ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రపంచ సముద్ర భారత సదస్సు-2023కు ప్రధాని శ్రీకారం


భారత సముద్ర నీలి ఆర్థిక వ్యవస్థ బృహత్
ప్రణాళిక ‘అమృతకాల దృక్కోణం-2047’ ఆవిష్కరణ;

దేశవ్యాప్తంగా రూ.23,000 కోట్లకుపైగా విలువైన
జాతీయ ప్రాజెక్టులు జాతికి అంకితం.. శంకుస్థాపన;

గుజరాత్లోని దీనదయాళ్ పోర్ట్ అథారిటీలో
‘ట్యూనా టెక్రా డీప్ డ్రాఫ్ట్ టెర్మినల్’కు శంకుస్థాపన;

సముద్ర రంగంలో జాతీయ – అంతర్జాతీయ భాగస్వామ్యం
దిశగా 300కుపైగా అవగాహన ఒప్పందాలు అంకితం;

“మారుతున్న ప్రపంచ క్రమంలో కొత్త ఆకాంక్షలతో భారత్వైపు ప్రపంచం చూపు”;

“ప్రగతి-శ్రేయస్సు కోసం ఓడరేవులు’ పేరిట ప్రభుత్వ
దార్శనికతతో క్షేత్రస్థాయిలో పరివర్తనాత్మక మార్పులు”;

“మేక్ ఇన్ ఇండియా - మేక్ ఫర్ ది వరల్డ్’ అనేదే మా తారకమంత్రం”;

“హరిత భూగోళానికి రూపుదిద్దడం కోసం నీలి ఆర్థిక వ్యవస్థ
మాధ్యమంగా భవిష్యత్తు వైపు మనం అడుగు వేస్తున్నాం”;

“భారత్ అత్యాధునిక మౌలిక సదుపాయాలతో
ప్రపంచ విహార నౌకా కూడలిగా అవతరిస్తోంది”;

“అభివృద్ధి.. జనాభా.. ప్రజాస్వామ్యం.. డిమాండ్ల
సమ్మేళనం పెట్టుబడిదారులకు ఒక సదవకాశం”

Posted On: 17 OCT 2023 11:54AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ముంబైలో నిర్వహిస్తున్న ప్రపంచ సముద్ర రంగ భారత మూడో శిఖరాగ్ర సదస్సు-2023ను వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం ద్వారా ప్రారంభించారు. భారత సముద్ర నీలి ఆర్థిక వ్యవస్థ సంబంధిత బృహత్‌ ప్రణాళిక ‘అమృతకాల దార్శనికత-2047”ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ భవిష్యత్ ప్రణాళికకు అనుగుణంగా భారత సముద్ర నీలి ఆర్థిక వ్యవస్థ కోసం రూ.23,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయడంతోపాటు కొన్నిటిని జాతికి అంకితం చేశారు. భారత సముద్ర రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించడంలో సదస్సు ఒక అద్భుత వేదికగా కాగలదు.

   నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తూ- 2021లో సదస్సు నిర్వహించిన సమయంలో కోవిడ్ మహమ్మారి ప్రభావిత అనిశ్చితితో యావత్‌ ప్రపంచం ఎంత తల్లడిల్లిందో గుర్తుచేశారు. జన జీవనాన్ని అతలాకుతలం చేసిన ఆనాటి దుస్థితి నుంచి నేడు సరికొత్త ప్రపంచ క్రమం రూపుదిద్దుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచం ఇవాళ కొత్త ఆకాంక్షలతో భారతదేశం వైపు చూస్తున్నదని ప్రధానమంత్రి వివరించారు. యావత్‌ ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో పడినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం నిరంతరం బలపడుతున్నదని వ్యాఖ్యానించారు. తదనుగుణంగా ప్రపంచంలోని 3 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్‌ పరివర్తన చెందే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యంలో సముద్ర మార్గాల పాత్రను ప్రధాని వివరిస్తూ- కరోనా అనంతర ప్రపంచంలో విశ్వసనీయ ప్రపంచ సరఫరా శ్రేణి అవసరాన్ని నొక్కిచెప్పారు.

