మంత్రిమండలి
azadi ka amrit mahotsav

స్వర్గేట్ నుంచి కాత్రజ్ వ‌ర‌కూ 5.46 కిలోమీట‌ర్ల మేర పుణే మెట్రో మొద‌టి ద‌శ ప్రాజెక్ట్ పొడిగింపునకు కేంద్ర మంత్రి మండ‌లి ఆమోదం


ప్రాజెక్ట్ పూర్తి వ్యయం రూ.2954.53 కోట్లు. 2029 నాటికి పూర్తి కానున్న ప్రాజెక్ట్‌

Posted On: 16 AUG 2024 8:18PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేతృత్వంలో స‌మావేశ‌మైన మంత్రి మండ‌లి పుణే మెట్రో మొద‌టి ద‌శ ప్రాజెక్ట్ పొడిగింపునకు ఆమోదం తెలిపింది. పూణే మెట్రో ఫేజ్-1లో భాగంగా ప్రస్తుతం ఉన్న పీసీఎంసీ-స్వర్గేట్ మెట్రో లైన్ ను స్వర్గేట్ నుంచి కాత్రజ్ వ‌ర‌కు భూగ‌ర్భ మార్గాన్ని విస్తరిస్తారు. 5.46 కిలోమీటర్లున్న ఈ మార్గాన్ని లైన్-1 బీగా పిలుస్తారు.  ఇందులో మూడు భూగ‌ర్భ స్టేషన్లు ఉంటాయి. కీల‌క ప్రాంతాలైన మార్కెట్ యార్డ్‌, బిబ్వేవాడి, బాలాజీ న‌గ‌ర్, కాత్రజ్ సబర్బన్ ప్రాంతాలను అనుసంధానిస్తారు.

 

పుణేలో ఎలాంటి అడ్డంకులూ లేని ప్రయాణ సౌకర్యాన్ని అందించ‌డానికి ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇది 2029  ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వ‌స్తుంది. 

ప్రాజెక్ట్ అంచ‌నా వ్యయం రూ.2954.53 కోట్లు  కాగా, దీనిని కేంద్ర ప్రభుత్వం, మ‌హారాష్ట్ర ప్రభుత్వం స‌మానంగా సమకూర్చుతాయి. ఇందులో ఇరు పక్షాలకు చెందిన సంస్థలు కూడా నిధులు సమకూర్చుతాయి.

 

స్వర్గేట్ మ‌ల్టీ మోడ‌ల్ హ‌బ్ తో కలిసి ఉండే ఈ విస్తరణ వల్ల మెట్రో స్టేష‌న్, ఎంఎస్ ఆర్టీసీ బ‌స్టాండ్‌, పిఎంపిఎంఎల్ బస్టాండ్ లు కూడా అనుసంధానం అవుతాయి. పూణే వాసులకూ, పూణేకు వచ్చే వారికీ ప్రయాణం సులభసాధ్యం అవుతుంది.

 

దీనిద్వారా పుణే ద‌క్షిణ ప్రాంతం దాదాపు పూర్తిగా, ఉత్తర, తూర్పు, ప‌శ్చిమ ప్రాంతాల‌కు జిల్లా కోర్టు ఇంట‌ర్ ఛేంజ్ స్టేష‌న్ మీదుగా అనుసంధానం పెరుగుతుంది. పూణేలో తిరిగేందుకూ, పూణే నుంచి బయటకు వెళ్లే వారికి కూడా

సౌకర్యం పెరుగుతుంది.

 

స్వర్గేట్ నుంచి కాత్రజ్‌ వ‌ర‌కు నిర్మిస్తున్న ఈ భూగ‌ర్బ మార్గం  కార‌ణంగా ట్రాఫిక్ స‌మ‌స్యలు గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయి. ప్రమాదాలు, కాలుష్య నివారణ, ప్రయాణ స‌మ‌యాన్ని త‌గ్గించ‌డం ద్వారా భద్రమైన, మ‌రింత సౌకర్యవంతమైన  ప్రయాణం అందుబాటులోకి వ‌స్తుంది. త‌ద్వారా సుస్థిర పట్టణాభివృద్ధికి దోహ‌దం చేసినట్లు అవుతుంది.

 

ఈ కొత్త కారిడార్ వివిధ బస్టాప్‌లను, రైల్వే స్టేషన్లను, రాజీవ్ గాంధీ జూలాజికల్ పార్క్, తాల్జాయ్ హిల్లాక్ (టేక్డి), మాల్స్ మొదలైన వినోద కేంద్రాలను, వివిధ నివాస ప్రాంతాలను,  విద్యా సంస్థల్ని, కళాశాలల్ని,  ప్రధాన వ్యాపార కేంద్రాలను కలుపుతుంది. ఇది వేగవంతమైన, త‌క్కువ ఖ‌ర్చుతో కూడిన ర‌వాణా స‌దుపాయాన్ని అందిస్తుంది, రోజువారీ ప్రయాణికులకు, ముఖ్యంగా విద్యార్థులు, చిరు వ్యాపారుల‌కు, ఆయా ఆఫీసులు, వ్యాపార కేంద్రాల వద్దకు ప్రయాణం చేసే నిపుణులకు ప్రయోజనం చేకూరుస్తుంది. స్వర్గేట్-కాత్రజ్ లైన్‌లో రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 2027, 2037, 2047, 2057 సంవత్సరాల్లో వరుసగా 95,000,  1.58 లక్షలు,  1.87 లక్షలు, 1.97 లక్షలుగా అంచ‌నా వేశారు. 

 

సివిల్‌, ఎలెక్ట్రో మెకానిక‌ల్‌, ఇంకా ఇత‌ర అనుబంధ స‌దుపాయాలు, ప‌నుల‌ను పర్యవేక్షించే మ‌హా మెట్రో ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రి బిడ్ కార్యకలపాలను మ‌హా మెట్రో ప్రారంభించింది. టెండ‌ర్ ప‌త్రాల‌ను సిద్ధం చేస్తోంది. బిడ్డింగ్ కాంట్రాక్టుల‌ను త్వరలోనే అందుబాటులోకి తేనున్నది.

ఈ వ్యూహాత్మక విస్తరణ పుణే ఆర్థిక సామ‌ర్థ్యాన్ని పెంచుతుంది. త‌ద్వారా న‌గ‌ర మౌలిక‌స‌దుపాయాలు గ‌ణ‌నీయంగా పెరుగుతాయి. అది న‌గ‌ర సుస్థిరాభివృద్దికి దోహ‌దం చేస్తుంది.

 

***


(Release ID: 2046292) Visitor Counter : 43