆ నదిని అలా దయనీయస్థితిలో వదిలేయాలనా? యమునను శుద్ధి చేయకపోతే, ఢిల్లీకి తాగునీరు ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్లు చేస్తున్న పని వల్ల ఢిల్లీ వాసులు కలుషితమైన నీరు తాగాల్సి వస్తోంది. ఆ ‘ఆప్-ద’ ఇక్కడి ప్రజల జీవితాలను ట్యాంకర్ మాఫియా చేతిలో పెట్టింది. ఈ ‘ఆప్-ద’ వ్యక్తులను అలాగే వదిలేస్తే.. నగర భవిష్యత్తును మరింత అధ్వాన్న స్థితికి తీసుకుపోతారు.

మిత్రులారా,

నేను చేస్తున్న నిరంతర శ్రమ వల్ల దేశంలో మంచి పథకాలు అమలు అవుతున్నాయి. వాటి వల్ల ఢిల్లీ సోదరులు, సోదరీమణులు కూడా లబ్ధి పొందుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పేద, మధ్యతరగతికి చెందిన వారికి వసతులను కల్పించడంతోపాటు వారి డబ్బుని ఆదా చేయడంలో దోహదపడుతున్నాయి.

మిత్రులారా,

ప్రజల విద్యుత్ బిల్లులను సున్నాకి తగ్గించడమే కాకుండా, తిరిగి ప్రజలే కరెంటు ద్వారా ఆదాయం ఆర్జించే అవకాశాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. పీఎం సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన ద్వారా ప్రతి కుటుంబం విద్యుత్ ఉత్పత్తిదారుగా మారిపోయింది. ఈ కార్యక్రమం ద్వారా సోలార్ విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి రూ.75,000 నుంచి 80,000 వరకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 7.5 లక్షల ఇళ్ల కప్పులపై సోలార్ ప్యానెళ్లు అమర్చాం. తద్వారా కుటుంబానికి అవసరమైన విద్యుత్ ఉచితంగా లభిస్తుంది. అలాగే మిగులు విద్యుత్తుతో డబ్బు సంపాదించవచ్చు. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే వారికి అందిస్తుంది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పీఎం సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజనను వేగంగా అమలు చేస్తామని హామీ ఇస్తున్నాను.

స్నేహితులారా,

ప్రస్తుతం ఢిల్లీలో 75 లక్షల మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తోంది. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకం ఢిల్లీ ప్రజలకు మేలు చేస్తోంది. కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో రేషన్ కార్డు తెచ్చుకోవడం కూడా ఎంతో ప్రయాసతో కూడుకొని ఉండేది. పాత వార్తాపత్రికలు తిరగేస్తే ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొనేవారో మీకు తెలుస్తుంది. రేషన్ కార్డులు జారీ చేయడానికి సైతం ఈ ‘ఆప్-ద’ వ్యక్తులు లంచం డిమాండు చేస్తున్నారు. ఇప్పుడు ఈ అక్రమాల మార్గానికి అడ్డుకట్ట పడింది. రేషన్‌పై చేస్తున్న ఖర్చులో సైతం ఆదా చేయగలుగుతున్నాం.

మిత్రులారా,

ఢిల్లీలోని పేద, మధ్య తరగతి ప్రజలకు చౌక ధరల్లో ఔషధాలు అందించేందుకు గాను 500 జన ఔషధి కేంద్రాలను నగరంలో ప్రారంభించాం. ఈ కేంద్రాల్లో 80 శాతానికి పైగా రాయితీతో ఔషధాలు లభిస్తాయి. ఉదాహరణకు ఓ మెడిసిన్ ఖరీదు బయట రూ.100 ఉంటే ఇక్కడ అది కేవలం రూ.15 నుంచి రూ. 20 లోపే లభిస్తుంది.

స్నేహితులారా,

ఢిల్లీ ప్రజలకు ఉచితంగా వైద్య చికిత్సను అందించే ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలు అందించాలనుకుంటున్నాను. కానీ ఈ ‘ఆప్-ద’ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలపై తీవ్ర ద్వేషాన్ని పెంచుకొంది. ఆయుష్మాన్ భారత్ పథకం దేశమంతటా అమలవుతుంటే.. ఢిల్లీలో మాత్రం దాని అమలును ‘ఆప్-ద’ ప్రభుత్వం అడ్డుకుంది. ఫలితంగా ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో ముఖ్యమైన అంశమేంటంటే ఢిల్లీకి చెందిన వర్తకులు, నిపుణులు, యువత తరచూ దేశవ్యాప్తంగా ప్రయాణిస్తూ ఉంటారు. దేశంలో ఏ మూలకి వెళ్లినా సరే, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆయుష్మాన్ కార్డు ద్వారా వారు చికిత్స పొందవచ్చు. కానీ ఈ సదుపాయం ఢిల్లీ ప్రజలకు లేదు ఎందుకంటే, ఇక్కడి ‘ఆప్-ద’ ప్రభుత్వం ఆయుష్మాన్ పథకంతో అనుసంధానమయ్యేందుకు నిరాకరించింది. ప్రయాణ సమయాల్లో ఏదైనా జరిగినప్పటికీ నేను, మోదీని, మీకు సాయం చేయాలని భావిస్తున్నప్పటికీ ‘ఆప్-ద’ కారణంగా అలా చేయలేకపోతున్నాను.

