సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

3వ విడత అంతర్జాతీయ యోగా దినోత్సవ మీడియా సత్కారం-2024పై కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ ప్రకటన


వివిధ భాషల్లో టెలివిజన్.. రేడియో.. ప్రచురణ మాధ్యమాలకు 33 పురస్కారాలు;
యోగా సందేశ వ్యాప్తిలో మాధ్యమాల పాత్రకు గుర్తింపుగా సత్కారం

Posted On: 11 JUN 2024 5:39PM by PIB Hyderabad

కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ అండ్ బి) ఇవాళ 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవ మాధ్యమ సత్కారం-2024కు సంబంధించి ప్రకటన జారీచేసింది. ఈ మేరకు భారత్ సహా విదేశాల్లో యోగా సందేశ వ్యాప్తి దిశగా మాధ్యమాల కర్తవ్య దీక్ష, వాటి విశేష పాత్రకు గుర్తింపుగా మంత్రిత్వ శాఖ 2019 జూన్ నెలలో తొలిసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ మాధ్యమ సత్కారం (ఎవైడిఎంఎస్) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

   ఈ నేపథ్యంలో ప్రస్తుత 3వ విడత అంతర్జాతీయ యోగా దినోత్సవ మాధ్యమ సత్కారం-2024 కింద ఆంగ్లంతోపాటు 22 భారతీయ భాషలకు సంబంధించి ‘‘ప్రచురణ, టెలివిజన్, రేడియో’’... మూడు విభాగాల్లో కథనాల నుంచి 33 పురస్కారాలకు అర్హులను ఎంపిక చేస్తారు:

   దీనికి అనుగుణంగా 11 పురస్కారాలను ‘‘వార్తా పత్రికలలో యోగాపై అత్యుత్తమ కథనాల’’కు, మరో 11 పురస్కారాలను ’’ఎలక్ట్రానిక్ (టీవీ) మాధ్యమాలలో యోగాపై అత్యుత్తమ కథనాల’’కు, ఇంకొక 11 పురస్కారాలను ‘‘రేడియో మాధ్యమంలో యోగాపై అత్యుత్తమ కథనాల’’కు ప్రదానం చేస్తారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం

   ప్రపంచవ్యాప్తంగా ఏటా జూన్ 21న నిర్వహించుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆరోగ్యం-శ్రేయస్సును ప్రోత్సహిస్తూ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చింది. దీంతో శారీరక-మానసిక-అధ్యాత్మిక శ్రేయస్సు దిశగా ఓ సంపూర్ణ జీవన విధానమైన యోగాపై అన్నిదేశాల్లోనూ ఆసక్తి గణనీయంగా పెరిగి, ఇదొక ప్రపంచ దృక్కోణంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ సహా విదేశాల్లోనూ యోగా సందేశ వ్యాప్తికి మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల ఈ ప్రాచీన జీవన విధానంతోపాటు తద్వారా లభించే అనేక ప్రయోజనాల ప్రచారంలో మాధ్యమాలకుగల అపార శక్తిసామర్థ్యాలు, కర్తవ్య నిబద్ధతను గుర్తించడం కూడా ఎంతో ముఖ్యం.

‘ఎవైడిఎంఎస్’ సిఫారసులు.. మార్గదర్శకాలు

   ప్రత్యేక పతకం/ఫలకం/ట్రోఫీతో కూడిన ఈ పురస్కారం స్వతంత్ర ఎంపిక సంఘం (జ్యూరీ) ద్వారా సిఫారసు చేయబడుతుంది. తదనుగుణంగా సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ రిజిస్ట్రేషన్/అనుమతి ఉన్న ప్రచురణ/రేడియో/టెలివిజన్‌ మాధ్యమాలను నిర్వహించే అన్ని సంస్థలు/కంపెనీలకు ఈ పురస్కారాలు పొందే వీలుంటుంది. దీనికింద రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం- ఆయా మీడియా సంస్థలు 2024 జూన్ 12 నుంచి 25 మధ్య కాలంలో రూపొందించిన/ప్రచురించిన/ప్రసారం చేసిన దృశ్య/శ్రవణ సారాంశాలు/వ్యాసాల సంబంధిత క్లిప్పింగ్‌లతో పాటు నిర్ణీత రూపంలో నామినేషన్లు సమర్పించవచ్చు. ఈ ఎంట్రీల స్వీకరణకు 2024 జూలై 8 తుది గడువుగా నిర్ణయించబడింది. వివరణాత్మక మార్గదర్శకాల కోసం పత్రికా సమాచార సంస్థ (పిఐబి) (https://pib.gov.in/indexd.aspx), సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ (https://mib.gov.in/sites/default/files/AYDMS%20Guidelines%202024_0.pdf) వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు.

‘ఎవైడిఎంఎస్-2023’ 2వ విడత పురస్కారాలు

   ఈ పురస్కారాల తొలి విడత ప్రదానోత్సవం 2020 జనవరి 7న నిర్వహించబడింది. అయితే, 2023కు సంబంధించి 2వ విడత కింద విజేతలకు ఇంకా పురస్కార ప్రదానం చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ రెండో విడత విజేతలకూ ఈ ఏడాది (3వ విడత) విజేతలతోపాటు పురస్కార ప్రదానం చేయబడుతుంది.

 

***

 



(Release ID: 2024416) Visitor Counter : 71