యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ జాతీయ యువజనోత్సవాలను ప్రకటించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


తమ ఆలోచనలను, లక్ష్యాలను నేరుగా ప్రధానమంత్రికి తెలియజేసే ప్రత్యేక అవకాశం: డాక్టర్ మాండవీయ
మై భారత్ వేదికగా వికసిత్ భారత్ ఛాలెంజ్ పోటీలు: ఈ నెల 25న డిజిటల్ క్విజ్ ప్రారంభం

భారత్ మండపంలో జరిగే ఈ కార్యక్రమానికి 3,000 మంది ప్రతిభావంతులైన యువతీ యువకులు

Posted On: 18 NOV 2024 2:33PM by PIB Hyderabad

ఈ ఏడాది సరికొత్త రూపంలో నిర్వహించనున్న యువజనోత్సవాల వివరాలను ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ మన్షుఖ్ మాండవీయ ప్రకటించారు. దేశ భవిష్యత్తులో యువతను భాగం చేయాలనే ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ పేరుతో దీనిని పిలుస్తున్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా యువత తమ ఆలోచనలను, దృక్పథాలను పంచుకునేందుకు ఇది క్రియాశీలక వేదికగా ఉపయోగపడుతుంది.

 

వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ముఖ్యోద్దేశాలను తెలియజేస్తూ ‘‘ఈ ఉత్సవాలు యువ ప్రతిభను పోత్సహించడానికీ, వికసిత్ భారత్‌ సాధన దిశగా వారి ఆలోచనలను పంచుకొనేందుకూ ఈ వేదిక ఆసరాగా ఉంటుంది’’ అని కేంద్రమంత్రి మన్షుక్ మాండవీయ అన్నారు. ఈ వేడుకల్లో ప్రధానమంత్రితో నేరుగా ముచ్చటించి, భారత్ భవిష్యత్తు కోసం తమ ఆలోచలను తెలియజేసే అవకాశం దక్కుతుంది. తద్వారా రాజకీయంగా, సామాజికంగా యువత భాగస్వామ్యాన్ని పెంచవచ్చు.

ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి సారిస్తూ ఈ ఏడాది ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ను రూపొందించినట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. మొదటిది, యువతను రాజకీయాల వైపు నడిపించడం. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువతీయువకులను ఈ రంగంలోకి తీసుకురావాలని అన్నారు. యువతలోని నాయకత్వ సామర్థ్యాన్ని గుర్తించి, ప్రోత్సహించడంతో పాటు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా తమ ఆలోచనలను పంచుకునే అవకాశాన్ని ఈ జాతీయ యువజనోత్సవాలు అందిస్తాయి.

రెండోది,  పారదర్శకమైన, ప్రజాస్వామ్యయుతమైన, ప్రతిభ ఆధారిత ఎంపిక విధానం ద్వారా వికసిత్ భారత్‌ దిశగా యువతను భాగస్వాములను చేయడం. ఈ కార్యక్రమం భారత్ పురోభివృద్ధిలో భాగం పంచుకొనే దిశగా తర్వాతి తరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికున్న నిబద్ధతను తెలియజేస్తుంది.

 

 

వికసిత్ భారత్‌ను నిర్మించడంలో యువతలోని శక్తిసామర్థ్యాలను వినియోగించుకొనేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలియజేస్తూ.. అర్హత కలిగిన యువత ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని డాక్టర్ మాండవీయ కోరారు.

వికసిత్ భారత్ ఛాలెంజ్ పరిచయం: నాలుగు దశలుగా పోటీ

వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ - జాతీయ యువజనోత్సవాలను పునర్నిర్వచిస్తూ, దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ‘వికసిత్ భారత్ ఛాలెంజ్’ ను నాలుగు దశల్లో నిర్వహిస్తారు. పోటీలు సాగే విధానం:

1.    మొదటి రౌండ్: వికసిత్ భారత్ క్విజ్

మేరా యువ భారత్ (మై భారత్) వేదికలో ఈ నెల 25 (నవంబర్ 25) నుంచి వచ్చే నెల 5 (డిసెంబర్ 5) వరకు నిర్వహించే డిజిటల్ క్విజ్‌లో వ్యక్తిగతంగా(15-29 ఏళ్ల వయసున్నవారు) పాల్గొంటారు. క్విజ్‌ ద్వారా వారి పరిజ్నానాన్ని, భారత్ సాధించిన విజయాలపై వారికున్న అవగాహనను పరీక్షిస్తారు.

2.    రెండో రౌండ్: వ్యాసం/బ్లాగు రచన

మొదటి రౌండ్‌లో విజేతలుగా నిలిచినవారు 'వికసిత్ భారత్ కోసం టెక్నాలజీ', 'వికసిత్ భారత్ దిశగా యువతను తీర్చిదిద్దడం’ లాంటి 10 రకాల అంశాలపై వ్యాసాలను సమర్పించాలి. వీటిలో దేశాభివృద్ధి సాధించే దిశగా తమ ఆలోచనలను ప్రతిఫలింపచేయాలి. ఈ పోటీని సైతం మై భారత్ వేదికలోనే నిర్వహిస్తారు.

