సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

విక‌సిత భార‌తం సంకల్ప యాత్రకు విస్తృత ప్రజా స్పందన


దేశ‌వ్యాప్తంగా 259కిపైగా పంచాయతీల్లో 1,00,000 మంది భాగ‌స్వామ్యం;

ప్ర‌ధాన‌మంత్రి ఉజ్వల యోజన కోసం 21,000 మంది న‌మోదు

Posted On: 17 NOV 2023 4:00PM by PIB Hyderabad

   విక‌సిత భార‌తం సంక‌ల్ప యాత్ర (విబిఎస్‌వై) ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ మేర‌కు తొలిరోజు కార్య‌క్ర‌మంలో దేశంలోని 259కిపైగా పంచాయ‌తీల్లో లక్ష మందికిపైగా ప్ర‌జ‌లు పాల్గొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జార్ఖండ్‌లోని ఖుంటిలో 2023 నవంబర్ 15న ఈ యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ మేర‌కు దేశవాప్తంగా గ‌ణ‌నీయ గిరిజ‌న ప్రాబ‌ల్యంగ‌ల వివిధ ప్రాంతాల నుంచి ఏకకాలంలో యాత్రకు సంబంధించిన ‘ఐఇసి’ వాహ‌నాల‌ను ఆయ‌న జెండా ఊపి సాగ‌నంపారు.

   యాత్ర తొలిరోజున అనేక కార్యక్రమాలు, కార్యకలాపాల సమ్మేళనంతో గ్రామగ్రామాన చైతన్యం పరవళ్లు తొక్కింది. దేశ ప్ర‌గ‌తి, సాధికార‌త‌ దిశగా స‌మ‌ష్టి దృక్ప‌థం, సామూహిక సంక‌ల్పాల క‌ల‌నేత ఈ కార్యక్రమాల్లో ప్ర‌స్ఫుటమైంది.

  కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేస్తున్న‌ సంక్షేమ పథకాలు, విధానాలపై ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పించడం,  ప్రతిష్టాత్మ‌క పథకాల అమ‌లులో 100 శాతం సంతృప్త స్థాయి సాధించడం ఈ యాత్ర ప్ర‌ధాన లక్ష్యం. దీనికి అనుగుణంగా యాత్ర తొలిరోజునే 21,000 మందికిపైగా పేద‌లు ప్ర‌ధాన‌మంత్రి ఉజ్వల యోజన కోసం త‌మ పేర్లు నమోదు చేసుకున్నారు.

   సంక‌ల్ప యాత్ర‌లో 80,000 మందికిపైగా ప్ర‌జ‌లు వికసిత భారతం ప్రతిజ్ఞ  చేయ‌గా, 1200 మంది ‘మై భారత్’ స్వ‌చ్ఛంద కార్య‌క‌ర్త‌లుగా న‌మోదు చేసుకున్నారు. విశిష్ట వ్య‌క్తుల అన్వేష‌ణ‌లో భాగంగా 3,448 మంది మహిళలు, 1,475 మంది విద్యార్థులు, 495 మంది స్థానిక కళాకారులు, 298 మంది క్రీడా ప్రముఖుల కృషిని గుర్తించి వారిని స్ఫూర్తి ప్ర‌దాత‌లుగా పేర్కొంటూ అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

   అన్ని గ్రామాల్లోనూ ప్రజలు పెద్ద సంఖ్య‌లో ‘విబిఎస్‌వై-ఐఇసి’ వాహ‌నాల వ‌ద్ద‌కు తరలివచ్చి, వివిధ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. దీంతోపాటు త‌క్ష‌ణ‌ సేవలను కూడా స‌ద్వినియోగం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వహించిన ఆరోగ్య శిబిరాల్లో 16,000 మందికిపైగా ప్రజలు వివిధ ప‌రీక్ష‌లు చేయించుకోగా- క్ష‌య వ్యాధి నిర్ధార‌ణ కోసం 6,000 మందికిపైగా , కొడ‌వ‌లి ర‌క్త‌క‌ణ వ్యాధి నిర్ధార‌ణ కోసం 4500 మందికిపైగా పరీక్ష చేయించుకున్నారు.

