ప్రధాన మంత్రి కార్యాలయం
జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో రూ.80,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన... ప్రారంభం
దేశవ్యాప్తంగా 550 జిల్లాల్లోని సుమారు 63,000 గిరిజన గ్రామాలకు ప్రయోజనం చేకూర్చే ‘ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’కు శ్రీకారం; 40 ఏకలవ్య పాఠశాలలు ప్రారంభం... మరో 25 స్కూళ్లకు శంకుస్థాపన; ‘పిఎం-జన్మన్’ కింద బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపన... ప్రారంభోత్సవం; ‘‘గిరిజన సమాజానికి ప్రభుత్వమిస్తున్న ప్రాధాన్యానికి నేటి ప్రాజెక్టులే నిదర్శనం’’
Posted On:
02 OCT 2024 3:56PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో రూ.80,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్’ను ప్రారంభించారు. 40 ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల (ఇఎంఆర్ఎస్)కు ప్రారంభోత్సవంతోపాటు మరో 25 స్కూళ్లకు శంకుస్థాపన కూడా చేశారు. అలాగే ‘ప్రధానమంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పిఎం-జన్మన్) కింద అనేక ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- జార్ఖండ్ ప్రగతి పయనంలో తానొక భాగమయ్యేందుకు అవకాశమిచ్చారంటూ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి కొద్ది రోజులముందే జంషెడ్‌పూర్ పర్యటనలో తాను రూ.వందల కోట్ల విలువైన అభివృద్ధి పథకాలను ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద జార్ఖండ్‌లోని వేలాది పేదలకు పక్కా ఇళ్లు స్వాధీనం చేయడాన్ని శ్రీ మోదీ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నేడు గిరిజన సంక్షేమం, సాధికారతకు ఉద్దేశించిన రూ.80,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. గిరిజన సమాజానికి ప్రభుత్వమిస్తున్న ప్రాధాన్యానికి ఇది తిరుగులేని నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు నిలయమైన జార్ఖండ్ రాష్ట్రం సహా దేశ పౌరులందరికీ ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గిరిజన సంక్షేమంపై ఆయన దార్శనికత, ఆలోచనలు దేశానికి ఎంతో ప్రశస్తమైనవని అన్నారు. గిరిజనం వేగంగా పురోగమిస్తేనే దేశం కూడా ముందడుగు వేస్తుందని మహాత్మా గాంధీ విశ్వసించారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం గిరిజన అభ్యున్నతిపై అత్యధిక శ్రద్ధ చూపుతుండటం ఎంతో సంతృప్తి కలిగిస్తున్నదని శ్రీ మోదీ అన్నారు. ఇందులో భాగంగా నేడు ‘ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్’ను ప్రారంభించడాన్ని ప్రస్తావించారు. దీనికింద దేశవ్యాప్తంగా 550 జిల్లాల్లో సుమారు 63,000 గిరిజన ప్రాబల్యంగల గ్రామాలను దాదాపు రూ.80,000 కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ గ్రామాల్లో సామాజిక-ఆర్థిక జీవనం మెరుగుదలకు కృషి చేస్తామని, తద్వారా 5 కోట్ల మందికిపైగా గిరిజన సోదర సోదరీమణులకు లబ్ధి కలుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. అలాగే ‘‘ఈ పథకంతో జార్ఖండ్ గిరిజన సమాజం కూడా ఎంతో ప్రయోజనం పొందగలదు’’ అని పేర్కొన్నారు.
భగవాన్ బిర్సా ముండా పుట్టిన గడ్డనుంచి ఈ పథకం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా లోగడ జార్ఖండ్ నుంచే ‘పిఎం-జన్మన్ యోజన’కు శ్రీకారం చుట్టడాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో 2024 నవంబరు 15న గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం నాడు ఈ పథకం తొలి వార్షికోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఏడాది నుంచీ ‘పిఎం-జన్మన్’ యోజన ద్వారా దేశంలోని గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందుతుండగా, ఇవాళ రూ.1350 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడాన్ని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ నిధులతో అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో మెరుగైన జీవనం దిశగా విద్య, వైద్యం, రోడ్లు వంటి సౌకర్యాలు కల్పిస్తామని ఆయన ప్రకటించారు.
