హోం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో రేపు అధికార భాషా వజ్రోత్సవ వేడుకలు, 4వ అఖిల భారత రాజభాషా సమ్మేళన్ ప్రారంభ వేడుకలో ప్రసంగించనున్న కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్ఫూర్తితో, 2021 నుంచి ప్రతి ఏటా అఖిల భారతీయ రాజభాషా సమ్మేళనం నిర్వహిస్తున్న హోం శాఖ అధికార భాషా విభాగం
అధికార భాషా వజ్రోత్సవ సందర్భంగా ‘రాజ్‌భాషా భారతి’ పత్రిక... వజ్రోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించనున్న కేంద్ర హోంమంత్రి
వజ్రోత్సవాన్ని చిరస్మరణీయం చేసేందుకు స్మారక తపాళా బిళ్ల, నాణెం విడుదల చేయనున్న శ్రీ అమిత్ షా.
భారతీయ భాషా అనుభాగ్‌ను ప్రారంభించనున్న కేంద్ర హోం మంత్రి
హిందీ, భారతీయ భాషల అభివృద్ధి, వాటి మధ్య మెరుగైన సమన్వయం గురించి నిరంతరం ప్రస్తావిస్తున్న ప్రధాని మోదీ
హిందీతో పాటు భారతీయ భాషల వినియోగాన్ని ప్రోత్సహించడం, వాటి మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం భారతీయ భాషా అనుభాగ్ లక్ష్యం
Posted On:
13 SEP 2024 3:08PM by PIB Hyderabad
న్యూఢిల్లో రేపు నిర్వహించనున్న అధికార భాషా వజ్రోత్సవ వేడుకలు, 4వ అఖిల భారతీయ రాజ్‌భాషా సమ్మేళన్ ప్రారంభ వేడుకలో కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించనున్నారు. హిందీ అధికార భాషగా అవతరించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అధికార భాషా విభాగం 4వ అఖిల భారత రాజ్‌భాషా సమ్మేళనాన్ని సెప్టెంబరు 14-15 తేదీలలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తోంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్ఫూర్తితో, కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా సమర్థ మార్గదర్శకత్వంలో, హోం శాఖ అధికార భాషా విభాగం 2021 నుంచి ప్రతి ఏటా అఖిల భారత రాజ్‌భాషా సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది.
అధికార భాషా వజ్రోత్సవ సందర్భంగా ‘రాజ్‌భాషా భారతి’ వజ్రోత్సవ ప్రత్యేక సంచికను కేంద్ర హోంమంత్రి ఆవిష్కరించనున్నారు. వజ్రోత్సవాన్ని చిరస్మరణీయంగా మార్చేందుకు స్మారక తపాళా బిళ్ల, నాణెంను శ్రీ అమిత్ షా విడుదల చేస్తారు. ఈ సందర్భంగా రాజ్‌భాషా గౌరవ్, రాజ్‌భాషా కీర్తి పురస్కారాలను కూడా హోంమంత్రి అందజేయనున్నారు. దీనితో పాటు మరికొన్ని పుస్తకాలు, పత్రికలు విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి భారతీయ భాషా అనుభవ్‌ను ప్రారంభిస్తారు. హిందీ, భారతీయ భాషల అభివృద్ధి, వాటి మధ్య మెరుగైన సమన్వయం గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిరంతరం ప్రస్తావిస్తుంటారు. రాజ్యాంగం ఉద్దేశం, ప్రధానమంత్రి ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకొని, హిందీ సహా భారతీయ భాషల ఉపయోగాన్ని ప్రోత్సహించడం, వాటి మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో భారతీయ భాషా అనుభాగ్ ను ఏర్పాటు చేయాలని అధికార భాషా విభాగం, ఎంహెచ్ఎ ప్రతిపాదించింది.
2019లో దేశంలోని వివిధ నగరాల్లో హిందీ దివస్‌ను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర హోంమంత్రి సంకల్పించారు. ఈ పిలుపు మేరకు 2021లో వారణాసిలో హిందీ దివస్, మొదటి అఖిల భారత రాజ్‌భాషా సమ్మేళనం నిర్వహించారు. ఆ తరువాత హిందీ దివస్ అలాగే రెండో, మూడో అఖిల భారత రాజ్‌భాషా సమ్మేళన్ వేడుకలను వరుసగా 2022లో సూరత్‌లో, 2023లో పూణేలో నిర్వహించారు. ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అధికార భాషా సిబ్బంది, అధికారులలో కొత్త శక్తిని నింపాయి.
అధికార భాషా విభాగం వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంలో భారత రాజధానిలో హిందీ దివస్ కార్యక్రమం అలాగే నాలుగో అఖిల భారత రాజ్‌భాషా సమ్మేళన్ నిర్వహించడం ప్రత్యేకతను సంతరించుకుంది. హిందీ అధికార భాషగా మారిన ఈ 75 ఏళ్ల ప్రయాణంలో అనేక ముఖ్యమైన మైలురాళ్లతో పాటు సాంకేతిక రంగంలో నిరంతర పురోగతి సాధ్యమైంది.
రెండు రోజుల పాటు జరిగే ఈ అఖిల భారతీయ రాజ్‌భాషా సమ్మేళనంలో, గత 75 ఏళ్లలో అధికార భాష, ప్రజల భాష, సంప్రదింపుల భాషగా హిందీ పురోగతిపై లోతుగా చర్చించనున్నారు. సదస్సు తొలిరోజు సెప్టెంబరు 14న మధ్యాహ్న భోజనానంతర సెషన్‌లో 'అధికారిక భాషా వజ్రోత్సవం- 75 ఏళ్లలో అధికార భాష, ప్రజా భాష, సంప్రదింపుల భాషగా హిందీ పురోగతి' అనే అంశంపై చర్చ జరగనుంది. రెండవ సెషన్‌లో 'భారతదేశ సాంస్కృతిక వారసత్వం మరియు హిందీ' అనే అంశం గురించి ప్రముఖ హిందీ కవి, వక్త డా. కుమార్ విశ్వాస్ ప్రసంగిస్తారు.
సెప్టెంబరు 15న జరిగే సదస్సు మూడో సెషన్‌లో 'భాషా బోధనలో నిఘంటువు పాత్ర, దేవనాగరి లిపి ప్రత్యేకత' అనే అంశంపై దేశంలోని ప్రముఖ భాషావేత్తలు, నిఘంటువు రచయితలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. నాలుగో సెషన్ 'సాంకేతిక యుగంలో అధికార భాష హిందీ అమలులో "పట్టణ అధికార భాషా కమిటీ" సహకారం' అనే అంశంపై నిర్వహించనున్నారు.
అయిదో సెషన్ 'భారతీయ న్యాయ్ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినీయం 2023: ఒక చర్చ' అనే అంశంపై నిర్వహించనున్నారు. దీనిలో కేంద్ర చట్టం, న్యాయ శాఖా మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్ ప్రసంగిస్తారు. చివరి సెషన్‌లో 'ఇండియన్ సినిమా, హిందీ భాష అభివృద్ధికి శక్తిమంతమైన మాధ్యమం' గురించి చర్చించనున్నారు. దీనిలో ప్రఖ్యాత నటుడు శ్రీ అనుపమ్ ఖేర్, ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు శ్రీ చంద్రప్రకాష్ ద్వివేది ప్రసంగిస్తారు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ నిత్యానంద రాయ్, శ్రీ బండి సంజయ్ కుమార్, పార్లమెంటరీ అధికార భాషా కమిటీ వైస్-ఛైర్మెన్ శ్రీ భర్తృహరి మహతాబ్, ఇతర కమిటీ సభ్యులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల (పిఎస్‌యుల) ముఖ్య కార్యనిర్వాహక అధికారులు, దక్షిణ భారతదేశానికి చెందిన ఇద్దరు హిందీ పండితులు ప్రొఫెసర్ ఎమ్. గోవిందరాజన్, ప్రొఫెసర్ ఎస్.ఆర్. సర్రాజు, ఇద్దరు ప్రముఖ హిందీ భాషా పండితులు, ప్రొఫెసర్ సూర్యప్రసాద్ దీక్షిత్, డాక్టర్ హరిఓమ్ పన్వర్‌లు ప్రారంభ వేడుకలకు హాజరు కానున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశం నలుమూలల నుంచి రాజ్‌భాష అధికారులు, హిందీ పండితులు, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు సహా 10,000 మందికి పైగా పాల్గొనే అవకాశం ఉంది.
*****
(Release ID: 2055137)
Visitor Counter : 44
Read this release in:
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam