సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
గోవాలో నవంబర్ 20 నుంచి 24 దాకా సాగే ప్రపంచ దృశ్య-శ్రవణ వినోద మహా సమ్మేళనానికి భారత్ ఆతిథ్యం
‘వేవ్స్’ సరంజామా.. ‘ఐఎఫ్ఎఫ్ఐ’ సాదృశ నైపుణ్యం భారత్‌ను
సృజన-ప్రతిభకు కీలక కూడలిగా రూపొందిస్తాయి: శ్రీ వైష్ణవ్;
ఉపాధి కల్పనపై ప్రభుత్వ దృష్టి; అధిక నాణ్యతతో సారాంశ సృష్టిని ప్రోత్సహించే పర్యావరణ వ్యవస్థ రూపకల్పన దిశగా నిర్మాణాత్మక-ప్రక్రియ పరమైన కృషి
Posted On:
13 JUL 2024 5:19PM by PIB Hyderabad
ఈ ఏడాది నవంబరు 20 నుంచి 24వ తేదీవరకూ గోవాలో నిర్వహించే ‘ప్రపంచ దృశ్య-శ్రవణ వినోద మహా సమ్మేళనం’ (వేవ్స్) కార్యక్రమానికి భారత్ ఆతిథ్యం ఇస్తున్నదని కేంద్ర సమాచార- ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఇవాళ ప్రకటించారు. ఈ వేడుకను ప్రపంచవ్యాప్త మీడియా-వినోద పరిశ్రమ (ఎం అండ్ ఇ)కు ఒక మైలురాయిగా ఆయన అభివర్ణించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో మంత్రి ఈ మేరకు ప్రకటించారు. గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్, కేంద్ర సమాచార-ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ కూడా ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ అశ్వనీ వైష్ణవ్ మాట్లాడుతూ- ‘‘మీడియా-వినోద ప్రపంచం ఇటు సమూల మార్పులకు లోనవుతుంటే, అటు అపార సాంకేతిక పరిజ్ఞానం చొచ్చుకొస్తోంది. దీనివల్ల ఒకవైపు అనేక అవకాశాలు అందివస్తున్నప్పటికీ, మరోవైపు మార్పు వేగాన్ని అందుకోలేని కొందరు భాగస్వాములలో ఆందోళన పెల్లుబుకుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ మార్పుల పరంపరలోని అత్యుత్తమ పద్ధతుల స్వీకరణలో ప్రభుత్వ విధానం నేడు తనవంతు పాత్ర పోషించాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ మార్పును జీర్ణించుకోవడంలో మీడియా-వినోద రంగాల పర్యావరణ వ్యవస్థ మొత్తానికీ ప్రభుత్వం చిత్తశుద్ధితో మద్దతిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ లక్ష్య సాధనకుగల మార్గాలు, తదనుగుణ చర్యలను వివరిస్తూ... మీడియా-వినోద రంగంలో ఉపాధి సృష్టిపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా సృజన, ప్రతిభలకు పదును పెట్టే అంశానికీ ప్రాధాన్యం ఇస్తోందని, నిర్మాణాత్మక-విధానపరమైన కృషితో ఈ ప్రణాళికను అమలు చేస్తుందని తెలిపారు. అత్యుత్తమ నాణ్యతగల సారాంశ సృష్టిని ప్రోత్సహించే విధంగా దేశంలో మేధాసంపత్తి (ఐపి) హక్కుల సృష్టి-పరిరక్షక పర్యావరణ వ్యవస్థ రూపకల్పనకు ఈ కృషి భరోసా ఇస్తుందన్నారు. తద్వారా భారతదేశాన్ని తమ సారాంశ సృష్టి కేంద్రాల ఏర్పాటుకు సహజ కేంద్రంగా ప్రపంచం గుర్తించేలా చేస్తామని తెలిపారు.
