సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారతీయ సినిమా శిఖరాగ్రానికి చేరుకోవాలనే తాపత్రయం, పట్టుదల, కలల సాధనే మిథున్ దా ప్రయాణం
ప్రముఖ నటుడు మిథన్ చక్రవర్తికి 2022 కు దాదాసాహేబ్ ఫాల్కే జీవన సాఫల్య పురస్కారం
మిథున్ దా సినీ ప్రయాణం చాలా విశేషమైనది, స్ఫూర్తి దాయకమైనది; ఆయన అంకితభావం, కఠోర శ్రమ ఔత్సాహిక నటులు, కళాకారులకు ఆదర్శనీయం: శ్రీ అశ్వినీ వైష్ణవ్
ప్రఖ్యాత నటుడిగా తన సినీరంగ సేవలు, దాతృత్వం, ప్రజాసేవలో చేసిన కృషితో భావి తరాలకు ఆయన స్ఫూర్తి. ఎప్పటికీ నిలిచిపోనున్న కరుణ, ప్రతిభ
Posted On:
30 SEP 2024 9:58AM by PIB Hyderabad
ప్రఖ్యాత నటుడు శ్రీ మిథున్ చక్రవర్తికి 2022వ సంవత్సరానికి గానూ దాదాసాహేబ్ ఫాల్కే జీవన సాఫల్య పురస్కారం లభించింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన చిరస్మరణీయ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని కేంద్ర సమాచార, ప్రసార, రైల్వే, ఎలక్ట్రానిక్స్ ఆండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈవేళ ప్రకటించారు. బహుముఖ ప్రదర్శనలు, తెరపై ఆకర్షణీయమైన నటనకు పేరొందిన చలనచిత్ర పరిశ్రమలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన, దిగ్గజ వ్యక్తులలో ఒకరిని సత్కరించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇది గర్వంగా ఉందని పేర్కొన్నారు.
మిథున్ దా చిరస్మరణీయ ప్రయాణం
మిథున్ దా గా గుర్తింపు పొందిన మిథున్ చక్రవర్తి దిగ్గజ భారతీయ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. బహుముఖ పాత్రలు, విలక్షణమైన నృత్య శైలితో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినిమాల్లో ఆయన విభిన్నమైన పాత్రలు పోషించారు. నాటకీయ ప్రదర్శనల్లో, యాక్షన్ నిండిన పాత్రల్లో కనిపించారు.
యువకుడిగా నిరాడంబర అరంగేట్రం నుంచి దిగ్గజ సినీనటుడి వరకు మిథున్ చక్రవర్తి ప్రయాణం సాగిందని మంత్రి పేర్కొన్నారు. ఆయన ప్రయాణంలో ఆశ, పట్టుదలతో కూడిన స్ఫూర్తి కనిపిస్తుందని, అభిరుచి, అంకితభావంతో అత్యంత ప్రతిష్ఠాత్మక కలలను సైతం సాధించవచ్చని ఆయన రుజువు చేశారని అన్నారు. ఆయన అంకితభావం, కఠోర శ్రమ ఔత్సాహిక నటులు, కళాకారులకు ఆయనను ఆదర్శనీయుడిని చేసిందని పేర్కొన్నారు.
మిథున్ దా అసలు పేరు గౌరంగ్ చక్రవర్తి. 1950 జూన్ 16న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించారు. తన మొదటి సినిమా "మృగయా"(1976)తోనే ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ) పూర్వ విద్యార్థి అయిన మిథున్ చక్రవర్తి తన కళా నైపుణ్యానికి మెరుగులు దిద్దుకొని, సినిమాల్లో భవిష్యత్తుకు పునాది వేసుకున్నారు.
