ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2024-25 బడ్జెట్‌లో మూలధన వ్యయం కోసం రూ.11,11,111 కోట్లు కేటాయింపు


రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రోత్సహించడానికి
దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాల కోసం రూ. 1.5 లక్షల కోట్ల కేటాయింపు

25,000 గ్రామీణ ఆవాసాలకు అన్ని-వాతావరణ పరిస్థితుల్లో కనెక్టివిటీని
అందించడానికి పీఎంజీఎస్వై 4వ దశ ప్రారంభానికి సిద్ధం

Posted On: 23 JUL 2024 12:43PM by PIB Hyderabad

ఆర్థిక వ్యవస్థలో మౌలిక సదుపాయాలను సమకూర్చడం, మెరుగుపరచడానికి సంబంధించి బలమైన గుణకార ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్‌లో 2024-25 బడ్జెట్‌ను సమర్పించారు. దీనిలో మూలధన వ్యయం కోసం రూ.11,11,111 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఇది దేశ జిడిపిలో 3.4 శాతంగా ఉంటుంది. రాబోయే 5 సంవత్సరాలలో మౌలిక సదుపాయాలకు బలమైన ఆర్థిక సహాయాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆర్థిక మంత్రి చెప్పారు.

.

అవస్థాపనకు సమానమైన మద్దతును అందించడానికి రాష్ట్రాలను ప్రోత్సహించడానికి, ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ సంవత్సరం దీర్ఘకాలిక వడ్డీ రహిత రుణాల కోసం రూ. 1.5 లక్షల కోట్ల కేటాయింపును ప్రకటించారు. ఇది మౌలిక సదుపాయాల కోసం రాష్ట్రాలకు వనరుల కేటాయింపులో మద్దతు ఇస్తుంది.

మౌలిక సదుపాయాలలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం గురించి మాట్లాడుతూ, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, విధానాలు, నిబంధనలను కల్పించడం ద్వారా ప్రైవేట్ రంగం ద్వారా మౌలిక సదుపాయాలలో పెట్టుబడిని ప్రోత్సహిస్తామని సీతారామన్ చెప్పారు. మార్కెట్ ఆధారిత ఫైనాన్సింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురానున్నట్లు ఆమె పేర్కొన్నారు.

జనాభా పెరుగుదల దృష్ట్యా అర్హత పొందిన 25,000 గ్రామీణ ఆవాసాలకు అన్ని వాతావరణ పరిస్థితుల్లో కనెక్టివిటీని అందించడానికి, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజిఎస్వై) 4వ దశను ప్రారంభించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

శ్రీమతి సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో నీటిపారుదల, వరద నిర్వహణ కోసం మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి పెట్టారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో నష్టపోయిన పలు రాష్ట్రాలకు ఆమె ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

కోసి-మెచి ఇంట్రా-స్టేట్ లింక్, బ్యారేజీలు, నదుల కాలుష్య నివారణ, నీటిపారుదల ప్రాజెక్టులతో సహా కొనసాగుతున్న, కొత్తవి 20 పథకాలకు సంబంధించిన ప్రాజెక్టులకు  రూ. 11,500 కోట్ల అంచనా వ్యయంతో  ఆర్థిక సహాయాన్ని మంత్రి ప్రకటించారు. అదనంగా, కోసికి సంబంధించిన వరద ఉపశమన, నీటిపారుదల ప్రాజెక్టుల సర్వే, విచారణ చేపట్టనున్నట్లు ఆమె చెప్పారు.

భారతదేశం వెలుపల ఉద్భవించే బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదుల ద్వారా అస్సాంలో వరదలు సంభవించే సాధారణ సందర్భాలను కూడా సీతారామన్ ప్రస్తావించారు. "మేము వరద నిర్వహణ, సంబంధిత ప్రాజెక్టుల కోసం అస్సాంకు సహాయం అందిస్తాము" అని ఆమె ఉద్ఘాటించారు.

వరదలు, భారీ కొండచరియలు విరిగిపడడం వల్ల హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లు తీవ్రంగా నష్టపోయాయని ఆర్థిక మంత్రి ప్రస్తావిస్తూ, పునర్నిర్మాణం, పునరావాసం కోసం రాష్ట్రాలకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పారు. సిక్కింలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన విధ్వంసాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆమె సిక్కిం రాష్ట్రానికి కూడా సహాయం ప్రకటించారు. 

 

***


(Release ID: 2036615) Visitor Counter : 180