అయితే, ఈ లక్ష్య సాధనలో ‘ఎం అండ్ ఇ’ పరిశ్రమ-ఆర్థిక రంగం-సాంకేతిక ప్రపంచ త్రయం మధ్య సమన్వయంతో కూడిన సమష్టి కృషి అవసరమని ఆయన స్పష్టం చేశారు. లోతైన ఆలోచనతో రూపొందించే విధానాలతోపాటు రాబోయే కాలంలో ప్రభుత్వం-పరిశ్రమ తమవంతుగా సంయుక్త కృషిని కూడా జోడించగలవని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
‘వేవ్స్’, ‘భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’ (ఐఎఫ్ఎఫ్ఐ) ఒకే పట్టకంలోగల రెండు భాగాలని మంత్రి పేర్కొన్నారు. ఆ మేరకు ‘వేవ్స్’ మహా సమ్మేళనం సరంజామా (ఇన్‌పుట్) సమకూరిస్తే, ‘ఐఎఫ్ఎఫ్ఐ’ సాదృశ నైపుణ్యం (అవుట్‌పుట్) దాన్ని ప్రతిఫలింపజేస్తుందని పేర్కొన్నారు. ఈ ఇన్‌పుట్-అవుట్‌పుట్‌ల సమ్మేళనంతో సృజనాత్మకత-ప్రతిభలకు గోవా ప్రధాన కూడలి కాగలదన్నారు. తద్వారా ఆవిష్కరణ-కళాత్మకతల వ్యక్తీకరణకు వెలుగు బాటలు పరచి, తన స్థానాన్ని పటిష్టం చేసుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పట్టకంలోని రెండు భాగాలూ కలగలిసేలా ‘ఐఎఫ్ఎఫ్ఐ’తో సమాంతరంగా ‘వేవ్స్-2024’కు ఆతిథ్యానికి ప్రణాళిక రూపొందించారంటూ గోవా ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రముఖులతో కలసి ‘వేవ్స్’ వెబ్‌సైట్ (https://wavesindia.org/) ప్రారంభంతోపాటు మహా సమ్మేళనం కరదీపికను మంత్రి ఆవిష్కరించారు.
గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ- చలనచిత్ర రంగ అపూర్వ ప్రతిభకు ‘ఐఎఫ్ఎఫ్ఐ’ చిరకాలం నుంచీ మార్దదర్శిగా ఉన్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత వర్ధమాన ‘ఎం అండ్ ఇ’ రంగంపై దృష్టి సారిస్తూ రెండు పరిశ్రమల మధ్య సన్నిహిత సహకారం దిశగా ‘వేవ్స్’ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని తెలిపారు. అపార భవిష్యత్ అవకాశాలతో దూసుకెళ్లడానికి ఈ రెండు వేడుకలూ బాటలు వేస్తాయన్నారు. ‘వేవ్స్’ నిర్వహణ ద్వారా కీలక సాంస్కృతిక కేంద్రంగా గోవా మరింత ప్రాచుర్యం పొందగలదని చెప్పారు. అందువల్ల ఆవిష్కరణ-సహకార స్ఫూర్తితో గోవాకు తరలి రావాలని ‘ఎం అండ్ ఇ’ రంగానికి శ్రీ సావంత్ ఆహ్వానం పలికారు.
ఈ పరిశ్రమలోని ప్రపంచవ్యాప్త అగ్రశ్రేణి సంస్థలను భారతదేశానికి రప్పించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను ‘వేవ్స్-2024’ సాకారం చేయగలదని సమాచార-ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ తన ప్రసంగంలో ఆశాభావం వెలిబుచ్చారు. దేశంలో ఈ రంగం వృద్ధికి తగిన స్థాయిలో నిపుణ మానవ వనరులు సమకూరే దిశగా ప్రోత్సహించడంలో ఈ వేడుక ఒక వేదిక కాగలదన్నారు.
మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు ప్రసంగిస్తూ- అంతర్జాతీయ స్థాయి ‘ఎం అండ్ ఇ’ సమ్మేళనం రూపకల్పనే ‘వేవ్స్’ వేడుక లక్ష్యమన్నారు. అలాగే ‘‘భారతదేశం ఆర్థికంగా ఎదుగుతున్న నేపథ్యంలో మన మృదుశక్తిని మరింత బలోపేతం చేసుకోవాలన్నదే ఈ వేడుక లక్ష్యం. తదనుగుణంగా సృజన, ఆవిష్కరణ, ప్రపంచవ్యాప్త ప్రభావాల రీత్యా ఇది కొత్త ప్రమాణాలను నెలకొల్పగలదని ఆశిస్తున్నాం’’ అన్నారు. ఆవిష్కరణ-సాంకేతిక ప్రగతిని ఇనుమడింపజేయడం, మన పరిశ్రమలో అంతర్జాతీయ పోటీతత్వం పెంపు, పరిశ్రమల మధ్య సహకార బలోపేతం, పెట్టుబడులను ఆకర్షించడం, నైపుణ్యాభివృద్ధికి ఉత్తేజం, సారాంశ వైవిధ్యం, సుస్థిర వృద్ధికి ప్రోత్సాహం వంటి లక్ష్యాల సాధనలో ఈ మహా సమ్మేళనం నిర్ణయాత్మకం కాగలదన్నారు.
ఈ మహా సమ్మేళనం ద్వారా సద్వినియోగం చేసుకోగల అవకాశాలను కార్యదర్శి వివరించారు. ఈ మేరకు సారాంశ రూపకల్పన-ఆవిష్కరణ, యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్ (ఎవిజిసి)సహా సంగీత, మేధాసంపద (ఐపి) సృష్టి వంటివి ఇందులో కీలకాంశాలని తెలిపారు.
నానాటికీ వృద్ధి చెందుతున్న ‘ఎం అండ్ ఇ’ పరిశ్రమ రంగంలో సంప్రదింపులు, వాణిజ్య సహకారం, ఆవిష్కరణలను ప్రోత్సహించే ఒక ప్రధాన వేదికగా నిలవాలన్నది ‘వేవ్స్’ నిర్వహణ లక్ష్యం. ఆ మేరకు అవకాశాల అన్వేషణ, సవాళ్లకు పరిష్కారం, భారత్ వైపు వాణిజ్యాకర్షణ సహా ఈ రంగం భవిష్యత్తు రూపకల్పన దిశగా పరిశ్రమలోని అగ్రశ్రేణి సంస్థలు, భాగస్వాములు, ఆవిష్కర్తలను ఇది ఒకే తాటిపైకి తెస్తుంది.
గతిశీల ‘ఎం అండ్ ఇ’ రంగంలో భారతదేశాన్ని అసమాన అంతర్జాతీయ శక్తిగా నిలపడంపై ‘వేవ్స్’ దృష్టి సారించింది. ఇందులో భాగంగా సృజన, ఆవిష్కరణ, ప్రపంచవ్యాప్త ప్రభావం రీత్యా సరికొత్త అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పాలని లక్ష్యనిర్దేశం చేసుకుంది. దీంతోపాటు ‘వేవ్స్’ అత్యున్నత వేదిక ద్వారా ప్రత్యేక పెట్టుబడి అవకాశాలతో అంతర్జాతీయ ‘ఎం అండ్ ఇ’ అగ్రశ్రేణి సంస్థలకు సాధికారత కల్పించడం దీని ధ్యేయం.
ఈ కార్యక్రమంలో ట్రాయ్ చైర్‌పర్సన్, శ్రీ అనిల్ కుమార్ లోహతి, గోవా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ పునీత్ కుమార్ గోయల్ సహా వివిధ విదేశీ దౌత్య కార్యాలయాల రాయబారులు, దౌత్య ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
సన్నాహక కార్యక్రమంలో భాగంగా ‘వేవ్స్’ లోగో, వెబ్‌సైట్, బ్రోచర్ ఆవిష్కరణ అనంతరం ‘సీఈవో’ల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగాగల 60 సంస్థలు, సంఘాలు, పారిశ్రామిక సంస్థల నుంచి బ్రాడ్‌కాస్టింగ్, ‘ఎవిజిసి’, డిజిటల్ మీడియా తదితర రంగాల ప్రతినిధులుగా 80 మంది అగ్రశ్రేణి నిర్వాహకులు ఇందులో పాల్గొన్నారు.
‘ఎం అండ్ ఇ’ పరిశ్రమ కేలెండర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయేలా గోవాలో 2024 నవంబరు 20 నుంచి 24 వరకు ‘వేవ్స్’ వేడుకను భారత్ ఘనంగా నిర్వహించనుంది.
***
(Release ID: 2033110)
Visitor Counter : 85
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Khasi
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada