ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఇటీవలి కాలంలో భారతదేశంలో మౌలిక సదుపాయాల విస్తరణ గణనీయమైన వృద్ధిని సాధించింది : ఆర్థిక సర్వే 2023-24
వ్యూహాత్మక ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యం పెరిగిన ఫలితంగానే మన్నికైన, సమర్థవంతమైన మౌలిక సదుపాయాలుగా రహదారుల నెట్‌వర్క్ సిస్టమ్ మెరుగుపరచబడింది
2014 ఆర్థిక సంవత్సరంలో రోజుకు 11.7 కిలోమీటర్లుగా ఉన్న జాతీయ రహదారుల నిర్మాణ సగటు వేగం 2024 ఆర్థిక సంవత్సరానికి రోజుకు 34 కిలోమీటర్లకు పెరుగుతుంది
గత 5 సంవత్సరాలలో రైల్వేలపై 77 శాతం పెరిగిన మూలధన వ్యయం
2024 ఆర్థిక సంవత్సరంలో లోకోమోటివ్స్, వేగన్స్ రెండింటిలోనూ రైల్వేస్ తన అత్యధిక ఉత్పత్తిని సాధించింది
Posted On:
22 JUL 2024 3:22PM by PIB Hyderabad
గత ఐదేళ్లలో పెరిగిన ప్రజల భాగస్వామ్యంతో, భారతదేశం భౌతిక, డిజిటల్ కనెక్టివిటీలో అలాగే పారిశుద్ధ్యం, నీటి సరఫరా సహా ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడే సామాజిక మౌలిక సదుపాయాలలో గణనీయమైన విస్తరణను సాధించినట్లు ఈరోజు పార్లమెంటులో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2023-24 చెబుతున్నది. మహమ్మారి కారణంగా నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన చర్యలలో, ప్రత్యేకించి అధిక నాణ్యమైన భౌతిక, సామాజిక మౌళిక సదుపాయాల కల్పన లక్ష్యంగా మూలధన వ్యయాన్ని పెంచడం ప్రధానమైనదని సర్వే పేర్కొన్నది. గత ఐదేళ్లలో ఇదే వేగాన్ని కొనసాగిస్తూ, 2020 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ మూలధన వ్యయం దాదాపు మూడు రేట్లు పెరిగిందని సర్వే పేర్కొంది. ప్రధాన మౌళిక రంగాలైన రహదారులు, రైల్వేలకు దీని ద్వారా ప్రధానంగా ప్రయోజనం చేకూరినట్లు సర్వే తెలిపింది.
రహదారుల మౌలిక సదుపాయాలు:
వ్యూహాత్మక ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యం పెరిగిన ఫలితంగా రహదారుల నెట్‌వర్క్ వ్యవస్థ మన్నికైన, సమర్థవంతమైన మౌళిక సదుపాయంగా ఎదిగినదని ఆర్థిక సర్వే పేర్కొన్నది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మూలధన పెట్టుబడి 2015 ఆర్థిక సంవత్సరంలో 0.4 శాతం ఉండగా అది 2024 ఆర్థిక సంవత్సరానికి జి.డి.పిలో 1.0 శాతానికి (సుమారు ₹3.01 లక్షల కోట్లు) పెరిగింది. ప్రైవేట్ రంగానికి అనుకూలమైన విధానాల వల్ల ఈ రంగం 2024 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించినట్లు సర్వే తెలిపింది.
జాతీయ రహదారుల అభివృద్ధిలో గణనీయమైన పురోగతిని ప్రస్తావిస్తూ, గత పదేళ్లలో 2014 నుండి 2024 వరకు జాతీయ రహదారుల అభివృద్ధి 1.6 రేట్లు పెరిగినట్లు సర్వే పేర్కొన్నది. భారత్‌మాల పరియోజన జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను గణనీయంగా విస్తరించిందని, ఇది 2014 నుండి 2024 మధ్య కాలంలో హై-స్పీడ్ కారిడార్‌ల పొడవును 12 రేట్లు, 4-లేన్ రహదారులను 2.6 రేట్లు పెంచినట్లు సర్వే తెలిపింది. ఇంకా, కారిడార్ ఆధారిత జాతీయ రహదారుల అభివృద్ధి విధానం ద్వారా అందించబడిన ప్రోత్సాహంతో జాతీయ రహదారుల నిర్మాణ సామర్థ్యం మెరుగుపడిన విషయాన్ని సర్వే ప్రస్తావించినది. జాతీయ రహదారుల సగటు నిర్మాణ వేగం 2014 ఆర్థిక సంవత్సరంలో రోజుకు 11.7 కిలోమీటర్లు ఉండగా 2024 నాటికి రోజుకు 34 కిలోమీటర్లకు అంటే 3 రేట్లు పెరిగినట్లు సర్వే తెలియజేసినది. జాతీయ రహదారుల నెట్‌వర్క్ మెరుగుదల లాజిస్టిక్స్ సామర్థ్యంలో గణనీయమైన పురోగతికి కారణమైనట్లు సర్వే గుర్తించినది, ఈ రంగంలో ప్రపంచ బ్యాంక్ యొక్క 'లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో భారతదేశ ర్యాంకింగ్ 2014 నుండి 2018 కాలంలో 54 నుండి 44వ స్థానానికి, 2018 నుండి 2023 కాలంలో 44 నుండి 38వ స్థానానికి చేరడం ఈ రంగం యొక్క నిరంతర వృద్ధికి నిదర్శనం అని సర్వే పేర్కొన్నది.