   భారత సముద్ర సామర్థ్యం ప్రపంచానికి సదా మేలు చేస్తూ రావడాన్ని చరిత్ర నిరూపిస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. కొన్నేళ్లుగా రంగం బలోపేతానికి చేపట్టిన క్రమబద్ధ చర్యలను ఆయన ఏకరవు పెట్టారు. ఇందులో భాగంగా ప్రతిపాదిత భారత-మధ్యప్రాచ్య-ఐరోపా ఆర్థిక కారిడార్‌పై జి-20 చరిత్రాత్మక సంయుక్త ప్రకటన ప్రభావాన్ని ఆయన నొక్కిచెప్పారు. పురాతన చరిత్రలో ‘పట్టు మార్గం’ అనేక దేశాల ఆర్థిక వ్యవస్థను పరివర్తనాత్మకం చేసిందని, అదే తరహాలో కారిడార్ కూడా ప్రపంచ వాణిజ్య ముఖచిత్రాన్ని పూర్తిస్థాయిలో మార్చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే తరం మెగా పోర్ట్, అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్ షిప్‌మెంట్ పోర్ట్, ద్వీపాల అభివృద్ధి, దేశీయ జలమార్గాలు, బహుళరంగ రవాణా కూడళ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా వాణిజ్య వ్యయం, పర్యావరణ క్షీణత తగ్గడంతోపాటు రవాణా సామర్థ్యం మెరుగుపడి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. భారత్‌తో జోడుకట్టి, ఈ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే దిశగా పెట్టుబడిదారులకు ఇదొక గొప్ప అవకాశం కాగలదని పునరుద్ఘాటించారు.

   రాబోయే పాతికేళ్ల కాలంలో వికసిత భారతంగా ఎదిగే సంకల్పం సాధించేందుకు నేటి భారతం కృషి చేస్తోందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నదని, తదనుగుణంగా భారత సముద్ర రంగం కూడా బలోపేతమయ్యేలా కృషి చేస్తున్నామని వివరించారు. గడచిన దశాబ్ద కాలంలో దేశంలోని ప్రధాన ఓడరేవుల సామర్థ్యం రెట్టింపైందని పేర్కొన్నారు. భారీ నౌకల పునఃసంసిద్ధత  సమయం 2014లో 42 గంటలు కాగా, నేడు 24 గంటలకన్నా తక్కువకు దిగివచ్చిందని తెలిపారు. దేశంలో కొత్త రహదారుల నిర్మాణం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఓడరేవులకు రహదారి అనుసంధానం పెంపుతోపాటు తీరప్రాంత మౌలిక సదుపాయాల బలోపేతానికి ‘సాగరమాల’ పథకం రూపొందించినట్లు గుర్తుచేశారు. ఈ విధంగా బహుముఖ కృషి కొనసాగుతున్నందున ఉపాధి అవకాశాలు, జీవన సౌలభ్యం అనేక రెట్లు పెరుగుతున్నట్లు పేర్కొన్నారు.

