ఆర్థిక మంత్రిత్వ శాఖ

గ్రామీణ ప్రాంతాల్లో గత తొమ్మిదేళ్లలో పేదల కోసం 2.63 కోట్ల ఇళ్ల నిర్మాణం


ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకంలో మహిళల భాగస్వామ్య రేటు 2019-20లో 54.8 శాతం కాగా, 2023-24లో 58.9 శాతానికి పెరిగింది.

Posted On: 22 JUL 2024 2:26PM by PIB Hyderabad

గ్రామీణ భారతంలో సమీకృత, సుస్థిరాభివృద్ధిని నెలకొల్పడం ప్రభుత్వ ప్రాధామ్యాలలో ముఖ్యమైనది. వికేంద్రీకృత ప్రణాళిక, మెరుగైన రుణ లభ్యత, మహిళా సాధికారత, ప్రాథమిక గృహనిర్మాణం, విద్య తదితరాల అంశాల ద్వారా సమగ్ర ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారించారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2024 ఈ విషయాన్ని తెలిపింది.

గ్రామీణ భారతంలో జీవన నాణ్యతను పెంపొందించడం

మౌలిక వసతుల కల్పన, విద్య, ఆరోగ్యం, ఆర్థిక సమ్మిళితం పరంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పురోగమించాయని ఆర్థిక సర్వే పేర్కొంది. మౌళిక సదుపాయాల విషయంలో, స్వచ్ఛభారత్ మిషన్- గ్రామీణ్ కింద 11.57 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్లు, జల్ జీవన్ మిషన్ కింద 10 జూలై 2024  నాటికి 11.7 కోట్ల ఇళ్లకు నల్లా కనెక్షన్ ఇచ్చినట్లు సర్వేలో వెల్లడించారు. పీఎం-ఆవాస్-గ్రామీణ్ లో గత తొమ్మిదేళ్లలో (2024 జూలై 10 నాటికి) పేదల కోసం 2.63 కోట్ల ఇళ్లను నిర్మించినట్లు సర్వే నివేదించింది.

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పిఎంజెడివై) కింద 26 జూన్ 2024 నాటికి 35.7 కోట్ల రూపే డెబిట్ కార్డులు జారీ చేయడం జరిగింది. ఆరోగ్య రంగంలో 1.58 లక్షల సబ్ సెంటర్లు, 24,935 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పెరిగాయి.

ఎంజిఎన్ఆర్ఇజిఎస్ భద్రత బలోపేతం, ఆధునీకరించడం

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లీకేజీలకు తావు లేదని సర్వే తెలిపింది. ఉపాధి కల్పను ముందు, లేదా పనులు చేస్తున్న సమయంలో, అనంతరం జియోట్యాగింగ్ జరుగుతోందని, 99.9 శాతం చెల్లింపులు నేషనల్ ఎలక్ట్రానిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా జరుగుతున్నాయని ఆర్థిక సర్వే పేర్కొంది.

ఉపాధి హామీ పథకం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 265.4 కోట్ల నుంచి 2023-24లో 309.2 కోట్లకు పెరిగిందని సర్వే వెల్లడించింది. మహిళా భాగస్వామ్య రేటు 2019-20లో 54.8 శాతంగా నమోదు కాగా 2023-24 నాటికి 58.9 శాతానికి పెరిగిందని సర్వే పేర్కొంది.

ఉపాధి హామీ పథకం 2019-20లో 265.4 కోట్ల నుంచి 2023-24లో 309.2 కోట్లకు పెరిగిందని, 2019-20లో 54.8 శాతంగా ఉన్న మహిళా భాగస్వామ్య రేటు 2019-20లో 58.9 శాతానికి పెరిగిందని సర్వే పేర్కొంది.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సుస్థిర జీవనోపాధి వైవిధ్యతన ప్రదర్శిస్తూ, ఒక ఆస్తి సృజన కార్యక్రమంగా అభివృద్ధి చెందిందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2014 ఆర్థిక సంవత్సరంలో పూర్తయిన మొత్తం పనులలో వ్యక్తిగత లబ్ధిదారుని వాటా 9.6 శాతం నుండి 2024 ఆర్థిక సంవత్సరంలో 73.3 శాతానికి పెరిగింది.

గ్రామీణ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను క్షేత్రస్థాయిలో సౌకర్యాల కల్పన

ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థాపకతకు వివిధ రూపాల్లో ప్రోత్సాహాకాన్ని అందిస్తోంది. సులభంగా లోన్లు పొందడం,  లాభదాయక మార్కెట్ అవకాశాలను సృష్టించడం వంటి శక్తివంతమైన ప్రణాళికలను అమలు చేయడం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బాసటగా నిలుస్తోంది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం), లఖ్‌పతి దీదీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ-జీకేవై) వంటి పథకాలు, కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కల్పనను పెంచాయి.

గ్రామీణ పాలన కోసం డిజిటలీకరణ కార్యక్రమాలు

ఈ-గ్రామ స్వరాజ్, స్వామిత్వ పథకం, భూ-ఆధార్ వంటి డిజిటలీకరణ కార్యక్రమాలు గ్రామీణ పాలనను మెరుగుపరిచాయి. స్వామిత్వ పథకం కింద 2.90 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసి 1.66 కోట్ల ప్రాపర్టీ కార్డులు సిద్ధం చేశారు. 2015-2021 మధ్య గ్రామీణ అంతర్జాల వినియోగదారులు 200 శాతం పెరగడం వల్ల గ్రామానికి, పరిపాలనా కేంద్రానికి మధ్య దూరం తగ్గుతుందని, ఇది ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది.

 

***



(Release ID: 2037083) Visitor Counter : 91