లాజిస్టిక్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడానికి, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (ఎం.వో.ఆర్.టి&హెచ్) ప్రత్యేకంగా మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్కులను (ఎం.ఎం.ఎల్.పి) ఏర్పాటు చేసినట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. 2024 ఆర్థిక సంవత్సరం వరకు ఇది మొత్తం ఆరు మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్కులను (ఎం.ఎం.ఎల్.పిలు) కలిగి ఉండగా 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ల (ఎం.ఎం.ఎల్.పిలు) కోసం ₹2,505 కోట్లు కేటాయించబడినవి. ఇంకా, 2025 ఆర్థిక సంవత్సరంలో మరో ఏడు మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సర్వే తెలిపింది.
రైల్వేల మౌలిక సదుపాయాలు
ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం, భారతీయ రైల్వేలు ఒకే యాజమాన్యం కింద 68,584 కిలోమీటర్ల రైలు మార్గాన్ని (31 మార్చ్ 2024 నాటికి) అలాగే 12.54 లక్షల మంది ఉద్యోగులను (1 ఏప్రిల్ 2024 నాటికి) కలిగి ఉండి, ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్‌వర్క్‌గా నిలిచాయి. కొత్త లైన్స్ నిర్మాణం, గేజ్ మార్పిడి, డబ్లింగ్ పనుల కోసం గణనీయమైన పెట్టుబడులతో రైల్వేపై మూలధన వ్యయం గత 5 సంవత్సరాల్లో (2024 ఆర్థిక సంవత్సరంలో ₹2.62 లక్షల కోట్లు) 77 శాతం పెరిగిందని సర్వే పేర్కొంది.
రైల్వేలు 2024 ఆర్థిక సంవత్సరంలో లోకోమోటివ్‌లు, వేగన్‌ల కోసం అత్యధిక ఉత్పత్తిని సాధించినట్లు సర్వే పేర్కొంది. 2024 మార్చ్ నెల వరకు 51 జతల వందే భారత్ రైళ్లను ప్రారంభించినట్లు సర్వే తెలిపింది. భూసేకరణను, అనుమతులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిరంతరం ప్రాజెక్టు పర్యవేక్షణ, సంబంధిత వ్యక్తులతో సంప్రదింపులతో పాటు ఆర్థిక కేటాయింపుల్లో గణనీయమైన పెరుగుదల ఫలితంగా మౌలిక సదుపాయాల మెరుగుదల వేగవంతమైనట్లు సర్వే తెలిపింది.
రైల్వే స్టేషన్స్, రైళ్లలో అలాగే వాటి పరిసరాలలో పరిశుభ్రమైన వాతావరణం కోసం రైల్వే చేపట్టిన కార్యక్రమాలలో, రైలు మార్గాలు శుభ్రంగా ఉండేందుకు కోచ్‌లలోని సంప్రదాయిక టాయిలెట్స్ స్థానంలో బయో-టాయిలెట్స్ ఏర్పాటు, బయో-డిగ్రేడెబుల్/నాన్ బయోడిగ్రేడెబుల్ వ్యర్థాలను వేరు చేయడం, ఘన వ్యర్థాల నిర్వహణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాలను సర్వే ప్రస్తావించినది.
2023-24 ఆర్థిక సర్వే ప్రకారం రైల్వేలు ప్రధానంగా సామర్థ్యం పెంపును వేగవంతం చేయడం, రోలింగ్ స్టాక్, దాని నిర్వహణను ఆధునీకరించడం, సేవల నాణ్యతను, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి కీలకమైన అంశాలపై దృష్టి సారించాయి. దీనికి అనుగుణంగా, ప్రత్యేక ఫ్రైట్ కారిడార్లు, హైస్పీడ్ రైళ్లు, వందేభారత్, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, ఆస్తా ప్రత్యేక రైళ్ల వంటి ఆధునిక ప్రయాణికుల సేవలు, అధిక సామర్థ్యం గల రోలింగ్ స్టాక్, లాస్ట్ మైల్ రైల్ లింకేజీల వంటి రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వబడినట్లు సర్వే పేర్కొంది. లాజిస్టిక్స్ ఖర్చులు, కర్భన ఉద్గారాలను తగ్గించడానికి, మూడు ప్రధాన కారిడార్లు (1) అధిక రద్దీ గల కారిడార్లు, (2) ఇంధనం, ఖనిజాలు, సిమెంట్ కారిడార్లు, (3) రైల్ సాగర్ (ఓడరేవులతో అనుసంధానించబడినవి) కారిడార్ ప్రాజెక్టుల కోసం కూడా ప్రణాళికలు రూపొందించబడిట్లు సర్వే తెలిపింది. సర్వే ప్రకారం, రైల్వే కర్భన ఉద్గారాల తగ్గింపు కోసం ప్రధానంగా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఇంధనాన్ని పొందాలని యోచిస్తుంది అలాగే 2029-30 నాటికి దాదాపు 30 గిగా వాట్స్ పునరుత్పాదక సామర్థ్యాన్ని ఇది సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. డీజిల్ నుండి విద్యుత్ ట్రాక్షన్‌కు మారడం, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం, అడవుల పెంపకం వంటివి సర్వే పేర్కొన్న ఇతర వ్యూహాలుగా ఉన్నాయి.
***
(Release ID: 2035458)
Visitor Counter : 351