ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్లోని అహ్మాదాబాద్లో , గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవాలలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.


“గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవాలు ఆ సంస్థ ప్రయాణంలో కీలకమైనది’’

“భారత పశుపాలకుల శక్తికి అమూల్ ఒక గుర్తుగా నిలిచిపోయింది’’

‘‘ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు ఏవిధంగా భవిష్యత్ తరాల గతిని మారుస్తుందో తెలియజెప్పడానికి అమూల్ గొప్ప ఉదాహరణ’’

“భారత పాడిరంగానికి నిజమైన వెన్నెముక నారీశక్తి’’

‘‘మహిళల ఆర్ధికశక్తిని పెంచేందుకు ఇవాళ ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తోంది’’

“2030 నాటికి గాలికుంటువ్యాధి నిర్మూలనకు మేం కృషిచేస్తున్నాం.

‘‘రైతులను ఇంధన సరఫరాదారులుగా, ఎరువుల సరఫరాదారుగా మారుస్తున్నాం’’

‘‘గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో సహకారం పరిధిని మరింత విస్తృత పరుస్తొంది’’

‘‘దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా గ్రామాలలో , రెండు లక్షల సహకార సొసైటీల ఏర్పాటుతో సహకార ఉద్యమం మరింత ఊపందుకుంటోంది.’’

“ ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఇది మోదీ గ్యారంటీ’’

Posted On: 22 FEB 2024 12:43PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ, గుజరాత్‌ సహకార పాల మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జిసిఎంఎంఎఫ్‌) స్వర్ణోత్సవాలలో పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లోని మొతేరాలో గల శ్రీనరేంద్రమోదీ స్టేడియంలో ఈ స్వర్ణోత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆసక్తిగా తిలకించారు.అనంతరం ప్రధానమంత్రి , స్వర్ణోత్సవాల సందర్భంగా కాఫీటేబుల్‌ బుక్‌ను ఆవిష్కరించారు. జిసిఎంఎంఎఫ్‌ సహకార రంగం శక్తికి , రైతుల పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రపంచంలోనే బలమైన బ్రాండ్‌గా అమూల్‌ నిలిచింది. 

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి, గుజరాత్‌ కో ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జిసిఎంఎంఎఫ్‌) స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రతిఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.  50 సంవత్సరాల కింద గుజరాత్‌ రైతులు వేసిన విత్తనం, ఇవాళ ప్రంచవ్యాప్తంగా విస్తరించిన ఒక మహావటవృక్షంగా రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి అన్నారు. శ్వేత విప్లవానికి కారణమైన పశుధనాన్ని తాను మరిచిపోలేనని ఆయన అన్నారు.
స్వాతంత్య్రానంతరం పలు బ్రాండ్‌లు వచ్చినప్పటికీ, అమూల్‌ వంటి బ్రాండ్‌ రాలేదన్నారు. ‘‘అమూల్‌ భారత పశుపాలకుల శక్తికి నిదర్శనంగా నిలిచింద’’ని ఆయన అన్నారు. అమూల్‌ అంటే నమ్మకం,అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం, రైతుల సాదికారత, కాలానుగుణంగా సాంకేతికతలో మార్పునకు సంకేతంగా నిలిచిందని ప్రధానమంత్రి అన్నారు.  ఆత్మనిర్భర్‌ భారత్‌కు అమూల్‌ ఒక ప్రేరణ అని ఆయన తెలిపారు.  అమూల్‌ ఉత్పత్తులు  ప్రపంచవ్యాప్తంగా 50కిపైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. అమూల్‌ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,  18,000 పాల సహకార కమిటీలు, 36,000 రైతుల నెట్‌వర్కన, రోజుకు 3.5 కోట్ల లీటర్ల పాల ప్రాసెసింగ్‌, పశుపోషకులకు ఆన్‌లైన్‌ ద్వారా  200 కోట్ల రూపాయల చెల్లింపులు ఇవన్నీ కీలకమైనవని అన్నారు. చిన్న పశుపోషకులు చేస్తున్న అద్భుతకృషి కారణంగా అమూల్‌, దాని సహకార సంఘాలు ఎంతో బలపడ్డాయని ప్రధానమంత్రి తెలిపారు.

ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలతో వచ్చి ఒక అద్భుతమైన పరివర్తన కు అమూల్‌ గొప్ప ఉదాహరణ అని ప్రధానమంత్రి అన్నారు. అమూల్‌కు మూలాలు ,సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మార్గనిర్దేశంలో రూపుదిద్దుకున్న ఖేడా మిల్క్‌యూనియన్‌లో ఉన్నాయన్నారు. గుజరాత్‌లో సహకార వ్యవస్థ విస్తరించడంతో జిసిఎంఎంఎఫ్‌ ఉనికిలోకి వచ్చిందని చెప్పారు.  సహకార సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య సమతూకానికి ఇది గొప్ప ఉదాహరణ అని, ఇలాంటి కృషి కారణంగా మనదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఎదిగిందని తెలిపారు. ఇందులో 8 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారు.  గత 10 సంవత్సరాలలో  పాల ఉత్పత్తి దాదాపు 60 శాతం వరకు పెరిగిందని, తలసరి పాల లభ్యత 40 శాతం పెరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. భారత పాడి పరిశ్రమ రంగం సంవత్సరానికి 6 శాతం వంతున వృద్ధి చెందుతున్నదడని, ఈ విషయంలో అంతర్జాతీయ సగటు కేవలం 2 శాతం మాత్రమేనని తెలిపారు.

పదిలక్షల కోట్ల విలువగల పాడి పరిశ్రమ రంగంలో మహిళల పాత్ర కీలకమని ప్రధానమంత్రి తెలిపారు. మహిళలు పాడిరంగం టర్నోవర్‌ను 70 శాతం పెంచారని అన్నారు.  గోధుమలు, బియ్యం, చెరకు  వీటన్నిటి కలయిక కంటే కూడా పాడి రంగం టర్నోవర్‌ ఎక్కువ అని అన్నారు. పాడిపరిశ్రమ రంగానికి మహిళా శక్తి వెన్నెముక అని ఆయన తెలిపారు. మహిళల నాయకత్వంలో అభివృద్ధిలో ఇండియా ముందుకు  పోతున్నదంటే, అందుకు పాడి పరిశ్రమ విజయం గొప్ప స్ఫూర్తి అని ప్రధానమంత్రి తెలిపారు. వికసిత్‌భారత్‌ ప్రయాణంలో మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాల్సిన కీలక ఆవశ్యకత గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,  ముద్రా యోజన కింద 70 శాతం అంటే 30 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మహిళా వ్యాపారవేత్తలు అందుకున్నారని ప్రధానమంత్రి తెలిపారు. మహిళా స ్వయం సహాయక బృందాల సభ్యుల సంఖ్య పది కోట్లు దాటిందని కూడా ఆయన చెప్పారు. వీరు 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువ గల  ఆర్థిక సహాయాన్ని అందుకున్నారని తెలిపారు. 4 కోట్ల పి.ఎం ఆవాస్‌ ఇళ్ల లో చాలావరకు ఇళ్లు మహిళల పేరుతోనే మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. నమో డ్రోన్‌ దిది పథకాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 15,000 స్వయం సహాయక బృందాలకు డ్రోన్‌లు ఇవ్వడం జరిగిందని, వీటి సభ్యులకు తగిన శిక్షణ ఇచ్చినట్టు ఆయన తెలిపారు.

గుజరాత్‌లోని పాల సహకార కమిటీలలో మహిళల సంఖ్య పెద్దఎత్తున పెరుగుతుండడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.వారి సంపాదనను నేరుగా వారి ఖాతాలలోనే జమచేస్తున్నట్టు  తెలిపారు. ప్రధానమంత్రిఅమూల్‌ కృషిని ప్రశంసిస్తూ ,  పశువుల పెంపకం దారులకు సహాయపడేందుకు వీలుగా వారు తమ ప్రాంతంలోనే నగదును విత్‌డ్రా చేసుకునేందుకు మైక్రో ఎటిఎంలు ఏర్పాటైనట్టు తెలిపారు. రూపే కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ పథకం, పశుపాలక్‌ పథకం, పంచ్‌పిప్ల, బనసకంఠలలో అమలవుతున్న పైలట్‌ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు.
గ్రామాలలోనే భారతదేశం నివశిస్తున్నదంటూ గాంధీజీ చెప్పినమాటలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పారు. గత ప్రభుత్వానికి   గ్రామీణ ఆర్థికవ్యవస్థ విషయంలో సరైన విధానం లేదని, ప్రస్తుత ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపడుతున్నదని తెలిపారు. ‘‘ చిన్న రైతుల జీవితాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రధానంగా దృష్టిపెడుతున్నది. పశుసంతతి ఆరోగ్య కరంగా ఉండేలా చూస్తున్నది. పశుగణాభివృద్ధి పరిధిని విస్తృతం చేస్తున్నది,  చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి వాటిని గ్రామాలలో ప్రోత్సహిస్తున్నది’’ అని ప్రధానమంత్రి తెలిపారు. తాను ఇంతకుముందు ప్రస్తావించినట్టు  పశువుల పెంపకం దారులకు, చేపల పెంపకం దారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ప్రయోజనాలను అందిస్తున్నట్టు తెలిపారు. వాతావరణ మార్పులను తట్టుకునే విత్తన రకాలను రైతులకు అందజేస్తున్నట్టు కూడా ప్రధానమంత్రి తెలిపారు.

జాతీయ గోకుల్‌ మిషన్‌ను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,  పాల ఉత్పత్తిని పెంచే పశు సంతతి రకాలను అభివృద్ధిచేసేందుకు దీనిని ఉద్దేశించినట్టు తెలిపారు. గాలికుంటు వ్యాధికారణంగా పశువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, జరుగుతున్న నష్టాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, పశువులకు సోకే ఈ వ్యాధికారణంగా  వేలాది కోట్ల రూపాయల విలువగల పశు సంపదను రైతులు కోల్పోతున్నారన్నారు.  ఇందుకు సంబంధించి 15,000 కోట్ల రూపాయల విలువగల  ఉచిత వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఇప్పటివరకు  ఈకార్యక్రమం కింద 7 కోట్ల వాక్సినేషన్‌లు జరిగాయన్నారు.  2030నాటికి గాలి కుంటు వ్యాధిని నిర్మూలించేందుకు తాము గట్గి కృషి చేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.
గత రాత్రి జరిగిన కేబినెట్‌ సమావేశంలో పశుసంతతికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. దేశీయ పశుజాతులను అభివృద్ధిచేసేందుకు, జాతీయ పశు సంతతి మిషన్‌ ను సవరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. బీడు భూములలో పశుగ్రాసాన్ని పెంచేందుకు ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలిపారు. పశువులకు బీమా ప్రీమియంను గణనీయంగా తగ్గించినట్టు కూడా ప్రధానమంత్రి తెలిపారు. గుజరాత్‌లో నీటిని పొదుపుగా వాడుకోవలసిన ఆవశ్యకత గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.  సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతంలో తలెత్తిన కరవు సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. మంచినీటి కొరత కారణంగా వేలాది జీవజంతుజాలం మరణించినట్టు తెలిపారు.  నర్మదా నదీ జలాల రాకతో ఈ ప్రాంతలో వచ్చిన పరివర్తనాత్మక మార్పుగురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. నర్మదా నీరు వచ్చిన తర్వాత నీటి కొరత గల ప్రాంతాల దశ తిరిగిందని అన్నారు. ఈ చర్య ఈ ప్రాంతంలో గొప్ప మార్పు తీసుకువచ్చిందని తెలిపారు. ఇది ప్రజల జీవితాలలో మార్పు తీసుకురావడంతోపాటు ఈ ప్రాంత వ్యవసాయ అలవాట్లలోనూ మార్పు తెచ్చిందన్నారు.‘‘ భవిష్యత్తులో ఇలాంటి సవాళ్లు తలెత్తవని అనుకోరాదని’’ ప్రధానమంత్రి హెచ్చరించారు. నీటికొరతను నివారించేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దేశవ్యాప్తంగా అభివృద్దిచేసేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల చర్యలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా  60 వేలకు పైగా  అమృత్‌ సరోవర్‌ రిజర్వాయర్లను ప్రభుత్వం నిర్మిచడం వల్ల దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో ఊతం లభించిందని చెప్పారు.

‘‘ఆధునిక సాంకేతికతతో , గ్రామాలలోని చిన్న రైతులను అనుసంధానం చేయడానికి తాము కృషి చేస్తున్నామని, ’’ ప్రధానమంత్రి చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి ద్వారా చిన్న రైతులకు సాధికారత కల్పించడం తమ లక్ష్యమని ఆయన అన్నారు. ‘‘ గుజరాత్‌లో , ఇటీవలి కాలంలో సూక్ష్మ సేద్యానికి సంబంధించి తాము ఎంతో గొప్ప వృద్ధిని చూశామ’’ ని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసేందుకు బిందు సేద్యం వంటి సమర్దవంతమైన నీటిపారుదల  పద్ధతులను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.

రైతుల సమస్యలకు , వారికి దగ్గరలోనే శాస్త్రీయ పరిష్కారాలను అందించేందుకు  లక్షలాది కిసాన్‌ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ప్రధానమంత్రి తెలిపారు. సేంద్రీయ ఎరువుల వాడకంలో రైతులకు సహాయపడేందుకు కృషి జరుగుతున్నదని, సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి చర్యలు కృషి జరుగుతోందని చెప్పారు.
‘‘ మా ప్రభుత్వం రైతులను ఇంధన ఉత్పత్తిదారులుగా మార్చేందుకు, ఎరువుల ఉత్పత్తిదారులుగా చేసేందుకు కృషి చేస్తున్నది’’ అని అంటూ ప్రధానమంత్రి, గ్రామీణ ఆర్థికవ్యవస్థను వృద్ధిలోకి తెచ్చేందుకు బహుముఖ విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయంలో సుస్థిర ఇంధన పరిష్కారాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి తెలిపారు.

గోవర్ధన్‌ యోజన పథకం కింద, పశు పోషకుల నుంచి ఆవు పేడను కొనుగోలు చేసేందుకు ఒక పథకాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. దీని ద్వారా  విద్యుత్‌ ఉత్పత్తికి బయోగ్యాస్‌ తయారు చేస్తారు.  బయోగ్యాస్‌ ఉత్పత్తికి అమూల్‌ సంస్థ బనస్‌కంఠ లో ప్లాంటు ఏర్పాటు చేయడం ఈ దిశగా గొప్పముందడుగుగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి పాడిపరిశ్రమ రంగంలో విజయవంతమైన చొరవల గురించి ప్రస్తావించారు.
‘‘ గ్రామీణ ఆర్థికవ్యవస్థలో సహకారం పాత్రను ప్రభుత్వం గణనీయంగా విస్తృతం చేస్తున్నద’’ని ప్రధానమంత్రి తెలిపారు.  ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా సహకార రంగాన్ని ప్రభత్వం చూస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు.  కేంద్ర ప్రభుత్వ స్థాయిలో తొలిసారిగా ప్రత్యేకంగా సహకార మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసినట్టు ప్రధానమంత్రి వెల్లడిరచారు.దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా గ్రామాలలో రెండు లక్షలకు పైగా సహకార సంఘాల ఏర్పాటుతో సహకార ఉద్యమం గొప్ప ఊపందుకుంటున్నదని చెప్పారు.  వ్యవసాయం, పశుగణాభివృద్ధి, మత్స్య రంగాలలో సహకార సంఘాలు ఏర్పడుతున్నట్టు తెలిపారు. మేడ్‌ ఇన్‌ ఇండియా చొరవ ద్వారా సహకార సంఘాలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.  వీరికి పన్నురాయితీలు కూడా ఇస్తున్నట్టు చెప్పారు. 10 వేల ఎఫ్‌.పి.ఒలలో ఇప్పటికే 8 వేల ఎఫ్‌.పి.ఒలు పనిచేస్తున్నాయని,  ఇవి చిన్న రైతులకు సంబంధించి పెద్ద సంస్థలని చెప్పారు. ఇది చిన్న రైతులను వ్యవసాయ దారులనుంచి వ్యవసాయ వాణిజ్యవేత్తలుగా మారుస్తుందన్నారు.పిఎసిఎస్‌లు, ఎఫ్‌.పి.ఒలు ఇతర సహకార సంస్థలు కోట్లాది రూపాయల సహాయాన్ని పొందుతున్నాయన్నారు. వ్యవసాయ మౌలికసదుపాయాల రంగానికి లక్ష కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసినవిషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
పశుగణ మౌలిక సదుపాయాలకు సంబంధించి  30 వేల కోట్ల రూపాయల పెట్టుబడి నిధి గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. పాడి సహకార సంఘాలు వడ్డీపై మరింత రిబేటు ను పొందుతున్నాయని  తెలిపారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలను పాల ప్లాంటుల ఆధునీకరణపై ఖర్చుచేస్తున్నట్టు చెప్పారు. ఈ పథకం కింద సబరకంఠ పాల యూనియన్‌ను ఈ రోజు ప్రారంభించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ఈ ప్లాంటులోనే రోజుకు 800 టన్లుల పశుదాణా ఉత్పత్తి ప్లాంటుకూడా ఉన్నట్టు ఆయన చెప్పారు.
‘‘ నేను వికసిత్‌ భారత్‌ గురించి ప్రస్తావిస్తున్నానంటే, నేను సబ్‌ కా ప్రయాస్‌ పై విశ్వాసంతో ప్రస్తావిస్తున్నాను. ’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఇండియా స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే నాటికి అమూల్‌ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. నానాటికీ పెరుగుతున్న దేశ జనాభా పోషక విలువలను కాపాడడంలో అమూల్‌ పాత్రను ప్రధానమంత్రి  ప్రస్తావించారు.  రాగల 5 సంవత్సరాలలో అమూల్‌ తన ప్రాసెసింగ్‌ప్లాంట్ల సామర్ధ్యాన్ని రెట్టింపుచేయడానికి నిర్ణయించుకున్నదని తెలిసి సంతోషిస్తున్నట్టు తెలిపారు. ‘‘ ఇవాళ అమూల్‌ ప్రపంచంలో 8వ అతిపెద్ద పాల ఉత్పత్తి కంపెనీ ’’అని ప్రధానమంత్రి తెలిపారు. వీలైనంత త్వరగా దీనిని ప్రపంచంలో మొదటి స్థానంలోకి తీసుకురావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమూల్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇది మోదీ గ్యారంటీ అని చెప్పారు. అమూల్‌ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ముగించారు.
గుజరాత్‌ గవర్నర్‌ శ్రీ ఆచార్య దేవ వ్రత్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్‌, కేంద్ర పశుసంవర్థక , పాడి, మత్స్య శాఖ సహాయమంత్రి శ్రీ పర్షోత్తం రూపాల, గుజరాత్‌ కో ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ శ్రీ శ్యామల్‌ బి పటేల్‌ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఉ త్సవాలలో సుమారు 1.25 లక్షల మంది రైతులు పాల్గొన్నారు.

***

DS/TS


(Release ID: 2008746) Visitor Counter : 84