జార్ఖండ్‌లో ‘పిఎం-జన్మన్’ కింద తొలి ఏడాదిలో సాధించిన అనేక విజయాలను శ్రీ మోదీ వివరించారు. ఈ మేరకు 950కిపైగా వెనుకబడిన గ్రామాల్లో ఇంటింటికీ నీటి సరఫరా పనులు పూర్తయినట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలో 35 ‘వందన్ వికాస్’ కేంద్రాలకు ఆమోదం లభించిందని తెలిపారు. సుదూర గిరిజన ప్రాంతాలకు మొబైల్ అనుసంధానం దిశగా సాగుతున్న కృషిని కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. తద్వారా సమాన అవకాశాల సౌలభ్యంతో గిరిజన సమాజ పురోగమనానికి బాటలు పడతాయని చెప్పారు.
విద్య, తదనుగుణ అవకాశాల లభ్యత ద్వారానే గిరిజన సమాజ ప్రగతి సుగమం కాగలదని ప్రధాని ఉద్ఘాటించారు. అందుకే, గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య ఆశ్రమ పాఠశాలల నిర్మాణంలో ప్రభుత్వం నిమగ్నమైందని శ్రీ మోదీ చెప్పారు. ఈ కృషిలో భాగంగానే నేడు 40 పాఠశాలల ప్రారంభోత్సవం, మరో 25 స్కూళ్లకు శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. ఈ పాఠశాలల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని, ఉన్నత ప్రమాణాలతో విద్యనందించాలని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వం ప్రతి పాఠశాల బడ్జెట్‌ను దాదాపు రెట్టింపు చేసిందని ఆయన తెలిపారు.
మన కృషి సరైనదిగా ఉన్నపుడే సత్ఫలితాలు సాధ్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ చేయూతతో గిరిజన యువత ముందడుగు వేయగలదని, వారి శక్తిసామర్థ్యాలతో దేశం ప్రయోజనం పొందగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జార్ఖండ్ గవర్నర్ శ్రీ సంతోష్ గంగ్వార్, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జుయల్ ఓరమ్ తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
దేశవ్యాప్త గిరిజనుల సమగ్ర-సంపూర్ణ ప్రగతికి భరోసా ఇవ్వాలనే కట్టుబాటుకు అనుగుణంగా రూ.80,000 కోట్లతో ‘ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ను ప్రధానమంత్రి ప్రారంభించారు. దీనిద్వారా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 549 జిల్లాలు, 2,740 సమితుల పరిధిలోని 63,000 గ్రామాల్లోగల 5 కోట్ల మందికిపైగా గిరిజనులకు ప్రయోజనం చేకూర్చగలవు. కేంద్రంలోని 17 మంత్రిత్వ శాఖలు, విభాగాలు అమలు చేసే 25 కార్యక్రమాల ద్వారా సామాజిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, జీవనోపాధి సంబంధిత కీలక అంతరాలను సంతృప్త స్థాయిలో భర్తీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
ఇక గిరిజనులకు విద్యా మౌలిక సదుపాయాల పెంపు దిశగా ప్రధానమంత్రి 40 ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలను ప్రారంభించారు. దీంతోపాటు రూ.2,800 కోట్లతో నిర్మించే మరో 25 స్కూళ్లకు శంకుస్థాపన చేశారు.
మరోవైపు ‘పిఎం-జన్మన్’ కింద రూ.1360 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించగా, మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. వీటిలో 1380 కిలోమీటర్ల మేర రహదారులు, 120 అంగన్‌వాడీలు, 250 బహుళ ప్రయోజన కేంద్రాలు, 10 పాఠశాల హాస్టళ్లు ఉన్నాయి. అలాగే ఈ పథకం కింద సాధించిన అనేక విజయాలను ప్రకటించారు. ఈ మేరకు సుమారు 3,000 గ్రామాల్లో 75,800కుపైగా... ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాల (పివిటిజి) గృహాలకు విద్యుత్ సదుపాయం, 275 సంచార వైద్య యూనిట్ల నిర్వహణ, 500 అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, 250 అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు, వన్-ధన్ వికాస్ కేంద్రాలు, మొత్తం 5,550కిపైగా ‘పివిటిజి’ గ్రామాలకు సంతృప్త స్థాయిలో ‘నల్ సే జల్’ (కొళాయి ద్వారా నీరు) ఇళ్లకు నీటి సరఫరా వగైరాలను ప్రధాని ఉటంకించారు.
*****
MJPS/SR/TS
(Release ID: 2061336)
|