మృణాల్ సేన్ సినిమాలో సంతాల్ తిరుగుబాటుదారు పాత్ర ఆయనకు జాతీయ స్థాయిలో ఖ్యాతిని తీసుకొచ్చింది. "డిస్కో డాన్సర్"(1982) సినిమాలో తన పాత్రతో 1980లలో మిథున్ గణనీయమైన ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నారు. భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆయనను నృత్య సంచలనంగా మార్చింది. "డిస్కో డాన్సర్"(1982) సినిమాలో తన పాత్రతో ఆయన అందరికీ తెలిసిన నటుడిగా మారిపోయారు. ఆయన అసాధారణమైన నృత్య నైపుణ్యాలను ప్రదర్శించడంతో పాటు భారతీయ చలన చిత్ర రంగంలో డిస్కో సంగీతానికి ఈ సినిమా ప్రాచుర్యం తెచ్చింది. అగ్నిపీఠ్ సినిమాలో తన నటనతో ఆయన 1990లో ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని గెలుచుకున్నారు.
అనంతరం తహదెర్ కథ(1992), స్వామి వివేకానంద(1998)లో తన పాత్రలకు గానూ మరో రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలను కైవసం చేసుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్‌లో హిందీ, బెంగాలి, ఒడియా, భోజ్‌పురి, తెలుగు సహా వివిధ భారతీయ భాషల్లో 350కి పైగా చిత్రాల్లో మిథున్ నటించారు. యాక్షన్ నుంచి డ్రామా, కామెడీ వరకు విభిన్న ప్రదర్శనలకు ఆయన గుర్తింపు పొంది ఉత్తమ నటుడిగా మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలను గెలుచుకున్నారు.
మిథున్ దా మరో కీర్తి
మిథున్ దా కేవలం తన చలనచిత్ర విజయాలకే కాకుండా సామాజిక అంశాల పట్ల ఆయన అంకితభావానికి సైతం గుర్తింపు తెచ్చుకున్నారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. విద్య, వైద్యసేవలు, అణగారిన వర్గాలకు సాయం చేసే లక్ష్యంతో వివిధ సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని, సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆయన నిబద్ధతను ఇది చాటుతోందని అన్నారు. పార్లమెంటు సభ్యుడిగా ఆయన పని చేయడం ప్రజాసేవ, పరిపాలన పట్ల తన అంకితభావాన్ని చూపుతోందని పేర్కొన్నారు.
దాదాపు ఐదు దశాబ్దాల వృత్తి జీవితం మొత్తంలో మిథున్ చక్రవర్తి లెక్కకు మించిన అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. భారతీయ చలనచిత్రానికి విశేష సేవలు అందించి గుర్తింపు పొందారు. ఇందుకు గానూ ఇటీవలే ఆయనకు ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్ పురస్కారం సైతం లభించింది. డిస్కో డాన్సర్, ఘర్ ఏక్ మందిర్ వంటి అద్భుత చిత్రాలతో కూడిన తన చలనచిత్ర జీవితంలో ఆయన కోట్లాది మందికి వినోదాన్ని అందించడంతో పాటు బాలీవుడ్, ప్రాంతీయ సినిమాకు ఒక రూపం తీసుకొచ్చారు. ఆయన ప్రభావం కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాలేదు. చలనచిత్రాలతో పాటు దాతృత్వంలోనూ ఆయన భావి తరాల్లో స్ఫూర్తి నింపుతున్నారు.
వచ్చే నెల 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక సందర్భంగా ఆయనకు ఈ పురస్కారాన్ని అందిస్తారు. దాదాసాహేబ్ ఫాల్కే పురస్కార ఎంపిక కమిటీలో సభ్యులుగా ఉన్న వారు:
1. ఆశా పరేఖ్
2. ఖుష్బు సుందర్
3. విపుల్ అమృత్‌లాల్ షా
ప్రతిష్ఠాత్మక దాదాసాహేబ్ ఫాల్కే జీవనసాఫల్య పురస్కారం కేవలం మిథున్ చక్రవర్తి కళాత్మక గొప్పతనాన్నిమాత్రమే కాదు, అనేక మంది జీవితాల్లో మార్పు తెచ్చిన కరుణ, అంకితభావం గల వ్యక్తిగా ఆయన ఘనతకు సైతం దక్కిన గుర్తింపు.
***
(Release ID: 2060217)
Visitor Counter : 90
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada