హోం మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలో ఐ4సి మొదటి వ్యవస్థాపక దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా


సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ జాతికి అంకితం, సమన్వయ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించనున్న హోం మంత్రి

'సైబర్ కమాండోస్' కార్యక్రమం, అనుమానిత రిజిస్ట్రీని ప్రారంభించనున్న శ్రీ అమిత్ షా

ప్రధాని మోదీ దార్శనికతను సాధించడంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలువనున్న 'సైబర్ సెక్యూర్(సురక్షిత) భారత్'

Posted On: 09 SEP 2024 6:21PM by PIB Hyderabad

కేంద్ర హోం  మంత్రి శ్రీ అమిత్ షా సెప్టెంబర్ 10న న్యూఢిల్లీలో ఐ4సి మొదటి వ్యవస్థాపక దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సైబర్ నేరాల రక్షణ కోసం పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

ఈ సమావేశంలో సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ (సీఎఫ్ఎంసీ)ను హోంమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక మధ్యవర్తి సంస్థలు, పేమెంట్ అగ్రిగేటర్లు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఐటీ మధ్యవర్తులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల (ఎల్ఇఎ) ప్రతినిధులతో న్యూఢిల్లీలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)లో సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్‌ని ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ ఆర్థిక నేరాల కట్టడి, తక్షణ చర్యలు, నిరంతర సహకారం కోసం వారు కలిసి పనిచేయనున్నారు. చట్ట అమలులో సహకార సమాఖ్య విధానానికి సీఎఫ్‌ఎంసీ ఒక ఉదాహరణగా నిలువనుంది.

కేంద్రమంత్రి అమిత్ షా సమన్వయ ప్లాట్‌ఫాం (జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేషన్ సిస్టం)ను కూడా ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు, డేటా షేరింగ్, నేర మ్యాపింగ్, డేటా అనలిటిక్స్, సహకార, సమన్వయ ప్లాట్‌ఫాం కోసం ఏకీకృత పోర్టల్‌గా పనిచేయడానికి ఈ సమన్వయ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేశారు.

కేంద్ర హోం మంత్రి 'సైబర్ కమాండోస్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కింద దేశంలో సైబర్ భద్రత ముప్పులను ఎదుర్కోవడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర పోలీసు సంస్థల్లో (సీపీఓ) శిక్షణ పొందిన 'సైబర్ కమాండోల' ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. శిక్షణ పొందిన సైబర్ కమాండోలు డిజిటల్ వ్యవస్థను సురక్షితంగా ఉంచడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ఏజెన్సీలకు సహాయపడతారు.

సస్పెక్ట్(అనుమానిత) రిజిస్ట్రీని కూడా అమిత్ షా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా, ఆర్థిక వ్యవస్థలో మోసపూరిత ప్రమాదాల నిర్వహణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి బ్యాంకులు, ఆర్థిక మధ్యవర్తుల సహకారంతో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఆధారంగా వివిధ గుర్తింపుదారుల అనుమానిత రిజిస్ట్రీని తయారు చేస్తున్నారు.

కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో, ఈ కార్యక్రమాలు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'సైబర్ సురక్షిత భారత్' సాకారాన్ని సాధించడంలో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలువనున్నాయి. కేంద్ర హోం శాఖలోని సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ (సీఐఎస్ డివిజన్) పరిధిలో కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)ను 2018 అక్టోబర్ 5న ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయి సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం దీని ప్రధాన లక్ష్యం. ఐ4సి లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల సామర్థ్యాలను పెంపొందించడం, సైబర్ నేరాలపై వ్యవహరించే వివిధ భాగస్వాముల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2020 జనవరి 10న న్యూఢిల్లీలోని ఐ4సీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. శాశ్వత సంస్థాగత రూపాన్ని ఇవ్వడానికి, 1, జూలై నుంచి, ఐ4సిని హోం శాఖ కింద అనుబంధ కార్యాలయంగా ఏర్పాటు చేశారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, డైరెక్టర్ ఐబీ, ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత), రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ ప్రభుత్వ సంస్థల అధికారులు, వివిధ బ్యాంకులు, ఆర్థిక మధ్యవర్తి సంస్థలు, మీడియా, సైబర్ కమాండోలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ కార్యక్రమం, సైబర్‌దోస్త్ ఆఫ్ ఐ4సీ అనే అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో సెప్టెంబర్ 10న 11.30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది.

 

***



(Release ID: 2053414) Visitor Counter : 22