డ్రోన్ ప్రదర్శనకు విశేష స్పంద‌న‌

   రైతులు తమ కమతాల్లో దిగుబడిని, ఉత్పాదకతను పెంచుకునేందుకు వీలుగా వ్యవసాయ రంగంలో దేశం సాధించిన ప్రగతిని ‘విబిఎస్‌వై’లో ప్రదర్శించారు. ఈ మేరకు 120కిపైగా డ్రోన్లతోపాటు  భూసార కార్డు సంబంధిత ప్రదర్శనలు నిర్వహించారు. మరోవైపు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ఇష్టాగోష్ఠి కూడా ఏర్పాటు చేశారు.

   ఈ యాత్రలో ప్రతిష్టాత్మక ప్రభుత్వ పథకాల 100 శాతం సంతృప్త స్థాయి దిశగా సాధించిన మైలురాళ్లను ప్రముఖంగా ప్రస్తావించారు. తదనుగుణంగా ఆయుష్మాన్ కార్డుల విషయంలో 83 పంచాయతీలు 100 శాతం సంతృప్త స్థాయిని సాధించాయి. అలాగే 89 పంచాయతీలు జల్ జీవన్ మిషన్ (జెజెఎం)లో, మరో 97 జన్-ధన్ యోజనలో, 124 పంచాయతీలు బహిరంగ విసర్జనరహిత ప్లస్ (+) స్థాయిలో 100 శాతం సంతృప్తతను సాధించాయి.

   సంకల్ప యాత్రలో వ్యక్తిగత విజయగాథలకూ స్థానం ఇవ్వబడింది. దీనికింద 200 మందికిపైగా లబ్ధిదారులు ‘‘నా విజయం-నా కథనం’’ శీర్షికన తమ సఫల కథనాలను వివరించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల ద్వారా వారి జీవితాల్లో వచ్చిన పరివర్తనాత్మక మార్పును ఈ కథనాలు ప్రతిబింబించాయి.

   విక‌సిత భారతం సంకల్ప యాత్ర పేరిట ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రభుత్వం అత్యంత భారీ కార్యక్రమం చేపట్టింది. సమ్మిళిత అభివృద్ధి దృష్ట్యా పథకాల అమలులో 100 శాతం సంతృప్తత సాధించడం దీని లక్ష్యం. తద్వారా దేశం నలుమూలలాగల ప్రజలందరికీ ఈ పథకాల ప్రయోజనాలు చేర్చాలనే నిరంతర కృషి ఫలిస్తుంది. ఈ లక్ష్యసాధన కోసం విస్తృత సమాచార వ్యాప్తితోపాటు దేశ ప్రగతిలో ప్రజలు చురుకైన భాగస్వాములుగా మారేలా వారికి సాధికారత కల్పించడంలో ఈ యాత్రను ఓ కీలక చర్యగా పరిగణించవచ్చు.

   యాత్రలో భాగంగా ‘ఐఇసి’ వాహనాలు చేపడుతున్న క్షేత్రస్థాయి కార్యకలాపాలతోపాటు ప్రజా భాగస్వామ్య సమాచారాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డిజిటల్ ఇండియా కార్పొరేషన్ రూపొందించిన పోర్టల్‌ అప్పటికప్పుడే స్వీకరిస్తూంటుంది.

****

దేశవ్యాప్తంగా యాత్ర దృశ్యాల్లో కొన్ని:

 

 

  • విక‌సిత భారతం కార్య‌క్ర‌మంలో భాగంగా ప్రజా సంక్షేమ పథకాలపై పంపిణీ చేయబడిన స‌మాచార క‌ర‌దీపిక‌లు
  • బీహార్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో వికసిత భారతం సంకల్ప యాత్రం ‘ఐఇసి’ వాహనం

  • వికసిత భారతం కార్యక్రమంలో భాగంగా డ్రోన్ల ద్వారా ప్రదర్శన

  • Health screening held in WJH for Viksit Bharat Sankalp yatra
  • ‘విబిఎస్‌వై’లో భాగంగా మేఘాలయలోని వెస్ట్ జైంటియా హిల్స్‌లో ఆరోగ్య పరీక్షలు

  • ఈశాన్య భారతంలో వికసిత భారతం సంకల్ప యాత్ర ‘ఐఇసి’ వాహనం
  • Image
  • అస్సాంలో ఆరోగ్య శిబిరం

 

****



(Release ID: 1977780) Visitor Counter : 247