ప్రధాన మంత్రి కార్యాలయం

భారత్-భూటాన్ ఇంధన భాగస్వామ్యంపై సంయుక్త దృక్పథ ప్రకటన

Posted On: 22 MAR 2024 5:20PM by PIB Hyderabad

 

  1.    భారత్-భూటాన్‌ల మధ్యనే కాకుండా రెండు దేశాల ప్రజల నడుమ ఆదర్శప్రాయ ద్వైపాక్షిక స్నేహ సంబంధాలున్నాయి. పరస్పర అవగాహన, విశ్వాసం, సద్భావన ప్రాతిపదికగా ఈ బంధం నిరంతరం బలోపేతమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారిక పర్యటనలో భాగంగా భూటాన్ ప్రధాని దాషో షెరింగ్ టోబ్‌గేతో థింపూ నగరంలో విస్తృత చర్చలు ఫలప్రదంగా సాగాయి. ఈ సందర్భంగా ఈ అసాధారణ ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా  మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడంపై దేశాధినేతలిద్దరూ తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
  2.    భూటాన్‌లో జలవిద్యుత్ రంగం అభివృద్ధి సహా ఆ ప్రాంతానికి ఇంధన భద్రత కల్పనలో పరిశుభ్ర ఇంధన భాగస్వామ్యం ద్వారా అద్భుత సహకారం అందగలదని అధినేతలిద్దరూ అంగీకరించారు. తదనుగుణంగా ఇంధన ప్రాజెక్టుల అమలులో భూటాన్ వ్యవస్థలు, సాంకేతిక సంస్థల జాతీయ సామర్థ్యం పెరగడాన్ని ప్రధాని మోదీ అభినందించారు. కాగా, ఇటీవలి కాలంలో భారత పునరుత్పాదక ఇంధన రంగం గణనీయ వృద్ధి నమోదు చేయడంతోపాటు అంతర్జాతీయ సౌరకూటమి ఏర్పాటు, భారత జాతీయ హరిత ఉదజని కార్యక్రమం వగైరా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ప్రధాని మోదీ నాయకత్వం పటిమను ప్రధాని టొబగే అభినందించారు.
  3.    ప్రధానమంత్రులిద్దరూ తమ సంభాషణల్లో భాగంగా ద్వైపాక్షిక ఇంధన సహకారం సంబంధిత అంశాలన్నిటినీ లోతుగా సమీక్షించారు. ఈ మేరకు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రాజెక్టుల పనితీరుతోపాటు భూటాన్‌ ఆర్థిక వృద్ధికి అది తోడ్పడటంపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా 720 మెగావాట్ల మాంగ్‌డెచ్చు జల విద్యుత్ ప్రాజెక్ట్ విజయవంతమైన నేపథ్యంలో ఈ ఏడాది 1020 మెగావాట్ల పునత్సంగ్చు-2 జల విద్యుత్ ప్రాజెక్ట్‌ ప్రారంభానికి వారు సిద్ధమవుతున్నారు. కాగా, 1200 వాట్ల పునత్సంగ్చు-1 (తొలిదశ)ను తక్కువ వ్యయం, సమర్థ సాంకేతిక పరిజ్ఞానాలతో నిర్మించడంలో సాంకేతిక నిపుణుల స్థాయి చర్చలపై ఉభయ పక్షాలు హర్షం వ్యక్తం చేశాయి.
  4. ప్రధానమంత్రులిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదిరిన అంశాలు:
  1.    రెండు దేశాలకూ ప్రయోజనం చేకూర్చగల సామర్థ్యం భారత్-భూటాన్ ఇంధన భాగస్వామ్యానికి ఉంది. ఈ మేరకు ఇంధన భద్రత పెంపు, ఆర్థిక వ్యవస్థల బలోపేతం, ఉపాధి సృష్టి, ఎగుమతి ఆదాయాల వృద్ధి, పారిశ్రామిక-ఆర్థిక సామర్థ్యాల ఇనుమడింపు తదితరాలకు అది దోహదం చేయగలదు.
  2. తదనుగుణంగా కొత్త ఇంధన ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ వాణిజ్యం సహా పరస్పర ప్రయోజనకర ద్వైపాక్షిక పరిశుభ్ర ఇంధన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోగల అపార అవకాశాలున్నాయి.
  3. అలాగే జల, సౌర, హరిత ఉదజని ఇంధన రంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణంలో భారతీయ సంస్థల వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించడం.
  4. రిజర్వాయర్లపై జలవిద్యుత్ ప్రాజెక్టులు సహా కొత్త పథకాల దిశగా రెండు ప్రభుత్వాలు ప్రాజెక్టు-నిర్దిష్ట అమలు విధానాలపై సమీక్ష-ఖరారుకు నిర్ణయం.
  5. భూటాన్‌లోని కొత్త, నిర్మించబోయే జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం భారత ఆర్థిక సంస్థల నుంచి అవసరమైన ఆర్థిక సహాయంతోపాటు విద్యుత్ విక్రయ విపణికి భారత ప్రభుత్వం సౌలభ్యం కల్పించడం.
  6. ఈ ప్రాంత ఇంధన భద్రత భరోసా ఇచ్చేలా రెండు దేశాల మధ్య విద్యుత్ ఆదానప్రదానం కీలక పాత్ర కొనసాగుతుంది. దీనికి సంబంధించి భూటాన్ విద్యుదుత్పాదన సంస్థలకు మార్కెట్ లభ్యత వర్తింపులో దేశీయ నిబంధనలు-విధానాలకు అనుగుణంగా పరస్పరం అంగీకరించిన మేరకు ఒప్పందాలు, అమలు సదుపాయాల సౌలభ్యం కల్పించబడుతుంది.
  7. ఇంధన విపణుల విస్తరణ దృష్ట్యా భూటాన్ ఇంధన ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడంతోపాటు విద్యుత్తు పరంగా నిరంతరాయ సరిహద్దు వాణిజ్యానికి భరోసా ఇచ్చేవిధంగా క్రమం తప్పకుండా సంప్రదింపుల కొనసాగింపు.
  8.  అన్ని భాగస్వామ్య సంస్థల పరస్పర ప్రయోజనం దృష్ట్యా ఆర్థిక వ్యవస్థల మధ్య పెరిగిన అంతర-అనుసంధానాలకు దారితీయగల విస్తృత ఉప-ప్రాంతీయ ఇంధన సహకారం దిశగా కృషి చేయడం.
  9. ఇంధన పొదుపు/సంరక్షణ చర్యల రంగంలో ఇంధన సహకారం బలోపేతం. ఇందుకోసం సామర్థ్య వికాసం, విధానాలు-సాంకేతికతలపై సమాచార ఆదానప్రదానం, ఇంధన పొదుపు సాంకేతికతలపై పరిశోధన-అభివృద్ధి వగైరాల ద్వారా సంయుక్త కృషి.

   పరస్పర ప్రయోజనానికి ఉద్దేశించిన సంయుక్త దృక్పథ ప్రకటనకు అనుగుణంగా ప్రాజెక్టులు, కార్యక్రమాలపై చర్యలను వేగిరపరచడంపై ప్రధానమంత్రులిద్దరూ ఏకాభిప్రాయం ప్రకటించారు.

 

***



(Release ID: 2016332) Visitor Counter : 84