3.    మూడో రౌండ్: విక్షిత్ భారత్ లక్ష్యం ఔన్నత్యం - రాష్ట్ర-స్థాయి ప్రదర్శనలు

రెండో రౌండ్‌లో క్వాలిఫై అయిన వారు ఎంపిక చేసుకున్న అంశాలపై రాష్ట్ర స్థాయిలో వారి ఆలోచనలను తెలియజేస్తారు. వీటి ద్వారా ప్రతి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు బృందాలను ఏర్పాటు చేస్తారు. వీరు జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన అంశాల్లో పోటీ పడతారు.

4.      నాలుగో రౌండ్: భారత్ మండపంలో వికసిత్ భారత్  జాతీయ ఛాంపియన్‌షిప్

వచ్చే ఏడాది జనవరి 11 - 12 తేదీలలో జరిగే జాతీయ యువజనోత్సవాల్లో వివిధ అంశాలపై రాష్ట్ర జట్లు పోటీపడతాయి. వీటిలో విజేతలుగా నిలిచినవారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో వికసిత్ భారత్ ను సాకారం చేసే దిశగా తమ ఆలోచనలను పంచుకుంటారు.

 

 

వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ – జాతీయ యువజనోత్సవాలు 2025లో మూడు విభిన్న విభాగాలుగా ఎంపిక చేసిన యువతతో అసెంబ్లీని నిర్వహిస్తుంది. మొదటి విభాగంలో వికసిత భారత్ ఛాలెంజ్ లో పాల్గొన్నవారు ఉంటారు. రెండో విభాగంలో జిల్లా, రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల నుంచి ఎంపికైన ప్రతిభావంతులు ఉంటారు. ఇక్కడ వారు చిత్రలేఖనం, సైన్స్ ఎగ్జిబిషన్లు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఉపన్యాసం తదితర విభాగాల్లో పోటీపడతారు. మూడో విభాగంలో వ్యాపారం, క్రీడలు, వ్యవసాయం, సాంకేతికత సహా విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించినవారు, యూత్ ఐకన్లు ఉంటారు.

జనవరి 11-12 తేదీల్లో న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే జాతీయ స్థాయి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ మూడు విభాగాల్లో 3,000 మంది యువతీయువకులను ఎంపిక చేస్తారు.

వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ – జాతీయ యువజనోత్సవాలు 2025కు సంబంధించిన ఇతర ప్రధానాంశాలు

ఈ కార్యక్రమంలో వికసిత్ భారత్ ఛాలెంజ్ తో  పాటు అనేకమైన ముఖ్యాంశాలుంటాయి.

1.    వికసిత్ భారత్ ఎగ్జిబిషన్: రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్న యువత కేంద్రీకృత కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం భారత్ అభివృద్ధిలో యువతను భాగం చేసేలా చర్చావేదికను అందిస్తుంది. దీనిలో విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార రంగంలో యువత-కేంద్రీకృత పథకాల గురించి తెలియజేస్తారు. అలాగే రాష్ట్రాలు, కేంద్రంమంత్రిత్వ శాఖలు ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేస్తాయి. ఇక్కడ వివిధ మంత్రిత్వ శాఖలు నాయకత్వం, సామాజిక ప్రభావం, ఆవిష్కరణల్లో యువతకున్న అవకాశాలు, శిక్షణ కార్యక్రమాల గురించి తెలియజేస్తాయి.

2.    చర్చా కార్యక్రమాలు: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన వారితో ఏర్పాటు చేసే చర్చాకార్యక్రమాలు, వర్క్ షాపుల్లో పాల్గొనే అవకాశాన్ని యువతకు కల్పిస్తుంది. తమ ఆలోచనలను పంచుకోవడంతో పాటు స్పూర్తిప్రదాతల నుంచి నేరుగా నేర్చుకొనే వీలును వారికి కల్పిస్తుంది.

3.      భారతదేశ సాంస్కృతిక వారసత్వ పండుగ: ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేశారు. "వికాస్ భీ, విరాసత్ భీ" దృక్పథం ఆధారంగా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ఈ వేడుకలు ప్రదర్శిస్తాయి. ఈ కళా ప్రదర్శనలు భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించేలా, చైతన్యం కలిగించేలా సాగుతాయి. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి యువతను ఈ వేడుకల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది.

 వికసిత్ భారత్ కోసం యువతను సిద్ధం చేయడం

‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ ఉత్సవం కంటే ఎక్కువ- ఇది దేశాభివృద్ధిలో చురుకైన భాగస్వామ్యం అందించేలా యువతను తీర్చిదిద్దే ఉద్యమం. వికసిత్ భారత్ ఛాలెంజ్ లాంటి కార్యక్రమాల ద్వారా, వారి ఆలోచనలను తెలియజేసేందుకు, ఆలోచనాపరులతో చర్చించేందుకు, అభివృద్ధి చెందిన భారత్ అనే లక్ష్యాన్ని సాధించేందుకు తమ వంతు సహకారం అందించే వేదికగా ఇది నిలవనుంది.

వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ – జాతీయ యువజనోత్సవాలు 2025కి సంబంధించిన అన్ని వివరాలు మై భారత్ ఆన్ లైన్ వేదికలో (https://mybharat.gov.in/) అందుబాటులో ఉంటాయి.

 

****


(Release ID: 2074465) Visitor Counter : 20