   ‘ఓడరేవులతో ఉత్పాదకత’ తారకమంత్రం గురించి వివరిస్తూ- “ప్రగతి-శ్రేయస్సు కోసం ఓడరేవులు’ పేరిట ప్రభుత్వం అనుసరిస్తున్న దార్శనికతతో క్షేత్రస్థాయిలో పరివర్తనాత్మక మార్పులు వస్తున్నాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రవాణా రంగాన్ని మరింత సమర్ధం, ప్రభావశీలం చేయడం ద్వారా ఆర్థిక ఉత్పాదకత పెంచేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్నదని శ్రీ మోదీ తెలిపారు. దేశంలో తీరప్రాంత నౌకా రవాణా రంగంలోనూ ఆధునికీకరణ చేపట్టినట్లు చెప్పారు. ఆ మేరకు గత దశాబ్దంలో తీరప్రాంత నౌకల ద్వారా సరకు రవాణా రెండింతలు పెరిగిందని, తద్వారా ప్రజలకు చౌకగా రవాణా సదుపాయం సమకూరిందని ఆయన వివరించారు. దేశీయంగా జలమార్గాల అభివృద్ధిపై వివరాలు వెల్లడిస్తూ- జాతీయ జలమార్గాల్లో సరకు రవాణా కార్యకలాపాలు నాలుగు రెట్లు పెరిగినట్లు ప్రధాని తెలిపారు. మొత్తంమీద గత 9 ఏళ్లలో రవాణా రంగం పనితీరు సూచికలో భారత్‌ గణనీయ మెరుగుదల సాధించిందని ఆయన చెప్పారు.

   నౌకా నిర్మాణం-మరమ్మత్తు రంగంపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధాని తెలిపారు. స్వదేశీ విమాన వాహక నౌక ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’ ఈ రంగంలో భారత్ సామర్థ్యానికి నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. “‘రాబోయే దశాబ్దంలో అగ్రస్థానంలోని ఐదు ఓడల తయారీదారు దేశాల జాబితాలో భారత్‌ ఒకటిగా అవతరిస్తుంది. ఈ మేరకు ‘మేక్ ఇన్ ఇండియా - మేక్ ఫర్ వరల్డ్’ అనేది మా తారకమంత్రం” అని ప్రధాని పునరుద్ఘాటించారు. ఈ రంగంలోని భాగస్వాములందర్నీ సముద్ర రంగ సముదాయాల ద్వారా ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఇప్పటికే చాలాచోట్ల ఓడల నిర్మాణం-మరమ్మతు కేంద్రాలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. ఓడల విడదీత-పునర్నిర్మాణ రంగంలో భారత్ ఇప్పటికే ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఈ రంగంలో నికరశూన్య ఉద్గార వ్యూహం ద్వారా దేశంలోని ప్రధాన ఓడరేవులను కర్బన-తటస్థం చేసేందుకు సాగుతున్న కృషిని కూడా ఆయన తెలియజేశారు. “నీలి ఆర్థిక వ్యవస్థ మాధ్యమంగా హరిత భూగోళం సృష్టించే ఉజ్వల భవితవైపు మేం పయనిస్తున్నాం” అని ప్రధాని ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు.

   సముద్ర రంగంలోని భారీ సంస్థలు భారత్‌లో ప్రవేశించేందుకు తగిన కృషి కొనసాగుతోందని ప్రధాని నొక్కిచెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే అహ్మదాబాద్‌లోని ‘గిఫ్ట్‌’ సిటీ రాయితీలు ఇవ్వడంతోపాటు నౌకల లీజింగ్‌ను ఒక ఆర్థిక సేవగా ప్రారంభించిందని తెలిపారు. ప్రపంచంలోని 4 ప్రముఖ అంతర్జాతీయ ఓడల లీజు కంపెనీలు ‘గిఫ్ట్‌-ఐఎఫ్‌ఎస్‌సి’లో ఇప్పటికే నమోదు కావడం హర్షణీయమని చెప్పారు. ఈ సదస్సు సందర్భంగా ఇతరత్రా కంపెనీలను కూడా ఇందులో భాగస్వాములను చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ మేరకు “భారత తీరప్రాంతం సువిశాలం.. బలమైన నదీతీర పర్యావరణ వ్యవస్థ, సుసంపన్న సాంస్కృతిక వారసత్వం దేశానికి సొంతం. ఇది సముద్ర పర్యాటకానికి కొత్త అవకాశాలను సృష్టించగలదు” అని ప్రధాని వివరించారు. దేశంలోగల దాదాపు 5 వేల ఏళ్లనాటి లోథాల్ ఓడల తయారీ కేంద్రాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ఆయన పేర్కొన్నారు. దీన్ని ‘ఓడల ఒడి’గా ఆయన అభివర్ణించారు. ఈ ప్రపంచ వారసత్వ సంపద పరిరక్షణ కోసం ముంబై సమీపంలోని లోథాల్‌లో జాతీయ సముద్ర వారసత్వ ప్రాంగణం కూడా నిర్మిస్తున్నామని, ఇది పూర్తయ్యాక పౌరులంతా తప్పక సందర్శించాలని ఆయన కోరారు.

   దేశంలో సముద్ర పర్యాటకానికి ప్రోత్సహించడంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన నదీ విహార నౌకా సేవల పాత్ర గురించి ప్రధాని ప్రస్తావించారు. ముంబైలో త్వరలోనూ అంతర్జాతీయ విహార నౌకా టెర్మినల్ పూర్తికానుందని, దీంతోపాటు విశాఖపట్నం, చెన్నైలలోనూ ఆధునిక విహార నౌకా టెర్మినళ్లు కూడా సిద్ధమవుతున్నాయని ఆయన వెల్లడించారు. “ఈ విధంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ప్రపంచ నౌకా విహార కూడలిగా మారే దిశగా భారత్‌ వేగంగా అడుగులు వేస్తోంది” అని తెలిపారు. చివరగా- ప్రపంచంలో అభివృద్ధి, జనాభా, ప్రజాస్వామ్యం,  డిమాండ్ల సమ్మేళనంగల దేశాల్లో భారత్‌ ఒకటని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు “దేశం 2047నాటికి వికసిత భారతంగా రూపొందే లక్ష్యంతో ముందడుగు వేస్తున్న తరుణంలో మీకందరికీ ఇదొక సువర్ణావకాశం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. తదనుగుణంగా భారత్‌తో జోడుకట్టి ప్రగతి పథంలో భాగస్వాములు కావాల్సిందిగా పెట్టుబడిదారులకు ఆహ్వానం పలుకుతూ ఆయన తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు-నౌకారవాణా-జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ కూడా పాల్గొన్నారు.

 

పూర్వరంగం

ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి భారతదేశం సముద్ర సంబంధి బ్లూ ఇకానమి కోసం ఉద్దేశించినటువంటి దీర్ఘకాలిక నమూనా అయిన అమృత్ కాల్ విజన్ 2047’ ను ఆవిష్కరించారు. ఈ నమూనా నౌకాశ్రయ సదుపాయాల ను పెంచడాని కి ఉద్దేశించిన వ్యూహాత్మక కార్యక్రమాల ను తెలియజేయడం తో పాటు, స్థిర ప్రాతిపదిక కలిగిన అభ్యాసాల ను ప్రోత్సహించడం, ఇంకా అంతర్జాతీయ సహకారాని కి మార్గాన్ని సుగమం చేయడం గురించి వ్యూహాత్మక కార్యక్రమాల కు రూపురేఖల ను తయారు చేస్తుంది. ఈ అత్యాధునిక ప్రణాళిక కు అనుగుణం గా, ప్రధాన మంత్రి భారతదేశ సముద్ర సంబంధి బ్లూ ఇకానామీ కి చెందిన అమృత్ కాల్ విజన్ 2047’ తో సంబంధం కలిగిన 23,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టుల ను ప్రారంభించడం, దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు శంకుస్థాపన కూడా చేశారు.

 

గుజరాత్ లోని దీన్ దయాళ్ పోర్ట్ ఆథారిటీ లో అన్ని రుతువుల లో కార్యకలాపాల ను నిర్వర్తించగలిగిన టూన్ టేక్ రా డీప్ డ్రాఫ్ట్ టర్మినల్ నిర్మాణాని కి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు; దీనిని 4,500 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో నిర్మించడం జరుగుతుంది. అత్యంత ఆధునికం గా ఉండేటటువంటి ఈ గ్రీన్ ఫీల్డ్ టర్మినల్ ను పబ్లిక్ ప్రయివేటు భాగస్వామ్యం (పిపిపి) పద్ధతి లో అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఒక అంతర్జాతీయ వ్యాపార కేంద్రం గా రూపుదిద్దుకొనే అవకాశం ఉన్నటువంటి ఈ టర్మినల్ 18,000 కు పైగా ట్వంటీ-ఫూట్ ఈక్వివలెంట్ యూనిట్స్ (టిఇయు స్) కు పైగా సామర్థ్యం కలిగిన భావి తరం నౌకల ను హేండిల్ చేస్తుంది. ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఇకోనామిక్ కారిడార్ (ఐఎమ్ఇఇసి) గుండా భారతదేశం వ్యాపారాని కి ఒక ప్రవేశ ద్వారం గా కూడా పని చేస్తుంది. ఇదే కార్యక్రమం లో ప్రధాన మంత్రి సముద్ర రంగం లో ప్రపంచ మరియు జాతీయ భాగస్వామ్యాల కోసం 7 లక్షల కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన 300 కు పైచిలుకు అవగాహన పూర్వక ఒప్పంద పత్రాల (ఎంఒయు)ను కూడా అంకితం చేశారు.

 

ఈ శిఖర సమ్మేళనం దేశం లో అతి పెద్దదైనటువంటి సముద్ర సంబంధి కార్యక్రమం అని చెప్పాలి. దీనిలో యూరోప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఏశియా (మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యం, ఇంకా బిఐఎమ్ ఎస్ టిఇసి ప్రాంతం సహా) దేశాల కు ప్రాతినిధ్యం వహించేటటువంటి ప్రపంచ వ్యాప్త మంత్రులు పాలుపంచుకొన్నారు. శిఖర సమ్మేళనం లో గ్లోబల్ సిఇఒ లు, వ్యాపార ప్రముఖులు, ఇన్వెస్టర్ లు, అధికారులు మరియు ప్రపంచ వ్యాప్తం గా ఇతర స్టేక్ హోల్డర్స్ కూడా పాల్గొన్నారు. అదనం గా, భారతదేశం లోని అనేక రాష్ట్రాల కు ప్రాతినిధ్యం వహించే మంత్రులు మరియు ఇతర ఉన్నతాధికారులు కూడా శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొన్నారు.

 

మూడు రోజుల శిఖర సమ్మేళనం లో రాబోయే కాలం లో నౌకాశ్రయాలు సహా సముద్ర సంబంధి అనేక విషయాల పై చర్చ మరియు సంప్రదింపులు జరగనున్నాయి. ఆయా విషయాల లో కర్బన ద్విఆమ్లం యొక్క ఉద్గారాల ను తగ్గించడం; కోస్టల్ శిపింగ్ & ఇన్ లాండ్ వాటర్ ట్రాన్స్ పోర్టేశన్; నౌక ల నిర్మాణం; రిపేర్ ఎండ్ రీసైకిలింగ్; ఫైనాన్స్, బీమా & మధ్యవర్తిత్వం; మేరీటైమ్ క్లస్టర్స్; నూతన ఆవిష్కరణ లు మరియు సాంకేతిక విజ్ఞానం; సముద్ర రంగ సంబంధి సురక్ష మరియు భద్రత లకు తోడు సముద్ర సంబంధి పర్యటన రంగం వంటి ఇతర అంశాలు ఉన్నాయి. దేశం లోని సముద్ర రంగం లో పెట్టుబడి ని ఆకర్షించడం కోసం ఒక శ్రేష్ఠమైన వేదిక ను కూడా ఈ శిఖర సమ్మేళనం అందించనున్నది.

 

మొట్టమొదటి మేరిటైమ్ ఇండియా సమిట్ ను 2016 వ సంవత్సరం లో ముంబయి లో నిర్వహించడమైంది. రెండో మేరిటైమ్ సమిట్ ను 2021వ సంవత్సరం లో వర్చువల్ పద్ధతి లో నిర్వహించారు.



(Release ID: 1968464) Visitor Counter : 85