ప్రధాన మంత్రి కార్యాలయం

నవంబరు ఒకటో తేదీన మూడు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న భారత, బంగ్లాదేశ్ ప్రధానమంత్రులు


భారత సహాయంతో మూడు ప్రాజెక్టుల అమలు

మూడు ప్రాజెక్టులు : అఖౌరా-అగర్తలా క్రాస్-బోర్డర్  రైల్ లింక్; ఖుల్నా-మోంగ్లా పోర్టు రైల్ లేన్; మైత్రీ సూపర్  ధర్మల్  ప్రాజెక్టు మూడో దశ

ఈ ప్రాజెక్టులతో ప్రాంతీయంగా కనెక్టివిటీ పెరగడంతో పాటు ఇంధన భద్రత ఏర్పడుతుంది.

Posted On: 31 OCT 2023 5:02PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్  ప్రధానమంత్రి శ్రీమతి షేక్  హసీనా నవంబరు ఒకటో తేదీన ఉదయం 11 గంటల ప్రాంతంలో మూడు అభివృద్ధి ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్సింగ్  విధానంలో కలిసి ప్రారంభించనున్నారు.  అఖౌరా-అగర్తలా క్రాస్-బోర్డర్  రైల్ లింక్; ఖుల్నా-మోంగ్లా పోర్టు రైల్ లేన్; మైత్రీ సూపర్  ధర్మల్  ప్రాజెక్టు మూడో దశ ఈ మూడు ప్రాజెక్టుల్లో ఉన్నాయి.

అఖౌరా-అగర్తలా క్రాస్-బోర్డర్  రైల్ లింక్  ప్రాజెక్టును భారత ప్రభుత్వ సహాయంతో రూ.392.52 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ రైల్  లింక్  ప్రాజెక్టులో బంగ్లాదేశ్  వైపు 6.78 కిలోమీటర్ల డబుల్  గేజ్  రైల్వే లైన్ తో కూడిన 12.24 కిలోమీటర్ల మొత్తం నిడివి గల రైల్వే లైను; త్రిపురలో 5.46 కిలోమీటర్ల రైల్వేలైను నిర్మించారు.

ఖుల్నా-మోంగ్లా పోర్టు రైల్ లేన్ ప్రాజెక్టును భారతదేశం నుంచి 38.892 కోట్ల డాలర్ల భారత ప్రభుత్వ రాయితీ  రుణంతో చేపట్టారు. ప్రాజెక్టులో భాగంగా మోంగ్లా పోర్టు నుంచి ఇప్పటికే అందుబాటులో ఉన్న ఖుల్నా రైల్  నెట్  వర్క్  ను అనుసంధానం చేస్తూ 65 కిలోమీటర్ల నిడివి గల బ్రాడ్  గేజ్  రైలు మార్గం నిర్మించారు. దీంతో బంగ్లాదేశ్  లో రెండో పెద్ద పోర్టు అయిన మోంగ్లా పోర్టుకు బ్రాడ్  గేజ్  రైల్  నెట్  వర్క్  ఏర్పడింది.

మూడోదైన మైత్రీ సూపర్  థర్మల్  పవర్ ప్రాజెక్టును 160 కోట్ల డాలర్ల విలువ గల భారత ప్రభుత్వ రాయితీ రుణ పథకం కింద చేపట్టారు. బంగ్లాదేశ్  లోని ఖుల్నాలో గల రాంపాల్  వద్ద 1320 మెగావాట్ల (2x660) సామర్థ్యం గల సూపర్ థర్మల్  పవర్  ప్లాంట్ (ఎంఎస్  టిపిపి) ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. భారత-బంగ్లాదేశ్  మైత్రీ విద్యుత్  కంపెనీ (ప్రైవేట్) లిమిటెడ్ (బిఐఎఫ్  పిసిఎల్), భారతదేశానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఎన్  టిపిసి మధ్య 50:50 శాతం జాయింట్ వెంచర్ భాగస్వామ్యంలో  ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మాణం పూర్తయిన మైత్రీ సూపర్  థర్మల్  పవర్  ప్లాంట్  తొలి యూనిట్  ను 2022 సెప్టెంబరులో ఉభయ దేశాల ప్రధానమంత్రులు ప్రారంభించారు. తాజాగా రెండో యూనిట్  ను 2023 నవంబరు ఒకటో తేదీన ఉభయులూ ప్రారంభిస్తున్నారు. ఈ మైత్రీ సూపర్  థర్మల్  పవర్ ప్లాంట్  బంగ్లాదేశ్  లో ఇంధన భద్రతకు దోహదపడుతుంది.

ఈ ప్రాజెక్టులు ఉభయ దేశాల మధ్య కనెక్టివిటీని పెంచడంతో పాటు ఇంధన భద్రతకు దోహదపడతాయి. (Release ID: 1974003) Visitor Counter : 140