స్నేహితులారా,

70ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు సైతం ఆయుష్మాన్ భారత్ సేవలు అందేలా బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని విస్తరించింది. ఇప్పుడు ఏ కుటుంబంలోనైనా సరే వృద్ధులైన తమ తల్లిదండ్రుల ఆరోగ్యరక్షణ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కొడుకు వారి సంక్షేమాన్ని పట్టించుకుంటాడు. కానీ ఢిల్లీలోని తన వృద్ధులైన తల్లిదండ్రులకు సేవ చేయాలని ఈ పుత్రుడు ఎంతగా పరితపించినా ఇక్కడి ‘ఆప్-ద’ ప్రభుత్వం కారణంగా దాన్ని చేయలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. వారు ఈ పథకం ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ఢిల్లీ వయోవృద్ధుల సంక్షేమం కంటే ‘ఆప్-ద’కు స్వార్థం, మూర్ఖత్వం, అహంకారమే ప్రధానంగా మారిపోయాయి.

మిత్రులారా,

ఢిల్లీ ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చాలా నిశిత దృష్టితో పనిచేస్తోంది. కొన్ని లక్షల మంది ఆందోళనలను తొలగిస్తూ ఎన్నో కాలనీలను క్రమబద్ధీకరించింది. కానీ ఈ ‘ఆప్-ద’ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నివాసితులందరినీ ‘ఆప్-ద’ బాధితులుగా మార్చేసింది. ఈ కాలనీల ప్రజలకు సాయం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా శిబిరాలను నిర్వహిస్తుంటే.. ‘ఆప్-ద’ ప్రభుత్వం వారికి కనీస అవసరాలైన తాగునీరు, మురగునీటి పారుదల వ్యవస్థలను కూడా కల్పించలేకపోయింది. ఫలితం, లక్షలాది మంది ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవడం, పగిలిన డ్రైనేజీలు, రోడ్ల మీద పారుతున్న మురికి నీటి కారణంగా లక్షలాది రూపాయలతో ఇళ్లు నిర్మించుకున్న ఢిల్లీ ప్రజలకు బాధ కలగడం సహజం. ఢిల్లీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన వారు, అబద్ధపు ప్రమాణాలు చేసిన వారు తమ కోసం ‘శీష్ మహల్’ (రాజసౌధం) నిర్మించుకున్నారు. దానికి పరిణామాలను త్వరలోనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ‘ఆప్-ద’ స్థానంలో బీజేపీ వస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

స్నేహితులారా,

ఎక్కడ ‘ఆప్-ద’ ప్రమేయం లేదో అక్కడ పనులన్నీ సమర్థంగా పూర్తయ్యాయని గుర్తుంచుకోవాలి. దీనికి ఉదాహరణే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ). డీడీఏలో ‘ఆప్-ద’ పాత్ర చాలా తక్కువ ఉండటంతో పేద, మధ్యతరగతి ప్రజలకు కొత్త ఇళ్లు నిర్మించగలిగాం. ఢిల్లీలోని ప్రతి ఇంటికీ పైప్ లైన్ల ద్వారా చౌకగా వంట గ్యాస్ అందించే నిమిత్తం చేపడుతున్న పనులు వేగంగా సాగుతున్నాయి. ‘ఆప్-ద’ జోక్యం దీనిలో లేకపోవడంతోనే ఇది సాధ్యమైంది. వారి ప్రమేయం లేకపోవడం వల్లే ఢిల్లీలో జాతీయరహదారులు, ఎక్స్‌ప్రెస్ వే పనులు సజావుగా కొనసాగుతున్నాయి.

మిత్రులారా,

ఈ ‘ఆప్-ద’ వారు ఢిల్లీ ప్రజలకు సమస్యలు సృష్టిస్తారు. కానీ బీజేపీ మాత్రం ఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కంకణం కట్టుకుంది. రెండు రోజుల క్రితమే ఢిల్లీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఈ నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు వారి విలువైన సూచనలను భారత ప్రభుత్వానికి అందించారు. వీటిలో శివ మూర్తి నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరువలోని నెల్సన్ మండేలా మార్గ్ వరకు సొరంగ నిర్మాణం, ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్ వేను కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వేతో అనుసంధానించడం, ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ వేను అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్డు-2తో అనుసంధానం, ఢిల్లీ కోసం తూర్పు భాగంలో బైపాస్ నిర్మించడం లాంటి ప్రతిపాదనలు ఉన్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించి, సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు సమీప భవిష్యత్తులో ఢిల్లీ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తాయి.

స్నేహితులారా,

ఈ 2025వ సంవత్సరం ఢిల్లీ సుపరిపాలన విధానంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. ‘దేశమే ప్రధానం, దేశ ప్రజలే ప్రధానం, నాకు ఢిల్లీ వాసులే ప్రధానం’’ అనే భావనను ఈ ఏడాది బలోపేతం చేస్తుంది. జాతి నిర్మాణం, ఢిల్లీలో ప్రజా సంక్షేమ రాజకీయాల్లో నూతన శకానికి ఈ ఏడాది నాంది పలుకుతుంది. దానికోసం మనం ‘ఆప్-ద’ను తొలగించి బీజేపీని తీసుకురావాలి. ‘ఆప్-ద’ను తొలగిద్దాం, బీజేపీని తీసుకొద్దాం, ఆప్-ద’ను తొలగిద్దాం, బీజేపీని తీసుకొద్దాం, ఆప్-ద’ను తొలగిద్దాం, బీజేపీని తీసుకొద్దాం.

ఇది జరగుతుందని విశ్వసిస్తూ, నూతన గృహాలు, కొత్త విద్యాసంస్థల విషయంలో మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

అందరూ నాతో కలసి చెప్పండి

భారత్ మాతాకీ - జై!



 

***


(Release ID: 2092265) Visitor Counter : 42